"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

17 నవంబర్, 2025

ఎప్పటికి పోతుందీ భావ దారిద్ర్యం ?

 ఎప్పటికి పోతుందీ భావ దారిద్ర్యం ?


ఎప్పటికి పోతుందీ భావదారిద్ర్యం ?


ఇతరుల భావాలను ఎవరైనా తీసుకున్నప్పుడు వాటిని ఎక్కడినుండి తీసుకున్నామో చెప్పటం నిజాయితీపరులు మాత్రమే చేస్తారు. ఇతరుల భావాలను గౌరవించే వాళ్ళు చేస్తారు. అలా కాకుండా ఇతరుల భావాలను చదువుకొని తమ భావాలుగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్లకి రెడీమేడ్ మసాలా కావాలి. తాము చెప్పేదానికి ఎలాంటి ఆధారాన్ని ఇవ్వరు. మన పత్రికలు కూడా అత్యధికంగా అటువంటి వాటికి ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటాయి. ఆధారాలు ఇవ్వడానికి దిన పత్రికలేమీ పరిశోధన పత్రికలు కాదు కదా అని సమర్థించుకుంటాయి. తెలంగాణ సమాజాన్ని ఆత్మగౌరవ గొంతుతో పలికించిన వాగ్గేయకారుడు అందెశ్రీ మరణించిన తర్వాత ఇది మరింతగా కనిపించింది. ఆయన గురించి ఒకటి రెండు పుస్తకాలలో సమాచారం ఉన్నప్పటికీ, మరికొన్ని వెబ్సైట్లో లిఖితపూర్వక ఇంటర్వ్యూలు ఉన్నప్పటికీ, వాటన్నింటి కంటే ఆయన వివిధ సందర్భాలలో ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలే ఎక్కువ. వీటన్నింటిలో ఆంధ్రజ్యోతి ఎం.డి వేమూరి రాధాకృష్ణ గారు చేసిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం ద్వారా ప్రసారం చేసిన సుదీర్ఘమైన వీడియో ఇంటర్వ్యూ చారిత్రాత్మక ఆధారంగా భవించాలి. ఆ తర్వాత మరికొన్ని టీవీల్లో కూడా అందెశ్రీ చెప్పిన మౌలికమైన భావాలు ఉన్నాయి. ఆయన ఇంటర్వ్యూలలో పునరుక్తి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే చెప్పిన విషయాలే అన్ని ఇంటర్వ్యూలలో చెప్తుంటారు.

తన జీవితం గురించి చెప్పినవే చెప్పడం ఆ పునరావృతికి సంబంధించిన విషయం. అందువల్ల ఆంధ్రజ్యోతి ఎం.డి వేమూరి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ ఎంతో మౌలికంగా భావించాలి. విచిత్రం ఏమిటంటే ఈ ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలను కొంతమంది అందెశ్రీ నివాళులు వ్యాసాల్లో యథాతధంగా వాడుకున్నారు. తమ శైలీ విన్యాసంతో ఆ భావాలను వ్యాసాలుగా రాసుకున్నారు. కానీ ఎక్కడా ఆ వీడియోలను ప్రస్తావించలేదు. ఇది ఒక రకంగా రచయితలుగా వాళ్ళకున్న భావదారిద్ర్యంగా భావించాలి. అందెశ్రీ పై వచ్చిన వ్యాసాలను గమనిస్తే మరొక అంశం కూడా బాగా కనిపిస్తుంది. చెప్పిన అంశాలనే రకరకాల వ్యాసాల రూపంలో చెప్పడం. ఇలాంటప్పుడు తమ జీవితా అనుభవాలను ఆధారంగా చేసుకుని ఆయనతో ఉన్న పరిచయాలను వ్యాసకర్తలుఒక వ్యాసంగా రాస్తే మౌలిక విషయాలు బయటికి వస్తాయి. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు అలాంటి ఒక చక్కని వ్యాసాన్ని రాశారు. నిజానికి ఈ వ్యాసం అందెశ్రీ గారు మరణించిన వెంటనే ఫేస్బుక్లో చదివాను. తర్వాత ఈరోజు (17.11.2025) విశాలాంధ్ర దిన పత్రిక, సాహిత్య అనుబంధంలో చూశాను. అది మౌలికమైన అంశాలతో కూడింది. కాబట్టి ఫేస్బుక్లో వచ్చినప్పటికీ, దాన్ని పత్రిక ప్రచురించటం సమచితంగా అనిపించింది. అలాగే, సీతారాం, విల్సన్ రావు, అంబటి సురేంద్రరాజు తదితరులు రాసిన వ్యాసాలలో కూడా కొత్త విషయాలు కనిపిస్తున్నాయి. కొన్ని వ్యాసాలు అయితే కేవలం వికీపీడియా ఇతర బ్లాగులలో ఉన్న వ్యాసాలను తమ భావాలుగా చెప్పినవే.

గత కొంతకాలంగా నా బ్లాగులో రాసిన నా వ్యాసాలు కొంతమంది తమ వాక్యాలుగాను, మరికొంతమంది పేరు మాత్రమే మార్చుకొని శీర్షిక కూడా మార్చుకుండగా ప్రచురించుకోవడం, దాన్ని గమనించి ఆ పత్రికల వారికి పంపిస్తే సంపాదకులు వారు నాకు ప్రత్యేకించి దానికి విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉత్తరం రాసారు. ఆ పత్రికలో తర్వాత ఆ వ్యాసకర్త పేరుతో సహా ప్రచురించారు. ఆ భావచౌర్యాన్ని ఖండిస్తూ సవరణ ప్రకటన కూడా చేశారు.

ఈమధ్య కాలంలో కేవలం వెబ్సైట్లో చూసి రచయితలు కావాలనుకునే వాళ్ళ భావ దారిద్ర్యం బాగా కనిపిస్తోంది. దీన్ని తమపత్రికల్లో ప్రచురించుకునే ముందు కనీసం సెర్చ్ ఇంజన్ లో ఒకసారి చెక్ చేసుకునైనా ప్రచురిస్తే బాగుంటుంది.  

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

పూర్వ అధ్యక్షులు, తెలుగు శాఖ 

సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ 

తేది: 17.11.2025.