Thursday, April 26, 2007

క్రిమీలేయర్ ... చిన్న వివరణ

ప్రసాద్ గారూ!
మీ స్పందనకు ధన్యవాదాలు.
క్రిమీలేయర్ అంటే ఏమిటో మీకు తెలుసనుకుంటాను. ఒకసారి రిజర్వేషన్‌ అవకాశాలను పొందిన వాళ్ళ కంటే, అసలు ఆ అవకాశాలు అందని వాళ్ళకు రిజర్వేషన్‌ సౌకర్యాలు అందాలనే ఆలోచన క్రిమీలేయర్ లో ఉంటుంది. ఇప్పుడున్న రిజర్వేషన్‌ వ్యవస్థలో కొన్ని వర్ణాలవారే అవకాశాలను పొందుతున్నారు. ఉదాహరణకు బాగా చదువుకున్న వాళ్ళ. రాజకీయవేత్తల పిల్లలతో గ్రామీణ ప్రాంత విద్యార్తులు పోటీ పడలేరు. అందులోనూ మొదటి తరం వాళ్ళు ఇప్పుడిప్పుడే విద్యావకాశాలను అందుకోవాలను కుంటున్నారు. వాళ్ళూ చాలావెనుకబడి ఉంటారు. కనుక, ఒకతరం రిజర్వేషన్లు పొందిన వాళ్ళు, తరువాత మళ్ళీ రిజర్వేషన్లు పొందడం కంటే, అసలు పొందని వాళ్ళకు ఆ అవకాశాన్ని కలిగిస్తే బాగుంటుంది. అప్పుడు మన రాజ్యాంగం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. కలకాలం కొన్ని వర్ణాల వారే రిజర్వేషన్లు పొందాలనుకోవటం సమర్థనీయం కూడా కాదు. రాజకీయ వేత్తల్లా మేథావులు కూడా మాట్లాడితే సమస్యలు పరిష్కారాలు అందవు. ప్రస్తుతం వర్ణానికి ( కులానికి) ప్రాధాన్యతనిచ్చేరిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. దీని వల్ల బయిటికి కనిపించక పోయినా కొని వర్ణాల పట్ల మరికొన్ని వర్ణాల వారికి ద్వేష భావం పెరిగి పోతున్నది. ఒక నిస్సహాయతనుండి పుట్టు కొస్తున్న ద్వేష భావమది . దీనికి కారణం కేవలం రి్జర్వేషన్లకు కులాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోవటం ఒక ప్రధాన కారణం. అందు వల్ల అవసరమైన మేరకు ఆర్థిక కారణాలను కూడా పరిగణ లోకి తీసుకొని కొంతకాలం రిజర్వేషన్లు అమలు చేయాలనేది ఒక వర్గం వాదన.ఇదే సుప్రీం కోర్టు వాదనలో సారాంశం. అంతే తప్ప క్రిమీలేయర్ లోనూ రిజర్వేషన్లు ఎలాఉంటాయండీ

6 comments:

సత్యసాయి కొవ్వలి said...

ప్రసాదుగారికి ఈవిషయం తెలియదనుకోను. ఆయన స్పందన మీ భావ వ్యక్తీకరణలోని స్పష్టత గురించనుకొంటాను. వాక్యాలు కొద్దిగా గందరగోళ పెడ్తున్నాయి.

radhika said...

చాలా మంచి వివరణ.చాలా మంది మీలా ఆలోచించగలిగితే కొంత అభివ్రుద్ది సాధించవచ్చు. కులాల ప్రాతిపదికన కాకుండా పేదలకు రిజర్వేషన్లు అందేలా చూడడం అనేది నిజం గా అభినందించదగిన విషయం.

ప్రసాద్ said...

దార్ల గారూ,
మన ఇద్దరి అభిప్రాయం ఒకటే అయినా "క్రీమీలేయర్"ను భిన్నంగా అర్థం చేసుకున్నాం.

రిజర్వేషను వల్ల లబ్ది పొందిన, సమాజంలో ఇప్పటికే మంచి అంతస్థులో (ఆర్థికంగ, సామాజికంగా)వున్న వారిని "క్రీమీలేయర్" అంటారు అనేది నా అవగాహన.
ఈ క్రీమీలేయర్‌కు మళ్ళీ రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోతే దానివల్ల బాగుపడిన వాడే మళ్ళీ మళ్ళీ బాగుపడతాడు. ప్రయోజనం అందని వాడు అందకుండానే వుంటాడు. అసలీ క్రీమీలేయరే తమ వర్గంలోని తక్కువ స్థాయి వారిని అణిచివేస్తారు.

మీ ఇదివరకటి టైటిల్ చూసి "క్రీమీలేయర్ కు రిజర్వేషను సమర్థిస్తున్నారేమొ" అని అనుకున్నాను. కానీ మన అభిప్రాయాలు ఒక్కటే!

--ఫ్రసాద్
http://blog.charasala.com

డా.వి.ఆర్ . దార్ల said...

సత్య సాయి గారూ నిజమేనండీ. హడావిడిగా రాయటం, రాసినదాన్ని మళ్ళీ చూసుకోకుండా పో్ష్టు చేసేయటం ,ఒక విషయం చెప్తూ మరొక విషయాన్ని కూడా స్పృ శించటం వల్ల అలాంటి వాక్యాలు తయారవుతాయి. కాసుల ప్రతాప రెడ్డి గారి " రెండు వైపులా పదును " కథను నేను చదివిన తరువాత రాసిన అభిప్రాయమది. సమకాలీన సమస్యలలో రెండు మూడు ప్రధాన సమస్యలను బలంగా అభివ్యక్టికరించ గలిగిన కథ అది.

డా.వి.ఆర్ . దార్ల said...

అభివ్యక్తీ

Nrahamthulla said...

ఆంధ్రప్రదేశ్ లో బీ.సీ.గ్రూపుల వర్గీకరణ మరోసారి చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.50 శాతం కోటా పరిమితికి మించి అమలు చేయాలంటే, మండల్‌ కమిషన్‌ తీర్పు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపర్చిన నిర్ణీత ప్రమాణాలను వెనకబడిన వర్గాల కమిషన్‌ పరిగణనలోకి తీసుకోవాలని ,తాజా జనాభా గణాంకాల ఆధారంగా వాటిని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.తమిళనాడులో 69 శాతం ,కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది.
42 ఏళ్ళు గడిచినా రిజర్వేషన్ల అవసరం తీరలేదు. ఇంకా ఎంత కాలం అవసరమో చెప్పలేము. ఇన్ని ఏళ్ళ కాలంలో కనీసం ఫలానా కులాలను పైకి తీసుకురాగలిగాము అని చెప్పుకోటానికి తగిన గణాంక సేకరణ ప్రభుత్వం చేయ లేదు. ఏదైనా ఒక కులం జనాభాలో 45 శాతం కుటుంబాలు తగిన ఉద్యోగాలు సాధించి, ఆర్ధికంగా బలపడితే ఆ కులాన్ని రిజర్వేషన్ల పరిధి నుండి తప్పించాలని గతంలో కొందరు మేధావులు కోరారు. ఆ ప్రకారంగా రిజర్వేషన్లు పొందే కులాల జాబితా క్రమేణా తగ్గిపోయి, కొంత కాలానికి రిజర్వేషన్లే ఉండవని వారి వాదం. అయితే ఆయా కులాల జనాభా మీద ప్రభుత్వం సమగ్రమైన సర్వేలు జరుపుతూ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
జనాభా ఎక్కువగా ఉండి, రాజకీయ శక్తులను భయపెట్టగలిగే కులాలు ఈ రిజర్వేషన్ల వల్ల ఎక్కువగా లాభపడుతూ ఉండగా, జనాభా తక్కువగా ఉండి, రాజకీయ నాయకత్వమే లేని కులాలు నష్టపోతున్నాయి. అందువలన శక్తివంతమైన కులాలను, శక్తిహీనమైన కులాల సరసన ఉండకుండా వేరు చేయాలి. ఆ విధంగా శక్తిమంతమైన కులాలు, శక్తిహీనమైన కులాలకు అడ్డురాకుండా కాపాడాలి.షెడ్యూల్డ్ కులాలు తెగలలోని శక్తిమంతమైన కులాలను వెనుకబడిన తరగతులు ' ఎ ' గ్రూపులోను, వెనుకబడిన తరగతులలోని శక్తిమంతమైన కులాలను దాని క్రింది గ్రూపులోను చేర్చాలి. ఆ విధంగా ప్రతి అయిదేళ్ళకొకసారి మార్పు తలపెట్టాలి. ప్రతి పంచవర్ష ప్రణాళికలోను ఆయా హీన కులాల అభివ్రుద్ధి కోసం పేరు పేరు వరుసన నిధులు కేటాయించి అవి వారికే అందేలా చూడాలి. అయిదేళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఆ కులం స్థాయి సాంఘికంగాను, ఆర్ధికంగాను బాగుపడాలి. ఆ విధంగా కాలక్రమేణా రిజర్వేషన్ల చట్రంలో నుండి అన్ని కులాలు తొలగిపోవాలి. కులం పేరు మీద ఇక ఎవ్వరూ రిజర్వేషన్ కోరలేని పరిస్థితి రావాలి.