1.0. ప్రస్తావన:
అపవిత్రతలనేవి ఒకదాన్ని ఒకటి వెన్నంటి ఉంటాయి. పవిత్రత అనేది ఒక భావన. మానవులు ఏర్పరుచుకున్న ఆచార సంప్రదాయాల నుండి రూపొందిన భావన. మానవుడు ఆదిమ కాలంలో ప్రకృతి శక్తులతో పోరాడి, తాత్కాలిక ఉపశమనం కోసం పంచభూతాలను దైవశక్తులుగా భావించుకున్నాడు. నిత్య జీవితంలో వాటి అవసరాన్ని గుర్తెరిగి వాటిని పరిరక్షించుకోవటానికి ఎంతగానో ప్రయత్నించాడు. వాటితో ప్రతి జీవికి గల సంబంధాన్ని విడదీయరానిదనీ త్వరలోనే గుర్తించగలిగాడు.
అదిమ సమాజంలో కూడా తెలివైన మానవుడు తనకంటే తెలివి తక్కువ ఉన్నవాడిని మాటలతో, చేతలతో తన అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేశాడు. దీనిలో భాగంగానే ప్రకృతి శక్తులకు నియమబద్దం గా “శాంతి ‘’ చేయడం ఆరంభించాడు. తాను చేసిన, చేస్తున్న “శాంతి” చర్యలకు యాదృచ్చికంగా వేగంగా గాలివీచటంగాని, గాలి ఆగిపోవటంగాని, వర్షం కురవటంగాని, ఆగిపోవటంగాని, భూమి కంపించటం, నెమ్మది పడటం వంటివి జరిగేవి. వీటిని శాంతి చర్యల వల్ల, లేదా మాంత్రిక చర్యల వల్ల మాత్రమే జరుగుతున్నాయిని కొంతమంది నమ్మటంతో ఆ పనులు ఆచారాలుగా, సంప్రదాయాలుగా మారిపోయాయి. దానితో ప్రకృతి ఆరాధన విస్తృతమైంది. మన వేదాల్లో కూడా పంచభూతాలను శాంతి చేసే విధంగానే అత్యధిక మంత్ర్లాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు మాట్లాడుకోవలసి వచ్చిందంటే , ఇటీవల ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు “కులవృత్తి” పేరుతో ఒక కథ రాశారు. దాన్ని ఒక సైద్ధాంతిక దృక్పథంతో పరిశీలించవలసిన అవసరం ఉంది.-ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ప్రజాసాహితి మాసపత్రిక (సెప్టెంబరు -2006:18 -26)లో రాసిన ‘’కులవృత్తి” కథ పై ఆ పత్రిక తరువాత సంచికల్లో కొంత చర్చ జరిగింది. రచయిత ప్రతి స్పందనను కూడా ప్రజాసాహితి ( 2006:51-52)లో ప్రచురించారు. అంతే కాకుండా, ఆంధ్రప్రభ దినపత్రిక సాహితీ గవాక్షం లోనూ ఆ కథా ప్రభావంతో ఒకరు అభిప్రాయాన్ని కూడా రాశారు. ఇంతమందిని ఆ కథ ఎందుకు కదిలించగలిగింది?ఆ కథ మామూలు కథ కాదు. ఉబుసుపోక రాసింది కాదు. పాఠకులు ఉబుసుపోక చదివేది కాదు. ఒక బలమైన సమస్యకు ఒక బలమైన తాత్త్విక ధారను అందించటానికి రాసిన కథ. ఇనాక్ గారు ఈ కథనే కాదు. అంతకు ముందుకూడా అంతకంటే గొప్ప కథలను చాలా రాశారు. అందులో ఊరబావి, గొడ్లదొంగ, పొట్టపేగులిబ్బందిగోడు, తాకట్టు,కొలుపులు కథలు పేర్కొన దగినవి. ఇందులో నాకు బాగానచ్చింది తాకట్టు కథ . తమకి తెలియకుండానే ఆచారాలు, సంప్రదాయాల పేరుతో బ్రాహ్మణీయ వర్ణాలు ఎలా కూరుకు పోతున్నాయో దీనిలో వివరించారు. నిజానికి ఈ కథలో బ్రాహ్మణీయవర్ణాల పట్ల రచయితకున్న సహృదయత కూడా అర్థమవుతుంది. వారికథల్లో బ్రాహ్మణీయ వ్యతిరేకత ఉంటుంది. అది వ్యక్తి గతంకాదు. అసలు అవగాహన ఉన్న రచయిత రాసిన దళిత సాహిత్యంలో వ్యక్తిగతానికి తావేలేదు. పైగా ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి రచనలనిండా డా.బి.ఆర్ . అంబేథ్కర్ భావజాలం వ్యాపించి ఉంటుంది. ఆచార్య కొలకలూరి ఇనాక్ గారే “ఆధునిక విమర్శ సూత్రం” (1996:155)లో బ్రాహ్మణవాదాన్ని ఇలా వివరించారు. బ్రాహ్మణుడు ” ఆర్యుడు గా ప్రవేశించినప్పుడు అభద్రతా భావంతో ఏర్పాటు చేసుకున్న వర్ణవ్యవస్థ ను తనకనుకూలంగా మలచుకొని , అధికారం హస్త గతంచేసుకొని, అందుకు ఆధారంగా సాహిత్యం సృష్టించుకొని అందర్నీ, ఆడవాళ్ళ్తో సహా అణచి ఉంచటానికి చరిత్ర అంతటా చేసిన కుట్ర , కుయుక్తి, మోసం బ్రాహ్మణవాదం….దళితులు బ్రాహ్మణుల్ని నిందించరు. బ్రాహ్మణ వాదాన్ని వ్యతిరేకిస్తారు” అని స్పష్టంగానే వివరించారు. ఈ దృష్టితో చూసినప్పుడు కులవృత్తి కథలో పూజారి (స్వామి) - అతడితో వాదించిన మాదిగ (మూర్తి)లు ఆ యా వ్యవస్థలకు ప్రతినిథులు.
1.1.కులవృత్తి కథలో ప్రతిపాదిత అంశాలు:
అసలు కులవృత్తి కథలో రచయిత ఈ కింది అంశాలు వాదనకు పెట్టారనుకుంటున్నాను.1) దేవుడికీ - భక్తుడికీ మధ్య పూజారి అవసరమా?2) పవిత్రతను అర్థం చేసుకోవడమెలా? పవిత్రత - అపవిత్రతలను నిర్ణయించటానికి తీసుకుంటున్నప్రమాణాలేమిటి? ఆ ప్రమాణాలు కాలానుగతంగా మారుతున్నాయా? లేదా? వాటిని కొన్ని వర్ణాలు తమ కనుకూలంగా మార్చుకుంటున్నాయా?లేదా?దేవాలయంలోకి పూజార్లు లేకుండా/చూడకుండా చెప్పులతోనూ, ఇంకా రకరకాలగానూ పోయినప్పుడు నిజంగా వాళ్ళందరికీ/ ఆ పశు పక్షులకు “పాపం” చుట్టుకుంటుందా? దాన్ని తెలుసు కోవడమెలా? ఇలాంటి సమస్యలన్నింటినీ ఆలోచింప చేసే విధంగా “కులవృత్తి” కథ ఉంది.
1.2. ప్రతిపాదిత అంశాల సమన్వయం :
1) దేవుడికీ - భక్తుడికీ మధ్య పూజారి నిలబడి ‘కొందరికే దేవుడ’నే భావన కలిగిస్తున్నారు. దేవుడే అంగీకరించినా అస్పృశ్యత పేరుతో దళితులను పూజారి దేవాలయం లోకి అంగీకరించని కథను “మునివాహనుడు “(1976) నాటకంలో ఇంతకుముందే ఇనాక్ గారు రాశారు. ఇప్పుడు దాని తరువాతి పరిణామాన్ని, అంటే అస్పృశ్యతను ఆధారం చేసుకుని కొంత మంది వృత్తి చిహ్నాలను దేవాలయం లోకి రాకుండా అవమానిస్తున్నారని, దాన్ని నిరసిస్తూనే, సంస్కరణను కోరుకుంటున్నారు రచయిత. చెప్పులతో దేవాలయంలోకి ప్రవేశించి దేవుడ్ని పూజించడం మన తెలుగు సాహిత్యం స్పర్శించిన అంశమే. శ్రీ కాళ హస్తీశ్వర మాహాత్మం లో భక్త కన్నప్ప కథలోనూ చెప్పులతో, మాంసం తో శివుడిని పూజచేసినా దేవుడికేమీ అభ్యంతరం రాలేదు. అప్పుడూ పూజారి వర్గానికే అభ్యంతరం వచ్చింది. అయితే, ఆ కథలో కన్నప్ప భక్తుడే కావచ్చు కానీ నాగరక సమాజంతో సంబంధంలేని వాడు. కానీ ఇనాక్ గారి మూర్తి చదువుకున్న భక్తుడు. అన్నీ తెలిసిన భక్తుడు. కార్య కారణ సంబంధాన్ని వివరిస్తూ మాట్లాడుతుంటాడు. దేవుడి కోసం పూజారి కాదు. పూజారి కోసమే దేవుడు అన్నట్లు గా దేవాలయ వ్యవస్థను మార్చేశారని స్వామి - మూర్తిల సంభాషణలో తేలిపోతుంది. దేవుడికీ-భక్తుడికీ మధ్య ఉండే పూజారి వారధిగా నిలుస్తాడనేది కేవలం భ్రమ , పూజారి అహంకారం గా రచయిత నిరూపించారు.2) పవిత్రత అనేది భౌతికమా? మానసికమా? అనేది తెలిస్తే గాని దాన్ని నిర్ణయించటం అంత సులువు కాదు. శుచి, శుభ్రతలు ముందుగా బాహ్య రూపానికి చెందినవే, ఆ తరువాతే ఆత్మ లేదా అంతరంగ పరిశుద్దత గురించి ఆలోచించటం జరుగుతుంది. అనేక చోట్లలో తిరిగి వస్తారు కనుక, కాళ్ళకున్న చెప్పులను విప్పేసి ఇంటిలోకైనా, గుడిలోకైనా ప్రవేశిస్తారు. అంటే ఇక్క డ శుభ్రత రూపంలో పవిత్రత దాగిఉంది. ఈ పవిత్రతను నిర్ణయించేది మానవులే! మానవులే దేవుడికి ప్రీతిపాత్రమైనవేమిటో నిర్ణయించి , వాటిని దేవుడికి నివేదించటం జరుగుతుంది. ” నిర్ణయించినవి” కాకుండా మరేమైనా పెడితే ఆ దేవాలయం లేదా ఆ స్థలం అపవిత్రం అయిపోతుందంటారు. కనుక “కొన్ని” నిషేధాలకు గురవుతాయి. కొంత మంది దేవుళ్ళకు, దేవతలకు మాంసాన్ని నివేదించటం జరిగితే అపవిత్రమైపోయినట్లే భావిస్తారు. శుద్ది కార్యక్రమం చేస్తారు. చిత్రమేమిటంటే ఆ మాంసం చాలా మంది దేవతలకు నివేదించినప్పుడు ఎలాంటి అపవిత్రతా రాదు. దీన్ని బట్టి పవిత్రతకు సార్వజనీన లక్షణం లేదనే కదా తేలేది. అంతే కాదు, భౌతిక స్థితిగతులే పవిత్రతను నిర్ణయించడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయనీ అర్థమవుతుంది. ఈ కారణాలను ఆధారం చేసుకునే దళితులకు దేవాలయ ప్రవేశాన్ని చాలా కాలం నిషేధించారు. చదువుకున్న, శుభ్రంగా ఉన్న దళితులకు తప్ప ,ఇప్పటికీ చాలా చోట్ల దళితులకు దేవాలయ ప్రవేశం లేదు. శుభ్రంగా ఉన్నంత మాత్రం చేత కూడా అందరినీ దేవాలయంలోకి ప్రవేశించనివ్వటం జరగటం లేదు. కనుక కేవలం బాహ్య శుభ్రత మాత్రమే సరిపోదు. మరింకొకటేదో కావాలి. అదేమిటి? అది మానసికంగా ఏర్పడిన, ఆచారాలతో కూడిన భావన. ఆ ఆచారాలు క్రమేపీ సంప్రదాయాలుగా మారిపోతాయి. శుభ్రతలో, మానసిక భావనలో పవిత్రత ఉంటుంది. అందుకనే కథలోబ్రాహ్మణుడు వేసుకున్న మురికి వస్త్రాలు గానీ, మాసిపోయిన జంధ్యం గానీ పవిత్రతకు అడ్డు రాలేదు.
1.3. ఆచార సంప్రదాయాలు - ద్వంద్వ ప్రమాణాలు:
ఇక్కడ ఆచారాల్లోనూ, ఆ అచారం సంప్రదాయంగా మలుచుకోవటంలోనూ ద్వంద్వ ప్రమాణాలున్నాయి. ఆ ప్రమాణాలు కొన్ని వర్ణాల, వర్గాలనుండే రూపొందుతున్నాయి. దీన్ని ప్రశ్నిస్తుంది కులవృత్తి కథ. పవిత్రతను పరీక్షకు పెడుతుందీ కథ. కనుకనే బూట్లు శుభ్రంగాఉన్నాయి. జంధ్యం మురికిగా ఉందని కూడా కనిపించే భౌతిక వాస్తవికతనుండే ‘మూర్తి’ తన ప్రశ్నలను సంధించాడు. అంతే కాదు పవిత్ర లో కనిపించే డొల్లతనాన్నికూడా ప్రశ్నించాడు. అందుకనే , పూజారి స్వామి, మూర్తి ని అడ్దగించినా, చెప్పులు , బూట్లు ధరించి వెళ్లకూడదన్నా, ‘ఒక ఉన్నతాధికారి’(?) దేవాలయంలోకి వెళ్ళిపోతాడు. దాన్ని మూర్తి గమనించి, స్వామిని అడిగితే, పూజారి చూడలేదంటాడు. ఇక్కడ పూజారి చూడకపోతే ఆ దేవాలయంలో ఏమి జరిగినా అపవిత్రం కాదనే కదా అర్థం! నిజంగా అపవిత్రం అయితే దాన్ని సంప్రోక్షణ ద్వారా శుద్ధి చేయటం జరుగుతుంది. అది కూడా పూజారి గమనిస్తేనే! లేకపోతే పవిత్రత - అపవిత్రత అనే ప్రస్తావనే రాదు. ఇంతజరిగినా దేవుడు నిమిత్తమాత్రుడు గానే కనిపిస్తున్నాడు. పూజారే పెత్తనం చెలాయిస్తున్నాడు. కనుక పూజారి లేకపోయినా భగవంతుడిని పూజించుకోవటంలో ఎలాంటి ఇబ్బందీ లేదనే స్పష్టమవుతుంది.
ఇనాక్గారు దేవుడిని అంగీకరిస్తున్నారా లేదా అనే దానికంటే దేవాలయ వ్యవస్థలో ప్రక్షాళనను అభిలషిస్తున్నారు. సామాజిక వ్యవస్థలో దేవాలయ వ్యవస్థ ఒక అంతర్భాగం. అది ఏ మతానికి చెందినదైనా కావచ్చు. దేవాలయం చుట్టూనే తరతరాలుగా పాలకులు తమ పాలనను కేంద్రీకరించారు. దేవాలయంలోకి వెళ్ళాలనుకోవటంలో సమాజంలో కలవటానికి దళితులు పడే తరతరాల ఆవేదన ఉంది. దేవుడిని నమ్మడం డాశాంతి కుమార్‌గారు అన్నట్లు ఒక మౌఢ్యమే కావచ్చు. కానీ, దేవాలయంలోకి వెళ్ళేవారంతా దేవుని పట్ల విశ్వాసంతోనే ఉన్నారనుకోవడానికి వీల్లేదు. అర్చకత్వం చేసేవాళ్ళంతా తాము దేవుడిని నమ్ముతూనే దైవసేవ చేస్తున్నారనుకోవడానికీ వీలులేదు. అర్చకత్వం ఒక వృత్తిగా మారింది. వృత్తిని ఫలితం ఆశించి చేస్తారు. సేవ ఉచితంగా లేదా నిస్వార్థంగా చేస్తారు. ఇతర పనులు చేస్తే అగౌరవంగా భావిస్తారనీ మరో పని చేతకాక గతిలేని స్థితిలో కూడా చాలా మంది అర్చకత్వం చేస్తున్నారు. మరికొంత మంది దీన్ని మంచి ఆదాయ మార్గంగానే భావిస్తున్నారు. కనుక అర్చకులంతా దేవుడి పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళని ఎలా అనలేమో దేవాలయ ప్రవేశం కోరుకునే వాళ్ళంతా దేవుణ్ణి పూజించడానికే పోరాడుతున్నారనీ అనలేం కదా!
1. 4. కుల వృత్తి - భావన :
ఇక, ‘ప్రతీ ఇంటిలోనూ కుల వృత్తులు అవతారం ఎత్తినా’ ఒక్కో వృత్తీ ఒక్కో కులానికి మాత్రమే అంటగట్టడం తరతరాలుగా జరుగుతోంది. ఇంటిలో బట్టలు ఉతుక్కోవడం, ఇస్త్రీ చేసుకోవడం, బూట్లు పాలిష్ చేసుకోవడం, షేవింగ్ చేసుకోవడం తదితర పనులన్నీ కులవృత్తులుగా భావింపబడవు. ఇంట్లో ఇలాంటివి చేసుకుంటున్నంత మాత్రాన కుల వృత్తులు ఇంటిలో అవతారం ఎత్తినట్లుగా భావించలేం. జీవనోపాధి కోసం ఎన్నుకునేదే వృత్తి అవుతుంది. సాధారణంగా ఇంట్లో చేసుకునే పనులు అవసరార్థం లేదా ఆదాయ వనరులు సరిపడక మాత్రమే చేసుకుంటారు. వాటిని కులవృత్తులు అనలేం కదా! అంతే కాదు, గ్రామాల్లో చాలా చోట్ల ఆదాయం రానంత కాలం పోచమ్మ, మైసమ్మ మొదలైన ఆలయాల్లో మాల - మాదిగలు లేదా కింది వర్ణాల వాళ్ళు పూజారులుగా వ్యవహరిస్తారు. అయినా పూజారి వృత్తిని బ్రాహ్మణ వర్గ సొత్తుగానే భావిస్తూ ఆ ఆలయానికి ఆదాయం సమకూరుతున్నప్పుడు ఆ కింది వర్ణాల పూజారులను తొలగిస్తారు. దానికి అవసరమైతే ప్రభుత్వ సహకారం తీసుకుని చట్ట పరంగా బ్రాహ్మణ వర్గానికిచెందిన వారినే పూజారులుగా నియమిస్తారు. నేటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజారులుగా పని చేయటానికి ఏ వర్ణాల వారికి అవకాశం ఉందో స్పష్ఠంగానే తెలుస్తుంది. కుల వృత్తులు అవతారాలు మారినట్లు కనిపించినా అవి మానసిక భావనలో కొన్ని వృత్తులు నేటికీ హీనంగానే భావింపబడుతున్నాయి. ఆ వృత్తులు కొన్ని వర్ణాలవారినే స్ఫురించేటట్లు చేస్తున్నాయి. కనుక కుల వృత్తుల అవతారాలను అర్థం చేసుకోవడంలో అన్ని వర్ణాల వాళ్ళూ అన్ని వృతులూ చేసినా మానసికంగా మాత్రం కుల వృత్తి భావన కొన్ని వర్ణాలదే అనేది అంతరించలేదు. “కుల వృత్తి” కథలో మూర్తి దేవాలయ ప్రవేశాన్ని ఆశించటంలో ఈ మానసిక వ్యథ అంతా ఉంది.
1.5. సామాజిక వాస్తవికత - కళా సిద్ధాంతం :
ఆదిశంకరాచార్యుల వారికి ఎదురుపడి చండాలుడి రూపంలో శివుడే కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అది నిజానికి ఆత్మ తత్వానికి సంబంధించిన వాదం. ఇనాక్గారు కుడా తన కథలో చిత్రించిన పూజారి స్వామి - మాదిగ మూర్తిల మధ్య సంభాషణ ఒక సామాజిక సమస్యను బయటికి తేవాలనే ఉద్దేశంతో చేసిన కల్పన. కొన్ని వేల సంవత్సరాల దళితుని వేదన మూర్తి మాటల్లో ప్రతిధ్వనించింది. దేవాలయ ప్రవేశం, కుల వృత్తీ ఆ పరికరాలను గౌరవించమనటం ఒక సామాజిక సమస్యకు సంబంధించిన విషయమే! సామాజిక సమస్యను సైద్ధాంతికంగా వివరించే ఈ ప్రయత్నాన్ని “కళ కోసం కళ” అనే సిద్ధాంతంతో ముడివేయడం అంటే సామాజిక వాస్తవికతను వక్రీకరించటమే!ఆదిశంకరాచార్యులు, చండాలుని వాదనను అంగీకరించటంలో కనిపించని వితండవాదం, మూర్తి సంభాషణలో కొందరికి కనిపించటం ఆశ్చర్యకరమే! ఇక్కడ ఈ కథా రచయిత ప్రతిభను కాదనలేం. కానీ, ప్రతిభను నిరూపించుకోవాలని కాకుండా సామాజిక సమస్యను ప్రతిభావంతంగా పరిష్కారాన్ని సూచించాలనుకున్నారు. దీన్నిఅర్థం చేసుకోవడంలో కలిగే కష్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ కథను “కళ కోసం కళ” అనే సిద్ధాంత చట్రం లోకి నెట్టేసే ప్రయత్నం శోచనీయం.
“దేవుణ్ణి నమ్మే వాళ్ళు మొత్తం జనాభాలో తొంభై శాతం కన్నా ఎక్కువగానే ఉంటారేమో! ఆ దేవుడు వుండే ఆలయం పవిత్రమైనది (ఉన్నతమైనది) అనే భావన వారిలో ఉంటుంది” అని ప్రకటించిన (ప్ర.జా.సా., అక్టోబర్ : 2006 - 56) డాశాంతి కుమార్‌గారే “దేవుడే ఉంటే - కనీసం ఉన్నాడని నమ్మకమో, భయమో వుంటే - ప్రపంచంలో ఇంత అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, దోపిడీ పీడనలు జరుగుతూ ఉండేవా? తన గుడిలో జరిగే అక్రమాలకే దిక్కు లేదు … ” అని వివరించారు. ఇవి పరస్పర విరుద్ద ప్రకటనలు. ఒకదాన్నొకటి ఖండించుకుంటున్నాయి. అంతే కాకుండా ఐదు శాతం ప్రజల్లో దేవుడి పట్ల నమ్మకం లేక పోవటం వల్లనే ఇన్ని అన్యాయాలు, అక్రమాలు వంటివన్నీ జరిగి పోతున్నాయా! ఆలోచించవలసిందే.
1.6. ఆలోచనావిధానంపై భావజాల ప్రభావం :
అత్యధికుల ఆలోచనా విధానం, అల్ప సంఖ్యాకుల ఆలోచనా విధానంపై ఎప్పుడూ పెత్తనాన్ని చెలాయిస్తూనే ఉంటుంది. ప్రశ్నించటాన్ని నేరంగా కూడా పరిగణిస్తుంది. అది అల్ప సంఖ్యాకుల స్వీయ అస్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. అప్పుడది ఆధిపత్య భావజాలంగా రూపొందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అమెరికా చెలాయిస్తున్నది ఇలాంటి ఆధిపత్య భావజాలమే. చిన్న దేశాలు తమ అస్తిత్వం కోల్పోవటంలో, ఉన్న అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేక పోవటంలో ఆధిపత్య భావజాల ప్రభావమే ప్రధాన కారణం. భారత దేశంలో ఆచారాలు, సంప్రదాయాలు మొదలైన వాటిపై హిందూ భావజాలం ఇలాగే తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. మానవ జీవన విధానానికి కావలసిన ప్రమాణాలు హిందూ భావజాలం నుండే రూపొందుతున్నాయి.
భారత దేశ వివాహ వ్యవస్థలో హిందూ - ముస్లిం - గిరిజన తెగల మధ్య జరిగే వావి వరుసల గురించి ఈ సందర్భంలో ఓ సారి ఆలోచించాలి. దీన్ని సాహిత్య పరంగా కూడా చూడవచ్చు. రామాయణంలో వాలి - సుగ్రీవుల కథలో హిందూ ఆధిపత్య భావజాలమే వావి వరుసలను నిర్ణయించింది. పవిత్ర భావనను కూడా ఏర్పరిచింది. ఈ వాలీసుగ్రీవుల కథలో కనిపించే వావి వరుసలు నిజానికి గిరిజన తెగలకు సంబంధించినవి కాదు. గిరిజన తెగలలో నేటికీ అన్న భార్యను తమ్ముడు, తమ్ముడి భార్యను అన్న - భార్యగా చేసుకోవటం సర్వ సాధారణమే! అయితే అది ఆయా పరిస్థితులను అనుసరించి ఉంటుంది. యుద్ధాల్లో కూడా ఓడిపోయిన వాళ్ళ భార్యలను గెలిచిన వాళ్ళు తమ ఆస్తిగా మార్చుకోవటం జరుగుతుండేది. దీనిలో పవిత్రత అపవిత్రతలకు అవకాశమే లేదు.
ఆరుద్ర రాసిన “రాముడికి సీత ఏమవుతుంది ” గ్రంథంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సీతారాముల కథలను పోలుస్తూ ఆయన వివరించారు. అప్పుడు ఆయనపై చాలా మంది తీవ్రంగానే విమర్శలు చేశారు. సీతారాముల మధ్య సంబంధాన్ని పవిత్రంగానే ఆ ప్రజలు భావించారు. నిజానికి ఆ రకమైన విమర్శలు రావటానికి తెలిసో తెలియకో ప్రజల ఆలోచనల్లో హిందూ భావజాలం ఆక్రమించి ఉండటమే కారణం. చాలా మంది తెలిసో తెలియకో కొన్ని మాటల్ని వాడేస్తుంటారు. అలాంటి వాటిలో దళితులు కూడా ఏదైనా ఒక నీచమైన విషయాన్ని పోలుస్తూ చెప్పటానికి “చండాలంగా ఉంది” అంటుంటారు. స్త్రీలు కూడా కొన్ని సందర్భాల్లో మగవాళ్ళను తక్కువచేస్తూ మాట్లాడేటప్పుడు “గాజులేసుకున్నావా?” అంటుంటారు. ఈ వ్యాసకర్త కూడా ఒక సెమినార్లో హిందూ భావజాలంలో కొట్టుకుపోయే కులవృత్తి కథలో మూర్తి చెప్పులతో దేవాలయంలోకి వెళ్ళాలనుకోవటాన్ని అందరూ అంగీకరించే భావనేనా అని అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానిక్కారణం కథలో చెప్పిన సమస్య లోతుల్లోకి వెళ్ళటం కంటే ఆచార సంప్రదాయాల ప్రభావం పైనే నిలిచి మాట్లాడటం ఒక ప్రధాన కారణం. ఇలాంటివన్నీ ఆధిపత్య భావజాలం ప్రభావంలో కొట్టుకుపోయి మాట్లాడేవే తప్ప లోతైన అవగాహనతో అంటున్నవి కాదు. అలాగే దేవాలయాంలోకి చెప్పులతో వెళ్ళకూడదు అనేది అందరి ఆలోచనల ఫలితంగా ఏర్పడిన ఆచార సంప్రదాయం కాదు. ఆధిపత్య భావజాలం నుండి వచ్చిన ఆలోచనలు మాత్రమే.
వాలీ సుగ్రీవుల కథలో పవిత్ర భావన ఒక నిస్సహాయత నుండి అంగీకరించిందే తప్ప స్వీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకుని అంగీకరించింది కాదు. అంగీకరించకపోతే ఆధిపత్యం విధించే శిక్ష తప్పదు. వ్యతిరేకిస్తే సంఘర్షణ తప్పదు. ఇలాంటిదే మాహాభారత కథలో పాండవుల పుట్టుకకు సంబంధించిందీ కూడా! ఇక్కడ స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన సంబంధాలను హిందూ భావజాలం అవసరానికి అనుగుణంగా మార్చేసింది. ప్రమాణాలను కాలానుగుణంగా మార్చుకోవచ్చని పాండవుల పుట్టుక జరిగిన తీరే గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది.
“కులవృత్తి” కథలో కొన్ని వర్ణాలు మరికొన్ని వర్ణాలపై అవసరానికనుగుణంగా మార్చుకుంటూ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారని రచయిత స్పష్టం చేయదలచుకున్నారు. అందుకనే పూజారి స్వామి మొదట్లో మూర్తిని చెప్పులతో దేవాలయ ప్రవేశానికి అంగీకరించడు. కాళ్ళు రసి కారుతున్నాయని మూర్తి అనగానే బూట్లు కడుక్కుని దేవాలయం లోనికి వెళ్ళడానికి స్వామి అంగీకరిస్తాడు. అంటే ప్రమాణం మారింది. ఆచారం సంప్రదాయం ఒకేలా ఉండాలని ఏమీ లేదు. వాటిని మార్చుకునే స్వభావం ఉందనేది స్వామి చేతనే నిరూపించారు రచయిత.
పూజారులు చూడకుండా పక్షులు,జంతువులు ఆలయంలోకి ప్రవేశించినపుడు దేవాలయం అపవిత్రం కావటం లేదు. అంటే దేవుడి కంటే పూజారికే నియమ నిష్ఠలపై ఆసక్తి ఎక్కువగా ఉంది. పాప పుణ్యాలు ఉన్నాయో లేవో కూడా పూజారులే స్పష్ఠం చేస్తున్నారు. అవసరమైతే పాపాలు పోవడానికి కర్మ కాండలు నిర్వహించే వాళ్లూ పూజారులే. ఆ నియమ నిష్ఠలు కొన్ని వర్ణాల నుండే రూపొందుతున్నాయిని మరికొన్ని వర్ణాలకు అవి శాపంగా మారుతున్నాయని రచయిత ఒక నూతన దృష్టిని ప్రదర్శించదల్చుకున్నారు. అవసరానికి అనుగుణంగా బలైపోతున్న వాళ్ళు అంటే సామాజిక సంబంధాలకు దూరంచేయబడుతున్న వాళ్ళు కింది వర్ణాల వర్గాల వాళ్ళే అనేది నిరూపించటం ఈ కథలో కనిపిస్తుంది. ఆ నిరూపణలకు హిందూ భావజాలం ఆధారంగా తీసుకుంటున్నారని నిరూపించదలచుకున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రమాణాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు. చెప్పులతో గుడిలోకి పోకూడదు అనేది ఇలాంటి ప్రమాణాల్లో ఒకటి. అంతే తప్ప అపవిత్రమవుతుందనే కారణం కాదనేది కూడా రచయిత ఉద్దేశం.
దేవాలయంలోకి చెప్పులతో ప్రవేశించటం అనేది అత్యధికులు తెలిసో తెలియకో అంగీకరించే పవిత్ర భావన. ” అంతర్నిబంధన రక్షణలో విడిగా ఉండిపోయేవి పవిత్రాలు. ఇక ఈ అంతర్నిబంధనలు, నిషేధాలు వర్తింపజేసి పవిత్రాంశాలకు దూరంగా ఉంచబడేవి అపవిత్రాలు” అని సామాజిక శాస్త్రవేత్త Prof. Durkhem తన గ్రంథం “The elementary forms of the relegion life” లో వివరించారు (డా . బి.ఆర్. అంబేద్కర్ రచనలు [సంపుటి 7] 1992 - 328). ఇవి అందరికీ వర్తిస్తాయి. వీటిని విధిగా పాటించాలి. వీటిని అతిక్రమించటం అంటే నేరం కంటే ఘోరం. అది దైవ దూషణ, పాప కార్యంగా మత ప్రచారకులు భావిస్తారు. కనుక ఆచారాలూ సంప్రదాయాల్లో పవిత్రాంశాలు ఒక భాగమైపోతాయి. ఇవి పరీక్షలకు గురైనప్పుడు సోక్రటీస్లా అవసరమైతే ప్రాణాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. శాస్త్రీయతకు అవకాశమే ఉండదు.
1.7. ముగింపు :
భౌతిక వాస్తవికత మానసిక ప్రభావాన్ని ఎలా కలిగిస్తుందో వివరించే పరిణామం ఈ “కుల వృత్తి” కథలో కనిపిస్తుంది. ఇతర దేశాల, మతాల ఆచార సంప్రదాయాల నుండి చూసే వారికి దేవాలయంలోకి చెప్పులతో వెళ్ళటం తప్పు కాదనిపిస్తుంది. పరిమిత దృష్టితో చూసేవాళ్ళకి తప్పనిపిస్తుంది. అస్పృశ్యత వేరు, పవిత్రత వేరు. సామాజికంగా ఒక వర్గం మరొక వర్గం పట్ల చూపే జుగుప్సనే అస్పృశ్యత అంటారు. అది భారత దేశంలో కనుమరుగైపోతుందని చెప్పడానికి నిదర్శనమే మాదిగ మూర్తిని దేవాలయంలోకి ప్రవేశించటానికి పూజారి స్వామి ఆటంకం పెట్టటంలేదంటాడు కథలో. ఈ స్థాయిని దాటి చెప్పులు వేసుకుని కూడా దేవాలయంలోకి వెళ్ళాలని కోరుకోవటంలో అన్ని వృత్తుల వస్తువులకు వృత్తులు చేసేవారికి సమాన గౌరవం సమాన వ్యక్తిత్వం దక్కాలనే సామాజిక సమస్యను ఈ కథ చిత్రించింది. కథ శాస్త్రీయమైనంత మాత్రాన అందరూ అంగీకరించాలని ఏమీ లేదు. చేతబడి, బాణామతి వంటివన్నీ మూఢ విశ్వాసాలని చెప్తున్నా, శాస్త్రీయంగా నిరూపిస్తున్నా అత్యధిక ప్రజలు నమ్మే స్థితిలో లేరు. శాస్త్రీయత కంటే మానసిక ప్రభావానికే తాత్కాలికంగా అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది. అలాంటప్పుడు మూర్తిలాంటి వారి వాదన కన్నీళ్ళే పెట్టిస్తుంది. కానీ, కొంతమందినైనా ఆలోచింపచేయగలిగితే మన ఆచార సంప్రదాయాల్లో మార్పులు ఖచ్చితంగా వస్తాయి. ఆ మార్పులు అందరికీ సంతోషాన్ని కలిగిస్తాయి. అందరితో కలిసి మెలిసి జీవించేలా చేస్తాయి. అలాంటి మార్పును ఆశించే కథే “కుల వృత్తి”.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి