ప్రాజెక్టు ఫెలో ఇంటర్వ్యూ తేదీ : 29 సెప్టెంబరు 2011

‘‘తెలుగు సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక అధ్యయనం’’ అనే  మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులో యు.జి.సి. ప్రాజెక్టు ఫెలో ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వారు ది: 29 సెప్టెంబరు 2011  వతేదీన జరగబోయే ఇంటర్వ్యూ కి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో  ఉదయం గం.10.00 నిమిషాలకు  హాజరు కావలసిందిగా కోరుతున్నాను. స్థలం: తెలుగు శాఖ అధ్యక్షుల వారి కార్యాలయం, హైదరాబాదు విశ్వవిద్యాలయం, గచ్చిబౌలి,  హైదరాబాదు...డా.దార్ల వెంకటేశ్వరరావు


ఆధునిక కవితారూపాలకు లక్షణాల అవసరం ఎంతవరకూ...!

Surya  Literary Page ,12-9-2011 

‘లోపల ఒకటి
బయట ఒకటి
మేడి పండు గురించి
ఎవరికి తెలియదు’ ఇది ఒక ఆధునిక కవి (మసన చెన్నప్ప) రాసిన నానీ. దీన్ని చదివిన వెంటనే పాఠకులకు వేమన చెప్పిన 
‘మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విప్పిచూడ పురుగులుండు
బెరుకు వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ’ పద్యమే గుర్తుకొస్తుంది.వేమన ఆశువుగా చెప్పినా ఆ పద్యాల్లో ఛందో నియమాల్ని పాటించాడు. అయినా ప్రజల నోళ్ళలో నేటికీ ఆ పద్యాలు నాట్యం చేస్తూనే ఉన్నాయి. వేమన పద్యాల్లో ప్రజలు లక్షణాల్ని పట్టించుకున్నారా, పద్యంలోని భావాలే ముఖ్యమనుకున్నారా? అనుకుంటే రెండవదానికే ఓటేశారని చెప్పొచ్చు. ఇదంతా ఎందుకంటే నేటి ఆధునిక కవిత్వంలో నెమ్మది నెమ్మదిగా మళ్ళీ నియమాల సంకెళ్ళతో కవిత్వాన్ని బంధించే ప్రయత్నం మొదలవుతుందేమోననే అనుమానం కలుగుతోంది. దీన్ని తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? అనే దానికంటే, ప్రయోగాలు చేయాలనే కుతూహలమే ఈ పని చేయిస్తుందేమో అనీ అనిపిస్తుంది.
ఒకప్పుడు మినీ కవిత్వాన్ని ఎక్కువగా రాశారు. ‘మినీ కవిత ఆయుష్షు మెరుపంత/ కానీ అది ప్రసరిస్తుంది కాలమంత’ అని జ్ఞానపీఠ్‌ బహుమతి పొందిన డా సి. నారాయణరెడ్డి వంటి కవి ప్రశంసను మీనీ కవిత పొందింది.

అప్పట్లో పురాణం సుబ్రహ్మణ్య శర్మ సంక్షిప్త రూపంలో కవిత్వ మెరుపుని అందిస్తూ పాఠకుల్ని ఆకర్షించడానికి ‘మినీకవిత’ అనే పేరుతో కవిత్వాన్ని ప్రోత్సాహించారు. తర్వాత అది ఒక ఉద్యమంగా చాలా కాలం (1970-85) కొనసాగింది.
‘ఎన్ని గజాలు
రాశాడన్నది కాదు
ఎన్ని నిజాలు
చెప్పాడన్నది ముఖ్యం’ (ఆరుద్ర) అనే పద్ధతిలో చాలా మందిని ఆకర్షించింది.ప్రముఖ విమర్శకుడు డా అద్దేపల్లి రామమోహనరావు మినీ కవిత్వానికి ఉచ్ఛ్వాసం క్లుప్తత, నిశ్వాసం ధ్వనిగా ఉండాలని, వ్యర్థ అక్షరమనేది ఉండకూడదనే లక్షణాల్ని చెప్పారు. కవితకు శీర్షిక ప్రధానమై వ్యవహారిక భాషలో ఉండి, కొసమెరుపు, కొసచరుపు, చమత్కార వ్యక్తీకరణతో సూటిగా పాఠకుని హృదయాన్ని తాకాలని అన్నారు. ఇక్కడెక్కడా సంకెళ్ళు వేసే నియమాల్లేవు.

అందుకనే ఒక ఉద్యమంగా మినీ కవిత్వం వచ్చింది. వచన కవిత్వంలో మళ్ళీ దీర్ఘకవిత్వం, దీర్ఘకావ్యాల విస్తృతికి విసిగిన పాఠకులు మినీ కవిత్వాన్ని ఆదరించారు. మహా కావ్యం చదివితే వచ్చేటంతటి ఆనందం చిన్న కవితను చదివితే వచ్చే స్పూర్తి కలిగినవి ఎన్నో ఈ సందర్భంలోనే వచ్చాయి. మినీ కవిత్వం అనగానే ఆచార్య భావన్‌ రాసిన ‘కెరటం
నా ఆదర్శం
లేచి పడినందుకు కాదు
పడినా లేచినందుకు’ అని రాసిన కవిత ఒక నినాదంగా మారింది. అలాగే అమ్మ గురించి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రూపాల్లో వర్ణించినా తక్కువే అనడానికి నిదర్శనమన్నట్లుగా
తినడానికి
మూడే రొట్టెలున్నప్పుడు
తినేవాళ్ళు
నలుగురయినప్పుడు
తనకు ఆకలి లేదనేవ్యక్తి
తప్పకుండా అయ్యుంటుంది
మాతృమూర్తి’ ఒక కవి (జోస్యభట్ల) హృద్యంగా వర్ణించారు.

మినీ కవిత్వంలో ‘ధ్వని’ ఉంటుందనీ, ఉండాలనీ- దీనికి కూడా సంప్రదాయ విమర్శకులు లక్షణాల్ని చెప్పే ప్రయత్నం చేసినా, ఆ ధ్వని సామాన్యులకు సైతం వెంటనే అవగాహన కొచ్చేటట్లుండాలనేదే ముఖ్యమని గుర్తించాలి. అయినప్పటికీ కొన్నాళ్ల తర్వాత, పదాల్ని పేర్చేసి, వాక్యాల్ని విడగొట్టేసి రూపానికే తప్ప రసస్పందన లేకుండా రాయడంతో మినీ కవిత్వం పట్లకూడా పాఠకులకు విసుగొచ్చింది. ఇటువంటప్పుడే మళ్ళీ కవిత్వం కొత్త రూపంలో రావాలనే ఆకాంక్ష మొదలవుతుంది. కొన్నిసార్లు పాత కవిత్వాన్నే నెమరువేసుకొనే ప్రయత్నమూ జరుగుతుంది. మినీ కవిత్వం వస్తున్నపుడే ప్రాచీన తెలుగుసాహిత్యంలో ఇంతకంటే మంచికవిత్వం, లఘు రూపాల్లో వచ్చిందనే దృష్టితో గతాన్నొకసారి స్మరించుకోవడానికీ ప్రయత్నాలు జరిగాయి.

ప్రాచీన తెలుగు సాహిత్యంలోనూ లఘురూపాల్లో కవిత్వం రావడం నిజమే. చాటువులు, శత పద్యాలు, ఖండకావ్యం, పంచరత్నాలు మొదలైన పేర్లతో కవిత్వం వచ్చినా, స్వరూపంలో మినీ కవితారూపానికి దగ్గరగా ఉన్నట్లనిపించినా స్వభావంలో ఇటువంటి కవిత్వం చాలా దూరంగా ఉంటుంది. ప్రశంసించడానికో, నిందించడానికో ఈ లఘు కవితా ప్రక్రియలు ఉపయోగపడ్డాయి. కొంతమంది ఇప్పటికీ ఛందో బద్ధంగానే కవిత్వం ఉండాలనే పండిత కవులు వివిధ సన్మానాలకు పంచరత్నాల్ని రాస్తూనే ఉన్నారు. అందుకనే అటువంటి లఘు కవితా ప్రక్రియల్లో సామాజికత ఉన్నా, సామాజిక స్ఫృహ కనిపించదు. పోషకుల్ని పొగడడానికో, తిట్టడానికో, నీతుల్ని బోధించడానికో, భగవంతుణ్ణి స్తుతించడానికో, శృంగారాన్ని ఒలకబోయడానికో ఉపయోగించినంతగా సామాజిక సమస్యని వర్ణించడానికి ఆ ప్రాచీన లఘు కవితాప్రక్రియలు ప్రయత్నించాయని చెప్పలేం. మినీ కవితా రూపంలా కనిపించినా, ఇదే స్వభావంలో ప్రాచీన కవిత్వానికీ, ఆధునిక కవిత్వానికీ గల ముఖ్యమైన ఒక వ్యత్యాసం.

కవిత్వాన్ని నిత్యనూతనం చేయడంలో కొత్త కొత్త కవితా రూపాలు అవసరమే. అలాగని ఆ రూపాలు కవిత్వాన్ని ఎక్కువ మందికి అందిం చకుండా పోకూడదు. కవిత్వం రాయడం కొందరికి మాత్రమే సాధ్యమనే భ్రమను పెంచకూడదు. సాహిత్య విలువల్ని కాపాడుకొంటూనే, పర భాషా సాహిత్యాల్లో నుండి వచ్చే ప్రక్రియల్ని మనం సొంతం చేసుకొంటున్నప్పుడు కొన్ని నియమాల్ని సరళీకరించుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అదే పరిస్థితి మనతెలుగులోకి వచ్చిన గజల్‌, రుబాయత్‌, హైకూ మొదలైన ప్రక్రియల్లో కనిపిస్తున్నది. వేమన ప్రభా వంతో, ఆధునిక మినీ కవితారూప ప్రేరణతో చాలా మంది కొన్ని ప్రయోగాల్ని చేస్తున్నారు. నానీలు, నానోలు, రెక్కలు, వామీలు, మామీల పేర్లతో కవి త్వాన్ని రాస్తున్నారు. ఇలా కొత్త కవితా రూపాలు రావడం ఆహ్వా నించదగిందే. అది ప్రజాస్వామిక లక్ష్యం కూడా! అయితే, అవి ఆధునిక కవిత్వానికి ఉండే మౌలిక లక్షణాల్ని విస్మరించకుండా ఉంటే బాగుంటుంది.

జపాన్‌ కవిత్వ ప్రభావంతో తెలుగులోకి వచ్చిన కవితా రూపం హైకూ. గాలి నాసరరెడ్డి 1994 నుండీ హైకూలు రాయడం ఆరంభించారు. 1991 నుండీ ఇస్మాయిల్‌ హైకూ కవితా ప్రక్రియను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. తర్వాత పెన్నా శివరామకృష్ణ లక్షణ యుక్తంగా రాసే ప్రయత్నం చేశారు. హైకూలో మూడు పాదాలు ఉండాలనీ, అవి 5,7,5 అక్షరాలను అనుసరించాలని లక్షణాల్ని వివరించారు. నిజానికివి జపాన్‌ భాషకి తగినట్లు అక్షర నియతిని ఏర్పరిచినా అవే లక్షణాల్ని తెలుగులో పాటించడం కుదరలేదు. అందువల్ల తర్వాత కాలంలో చాలా మంది హైకూల్ని రాసినా ఆ లక్షణాల్ని పాటించలేకపోయారు. కానీ, హైకూలో ఉండే తత్త్వాన్ని అందించే ప్రయత్నం చేశారు. అంతకు ముందు పారశీ, అరబ్బు ప్రభావంతో వచ్చిన గజల్స్‌, రుబాయత్‌ వంటిప్రక్రియలు కూడా అలాగే పాఠకుల్ని/ ప్రేక్షకుల్నీ అలరించినా లక్షణాలకంటె, కవితల్లోని మానవీయ స్పందనలకే ప్రాముఖ్యం లభించింది.

దేశీయమైన కవితా ప్రక్రియగా నానీలను ఆచార్య ఎన్‌. గోపి సృష్టించారు. నావి- నీవి- వెరసి మనవి అనే అవగాహనతో ‘నానీలు’ పుట్టుకొచ్చాయి. వీటికి లక్షణాల్ని చెప్పినవాళ్ళు- నాలుగు పాదాలు ఉండాలనీ, వాటిలో 20- 25 అక్షరాల నిడివి ఉండాలనీ ఒక లక్షణాన్ని చెప్పి, ఒక భావాంశాన్ని రమణీయంగా చెప్పే వీలు దీనిలో ఉందన్నారు.ఈగ హనుమాన్‌ నానో ప్రక్రియను ప్రారంభించారు. నానో అంటే- ‘సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రక్రియ’ అనే అర్థంలో దీన్ని ప్రయోగిస్తున్నారు. నానో టెక్నాలజీ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ‘నానో’ పేరుతో కవితా ప్రక్రియ కూడా ప్రసిద్ధిలోకి వచ్చింది. ఈగ హనుమాన్‌ 2005 నుండీ దీన్ని రాస్తున్నారు. నానోలో నాలుగు పాదాలు ఉండాలి. పాదానికి ఒక పదం లేదా చిన్న సమాసం మాత్రమే ఉండాలి.

నాలుగో పాదం చమత్కారంతో ముగియాలి. ఈ కవిత్వంలో వస్తువుగా దేనై్ననా స్వీకరించవచ్చు.రెక్కలు అనే కవితా ప్రక్రియతో కూడా ఈ మధ్య కాలంలో కవిత్వం వస్తోంది. రెక్కలు కవితా ప్రక్రియని ఎం.కె. సుగమ్‌బాబు ప్రారంభించారు. రెక్కలు ప్రక్రియ 2009 నుండీ వస్తోంది. రెక్కలు కవితలో నాలుగు పాదాలు ఉంటాయి. ఒక్కో పాదంలో ఒకటి లేదా రెండు పదాలు ఉండాలి. నాలుగు పాదాలకు మధ్య ఒక వాక్యానికి ఉండే ఖాళీ వదిలి మరో రెండు పాదాల్ని రాయాలి. చివరి రెండు పాదాల్లో కూడా ఒకటి లేదా రెండు పదాలు చొప్పునే ఉండాలి. అవి దీర్ఘ సమాసాలతో ఉండకూడదు. సరళ సుందరంగా ఉంటే బాగుంటుంది. పై నాలుగు పాదాలు పక్షి దేహ నిర్మాణాన్ని పోలి ఉంటాయి.
అయితే, కింది రెండు పాదాలు పక్షికుండే రెక్కల వంటివి. ఈ చివరి రెండు పాదాల్లోనే ఒక చమత్కారమో, ఆలోచనను రేకెత్తించే గుణమో ఉండాలి. ఇలాంటి గుణాన్నే ‘పంచ్‌’ అంటారు. ఆధునికతకు అత్యంత ప్రాణప్రదమైంది శాస్త్రీయమైన మానవీయకోణం. మానవుణ్ణి కేంద్రంగా చేసుకోవడంతో పాటు హేతు పూర్వకమైన రసస్పందనతో కవిత్వం వెలువడాలి. ఆధునికకవిత్వం, అదీ వచన కవిత్వంలో నియమాలు పాటించరని కాదు గానీ, వాటి కంటే, స్వేచ్ఛకీ, సహజ స్పందనకీ ప్రాధాన్యాన్నిస్తూనే, సాహిత్యంలో ప్రయోగాల్నీ చేయాలి. వస్తువుని స్వీకరించడం మంచిదే. అలాగే ఒక క్రమాన్ని పాటిస్తూ తర్వాత తరాలు కూడా అందుకొనేలా కొన్ని నియమాల్ని పాటించినా అవి మళ్ళీ సంకెళ్ళుగా మారకూడదు.
-Dr.Darla Venkateswara Rao,
Assistant Professor, 
Dept .of Telugu, 
University of Hyderabad, (Central University), 
Gachibowli, Hyderabad-500 046 
e-mail: vrdarla@gmail.com 
Ph: 040-23133563 (O), Mobile: 09989628049,

(ఈ వ్యాసం సూర్య దినపత్రిక ( 12-9-2011) సాహిత్యం పేజీలో ప్రచురితమైంది.)

తమ వారసుల్ని తెలుగు చదివిస్తున్నారా?

-వెంకట రామయ్య గంపా (రచయిత యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌)

ఇటీవల కాలంలో ప్రాంతీయ భాషాభిమానులు వారి భాషల పరిరక్షణకోసం తీవ్రంగా ఉద్యమాలు చేస్తున్నారు. అందుకు కారణం ఆయా భాషలు ఇతర భాషల వల్ల, ముఖ్యంగా ఆంగ్లభాష ప్రభావం వల్ల క్రమంగా కనుమరుగవుతున్నాయని వారి భావన. భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో భాషా పరిరక్షణ చర్యలు తీసుకొంటున్నవారికి తమిళులు ఆదర్శప్రాయులని పేర్కొంటున్నారు. తక్కిన ప్రాంతీయ భాషల వారు కూడా తమిళులను అనుకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు భాషాభిమానులు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం నాడు తెలుగు భాష సంరక్షణకు తీసుకోవలసిన చర్యల గురించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొందరు తెలుగు భాష ఆంగ్లప్రభావం వలన అంతరించిపోయే అవకాశం ఉందని వాదిస్తున్నారు.

వారి వాదన ప్రకారం, తెలుగు భాషకు అతి తక్కువకాలంలో ప్రమాదం పొంచి ఉంది. తెలుగు చదువుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంది. భాషలో కొన్ని పదాలు పూర్తిగా ఆంగ్లంలో ఉన్నాయి. వాటికి తెలుగు పదాలు లేవు. పిల్లలు తమ ఇంట్లో కూడా తెలుగు మాట్లాడడం మానేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమాన్నే ప్రోత్సహిస్తున్నారు. దీనివలన క్రమంగా తెలుగు భాష కనుమరుగవుతుందనే వాదన వినిపిస్తుంది. ఆంగ్లభాష వల్ల తెలుగు భాషకు కొంత అన్యాయం జరుగుతున్నప్పటికీ వాస్తవాల్ని మరిచి మాట్లాడే పరిస్థితే ఎక్కువగా కనిపిస్తుంది.

భారతదేశంలో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడేభాష తెలుగు. భాషకు సంబంధించిన వాస్తవాలను గమనిస్తే ఒక భాష మనుగడ అనేది ఆభాష మాట్లాడేవారిపై ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు 2011 నాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ జనాభా పనిమిది కోట్ల నలభై ఆరు లక్షలు. తెలుగేతర ప్రాంతాలలో తెలుగుభాష మాట్లాడేవారి సంఖ్య దాదాపు నాలుగు కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఆ లెక్కన తెలుగుభాష మాట్లాడేవారి సంఖ్య దాదాపు పన్నెండు కోట్లకు పైగానే ఉంటుంది.

ప్రపంచంలో పన్నెండు కోట్లకుపైగా జనాభా ఉన్న దేశాలు పది మాత్రమే. ఇంతమంది ప్రజలు మాట్లాడే భాషకు ఇతర భాషల నుంచి ప్రమాదం ఉందని చెప్పడం కొంత ఆలోచించవలసిన విషయం. చాలా మంది మన దేశ వాస్తవ పరిస్థితులను విస్మరిస్తున్నారు. మన రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 72.5. శాతం. ఇది అధికారిక లెక్కల ప్రకారం ఉన్న అక్షరాస్యత. ఇందులో కేవలం సంతకం తప్ప రాయడం, చదవడం రానివారు దాదాపు 10 శాతానికి పైగానే ఉంటారు. ఈ విధంగా దాదాపు ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత 60 శాతం కంటే కొంచెం పక్కువగా ఉంటుంది. అంటే 40 శాతం నిరక్షరాస్యులకు తెలుగు తప్ప మరొక భాష తెలియదు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ జనాభా అయిదు కోట్ల అరవై మూడు లక్షలు కాగా, పట్టణ జనాభా రెండుకోట్ల పనభై మూడు లక్షలు. దాదాపు 75 శాతం విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోనే చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నప్పటికీ వారి పరీక్షలు తప్ప, తక్కిన చదువంతా తెలుగులోనే ఉంటుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో చదువుతున్న వారు 25 శాతం మంది. వారు ఆంగ్లమాధ్యమంలో చదువుతున్నప్పటికీ పదవతరగతి వరకు తెలుగు తప్పనిసరిగా చదవాలి. సిబియస్‌సిలో కూడా తప్పని సరిగా మూడు భాషలు చదవాలి. వాటి నుంచి తెలుగును కూడా పంచుకోవచ్చు. అంటే తెలుగు భాషను ప్రతి విద్యార్థి తప్పని సరిగా చదివే అవకాశం ఉంది.

ఈ విధానాల వలన తెలుగువాడైన ప్రతి విద్యార్థి తెలుగు చదవటానికి, రాయడానికి అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో తెలుగుకు వచ్చిన ముప్పేమి లేదు. అయితే విద్యార్థుల్లో తెలుగు భాష వాడకం కొంత తగ్గింది. ఆంగ్ల పదాలు కొన్ని పూర్తిగా వాడుకలోకి వచ్చాయి. ఒక భాష నుంచి మరొక భాషలోకి పదాలు ప్రవేశించడం అనేది సహజం. ఏదైనా ఒక పదం కేవలం ఒక్క భాషలోనే ఉంటే, ఆ పదాన్ని ఇతర భాషల వాళ్ళు వాడాల్సివస్తే మూల భాష పదాన్నే వాడడం సహజంగా జరుతున్నదే. ఆ విధంగా చాలా ఆంగ్లపదాలు తెలుగులో వాడుతున్నారు.

భాషా పండితులు చాలా ఆంగ్ల పదాలకు తెలుగులో సమానార్థక పదాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పదాలను కొన్ని పత్రికలు వ్యవహారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. గత్యంతరం లేని సమయంలో ఆంగ్లపదాలను యథాతధంగా వాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు భాషలో కొన్ని వేల సంఖ్యలో ఇతర భాషల నుంచి వచ్చిన పదాలున్నాయి. తెలుగులో ఉన్న పదాలలో సంస్కృతం వాటా 60 శాతం పైగానే ఉన్నట్లు భాషాశాస్త్ర వేత్తలు నిరూపించారు. సంస్కృత పదాలు లేకుండా ఒక వాక్యం కూడా తెలుగులో రాయలేం. కాబట్టి తెలుగులో సమానార్థకాన్ని సృష్టించలేని ఆంగ్లపదాలను యథాతధంగా వాడటం వల్ల తెలుగు భాషకు వచ్చిన ముప్పేమి లేదు.

భాషా వ్యాప్తి పురోగతి లేదా తిరోగతి ఆ భాషలోవచ్చే సాహిత్య రచనలపై కూడా ఆధారపడి ఉంటుంది. శతాబ్దాల కాలం వరకు ఒకటి రెండు తెలుగు రచనలు మాత్రమే చలామణిలో ఉన్నాయి. అతి తక్కువ మంది పాఠకులు మాత్రమే ఉన్నారు. సాహిత్య రచనల సంఖ్య క్రమంగా పదుల సంఖ్యలో పెరగడానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టింది. పాఠకుల సంఖ్య కూడా చాలా కొద్దిమందికే పరిమితమై ఉంది. కాని ప్రస్తుతం తెలుగులో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో సాహిత్య రచనలు వెలువడుతున్నాయి. కొన్ని వేల సంఖ్యలో సాహిత్య పాఠకులు ఉన్నారు.

ఈ గణాంకాల ద్వారా ప్రస్తుత తెలుగుభాష పురోగతి తెలుస్తుంది.నాడు కొద్ది మంది మాత్రమే తెలుగు భాషా సాహిత్యాలను అభ్యసించేవారు. కాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పదహైదుకు పైగా విశ్వవిద్యాలయాలలో తెలుగు పం.ప. పాఠ్యాంశంగా ఉంది. ప్రతి విశ్వవిద్యాలయంలో సగటున వందమంది విద్యార్థులు ఉన్నారు. ఈ లెక్కన సంవత్సరానికి పదహైదు వందల మంది విద్యార్థులు తెలుగును విశ్వద్యాలయ ్థాయిలో చదువుతున్నారు. ఇంతకు పూర్వం ఉన్న తెలుగు విద్యార్థులతో పోస్తే ఈ సంఖ్య చాలా పక్కువనే చెప్పాలి.

కొందరి అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పదవతరగతి వరకు మాత్రమే తెలుగు తప్పనిసరి పాఠ్యాంశంగా ఉంది. దానిని ఇంటర్మీడియట్‌ వరకు పొడిగించాలి. అంటే తెలుగు భాషను ఇంటర్మీడియట్‌ వరకు తప్పనిసరిగా చదవాలి అనేది వారి వాదన. ఇలా చదవడం వలన తెలుగు రాయడం, చదవడం బాగా వస్తుందనేది వారి అభిప్రాయం. ఇక్కడ ఆలోంచవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. దాదాపు రెండు మూడు దశాబ్దాల క్రితం పదవ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. అప్పట్లో పదవ తరగతి చదిన వారు తెలుగులో స్పష్టంగా చదవడం, రాయడంతో పాటు ఉద్యోగంలో పటువంటి సమస్య లేకుండా రాణించారు.

కానీ ప్రస్తుతం పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం సరిగా రాదు అనే పరిస్థితి నెలకొనడానికి కారణమేమిటి? అందుకు కారణం విద్యార్థులు తెలుగును సరిగా చదవకపోవడమా? లేక తెలుగు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు సరిగా చెప్పకపోవడమా? ఒక విద్యార్థి లేకా కొందరు విద్యార్థులు తమకు తెలుగు సరిగా రాయడం, చదవడం రావడం లేదంటే అది ఆ విద్యార్థుల తప్పు. కానీ అధిక శాతం మంది విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం రావడం లేదంటే అది తెలుగు నేర్పే ఉపాధ్యాయుడి తప్పు. పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమం చదివిన విద్యార్థులు తక్కిన పాఠ్యాంశాలు పాసై తెలుగు పాఠ్యాంశం మాత్రమే ఫెయిల్‌ అయినవారి సంఖ్య పక్కువగానే ఉంది. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి.

కొందరు విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశం అంటే భయం. అందుకు గల కారణం తెలుగు ఉపాధ్యాయులే. ఇప్పటికీ చాలా మంది తెలుగు ఉపాధ్యాయుల దృష్టిలో తెలుగు పాఠ్యాంశం అంటే తెలుగు పద్యాలు మాత్రమే అనే భావన ఉంది. వారి దృష్టిలో విద్యార్థులకు తెలుగు నేర్పడమంటే తెలుగు పద్యాలను, వ్యాకరణాన్ని కంఠస్థం చేయించడమే. తెలుగు పద్యాలను తప్పులు లేకుండా రాస్తేనే విద్యార్థులకు మంచి మార్కులు వేస్తారు. తక్కిన పాఠ్యాంశాలు చదవడానికి ఇబ్బంది ఉండదు. పూర్థిగా ప్రతి అక్షరాన్ని కంఠస్థం చేయవలసిన అవసరం ఉండదు. సమాధానాలలో ఒకటి రెండు విషయాలు గుర్తుకు రాకపోయినా సమాధానాన్ని పూర్తిచేయవచ్చు. మార్కులూ వస్తాయి.

కానీ తెలుగు పద్యంలో ఏ ఒక్క అక్షరం తప్పు పోయినా పూర్తి పద్యాన్ని తప్పుగా గుర్తించి తక్కువ మార్కులు ఇచ్చే ఉపాధ్యాయులు ఇప్పటికీ ఉన్నారు. దీని వలన చాలా మంది విద్యార్థులు తెలుగు పాఠ్యాంశాన్ని కాదని సంస్కృతమో లేక హిందీనో తమ ద్వితీయ భాషగా పంచుకొంటున్నారు. ఈ విధానం ఇప్పటికీ విశ్వవిద్యాలయ ్థాయిలో కూడా కొనసాగుతోంది.ఉదాహరణకు పిహెచ్‌.డి. చేసిన వారు విశ్వ విద్యాలయ అధ్యాపక పోస్టులకు ఇంటర్వూలకు ెవెడితే, అభ్యర్థి పరిశోధనాంశాన్ని పక్కనపెట్టి, కేవలం పద్యాల ద్వారా అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేసే పరిస్థితి నేటికీ ఉంది. కొన్నిచోట్ల తెలుగు ఉపాధ్యాయులే లేని పరిస్థితి కూడా ఉంది.

కానీ అన్ని పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులు లేరని చెప్పలేం. మరి కొన్ని చోట్ల ‘తెలుగును ప్రత్యేకంగా చెప్పేది ఏముంది!’ అని చెప్పి విద్యార్థులకు గైడ్‌ ఇచ్చి చదువుకోమని చెప్పే తెలుగు ఉపాధ్యాయులు ఉన్నారు. మరికొంత మంది తెలుగు ఉపాధ్యాయులు తమ పిల్లలకు తెలుగు చదవడం, రాయడం రాదు అని గొప్పగా, గర్వంగా చెప్పుకొంటుంటారు. తమ పిల్లలకు తెలుగు పాఠాలు నేర్పించవచ్చు, కాని నేర్పరు. వారి పిల్లలకే వారు తెలుగు చదవడం, రాయడం నేర్పలేనివారు ఇతర విద్యార్థులకు తెలుగును సరిగా బోధించడానికి నైతికంగా అర్హత కలిగిఉన్నారో లేదో వారే ఆలోంచుకోవాలి. తెలుగు భాష పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న తెలుగు ఉపాధ్యాయులలో పంతమంది తమ పిల్లలు కూడా తెలుగు ఉపాధ్యాయులు కావాలని అనుకుంటున్నారు?
తెలుగు భాష పరిరక్షణ గురించి సభలలో మాట్లాడేవారు, తెలుగు రచ యితలు, కవులలో తమ రచనా వారసత్వాన్ని తమ పిల్లలు కూడా కొన సాగించాలనుకొనే వారు పంతమంది ఉన్నారు? కేవలం వార్తా ఛానెళ్లలో వాడుతున్న భాషే అందరి భాషా! వారి వల్లే భాష అంతరించి పోతుందా? పిల్లలు మాట్లాడే వచ్చీ రాని ఆంగ్లపదాలే భాషను కనుమరుగు చేస్తాయా? వార్తా ఛానెళ్ల వారిని, ప్రభుత్వాన్ని, పిల్లలను విమర్శస్తే తెలుగుభాషను సంరక్షించినట్ల వుతుందా? లేక మన చేతుల్లో ఉన్న పనిని సక్రమంగా నిర్వహిస్తే తెలుగు భాషను కాపాడు కోవచ్చా? ఈ విషయాలను ఆలోంచవలసిన అవసరం ఉంది.


అనువాదం పై జాతీయ సదస్సు

మూడు రోజుల పాటు (8,9,10 తేదీలలో) తెలుగు శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదు విశ్వవిద్యాలయం లో తెలుగులో అనువాదాలు - సమీక్ష అనె అంశం పై జాతీయ సదస్సు జరుగుతుంది.  డా.డి.విజయ లక్ష్మి గారు  సదస్సు కోర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు
.

Employment Notification of UGC Project Fellow

 University of Hyderabad Link for this Notification
click for download
Ugc Project Fellow Advertisement