Monday, September 12, 2011

ఆధునిక కవితారూపాలకు లక్షణాల అవసరం ఎంతవరకూ...!

Surya  Literary Page ,12-9-2011 

‘లోపల ఒకటి
బయట ఒకటి
మేడి పండు గురించి
ఎవరికి తెలియదు’ ఇది ఒక ఆధునిక కవి (మసన చెన్నప్ప) రాసిన నానీ. దీన్ని చదివిన వెంటనే పాఠకులకు వేమన చెప్పిన 
‘మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విప్పిచూడ పురుగులుండు
బెరుకు వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ’ పద్యమే గుర్తుకొస్తుంది.వేమన ఆశువుగా చెప్పినా ఆ పద్యాల్లో ఛందో నియమాల్ని పాటించాడు. అయినా ప్రజల నోళ్ళలో నేటికీ ఆ పద్యాలు నాట్యం చేస్తూనే ఉన్నాయి. వేమన పద్యాల్లో ప్రజలు లక్షణాల్ని పట్టించుకున్నారా, పద్యంలోని భావాలే ముఖ్యమనుకున్నారా? అనుకుంటే రెండవదానికే ఓటేశారని చెప్పొచ్చు. ఇదంతా ఎందుకంటే నేటి ఆధునిక కవిత్వంలో నెమ్మది నెమ్మదిగా మళ్ళీ నియమాల సంకెళ్ళతో కవిత్వాన్ని బంధించే ప్రయత్నం మొదలవుతుందేమోననే అనుమానం కలుగుతోంది. దీన్ని తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? అనే దానికంటే, ప్రయోగాలు చేయాలనే కుతూహలమే ఈ పని చేయిస్తుందేమో అనీ అనిపిస్తుంది.
ఒకప్పుడు మినీ కవిత్వాన్ని ఎక్కువగా రాశారు. ‘మినీ కవిత ఆయుష్షు మెరుపంత/ కానీ అది ప్రసరిస్తుంది కాలమంత’ అని జ్ఞానపీఠ్‌ బహుమతి పొందిన డా సి. నారాయణరెడ్డి వంటి కవి ప్రశంసను మీనీ కవిత పొందింది.

అప్పట్లో పురాణం సుబ్రహ్మణ్య శర్మ సంక్షిప్త రూపంలో కవిత్వ మెరుపుని అందిస్తూ పాఠకుల్ని ఆకర్షించడానికి ‘మినీకవిత’ అనే పేరుతో కవిత్వాన్ని ప్రోత్సాహించారు. తర్వాత అది ఒక ఉద్యమంగా చాలా కాలం (1970-85) కొనసాగింది.
‘ఎన్ని గజాలు
రాశాడన్నది కాదు
ఎన్ని నిజాలు
చెప్పాడన్నది ముఖ్యం’ (ఆరుద్ర) అనే పద్ధతిలో చాలా మందిని ఆకర్షించింది.ప్రముఖ విమర్శకుడు డా అద్దేపల్లి రామమోహనరావు మినీ కవిత్వానికి ఉచ్ఛ్వాసం క్లుప్తత, నిశ్వాసం ధ్వనిగా ఉండాలని, వ్యర్థ అక్షరమనేది ఉండకూడదనే లక్షణాల్ని చెప్పారు. కవితకు శీర్షిక ప్రధానమై వ్యవహారిక భాషలో ఉండి, కొసమెరుపు, కొసచరుపు, చమత్కార వ్యక్తీకరణతో సూటిగా పాఠకుని హృదయాన్ని తాకాలని అన్నారు. ఇక్కడెక్కడా సంకెళ్ళు వేసే నియమాల్లేవు.

అందుకనే ఒక ఉద్యమంగా మినీ కవిత్వం వచ్చింది. వచన కవిత్వంలో మళ్ళీ దీర్ఘకవిత్వం, దీర్ఘకావ్యాల విస్తృతికి విసిగిన పాఠకులు మినీ కవిత్వాన్ని ఆదరించారు. మహా కావ్యం చదివితే వచ్చేటంతటి ఆనందం చిన్న కవితను చదివితే వచ్చే స్పూర్తి కలిగినవి ఎన్నో ఈ సందర్భంలోనే వచ్చాయి. మినీ కవిత్వం అనగానే ఆచార్య భావన్‌ రాసిన ‘కెరటం
నా ఆదర్శం
లేచి పడినందుకు కాదు
పడినా లేచినందుకు’ అని రాసిన కవిత ఒక నినాదంగా మారింది. అలాగే అమ్మ గురించి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రూపాల్లో వర్ణించినా తక్కువే అనడానికి నిదర్శనమన్నట్లుగా
తినడానికి
మూడే రొట్టెలున్నప్పుడు
తినేవాళ్ళు
నలుగురయినప్పుడు
తనకు ఆకలి లేదనేవ్యక్తి
తప్పకుండా అయ్యుంటుంది
మాతృమూర్తి’ ఒక కవి (జోస్యభట్ల) హృద్యంగా వర్ణించారు.

మినీ కవిత్వంలో ‘ధ్వని’ ఉంటుందనీ, ఉండాలనీ- దీనికి కూడా సంప్రదాయ విమర్శకులు లక్షణాల్ని చెప్పే ప్రయత్నం చేసినా, ఆ ధ్వని సామాన్యులకు సైతం వెంటనే అవగాహన కొచ్చేటట్లుండాలనేదే ముఖ్యమని గుర్తించాలి. అయినప్పటికీ కొన్నాళ్ల తర్వాత, పదాల్ని పేర్చేసి, వాక్యాల్ని విడగొట్టేసి రూపానికే తప్ప రసస్పందన లేకుండా రాయడంతో మినీ కవిత్వం పట్లకూడా పాఠకులకు విసుగొచ్చింది. ఇటువంటప్పుడే మళ్ళీ కవిత్వం కొత్త రూపంలో రావాలనే ఆకాంక్ష మొదలవుతుంది. కొన్నిసార్లు పాత కవిత్వాన్నే నెమరువేసుకొనే ప్రయత్నమూ జరుగుతుంది. మినీ కవిత్వం వస్తున్నపుడే ప్రాచీన తెలుగుసాహిత్యంలో ఇంతకంటే మంచికవిత్వం, లఘు రూపాల్లో వచ్చిందనే దృష్టితో గతాన్నొకసారి స్మరించుకోవడానికీ ప్రయత్నాలు జరిగాయి.

ప్రాచీన తెలుగు సాహిత్యంలోనూ లఘురూపాల్లో కవిత్వం రావడం నిజమే. చాటువులు, శత పద్యాలు, ఖండకావ్యం, పంచరత్నాలు మొదలైన పేర్లతో కవిత్వం వచ్చినా, స్వరూపంలో మినీ కవితారూపానికి దగ్గరగా ఉన్నట్లనిపించినా స్వభావంలో ఇటువంటి కవిత్వం చాలా దూరంగా ఉంటుంది. ప్రశంసించడానికో, నిందించడానికో ఈ లఘు కవితా ప్రక్రియలు ఉపయోగపడ్డాయి. కొంతమంది ఇప్పటికీ ఛందో బద్ధంగానే కవిత్వం ఉండాలనే పండిత కవులు వివిధ సన్మానాలకు పంచరత్నాల్ని రాస్తూనే ఉన్నారు. అందుకనే అటువంటి లఘు కవితా ప్రక్రియల్లో సామాజికత ఉన్నా, సామాజిక స్ఫృహ కనిపించదు. పోషకుల్ని పొగడడానికో, తిట్టడానికో, నీతుల్ని బోధించడానికో, భగవంతుణ్ణి స్తుతించడానికో, శృంగారాన్ని ఒలకబోయడానికో ఉపయోగించినంతగా సామాజిక సమస్యని వర్ణించడానికి ఆ ప్రాచీన లఘు కవితాప్రక్రియలు ప్రయత్నించాయని చెప్పలేం. మినీ కవితా రూపంలా కనిపించినా, ఇదే స్వభావంలో ప్రాచీన కవిత్వానికీ, ఆధునిక కవిత్వానికీ గల ముఖ్యమైన ఒక వ్యత్యాసం.

కవిత్వాన్ని నిత్యనూతనం చేయడంలో కొత్త కొత్త కవితా రూపాలు అవసరమే. అలాగని ఆ రూపాలు కవిత్వాన్ని ఎక్కువ మందికి అందిం చకుండా పోకూడదు. కవిత్వం రాయడం కొందరికి మాత్రమే సాధ్యమనే భ్రమను పెంచకూడదు. సాహిత్య విలువల్ని కాపాడుకొంటూనే, పర భాషా సాహిత్యాల్లో నుండి వచ్చే ప్రక్రియల్ని మనం సొంతం చేసుకొంటున్నప్పుడు కొన్ని నియమాల్ని సరళీకరించుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అదే పరిస్థితి మనతెలుగులోకి వచ్చిన గజల్‌, రుబాయత్‌, హైకూ మొదలైన ప్రక్రియల్లో కనిపిస్తున్నది. వేమన ప్రభా వంతో, ఆధునిక మినీ కవితారూప ప్రేరణతో చాలా మంది కొన్ని ప్రయోగాల్ని చేస్తున్నారు. నానీలు, నానోలు, రెక్కలు, వామీలు, మామీల పేర్లతో కవి త్వాన్ని రాస్తున్నారు. ఇలా కొత్త కవితా రూపాలు రావడం ఆహ్వా నించదగిందే. అది ప్రజాస్వామిక లక్ష్యం కూడా! అయితే, అవి ఆధునిక కవిత్వానికి ఉండే మౌలిక లక్షణాల్ని విస్మరించకుండా ఉంటే బాగుంటుంది.

జపాన్‌ కవిత్వ ప్రభావంతో తెలుగులోకి వచ్చిన కవితా రూపం హైకూ. గాలి నాసరరెడ్డి 1994 నుండీ హైకూలు రాయడం ఆరంభించారు. 1991 నుండీ ఇస్మాయిల్‌ హైకూ కవితా ప్రక్రియను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. తర్వాత పెన్నా శివరామకృష్ణ లక్షణ యుక్తంగా రాసే ప్రయత్నం చేశారు. హైకూలో మూడు పాదాలు ఉండాలనీ, అవి 5,7,5 అక్షరాలను అనుసరించాలని లక్షణాల్ని వివరించారు. నిజానికివి జపాన్‌ భాషకి తగినట్లు అక్షర నియతిని ఏర్పరిచినా అవే లక్షణాల్ని తెలుగులో పాటించడం కుదరలేదు. అందువల్ల తర్వాత కాలంలో చాలా మంది హైకూల్ని రాసినా ఆ లక్షణాల్ని పాటించలేకపోయారు. కానీ, హైకూలో ఉండే తత్త్వాన్ని అందించే ప్రయత్నం చేశారు. అంతకు ముందు పారశీ, అరబ్బు ప్రభావంతో వచ్చిన గజల్స్‌, రుబాయత్‌ వంటిప్రక్రియలు కూడా అలాగే పాఠకుల్ని/ ప్రేక్షకుల్నీ అలరించినా లక్షణాలకంటె, కవితల్లోని మానవీయ స్పందనలకే ప్రాముఖ్యం లభించింది.

దేశీయమైన కవితా ప్రక్రియగా నానీలను ఆచార్య ఎన్‌. గోపి సృష్టించారు. నావి- నీవి- వెరసి మనవి అనే అవగాహనతో ‘నానీలు’ పుట్టుకొచ్చాయి. వీటికి లక్షణాల్ని చెప్పినవాళ్ళు- నాలుగు పాదాలు ఉండాలనీ, వాటిలో 20- 25 అక్షరాల నిడివి ఉండాలనీ ఒక లక్షణాన్ని చెప్పి, ఒక భావాంశాన్ని రమణీయంగా చెప్పే వీలు దీనిలో ఉందన్నారు.ఈగ హనుమాన్‌ నానో ప్రక్రియను ప్రారంభించారు. నానో అంటే- ‘సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రక్రియ’ అనే అర్థంలో దీన్ని ప్రయోగిస్తున్నారు. నానో టెక్నాలజీ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ‘నానో’ పేరుతో కవితా ప్రక్రియ కూడా ప్రసిద్ధిలోకి వచ్చింది. ఈగ హనుమాన్‌ 2005 నుండీ దీన్ని రాస్తున్నారు. నానోలో నాలుగు పాదాలు ఉండాలి. పాదానికి ఒక పదం లేదా చిన్న సమాసం మాత్రమే ఉండాలి.

నాలుగో పాదం చమత్కారంతో ముగియాలి. ఈ కవిత్వంలో వస్తువుగా దేనై్ననా స్వీకరించవచ్చు.రెక్కలు అనే కవితా ప్రక్రియతో కూడా ఈ మధ్య కాలంలో కవిత్వం వస్తోంది. రెక్కలు కవితా ప్రక్రియని ఎం.కె. సుగమ్‌బాబు ప్రారంభించారు. రెక్కలు ప్రక్రియ 2009 నుండీ వస్తోంది. రెక్కలు కవితలో నాలుగు పాదాలు ఉంటాయి. ఒక్కో పాదంలో ఒకటి లేదా రెండు పదాలు ఉండాలి. నాలుగు పాదాలకు మధ్య ఒక వాక్యానికి ఉండే ఖాళీ వదిలి మరో రెండు పాదాల్ని రాయాలి. చివరి రెండు పాదాల్లో కూడా ఒకటి లేదా రెండు పదాలు చొప్పునే ఉండాలి. అవి దీర్ఘ సమాసాలతో ఉండకూడదు. సరళ సుందరంగా ఉంటే బాగుంటుంది. పై నాలుగు పాదాలు పక్షి దేహ నిర్మాణాన్ని పోలి ఉంటాయి.
అయితే, కింది రెండు పాదాలు పక్షికుండే రెక్కల వంటివి. ఈ చివరి రెండు పాదాల్లోనే ఒక చమత్కారమో, ఆలోచనను రేకెత్తించే గుణమో ఉండాలి. ఇలాంటి గుణాన్నే ‘పంచ్‌’ అంటారు. ఆధునికతకు అత్యంత ప్రాణప్రదమైంది శాస్త్రీయమైన మానవీయకోణం. మానవుణ్ణి కేంద్రంగా చేసుకోవడంతో పాటు హేతు పూర్వకమైన రసస్పందనతో కవిత్వం వెలువడాలి. ఆధునికకవిత్వం, అదీ వచన కవిత్వంలో నియమాలు పాటించరని కాదు గానీ, వాటి కంటే, స్వేచ్ఛకీ, సహజ స్పందనకీ ప్రాధాన్యాన్నిస్తూనే, సాహిత్యంలో ప్రయోగాల్నీ చేయాలి. వస్తువుని స్వీకరించడం మంచిదే. అలాగే ఒక క్రమాన్ని పాటిస్తూ తర్వాత తరాలు కూడా అందుకొనేలా కొన్ని నియమాల్ని పాటించినా అవి మళ్ళీ సంకెళ్ళుగా మారకూడదు.
-Dr.Darla Venkateswara Rao,
Assistant Professor, 
Dept .of Telugu, 
University of Hyderabad, (Central University), 
Gachibowli, Hyderabad-500 046 
e-mail: vrdarla@gmail.com 
Ph: 040-23133563 (O), Mobile: 09989628049,

(ఈ వ్యాసం సూర్య దినపత్రిక ( 12-9-2011) సాహిత్యం పేజీలో ప్రచురితమైంది.)

1 comment:

కనకాంబరం said...

వివరణాత్మకమైన మీ వ్యాసం బాగుంది. నీను దీర్ఘ కవితలతో సంతృప్తి చెందక, చిరు కవితా ప్రక్రియలపై దృష్టి పెట్టి ప్రయోగాలు చేస్తూ వస్తున్నాను. ఫేస్ బుక్ లో... నా స్వీయ కుడ్యం పైననూ ఇతర సమూహాలలోనూ, నానో లు, రెక్కలు ,హైకూలు,ఫెంటోలు రాసి పోస్ట్ చేయడం జరిగింది . నా నానోలు శ్రీ హనుమాన్ హానీ గారు సంతృప్తి పడినవే కొన్ని వేలు వుండి ఉండవచ్చు. నిజానికి అంతర్జాల పుటలలో వున్న,వాటిని లెక్కించడం, సంకలన పరచడం నాకు ఇబ్బందిగానే వుంది.

కొన్ని వందల పై చిలుకు హైకూలు, ఓ రెండు వందల పై చిలుకు రెక్కలు ,వేయి పైగా ఏకవాక్య క్లుప్త కవితలు వ్రాసి ప్రచురించడం జరిగింది. ఇవి కాక నేనుగా సృష్టించుకున్న చిరు కవితా ప్రక్రియ "అణువులు" తెలంగాణా మాండలిక మాద్యమం లో వ్రాయడం జరిగింది. అవి కేవలం 24 కవితలే .పలువురి ప్రసంసలనండుకున్నాయి. మీకు వీలైనప్పుడు వాటిని, ఫేస్బుక్ లోని వివిధ ప్రక్రియలలో వున్నా నా ప్రచురణలను విమర్శనాత్మకంగా పరిశీలించి నాకు సూచనలందించ గలరు.నా FB పేజి Nutakki Raghavendra Rao.నా బ్లాగ్ అడ్రస్ ...www.nutakki.wordpress.com. (గిజిగాడు)...( కనకాంబరం/gmail)...శ్రేయోభిలాషి ..నూతక్కి రాఘవేంద్ర రావు.