Monday, July 09, 2007

యాహూలో నా తొలి కథలాంటిది !

(నేను చాలా రోజుల క్రితం రాసిన కొందరి అనుభవాలను కథలా చెప్పే ప్రయత్నం చేశాను. దాన్ని వెబ్ ప్రపంచంవాళ్ళు ప్రచురించారు. దాన్ని ఈ మధ్యకాలంలో యాహూ తెలుగు వాళ్ళు పునర్ముద్రించారు. పూర్తిగా యూనికోడ్ లో ఉంది. మీ సమయాన్ని బట్టి ఓ సారి ఇలా దయచేయండి!)


‘ రాఖీ’ కథ
-దార్ల వెంకటేశ్వరరావు
పేగు పడే మూగ వ్యధని లెక్కించేందుకు ఏ ప్రమాణాలు సరిపోతాయి? వ్యక్తావ్యక్త భావనలోని మాధుర్యాన్ని ఆస్వాదించటం మనదికాని మరో హృదయానికెలా సాధ్యమవుతుంది. తల్లిగాని, చెల్లిగాని, తమ్ముడుగాని, ఒక పిల్లగాని, పిల్లవాడు గాని ఏదో ఒక రక్తసంబంధం ఉంటేనే కదా రాగబంధంలో ఉండేసౌందర్యం తెలిసేది! తిట్టుకోవడంలోను, కొట్టుకోవడంలోను, సుఖదుఃఖాల్ని కలిసి పంచుకోవడంలోను ఉన్న ఆనందాన్ని ఏ నిర్వచనాల్లోనూ బంధించలేమనిపిస్తూ ఉంటుంది.
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో సీటు రావడంతో కోనసీమలో ఓ పల్లెటూరు నుండి పెట్టీ బెడా సర్దుకొని ఇక్కడకొచ్చాను. ఈ వాతావరణమంతా కొత్తగా అన్పించింది. నాతో పాటుగా చేరిన మా క్లాసుమేట్స్‌ మాత్రం ఏ చిన్న విషయాన్నైనాసరే గొప్పగా చెప్పేవాళ్ళు. పరిచయాలకో పంక్షన్‌ కావాలన్నట్లు ప్రతీ చిన్న విషయానికీ ట్రీట్‌ కావాలనో, బిర్లా మందిర్‌ కెళ్ళాలనో, జూపార్క్‌ చూడాలనో అనేవాళ్ళు.
నాలో ముభావం పోవటానికిది బాగా ఉపయోగపడుతుందనుకొని, నేనూ వాళ్ళతో సై అనేవాణ్ణి. వచ్చింది కొత్త కావటం వల్లనో, ఒకరి గురించి ఇంకొకరికి లోతుగా తెలియకపోవడం వల్లనో, ఉన్నా లేకపోయినా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేస్తూ ఖర్చుపెట్టడానికీ వెనుకాడేవాళ్ళం కాదు.
గతం గురించి గొప్పలు, రాబోయే రోజుల గురించి ఊహల్ని కాంపస్‌ లైబ్రరీ ముందు పరిచిన పరుపులా ఉంటే గడ్డిమీదో, క్యాంటీన్‌ దగ్గరో, లేడీస్‌ హాస్టల్ ఎదురుగా ఉన్న తూముల మీదో, లేక్‌వ్యూ గట్టుమీదో, మష్రూమ్‌రాక్‌ మీదో కబుర్లు కలబోసుకోవడం నిత్యకృత్యంగా మారేది వచ్చిన కొత్తలో.
అసలు యూనివర్శిటీలో ఉండగానే జీవితాన్ని జల్సాగా గడపాలనీ, అవే తర్వాత మనకి మిగిలే తీపి గుర్తులనీ ఎన్ని ఊసుల్ని చెప్పుకునే వాళ్ళమో!
మాట్లాడుకోవడానికేమీ దొరక్కపోతే మా పాత పంతుళ్ళ మీదనో, కాలేజీలో బీటేసిన అమ్మాయిల గురించో, బీటేసి దెబ్బలు తిన్న అబ్బాయిల గురించో ఏవో కబుర్లతో గడిపేసేవాళ్ళం. ఆ సమయంలో ఎవరెంత ఎక్కువగా గొప్పలు చెప్తే ఆ స్టూడెంట్‌ మిగతా వాళ్ళకంటే గొప్పగా భావింపబడేవాడు. ఏమీ చెప్పక ఇన్‌ఫీరియారిటీతో ఉండకూడదనుకొని ఏదొకటి చెప్పేసో, ఏదొకటి చేసేసో తన అస్తిత్వాన్ని నిరూపించేసుకోవాలనుకొనే వాళ్ళలాగానే నేనూ ఆలోచించే వాణ్ణి.
రాఖీపండుగ ఇంకా రెండు మూడు రోజులు ఉందనగానే పోస్టులో రాఖీలు ప్యాక్‌లు వచ్చేవి. అవన్నీ ఉత్తరాలతో పాటు మా హాస్టల్‌లో ఉన్న లెటర్స్‌ బాక్స్‌లో వేసేసి వెళ్ళిపోయే వాడు మా పోస్ట్‌మాన్‌. భోజనాలకొచ్చినపుడు ఎవరికొచ్చినవాటిని వాళ్ళం తీసుకునే వాళ్ళం.
ఇంటి దగ్గర ఎలా ఉన్నా గాని అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని ఇంతింతై వటుడింతై చేసి చెప్పేవాళ్ళూ ఉండేవాళ్ళు. అయ్యో ... ఎక్కడున్నా ఈ రోజుకి మాత్రం మా ఇంటికెళ్ళిపోయి మా చెల్లి చేతనే కట్టించుకొనే వాణ్ణి రాఖీని! అని ఒకడంటే, రాఖీ కట్టించుకొని రేపొస్తా నని ఫస్్ట‌ సెమిస్టర్‌లోనే ఇంటికెళ్ళి పోయేవాడు మరొకడు. రాఖీ పండగ వాతావరణం ఇలా ఉండేది.మా యూనివర్శిటీ హాస్టళ్ళలో అన్నా చెల్లెళ్ళ అనురాగ బంధాన్ని గుర్తు చేసుకునే గొప్ప పండుగ రాఖీ గురించి అలా మొహం తెల్లబోయి చూస్తుంటే, నన్ను మా ఫ్రెండ్స్‌తో పాటు మిగతా వాళ్ళూ వింతగా చూస్తుండటంలో ఆశ్చర్యం లేదు. పాష్‌ కల్చర్‌కి నెలవైన ఈ యూనివర్శిటీ స్టూడెంట్స్‌ అంటే ఆ మాత్రం లేకపోతే ఎలాగలే అని సరిపెట్టేసుకుందామనీ అనుకొనే వాణ్ణి.కానీ నాలో ఏదో సంఘర్షణ... వెనుకుబాటుతనంలా కన్పించే అవమానపు నీడలు... నేనూ మీ కేమీ తీసి పోలేదని రుజువు చేసుకోవాలనే తపన. ఏదో నన్ను పట్టుకొని కుదిపేస్తుంది. దాని గురించే నా ఆలోచన.రాఖీ పండగ రానే వచ్చింది. మా ఫ్రెండ్స్‌లో అందరికంటే అందమైన రాఖీ నాచేతికి కన్పించే సరికి వాళ్ళకి కొంత అసూయే కల్గింది. చెప్పలేదే ... నీకూ చెల్లె ఉందనీ రాఖీ పంపిస్తుందనో, పంపించిందనో అని అడిగారు. చిరునవ్వు నవ్వాను. అదో పెద్ద విజయం సాధించినంత తృప్తి కల్గింది.
ఆ రోజు క్లాసు కెళితే మా క్లాస్‌మేట్స్‌ శైలూ, కరుణా క్లాసుకొచ్చేటపుడు రాఖీలు పట్టుకొచ్చి కట్టారు నాకు.
వాళ్ళపట్ల నా కేదో అనురాగం
నా కళ్ళలో కన్పించకుండా పొంగిన ఆనంద కెరటాలు.
ఏమి మాట్లాడాలో నాకర్ధం కాలేదు.
నన్ను కాసేపు గమనించి, నవ్వుతూ క్లాసవ్వగానే వెళ్ళిపోయారు.
నా చేతికున్న మూడు రాఖీల్ని చూసుకొని రోజంతా పొందిన సంతోషమెంతని చెప్పను!
నా చేతికున్న రాఖీల్ని చూసి ఎవరు కట్టారనీ, కట్టిన వాళ్ళకేమిచ్చావనీ చాలా మంది ఫ్రెండ్స్ అడిగారు.
మౌనంగా చిన్న చిరునవ్వే నా సమాధానం.
ఆ ప్రశ్నల ఫలితమేనేమో మధ్యాహ్నం క్లాసుకెళ్ళేటప్పుడు రెండు చాక్లెట్స్‌ కొనుక్కెళ్ళాను. కరుణా, శైలజలకిద్దామని. చేరింది కొత్త కావడమో, రాఖీలు కట్టింది పొద్దున్నయితే చాక్లెటస్‌ మధ్యాహ్నం ఇవ్వటమేంటనో, ఏమనుకుంటారనో ఇవ్వడానికి సందేహించాను. నాలో నేనే చాలా సేపు తర్కించుకున్నాను.
ఎలాగైతే ఇవ్వాలనే నిర్ణయానికొచ్చేసి, ఇచ్చేశాను. సరదాగా, కలివిడిగా ఉండే కరుణే కల్పించుకొని చాక్లెట్స్‌తోనే సరిపెట్టేద్దామనా ... అనేసి, నా నుండేమి సమాధానం రాకపోయే సరికి రాఖీలు కట్టిన వాళ్ళకి వాళ్ళ బ్రదర్స్‌ డబ్బులు గట్టిగానే ఇస్తారు తెల్సా ... నువ్వెంతిస్తున్నావో ... అంది నవ్వేస్తూ!
శైలు ఏమీ అడగలేదు గానీ, అలాగే నా నుండి ఏం జవాబు వస్తుందో నన్నుట్లు చూస్తోంది. నేలకేసి చూస్తూ మళ్ళీ ఓ చిరునవ్వు నవ్వాను. నేలమీద పడిన నవ్వులో నా భావాన్ని ఏమి వెతుక్కున్నారో గాని నన్నింకేమీ అడగలేదు.
ఆరోజు రాత్రి రూమ్‌లో పడుక్నునాను గాని నిద్రపట్టలేదు. మంచం మీద అటూ ఇటూ చాలాసార్లు దొర్లాను. రాఖీలు నలిగి పోతున్నాయేమోనని చేతిని మాత్రం జాగ్రత్తగానే జరుపుకునే వాణ్ణి!రాఖీని తీసిన కవరులోనే ఉన్న చెల్లి ఉత్తరం తీసాను.
‘‘అన్నయ్యా!
ప్రతీ ఏడాదీ నేనే నీ చేతికి ఈ రాఖీని కట్టే దాన్ని. నువ్విచ్చే బహుమతిని మా స్నేహితులందరికీ గర్వంగా చూపించేదాన్ని. ఈసారి కూడా పంపావనుకో. కానీ నేనే నీ చేతికి ఈ రాఖీని కట్టలేకపోతున్నందుకే బాధగా ఉందిరా... ఎంత ఇంటర్‌నల్‌ పరీక్షలయితే మాత్రం మీ మాస్టారికి ఆ మాత్రం తెలీదా- రాఖీ పండక్కి శెలవివ్వాలని! పోనీలేరా .. నేనే నీ చేతికి కట్టినట్లు భావించుకొని, నాలాంటి ఓ చెల్లిచేత కట్టించుకొని, బహుమతి కూడా ఇవ్వు. ఒరే అన్నయ్యా ఓ విషయం - ఆ బహుమతి మాత్రం నాకు పంపించిందానికంటే కూడా మంచిదైతే నేనూరుకోను జాగ్రత్త. ఆ విషయాలన్ని నాకు రాయి ఉత్తరంలో ...అన్నయ్యా .... నీకు తెలుసో లేదో ఈ రాఖీ కోసం మూడు రోజుల నుంచి ఎన్ని షాపులు తిరిగానో. నీ చేతికున్న రాఖీ మిగిలిన వాళ్ళకెవ్వరికీ ఉండకూడదని అనుకొని మరీ వెతికి వెతికి కొని పంపుతున్నాను.పెద్ద, నువ్వే కొడుకువన్నట్లు అమ్మ రోజూ భోజనాల దగ్గర తెగ బాధపడి పోతుంది రా ... ఎప్పుడొస్తావు? ఓ నిజం చెప్పనా నువ్వు అన్నం తినేటప్పుడు నీ చేతి ముద్ద కోసం నేనూ బాధపడ్తున్నాను రా! సర్లే, దసరా పండక్కి తప్పకుండా రావాలి. నువ్వు పులి వేషం వేస్తే నిన్నేడిపించాలనుంది. ఈ సారి నువ్వెంత భయపెట్టినా నేనేమీ భయపడిపోను. స్కూలుకి జాగ్రత్తగా వెళ్తున్నాను. అమ్మనేమీ ఏడిపించటం లేదు.
వెంటనే ఉత్తరం రాయవలెను.
ఉంటాను
మీ చెల్లి ...
రెండు మూడు సార్లు చదివి, నా చేతికి ఉన్న రాఖీని సుకుమారంగా తడిమాను. కళ్ళ నుండి రెండు మూడు స్వచ్ఛమైన బిందువులేవో జలజలరాలాయి వేడిగా!కాగితం మీద పెన్సిల్‌తో రూళ్ళుకొట్టి, దానిమీద కుదించి, కుదించి రాసిన అక్షరాలు వాటినే చూస్తూ వాటిలో ఏదో చూస్తుండిపోయాను. అనురాగానికి అర్ధమైన చెల్లి .... ఔను మా చెల్లిప్పుడేమి చేస్తుందో. మా నల్గురు తర్వాత పుట్టిన ఒక్కగానొక్క పిల్ల. ప్రేమానురాగాల ప్రతిబింబం ఎలాగుంటుందో చూసుకోమని దేవుడు మాక్చిచిన వరం. ఏం చేస్తుందో !
చిన్నప్పుడు స్కూల్లో ఓ పిల్ల మా చెల్లి కట్టుకున్న కొత్త బట్టల గురించి ఏదో అంటే, మా చెల్లి కళ్ళల్లో కన్నీళ్ళు చూసి తట్టుకోలేక, అలా అన్న పిల్ల, మా ఫ్రెండ్‌ చ్లెలెలైనా సరే చెంప చెల్లుమనిపించాను. మా చెల్లి మీద నాకంత ఇష్టం ఉంటే ఎదుటి వాళ్ళకి అంత ఇష్టం ఉంటుందని గానీ, గొడవలవుతాయని గానీ ఇవేమీ ఆలోచించలేదు. అలాగే చాలా గొడవలయ్యాయి. అది వేరేసంగతి
మా చెల్లి పిలకలేసుకుంటున్నప్పుడే ఎక్కడే పువ్వు కన్పించినా పట్టుకెళ్ళి తలలో పెట్టేసేవాణ్ణి. కొన్ని పువ్వులు తల్లో పెట్టుకోరట. నాకేం తెల్సు!
ఓ సారి మా చెల్లిని సినిమాకి తీసుకెళ్ళాను.
హీరో - విలన్‌ బృందానికి మధ్య ఓ ఫైటింగ్‌ సీను వచ్చింది.అమాంతంగా నా ఒళ్ళో కొచ్చేసి, కళ్ళు బుల్లి బుల్లి చేతుల్తో మూసేసుకుని కొట్టేసుకుంటున్నారు బాబోయ్‌ అంటుంటే, ‘‘పాపా ... అది సినిమా అమ్మా ... నిజంకాదు’’ అని ఎంత నచ్చచెప్పినా వింటే కదా... ‘‘వద్దు వెళ్ళిపోదాం. పందిగాడు పట్టుకొంటే, మిగిలిన వాళ్ళంతా పాపం ఒకణ్ణి పట్టుకొని కొట్టేస్తున్నారు. మనమీదికే వచ్చిపడిపోతున్నాడు వెళ్ళి పోదా పదా...’’ అని హాలు బయటికి వచ్చిందాకా ఒకటే గోల.
సినిమాల్లో అటువంటి సీన్లు కన్పించే మా పాపతో చిన్నప్పటి ఆ సంఘటన చెప్పినపుడు ఎంత నవ్వుతుందో... ఆ నవ్వుని చూడాలి.
చెల్లిని చెల్లిఅనో, పేరుపెట్టో పిలవకుండా పాప అనడం ఏంటనుకోవచ్చు. పుట్టినప్పుడు న్నపిల్ల కదా. పుట్టేటపుడు మేమంతా ఆడపిల్లే పుట్టాలని ఎదురుచూశామట. మంత్రసాని వచ్చి పాప పుట్టిందని చెప్పగానే పాపపుట్టింది పాప పుట్టింది అని ఎంతో గంతులేశామనీ, అలా మాకు తెలీయకుండానే పాపాఅని పిలవడమే కంటిన్యూ అయిపోయింది. మా చెల్లి ఇపుడు ఎంత ఎదిగినా పేరు విజయకుమారిఅని స్కూలు రికార్డుల్లో ఉన్నా పాపాఅని పిలవటంలోనే మాకెంతో సంతోషంగా ఉంటుంది.
నా బాధకంటే మా పాప ఏడుపు నా పటిమ ముందు చెయ్యాలనీ, ఏదొకటి చెప్పడానికి మాటలొస్తే బాగుండుననీ తెగప్రయత్నించాను. దేవుళ్ళను ఎంతమందినో మనసులోనే దండం పెట్టేసుకున్నాను. మా పాప కన్నీళ్ళని చూడలేక నేను ఓ చేత్తో తుడుస్తుంటే, ఇంకా ఏడ్చేసింది. ఆ ఏడుపు విని, పొలం పనులకి పొద్దున్నే వెళ్ళేవాళ్ళు, పొలాల దగ్గరకెళ్ళే రైతులు ఏం జరిగిందిఅంటూ మా దగ్గరకొచ్చి, గబగబా నన్నూ, మా చెల్లెల్ని ఇంటికి తీసుకెళ్ళారు.
నాకు తెలీయకుండానే నా కన్నీళ్ళు పడుకున్న మంచం మీద పడటం, నిద్రపోతున్నట్లు ఉన్నా, నిద్రపోవటం లేదనీ, మౌనంగా ఏదో ఊహాలోకాల్లో ఉన్నాననీ గమనించిన రూమ్మేటు ఉమామహేశ్వరరావు ఏంటింకా ఆలోచిస్తున్నావ్‌ నిద్రపోకుండా ... ఇల్లు గుర్తొచ్చిందాఅని అడిగాడు. అతనికి అంతకు ముందే అయిదేళ్ళ హాస్టలు అనుభవం ఉంది. ఆ కాదు గానీ, ఇంటికెళ్ళాలనిపిస్తుందిఅని అన్నాను.
తర్వాత కొత్తగా ఇల్లు వదిలి వచ్చినపుడు ఇంకోచోట ఉండవలసి వస్తే ఎలాగుంటుందో, తన అనుభవాల్ని జోడించి, నాకు కొంత ఊరట కల్గించాలని ప్రయత్నించాడు. లైట్లు ఆర్పేసి పడుకున్నా, ఆలోచనల నుండి తేరుకోలేక పోతున్నాను. ఆత్మ సంఘర్షణకు గురైపోతుంది.
బంధాల్ని ఏడాదికెప్పుడో గుర్తించేందుకు రాఖీలో, ఏవో గుర్తులో చాలా మంది పంపలేక పోవచ్చు. అది చాలా మందికి తెలియకపోవచ్చు. అలా పంపితేనే అనురాగం మూటకట్టి పంపించేసినట్లయిపోతుందా? నిజమైన అనురాగం ఎక్కడికి పోతుంది. కేబుల్‌ చానల్స్‌, వార్తాపత్రికలు వచ్చిన తర్వాత పట్టణ నాగరికతను ఇపుడిపుడే పల్లె కూడా అలవర్చుకొని వాలెంటైన్స్‌ డేలు, మదర్స్‌ డే లు, ఫ్రెండ్‌ షిప్‌ డే లు, రాఖీల పండగలు వంటి వాటిని గొప్పగా చేయటం అల్చవరుకుంటున్నారు.
ఇలా చేసుకోవటమే గొప్ప నాగరికతగానూ, చేసుకున్న వాళ్ళనే నాగరికులుగాను తలుస్తున్నారు. ఇలా చేసుకోకపోతే వాళ్ళ మధ్య ఉన్న నిజమైన ప్రేమాభిమానాలు, ఆత్మీయానురాగాలు లేనట్లేనా, వాళ్ళంతా అనాగరికులేనా... మనసంతా ఏదో తేలికైపోయింది. చెల్లి లెటర్‌, చేతికి ఉన్న రాఖీ రెండింటినీ కవర్‌లో జాగ్రత్తగా పెట్టేసి, నిన్న మా హాస్టల్‌ లెటర్స్‌ బాక్స్‌లో ఎవరిదైతే తీసుకున్నానో, వీటిని అతనికిచ్చేసి, జరిగింది చెప్పేసి రావాలని బయలుదేరాను.

3 comments:

మాకినేని ప్రదీపు said...

మీ కధ చాలా బాగుంది. నాకు కూడా ఒక చెల్లి ఉంటే బాగుండేది కదా అని అనిపించింది...

కొత్త పాళీ said...

It is beautiful, narrated with a rare sensitivity.

Lalithaa Sravanthi Pochiraju said...

touching one......