"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

12 July, 2007

Online లో ఆరుద్ర - సాహిత్యం


నాగరాజు గారు ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని విల్‌డ్యూరాంట్ రచించిన స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ తో పోలుస్తూ మంచి వ్యాసం రాశారు. ఆ వ్యాసం దగ్గర కొన్ని సాంకేతిక కారణాలవల్ల నా అభిప్రాయాన్నిఅక్కడ పూర్తిగా చెప్పలేక పోయాను. అక్కడ నేను చెప్పిన అభిప్రాయం ఇది.


"నాగరాజు గార్కి నమస్కారం!


మీ వ్యాసం అద్యంతమూ ఆసక్తి గా చదివాను. మంచి రీడబిలిటీ ఉంది. ఆరుద్ర గారి గురించి మీరు వ్యక్తంచేసిన చాలా అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను. తెలుగు అకాడమీ వారు ప్రచురించిన నాలుగు సంపుటాల్లో కొన్ని పద్యాలు ,వాక్యాలు వంటివి తొలగించారు. నిజానికి ప్రజాశక్తి వాళ్ళు ప్రచురించిన పుస్తకాలలో ఆరుద్ర అభిప్రాయాలు యధాతథంగా ఉన్నాయి. కాకపోతే అందులో కొన్ని హడావిడిగా రాసినవీ ఉన్నాయి. మరిన్ని అభిప్రాయాలను నా బ్లాగులో రాసున్నాను. ( సాంకేతిక కారణాలు ప్లీజ్ )


మీ


దార్ల "




ఆరుద్ర 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' తొలిముద్రణలో 12 సంపుటులుగాను, ద్వితీయముద్రణలో 13 సంపుటులుగానూ తెలుగు సాహిత్యాన్ని సాధ్యమైనంత సమగ్రంగా అందించారు. చాలా మంది తొలి ముద్రణనే ఆధారం చేసుకొని చాలా మంది 12, 14 అని Online లో రాస్తున్నారు. పెద్ద పెద్ద సాహితీ వేత్తలు కూడా ఇలాగే పొరపడుతున్నారు .
నిజానికి ఆరుద్ర 13 సంపుటులు రాశారు. మొదటి ప్రచురణ మాత్రం 12 సంపుటాలే! వెబ్ సైట్ల లో కూడా ఇదే ప్రచారంలో ఉంది. నాగరాజు పప్పు గారు " ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం '' పేరుతో ఒక మంచి వ్యాసం రాశారు. దీనిలోని ప్రతి వాక్యం స్పూర్తి దాయకంగా ఉంది. ఆరుద్ర పట్ల గౌరవం పెరిగేటట్లు ఉంది.అయితే ఆరుద్ర రచనలో కొన్ని లోపాలున్నాయి. వాటిని కూడా స్పర్శిస్తూనే మూల రచనను చదివించేటట్లు నాగరాజు గారు రాశారు. కానీ నాగరాజు గారు The Story of Civilization by Will and Ariel Durant లతో పోల్చి చెప్పడం, ఆ దేశంలో చరిత్ర కారులకిచ్చే గౌరవం ... ఇలా పోల్చి చెప్పటం బాగుంది. అయితే ఈ సందర్భం లో మనం ఒకటి గమనించాలి. మనతెలుగులో కవులు, చరితకారులు, విమర్శకులపై భావజాల ప్రభావం అధికంగా ఉంది. అది ఎలాంటిదైనా కావచ్చు. ఆరుద్ర మార్క్సిస్టు దృక్పథంతో సాహిత్య చరిత్రను రాశారు. ఇదొక కారణంగా సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని చాలా మంది రిఫర్ చేయడం లేదేమో అనుకుంటున్నాను. అకాడిమిక్ గా చదివే వారికి సమగ్ర ఆంధ్ర సాహిత్యం కంటే ఆచార్య జి.నాగయ్య గారి తెలుగు సాహిత్య సమీక్ష సులువుగా ,స్పష్టంగా ఉంటుందనే భావన దానికి కారణం కావచ్చు.
నా పరిశోధనను ఇంకా ( పరిశోధకుడుగా ఆరుద్ర " పేరుతో పిహెచ్. డి చేశాను) ప్రచురించలేదు. (ఆ రాత ప్రతి డిజిటైజేన్‌ చేశామని మా యూనివర్సిటీ లైబ్రరీ వాళ్ళు అంటున్నారు. కానీ ఆ వెబ్ లింక్ లో అది రావటం లేదు. )ఈ విషయంలో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకొనేవారికి నా పుస్తకం కొంత ఉపయోగ పడవచ్చనుకుంటున్నాను.
ఏది ఏమైనా అంటే ఆరుద్ర గారు రాసినా మరొకరు రాసినా మూల రచనను చదివించే్టట్లు చేయగలగటం, ఒక ఆలోచనా స్రవంతిని కలిగించటమే ప్రధానంగా పరిశోధకుడైనా, విమర్శకుడైనా కలిగించగలగాలి.
Onlineలో రచయితలు చాలా వరకూ విజయం సాధించగలగుతున్నారు .


2 comments:

Nagaraju Pappu said...

మాస్టారూ,
ఎప్పుడో ఉబుసుపోక రాసిన వ్యాసాన్ని మీరు సమీక్షించడం, మాటల సందర్బంలో మీరు ఆరుద్ర మీద రీసెర్చి చేసినట్టుగా తెలియడం చాల సంతోషంగా ఉంది.

సమగ్ర ఆంధ్ర సాహిత్యం గురుంచి నాకు చాలా సందేహాలున్నాయి - మీ పి.హెచ్.డి థీసిస్ మీరిచ్చిన లంకెలో తెరుచుకోవటం లేదండి. మీ దగ్గర పి.డి.ఫ్ ఫైలుంటే పంపగలరా? There are places where I thought the perspective and information presented by him is not authentic. But, I do not have the necessary expertise to verify such details.
అదీకాక, భావుకుడు, ఆవేశపరుడూ ఐన కవి అంత కూలంకుషమైన పరిశోధకుడుగా ఎలా ఎదిగేడు అనేది నన్నెప్పుడూ ఆశ్చర్యానికి లోను చేస్తుంది. ఈ రెండూ ఉత్తర దక్షిణ ధ్రువాలు లాటివి కదా?

సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని - స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ తో సరిపోల్చడం సరియైనదో కాదో నాకు తెలియదు కాని, నేను Will Durant గురించి రాయడానికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి:

౧. సామాన్యులకోసం విజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడానికి 'సింథసిస్" టెక్నిక్ ని ఆయన ప్రవేశ పెట్టారు, దానిని పరిచయం చేయడానికి విల్ డ్యూరాంట్ ని ఉదాహరణగా తీసుకొన్నాను. ఆరుద్ర ఉపయోగించిన టెక్నిక్ కూడా అదే కదా? ఈ పద్ధతిని Scholastic Techniques కి మధ్యనున్న తేడాలు, సంబంధాలు కూడా పరిచయం చెయ్యడం నేను రాసిన వ్యాసంలో ప్రధమ భాగం.

౨. వ్యక్తులుగాను, పరిశ్రమలోనూ, ఎంచుకొన్న ఆశయంలోనూ, చేసిన పరిశోధనలోనూ ఆరుద్రని కొంతవరకూ విల్ డ్యూరాంట్ తో పోల్చవచ్చేమో. అలాగే, ఇద్దరి శైలి, శిల్పమూ అమోఘమైనవే. డ్యూరాంట్ శైలి - శాంభవ ఝటా సంరంభ గంగార్భుటి. వచనంలో దాగిన కవిత్వంలాగా, పర్వతాలమీదనుంచి దుమికే జలపాతంలాగా ఉంటుంది. చదవటం మొదలుపెడితే ఆపటం కష్టం.

డ్యూరాంట్ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ అని పేరు పెట్టినప్పటికి - ఆయన రాసింది ప్రధానంగా ౧౮-౧౯ శతాబ్డాలనాటి యూరోపియన్ చరిత్ర గురించే. మొదటి సంపుటిలో - ప్రాచీన నాగరికతనంతా క్లుప్తంగా చేప్పేసి, రెండో సంపుటిలో గ్రీకుల గురించి, మూడో సంపుటిలో రోమన్ల గురించి రాసి, అక్కడ నుంచి మిగిలిన సంపుటిలన్నీ యూరోపియన్ చరిత్రకి సంబంధించినవే.

నాగయ్యగారి రచనలలాగే, ఆర్నాల్డ్ టోయన్బీ రాసిన ప్రపంచ చరిత్రని పండితులు, పరిశోధకులు రిఫెరెన్సుగా వాడతారనుకొంటా.

అంతమాత్రం చేత, అటు డ్యూరాంట్ గారి పుస్తకాలకిగాని, ఆరుద్రగారి పుస్తకాలకి వచ్చిన లోటేం లేదు కదా - కనీసం మాలాటి సామాన్య పాఠకులకి సంబంధించినతవరకు.

నా వ్యాసం చదివినందుకు, మీరు ఇచ్చిన సూచనలకి మరోసారి ధన్యవాదాలు. మీ పరిశోధనా వ్యాసం చదివిన తర్వాత మరలా ఈ వ్యాసాన్ని తిరిగరాస్తాను.

vrdarla said...

మాస్టారూ నమస్తే!
మీ వ్యాసాన్ని ప్రచురణకు పంపేయండి.మరలా రాయాలంటే రాయవచ్చు. ఇక నా పిహెచ్ .డి. పైల్ లేదు. టైపు చేయించినప్పుడు ఫైల్ పి.డి. ఎఫ్ అడిగితే వాళ్ళ దగ్గర లేదన్నారు. దానితో తరువాత మామూలు ఫైలు అయినా ఇమ్మన్నాను. దాన్ని డీలీట్ చేశారట!
మీరు ఒక విషయాన్ని అదే"అదీకాక, భావుకుడు, ఆవేశపరుడూ ఐన కవి అంత కూలంకుషమైన పరిశోధకుడుగా ఎలా ఎదిగేడు అనేది నన్నెప్పుడూ ఆశ్చర్యానికి లోను చేస్తుంది. ఈ రెండూ ఉత్తర దక్షిణ ధ్రువాలు లాటివి కదా? అన అడిగారు. నాపరిశోధనలో ఆయన సృజనాత్మక పరిశోధకుడని నేను ప్రతిపాదించాను.పరిశోధనలో సృజనాత్మకత చాలా అరుదు గా కనిపిస్తుంది. మీ రు మీ వ్యాసంలో కూడా రాశారు- సామాన్యులను దృష్టిలో పెట్టుకునే ఆరుద్ర సమగ్ర ఆంధ్రసాహిత్యాన్ని రాశారు. అందువల్ల సృజనాత్మక లక్షణాలు ఆయన పరి్శోధనలో ఉన్నాయి.