"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

17 April, 2024

పాట చైతన్య ప్రవాహిని... 16.4.2024

పాట మానవ చైతన్య ప్రవాహిని


ప్రతి ఉద్యమంలోనూ పాట మనిషిని ముందుండి నడిపించిందని ప్రముఖ సినీ గేయ రచయిత డా.సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. మానవ చరిత్రలో ఆదిమ కావ్యం పాటేనని, అది శ్రమనుంచే పుట్టిందని ఉత్పత్తి ప్రక్రియలోనూ కాయకష్టంలోనూ పనితో పాటే పాట వర్ధిల్లిందని ఆయన వివరించారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాళవీయ  మిషన్ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం, కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాదు, కళాశాల విద్యాశాఖ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోని డిగ్రీ కళాశాలల తెలుగు అధ్యాపకులకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం (సామర్ధ్యాల నిర్మాణ కార్యక్రమం) మంగళవారం (16.4.2024) ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం యు. జి .సి.,మాళవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పది రోజుల పాటు జరుగుతుంది.  ఈ కార్యక్రమం యు .జి. సి., మాళవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ సంచాలకులు ఆచార్య పి ప్రకాష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య పి. ప్రకాష్ బాబు మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయం లోని మాళవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్  ఉన్నత ప్రమాణాలతో విద్యా శాఖలోని అధ్యాపకులకు సహాయాచార్యులకు ఆచార్యులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించడంలోనూ, పరిశోధన పద్ధతులను, ప్రమాణాలను రూపకల్పన చేయడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తోందని తెలియజేశారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ మానవ మహాప్రస్థానంలో పాట అత్యంత కీలకమైనదని, మానవ నాగరికత ప్రతి మలుపులోనూ మానవ ప్రస్థానాన్ని ముందుకు నడిపించిన ప్రతి ఉద్యమంలోనూ పాట మనిషిని ముందుండి నడిపించిందని పేర్కొన్నారు. మానవ చరిత్రలో ఆదిమ కావ్యం పాటేనని, అది శ్రమనుంచే పుట్టిందని ఉత్పత్తి ప్రక్రియలోనూ కాయకష్టంలోనూ పనితో పాటే పాట వర్ధిల్లిందని వివరించారు. కానీ కారణాంతరాల వల్ల పాటకు ద్వితీయ స్థానాన్ని సాహిత్య చరిత్ర ఇచ్చిందని ఇది బాధాకరమైన విషయమని తెలియజేశారు. మనిషి ప్రతి భావోద్వేగానికి పాట వేదికైందని, మనిషి కష్ట సుఖాల్లో మానవుడికి తోడుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాట పరిణామ క్రమాన్ని నదితో పోలుస్తూ బొట్లు బొట్లుగా  ప్రవాహంతో ప్రయాణమైన పాట ఈరోజు ప్రతి మానవుడి జీవితంలో భాగమైనటువంటి విషయాన్ని వివరించారు. అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, సుద్దాల హనుమంతు అందెశ్రీ,గద్దర్ వంటి భక్తి ప్రజావాగ్గేయకారులను ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మానవీయ విభాగాల డీన్ ఆచార్య వీ కృష్ణ మాట్లాడుతూ నూతన విద్యా విధానం 2020 ఉన్నత విద్యా వ్యవస్థలో అనేకమైన కీలక మార్పులను తీసుకొచ్చిందని వాటిపైన ఇంకా విస్తృతమైన చర్చ జరగాలని విద్యా వ్యవస్థలోని మార్పులే సామాజిక మార్పులకు దారితీస్తాయని కాబట్టి విద్యా విధానం రూపకల్పనలో మేధావి వర్గమైన అధ్యాపకులు కీలక పాత్ర పోషించాలని, అందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడతాయని తెలిపారు. తెలుగు విభాగాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని యు.జి.సి., మాళవీయ మిషన్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం(MMTTC) ఆంధ్ర ప్రదేశ్ లోని డిగ్రీ కళాశాల అధ్యాపకులకు చాలా అంశాలలో శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిందని తెలుగు సబ్జెక్టు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం తెలుగు శాఖకు గర్వకారణం అని తెలుగు భాషా సాహిత్యాలలో లబ్ద ప్రతిష్టులైన మరియు విశేష కృషిచేసిన ఎందరో సాహితీ భాషావేత్తలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ పి విజయ కుమార్ మాట్లాడుతూ తెలుగు భాష ఆధునిక కాలానుగుణంగా ఎదగాల్సిన అవసరం ఎంతో ఉందని అందుకు కావాల్సిన పరిశోధన సాంకేతికత వంటి అంశాలపై అధ్యాపకులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టి భాషా సాహిత్యాలలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని అందుకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడతాయని వాటిని అధ్యాపకులు సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లో వివిధ కళాశాల నుంచి వచ్చిన అధ్యాపకులు, విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.






No comments: