"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

ప్రభంజనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రభంజనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15 అక్టోబర్, 2026

మై ఫాదర్ బాలయ్య' ఓ మాదిగ ఆత్మకథ( ప్రభంజనం దినపత్రిక సౌజన్యంతో

  'మై ఫాదర్ బాలయ్య' ఓ మాదిగ ఆత్మకథ


ప్రభంజనం దినపత్రిక 15.10.2026 సౌజన్యంతో 

డాక్టర్ వై.బి. సత్యనారాయణ ఇంగ్లీష్‌లో రచించిన ఒక అద్భుతమైన ఆత్మకథాత్మక నవల ‘మై ఫాదర్ బాలయ్య’ (My Father Baliah) తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మాదిగ కుటుంబం నాలుగు తరాల పాటు సాగించిన సామాజిక, ఆర్థిక పోరాటాన్ని ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వర్ణించారు. నిజాం పరిపాలన కాలం నాటి సామాజిక పరిస్థితులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తీవ్రమైన కుల వివక్ష, అంటరానితనం, వెట్టిచాకిరీ వ్యవస్థలను రచయిత ఇందులో ఎంతో వాస్తవికంగా చిత్రించారు. కథానాయకుడైన బాలయ్య (రచయిత తండ్రి) చదువు రానివాడైనప్పటికీ, వివక్షతో కూడిన పాత జీవితాన్ని వదిలేసి రైల్వేలో గ్యాంగ్‌మ్యాన్‌గా చేరడం ద్వారా తన కుటుంబ భవిష్యత్తును మార్చడానికి పునాది వేశారు. ఈ నవల కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాకుండా, అణచివేతకు గురైన ఒక సమాజం ఆత్మగౌరవం కోసం చేసిన ప్రయాణానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. ఈ కథలో చదువుకున్న ప్రాధాన్యత అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని తెలియజేస్తుంది. తన పిల్లలు సమాజంలో గౌరవంగా బతకాలంటే కేవలం 'చదువు' ఒక్కటే మార్గమని బాలయ్య బలంగా నమ్మి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనన్నా, వారిని ఉన్నత చదువులు చదివించారు. ఆయన ఆశయానికి తగ్గట్టే రచయిత సత్యనారాయణ రసాయన శాస్త్రంలో డాక్టరేట్ (Ph.D) సాధించి, ఒక డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నతమైన పదవిలో రిటైర్ అయ్యారు. సామాజిక అడ్డంకులను అధిగమించి విద్యా ఉపాధి ద్వారా ఒక కుటుంబం ఎలా ఉన్నత స్థానానికి చేరుకోగలదో నిరూపించే ఈ పుస్తకం, ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచింది. మొదట ఆంగ్లంలో  వచ్చిన ఈ ఆత్మకథ, తర్వాత తెలుగులో పి. సత్యవతిగారు  ‘మా నాయన బాలయ్య’ పేరుతో అనువదించారు. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ నవల, సినీ నటుడు రజనీకాంత్ 'కబాలి' సినిమాలో  కనిపించేలా దర్శకుడు పా రంజిత్ చిత్రించిన సన్నివేశం ద్వారా దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందింది.

 కరీంనగర్ జిల్లాలోని వంగపల్లి గ్రామానికి చెందిన ఒక ఎలుకటి కుటుంబం ఈ కథకు కేంద్ర బిందువు. మాదిగ కులానికి చెందిన వీరు ఎదుర్కొన్న అమానుషమైన అంటరానితనం, వివక్ష ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. తన ముత్తాత (నరసయ్య తండ్రి) కాలం నాటి ఒక ముఖ్యమైన చారిత్రక ఘట్టాన్ని ఈ నవలలో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుంది. వృత్తిలోని ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని వర్ణించే విధంగా తన నిజజీవితంలో జరిగిన ఒక సంఘటనను ఈ నవలలో పంచుకున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారి అద్భుతమైన వృత్తి నైపుణ్యాన్ని, పనితనాన్ని నిజాం నవాబు గుర్తించి మెచ్చుకున్న సందర్భాన్ని వివరించారు.రచయిత ముత్తాత, ఒక లేగదూడ చర్మంతో అత్యంత సున్నితమైన, అందమైన, నాణ్యమైన జోళ్లను (పాదరక్షలను) తయారు చేశారు. ఆ పాదరక్షల అద్భుతమైన పనితనాన్ని, కళా నైపుణ్యాన్ని చూసి అప్పటి నిజాం నవాబు (ఐదవ నిజాం అఫ్జల్-ఉద్-దౌలా) ఎంతగానో ముగ్ధుడయ్యారు. వారి వృత్తి నైపుణ్యానికి అబ్బురపడి, ఆ పనితనాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. ఆ పనితనానికి గుర్తింపుగాను,  బహుమతిగాను నిజాం నవాబు ఆ కుటుంబానికి 50 ఎకరాల భూమిని ఇనాంగా (బహుమతిగా) ప్రకటించారు.నిజాం నవాబు అంత పెద్ద మొత్తంలో భూమిని బహుమతిగా ఇచ్చినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తీవ్రమైన కుల వివక్ష, భూస్వామ్య (దొరల) వ్యవస్థ కారణంగా వారు ఆ భూమిని ఎలా కోల్పోవాల్సివచ్చిందో వివరించారు. దళితులకు భూములు ఉన్నా, నిత్యం ఎదురయ్యే కులపరమైన వివక్షలు, అణచివేతల వల్ల వాటినేలా కోల్పోవలసివస్తుందో వర్ణించారు. దానితో రచయిత తాతగారైన నరసయ్యను తమ సొంత ఊరైన వంగపల్లి నుండి వలస వెళ్లేలా చేశాయి.

నవాబు ఇచ్చిన 50 ఎకరాల భూమిలో 48 ఎకరాలను దళిత కుటుంబం నుంచి స్థానిక దొరలు లాగేసుకోవడం,  కనీసం బడిలో చదువుకునే హక్కు కూడా లేకుండా చేయడం నాటి దయనీయ పరిస్థితులకు అద్దం పడతాయి. ఈ పుస్తకం ఒక హృదయ విదారకమైన దృశ్యంతో ప్రారంభమవుతుంది. రచయిత తాత నర్సయ్య, కలరాతో చనిపోయిన తన భార్య మృతదేహాన్ని పూడ్చడానికి ఎవరి సహాయం అందక, తన చిన్నారి కొడుకుతో కలిసి స్వయంగా మోసుకువెళ్లడం చదివేవారి మనసును కలచివేస్తుంది. ఈ సంఘటన ద్వారా ఆ రోజుల్లో దళితుల వృత్తి నైపుణ్యానికి పాలకుల నుండి గుర్తింపు లభించినప్పటికీ, స్థానిక భూస్వామ్య వ్యవస్థ వారిని ఎలా అణగదొక్కిందో స్పష్టంగా చూపిస్తుంది.

 గ్రామంలోని కుల రాజకీయాలను, అమానుషమైన అంటరానితనాన్ని భరించలేక నర్సయ్య తన రెండెకరాల భూమిని, చేతికొచ్చిన పంటను వదిలేసి కొడుకుతో సహా 70 కిలోమీటర్లు నడిచి జనగామ చేరుకుంటాడు. అక్కడ ఆయనకు రైల్వేలో ఉద్యోగం వస్తుంది. ఆ రోజుల్లో ఆంగ్లేయులు కులవివక్ష చూపకపోవడం వల్ల, శూద్రులతో సమానంగా ఒకే క్వార్టర్స్‌లో నివసించే అవకాశం వారికి దక్కుతుంది. నర్సయ్య కుటుంబానికి మొదటిసారిగా మనుషులుగా గుర్తింపు, ఆత్మవిశ్వాసం లభించింది ఇక్కడే. అంటరానివారిని సమాజంలో భాగం చేయడంలో, వారికి ఒక సమానమైన జీవితాన్ని అందించడంలో భారతీయ రైల్వే వ్యవస్థ పోషించిన పాత్ర ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.నర్సయ్య కొడుకు రామస్వామి (బాలయ్య), ఒక ముస్లిం మతగురువు చొరవతో కొద్దిగా చదువుకుంటాడు. అగ్రవర్ణాల వారు బడుల్లోకి రానివ్వని ఆ రోజుల్లో, చదువు మాత్రమే తన పిల్లలను కుల వివక్ష అనే నరకకూపం నుంచి బయటపడేయగలదని బాలయ్య ఎంతో బలంగా విశ్వసిస్తాడు. తనకున్న 13 మంది పిల్లల్లో (ముగ్గురు చనిపోగా) మిగిలిన వారికి కఠినమైన క్రమశిక్షణను అలవరుస్తాడు. ఉదయం 4 గంటలకే నిద్రలేపి మరీ వారిని చదివిస్తాడు. ఆయన పట్టుదల వృధా కాలేదు. వారిలో ముగ్గురు పీహెచ్‌డీలు సాధించి విద్యావేత్తలుగా స్థిరపడ్డారు. రచయిత సత్యనారాయణ గారు ఏకంగా ధర్మవంత్ కళాశాలకు ప్రిన్సిపాల్ స్థాయికి ఎదగడం చదువుకున్న గొప్ప శక్తి అనిరూపించడానికి  అదొక సజీవ నిదర్శనం.

చదువుకుని జీవితంలో స్థిరపడుతున్నా, అంటరానితనం అనే చీకటి వారిని వెంటాడుతూనే ఉండేది. సికింద్రాబాద్‌లోని ఒక  ప్రిన్సిపాల్, భవిష్యత్తులో ఈ తెలివైన విద్యార్థి కులవివక్షకు గురికాకూడదనే ఉద్దేశ్యంతో 'సత్తి' లేదా 'సత్తయ్య' అనే పేరును 'సత్యనారాయణ'గా మారుస్తాడు. అయినా సరే, అగ్రవర్ణాలకు చెందిన తన స్నేహితుని ఇంటికి వెళ్లి సోఫాలో కూర్చున్నందుకు అక్కడి వంటవాడు సత్యనారాయణను బయటకు గెంటేయడం లాంటి సంఘటనలు వారిని మానసికంగా ఎంతగానో కుంగదీశాయని తెలిపారు. ఒక ఉన్నతమైన విద్యాసంస్థకు అధిపతి అయిన తర్వాత కూడా అతని నైపుణ్యాన్ని శంకించడం వంటివి సమాజంలోని కులాధిపత్వాన్ని నిరూపిస్తాయని వాపోయేవారు.‘మైఫాదర్ బాలయ్య’ ఇంగ్లీష్ మూల ప్రతి 2011 డిసెంబర్ చివరి వారంలో విడుదల అవ్వగా, పి. సత్యవతి గారు తెలుగులోకి అనువదించిన ప్రతిని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు వెంటనే 2012 జనవరిలో ప్రచురించారు. ఆ తర్వాత ఈ పుస్తకం రెండు భాషల్లోనూ అనేక ఎడిషన్లుగా (పునఃప్రచురణలు) మార్కెట్లోకి వచ్చింది. 

దళిత చైతన్యం, సామాజిక మార్పును విశ్లేషించేందుకు ‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తకాన్ని భారతదేశంలోను, విదేశాల్లోనూ పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో సామాజిక శాస్త్రం, తెలుగు సాహిత్యం,  ఆంగ్ల సాహిత్య కోర్సులలో ఒక పాఠ్యపుస్తకంగాను,  రిఫరెన్స్ బుక్‌గా చేర్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ వంటి జాతీయ పత్రికలు ఈ పుస్తకం తెచ్చిన చైతన్యాన్ని, అది అందించిన సందేశాన్ని ప్రశంసిస్తూ ప్రత్యేకంగా కొన్ని సమీక్షలు రాశాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డా.గిన్నారపు ఆదినారాయణ తన ఆత్మకథలపై చేసిన పిహెచ్. డి. సిద్ధాంత గ్రంథంలో ఈ పుస్తకంపై ప్రత్యేక పరిశోధన చేశాడు. ఈ పుస్తకం తెచ్చిన గుర్తింపుతో రచయిత వై.బి. సత్యనారాయణ గారు 'సెంటర్ ఫర్ దళిత స్టడీస్' (Centre for Dalit Studies) ద్వారా మరింత చురుగ్గా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి సంఘం (DSU) వారు సదాలక్ష్మి గారిపై ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, డా. వై. బి. సత్యనారాయణ గారిచే ప్రత్యేక ఉపన్యాసం ఇప్పించారు. డా.వై.బి. సత్యనారాయణ గారు రచించిన ‘మై ఫాదర్ బాలయ్య’ కేవలం ఒక వ్యక్తిగత ఆత్మకథ కాదు. ఇది ఆయన ముత్తాత, తాత (నర్సయ్య), తండ్రి (బాలయ్య), రచయితతో కలుపుకుని నాలుగు తరాల సుదీర్ఘ సామాజిక పరిణామాన్నీ, వారి జీవన పోరాటాన్నీ కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది. అలెక్స్ హేలీ రచించిన ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ నవల ‘రూట్స్’ (ఏడు తరాలు) తరహాలో, తెలుగు సమాజంలో అణగారిన వర్గాల ప్రయాణానికి ఇది అద్దం పడుతుంది. అందుకే ఈ పుస్తకం ఒక సాధారణ ఆత్మకథగా మిగిలిపోకుండా... వలస, విద్యల ద్వారా ఒక సమాజం చీకటి నుంచి వెలుగు వైపుకు చేసిన ప్రయాణానికి చారిత్రక సాక్ష్యంగా నిలిచిపోతుంది.

కొన్ని మత గ్రంథాల ముసుగులో సృష్టించిన అంటరానితనం, కింది వర్గాలపై రుద్దిన అమానుష ఆంక్షలు (చెవిలో సీసం పోయడం, మంచి బట్టలు వేసుకోనివ్వకపోవడం, దేవాలయ ప్రవేశ నిరాకరణ వంటివి) సమాజాన్ని ఎంతగా కలుషితం చేశాయో ఈ పుస్తకం తీవ్రంగా నిలదీస్తుంది. ఎంతో శ్రమకోర్చి సాధించుకున్న 'చదువు' మాత్రమే ఈ అసమానతల వ్యవస్థను పారద్రోలి దళితులకు సాధికారతను అందిస్తుందని ఈ రచన చాటిచెబుతుంది. అంటరానివారి జీవితాల్లోకి, వారు పడిన అంతర్గత సంఘర్షణలోకి ఈ పుస్తకం ఒక సరికొత్త దృక్పథాన్ని ప్రసరిస్తుంది. కష్టపడే తత్వమే తప్ప మేధస్సు ఏ ఒక్క వర్గానికో సొంతం కాదని, శతాబ్దాల సామాజిక వివక్షను అక్షరంతోనే జయించవచ్చని 'మై ఫాదర్ బాలయ్య' సజీవంగా నిరూపిస్తుంది.​1946 జూన్ 2న జన్మించిన డా. వై.బి. సత్యనారాయణ గారు 14 అక్టోబర్ 2026న భౌతికంగా మనకు దూరమై ఉండొచ్చు. కానీ, అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని అక్షరబద్ధం చేసిన ఆయన ప్రయాణం అక్కడితో ఆగిపోదు. తరతరాల అజ్ఞానపు చీకట్లను చీల్చుకుంటూ ఆయన వెలిగించిన చైతన్య దీపం, రాబోయే ఎన్నో తరాలకు నిరంతరం దారిచూపుతూనే ఉంటుంది.

(డా.వై.బి.సత్యనారాయణగారికి నివాళి అర్పిస్తూ…)

డా.దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, తెలుగు శాఖ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్. ఫోన్: 9989628049


14 ఆగస్టు, 2026

డా. ఆది నారాయణ కవిత్వం

 

‘సాధారణంగా కనిపించే అసాధారణ కవిత్వం’


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, 

స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 

హైదరాబాద్.


‘కవిత్వానికి, కన్నీటికి

ఎప్పటి బంధమో ఏమో

కన్నీరు కార్చిన ప్రతిసారి 

కవిత్వం జాలువారుతుంది’ ఇవి సాదాసీదా పదాలు కాదు; జీవితాన్ని కాచి వడబోసిన కవితా పంక్తులు. కవిత్వం ఎలా పుడుతుందనేది ఆదికావ్యం ఆవిర్భావం నుండి నేటి వరకు చర్చోప చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతీ కవీ తన కవిత్వానికి ప్రేరణ ఏమిటో ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పుకుంటాడు. దానితో పాటు తన కవిత్వ ప్రయోజనాన్ని కూడా సూచిస్తాడు. డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ కూడా అదే పని చేశాడు. కవి భావోద్వేగాలు, అనుభవాలు, కన్నీటి రూపంలో ప్రవహించినప్పుడు, అవి కవిత్వంగా మలచబడతాయని చెబుతున్నాడు. అంతే కాదు, కవిత్వం పాండిత్యానికి మాత్రమే పరిమితం కాదని, అది కవి ఆత్మను ప్రతిబింబించే భావోద్వేగంగా భావిస్తాడు. కవిత్వం కవి హృదయం నుంచి సమాజాన్ని తాకే ఒక శక్తివంతమైన ప్రక్రియగా అవతరిస్తుందని, అదే తన కవిత్వమని కూడా చెప్పకనే చెప్పాడుకవి. కవి తన భావోద్వేగాలను అక్షరాలుగా మారుస్తాడు; గాయకుడైతే ఒక తన సంతోషాన్నిగానీ, దుఃఖాన్ని గాని గేయంగా మారుస్తాడు; చిత్రకారుడు అయితే ఒక చిత్రమవుతాడు. కళాకారుడు తన బాధనయినా, సంతోషాన్ని అయినా సత్వరమే ఏదో ఒక రూపంలో బహిర్గత పరుస్తాడు. తొలి దశలో అలా జరిగినా, ఒక సమాధ్యవస్థ పొందిన సృజనకారుడు దాన్ని సాధారణీకరించగలగాలి. అప్పుడు పాఠకుడు / ప్రేక్షకుడు దానితో తన్మయీ భావానికి గురికాగలుగుతాడు. ఒక జీవితం కవిత్వం లేదా కళ అయ్యే వివిధ దశలను ఇది తెలుపుతుంది. కవిత్వం రాయడం, దాన్ని ఆస్వాదించడంలో ఉన్న తృప్తి, ఆనందం, ఆ మమేకత సృజనకారుడు మాత్రమే గుర్తించగలడు. తాను కవిత్వం కోసం ఎలా ఉద్వేగానికి గురయ్యే వాడో, ఆ కవిత్వంలో సామాన్యుడికి స్థానం కోసం, సామాన్యుడే కవిత్వం కావడం కోసం శ్రీశ్రీ తన ‘కవితా! ఓ కవితా!’లో తెలిపాడు. అలాగే ఈ కవి కూడా తాను కవిత్వమయ్యే క్రమంలో గుండె గొంతుకలో కొట్లాడిన విధానాన్ని కవిత్వీకరించాడు.

‘’నీకై

 నా మదిని నీలాకాశపు ఎడారిలో 

ఒంటరి ఒంటెలా తిప్పుతున్న క్షణాలు చూస్తే ఒయాసిస్సులు కూడా కన్నీటి బొట్లను ఆపేసుకుంటాయేమో.’’

ఇది ఆదినారాయణ వ్యక్తిగత జీవితానికి సంబంధించిందే కాదు; తరతరాలుగా భారతదేశంలో దళితులు అనుభవించిన అవమానాలకు, బహిష్కరణలకు, సమాజంలో తగిన స్థానం లేని పరిస్థితులకు నిలువుటద్దం ఈ కవిత. శూద్రుని కవిత్వాన్ని ఆస్వాదించడమంటే, కాకి ఎంగిలి చేసిన ఆహారాన్ని భుజించినట్లేనని అప్పకవి, ఆ వారసులు దళితుల్నీ, దళిత కవిత్వాన్ని పరిగణించే దయనీయమైన పరిస్థితి నేటికీ పూర్తిగా పోయిందని గుండెల మీద చేయేసుకొని చెప్పలేం. ఈ కవితలో కొన్ని తరాలుగా దళితులు త్రాగడానికి మంచినీళ్ళకోసం ఎదుర్కొన్న సామాజిక వ్యవస్థీకృత సంఘర్షణను కూడా అద్భుతమైన అభివ్యక్తితో వర్ణించాడు కవి. దళితుల జీవితం, ముఖ్యంగా నీటి వంటి ప్రాథమిక వనరులకు సైతం అవకాశం లేని పరిస్థితినీ ఈ కవితలో వివిధ ప్రతీకల ద్వారా మరింత స్పష్టంగా వర్ణించాడు. "నీలాకాశపు ఎడారి" ద్వారా దళితుల నిరాశ, అనుభవించే పాశవికత, సామాజిక విస్మరణ ప్రతిబింబించగా, "ఒంటరి ఒంటె" వారి అవహేళన భరించాల్సిన సామర్థ్యాన్ని సూచిస్తుంది.భారతదేశంలో దళితుల నిత్యజీవితంలో నీటి కోసం చేసే పోరాటాలు సామాజిక వివక్షతను వ్యక్తీకరిస్తాయి. అనేక గ్రామాల్లో బావులపై, చెరువులపై సాంప్రదాయంగా ఉన్న యజమానత్వం దళితులను వాటికి దూరం చేస్తుంది. ఈ కవితలోని "ఒయాసిస్సులు కూడా కన్నీటి బొట్లను ఆపేసుకుంటాయి" అనే వాక్యం, దళితుల గాధను చూసి ప్రకృతి కూడా సతమతమవుతుందని ఒక స్ఫూర్తివంతమైన దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది.

డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ పద్య కవిత్వం పై ఎం.ఫిల్. చేశాడు. దళిత ఆత్మకథలపై డాక్టరేట్ చేశాడు. ఓరియంటల్ కళాశాల నుండి వచ్చి, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు. తను విద్యార్థిగా, పరిశోధకుడుగా, విద్యార్థి నాయకుడుగా, ప్రస్తుతం ఒక అధ్యాపకుడిగా ఉన్నప్పటికీ తాను విస్తృతంగా అధ్యయనం చేస్తున్నాడు. గతంలో ‘నానీలసుగంధం’ (2023) పేరుతో తన తొలి కవితా సంపుటిని వెలువరించాడు. దాన్ని రవీంద్ర భారతిలో తన గురువు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగార్కి అంకితం చేశాడు. కవిత్వం ఒక తీరని దాహం. తన చుట్టూ ఉన్న సమాజాన్ని, ఆ సమాజంలోని వివిధ పొరలను సూక్ష్మంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో మళ్లీ అనేక కవితలయ్యాడు. ఎవరికైనా సాంఘికీకరణ ప్రక్రియ లో కుటుంబం ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఆ తరువాత పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి వరకు మరొక సమాజాన్ని అభ్యసింప చేస్తుంది. మరలా సమాజంలో ఒక పౌరుడిగా తన విధులు నిర్వహించేటప్పుడు చట్టం, న్యాయం మరికొన్ని నియమనిబంధనలు నేర్పుతాయి. ఇవన్నీ సాంఘికీకరణ ప్రక్రియలో వివిధ దశలు. వీటన్నింటి గురించి ఆదినారాయణ కవిత్వం అయ్యాడు. అమ్మ నాన్నలలో నాన్న గురించి కవిత్వం రాసినా, రాయకపోయినా బహుశా తన అమ్మ గురించి కవిత్వం రాయని కవి ఉండడు. ఈ కవి కూడా తన తల్లిని ఒక ప్రేమమూర్తిగా, ఆత్మీయ మూర్తిగా తమకు అందించిన వివిధ అనురాగ పార్శ్వాలను ఎన్నో భావచిత్రాలుగా చూపించాడు. తన తల్లిలోని శ్రమైక జీవన సౌందర్యాన్ని తలచుకొని మురిసిపోతాడు. 

‘’దండెం అమ్మ పుట్టింటి ఆస్తి. 

ఆ దండెం దగ్గర 

నాన్నకు చోటే ఉండదు 

దాని పూర్తి హక్కులు అమ్మవే.’’ ఇంట్లో పనులు చేయటం, బట్టలు ఉతకడం, వంట చేయడం… దీనితో పాటు పొలం పనులు చేయడం తరతరాలుగా స్త్రీకి మాత్రమే సంక్రమించిన పనులుగా మారిపోయిన స్థితిని అద్భుతంగా వ్యక్తీకరించాడు కవి. 


మనుచరిత్రలో అల్లసాని పెద్దన సంసారం గొప్పతనాన్నీ, భార్యాబిడ్డలు, కుటుంబం, ఆ గృహస్థ జీవితంలోని ఔన్నత్యాన్ని వర్ణిస్తూ భారతీయ జీవన విధానాన్ని వేనోళ్లా కీర్తించారు. ఈ కవి ఆదినారాయణ కూడా ఇల్లుని వర్ణిస్తూ అటువంటి పనే చేశాడు. ఇంట్లో ప్రతి ఒక్కొక్కరికి మధ్య ఉండే‌ అనురాగాన్నీ, బాధల్నీ, బాంధవ్యాల్నీ, వారి వారి ఆస్తిత్వాల్ని అద్భుతంగా వర్ణించి, ఆధునిక భారతీయ సమాజంలో కూడా కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనం కొనసాగుతూనే ఉందని పరోక్షంగా సూచించాడు. 

‘’ఇల్లంటే 

చెమ్మగిల్లిన కన్నీటి బొట్లను

బరువెక్కిన హృదయాన్ని

మనసారా నవ్విన జ్ఞాపకాలను 

నడుస్తున్న వంటగదిని 

ఒక్కసారి స్పృశించడం.’’

ఇల్లంటే ఎవరెవరు? తల్లి, తండ్రీ, అన్నదమ్ములు, భార్యాభర్తలు, బిడ్డలు…బంధువులు ఒకరేమిటి! అనేక బంధుత్వాలతో ముడివేసుకున్న అనురాగాలు. ఆదినారాయణ వీళ్ళందరినీ సందర్భం వచ్చినప్పుడల్లా కవిత్వం చేశాడు. 

‘’పనికాడ తల్కాయకు తువ్వాల గట్టి 

పారవట్టి పనిజేస్తే

పడ్సు మొగోడు గూడ పన్కిరాడు

పార, పలుగు, కొడ్వలి చేతబట్టిందే 

ఐనా పెన్ను వట్టినోల్ల కంటే లగాంచి మాట్లాడుత- దబ్బున నాకు జరమత్తే

కడ్పుమీద తడిబట్టేసి పెయంత రుద్ది

ఫ్యాన్ దిరిగినట్టు తిరుగుద్ది 

నా మంచం సుట్టు’’

మనకెన్ని భాషలు వచ్చినా, అమ్మ పలుకులలోని ఆత్మీయత దేనికీ రాదు. కవి సందర్భోచితంగా తెలంగాణ పలుకుబడి లోని సౌందర్యాన్ని పట్టి చూపించాడు. ‘జననీ జన్మభూమశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అనే శ్లోకం తల్లి గొప్పతనాన్ని, తాను జన్మించిన భూమినీ ప్రశంసిస్తుంది. అందుకే ఈ శ్లోకం ఒక సూక్తిలా కూడా మారిపోయింది. కానీ, కవి గిన్నారపు ఆదినారాయణ తల్లడిల్లే తల్లి హృదయాన్ని కూడా పట్టుకున్నాడు. 


‘’ఆ కిటికి కోసం 

ఎన్నిసార్లు ఖరాఖండిగా

నేను అక్కడి నుండి లేవనని చెప్పానో 

ఎన్ని అబద్ధాలు ఆడానో 

అదే కిటికి కోసం 

ఎన్నిసార్లు బతిమాలానో 

ఇలా కిటికి ఒక మధురానుభూతి’’ 

ఈ కవిత సాధారణం లో అసాధారణతను గుర్తించు అనే సందేశాన్ని అందిస్తుంది.ఈ కవితలో సాధారణం లో అసాధారణత అనే భావనను జీవితంలోని భావోద్వేగాల వైకల్యాలను, వాటి సంక్లిష్టతను వ్యక్తీకరించే ఒక నది లాంటిది. కవితలో "కిటికి" అనేది ఒక సాధారణమైన భౌతిక వస్తువు కాదు, ఇది జ్ఞాపకాలు, కోరికలు, మరియు ఆశల సమ్మేళనానికి ప్రతీక. ఇది మానసిక స్థితి కు ప్రతిరూపం. సాధారణ వస్తువును అసాధారణంగా మార్చే కళను కావ్య సౌందర్యాత్మకత అంటారు. "కిటికి ఒక మధురానుభూతి" అనే వాక్యం, కవి జీవితంలోని సాధారణ అనుభవాలకు కొత్త ధ్రువాలను ఇవ్వగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ కవితలో "కిటికి" వ్యక్తి జీవితంలోని సాధారణ అనుభవాలకు అసాధారణ భావాన్ని జోడిస్తుంది. అదొక నోస్తాల్జియా. ఈ కవితలో పదార్థాల వ్యర్థతను అసాధారణతలోకి మార్చి భావోద్వేగాల విశిష్టతను వెలుగులోకి తీసుకురావడంగా కవి భావించాడు. అసాధారణత అనేది ప్రతిరోజు జీవనంలో, చిన్న చిన్న విషయాలపై మన హృదయస్పందనలను గుర్తించగల తత్వానికి సంబంధించినది. సౌందర్య తత్వం ప్రతిఫలించింది. ఇలాంటిదే మరొక కవిత. మనం చాలా సాధారణమైనట్లుబావించే వాటిలో అసాధారణమైన తాత్వికతను గుర్తించడం కవి గొప్పతనం. 


‘’డిసెంబర్ 31

జీవన గమనానికి 

అంచలంచెల 

ఆయుష్షు దించే మెట్టే తప్పా

 పెంచే మెట్టు కాదు.

….

….

నిన్నటి చీకటిని మర్చిపోయి 

రేపటి వెలుగును ఆస్వాదించడానికి 

ఎంతటి ఆరాటం 

పోరాటమై సాగుతుందో 

నిత్యం చూస్తూనే ఉన్నాం.’’ అన్నప్పుడు ఆదినారాయణ ఒక తాత్వికుడిలా కనిపిస్తాడు. 

మానవ జీవితంలో మార్పు, కాల చక్రం, మనసు నిరంతర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. డిసెంబర్ 31 అనే ఒక తేది, ఒక సంవత్సరానికి ముగింపు. కొత్త సంవత్సరానికి ఆరంభాన్ని సూచిస్తూ, సమయ తాత్వికతతో ముడిపడిన జీవన తాత్విక ప్రశ్నలను రేకెత్తిస్తుంది.

"అంచలంచెల ఆయుష్షు దించే మెట్టే తప్పా, పెంచే మెట్టు కాదు" అనేది మనిషి జీవితంలో సమయ సంక్షిప్తత కు ప్రతీక. కాలం అనేది కేవలం నశించేవాటిని తగ్గించడానికే ప్రయత్నిస్తుంది. కానీ, అదనంగా దేన్నీ పెంచదు. ఇది సమయ క్రమబద్ధత ను ప్రతిబింబిస్తుంది."నిన్నటి చీకటిని మర్చిపోయి రేపటి వెలుగును ఆస్వాదించడానికి" అనే వాక్యం, జ్ఞాపకాల తాత్వికత భవిష్యత్ ఆశల తాత్వికత మధ్య ఉన్న ద్వంద్వ సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. జ్ఞాపకాలు మన జీవితాన్ని నిర్మించే మార్గాలు, అయితే, భవిష్యత్ ఆశలు జీవన ఉత్సాహానికి దోహదం చేస్తాయి. దీన్ని స్మృతి భవిష్యత్ ఆశల మధ్యగల వ్యతిరేకతగా చెప్పుకోవచ్చు. మానవ ఆరాటం "ఎంతటి ఆరాటం పోరాటమై సాగుతుందో" అనే వాక్యం, మనిషి యొక్క అస్తిత్వ పోరాటం ను సూచిస్తుంది. ఇది జీవన పరిణామ క్రమంతో ముడిపడిన తన మనుగడ కోసం చేసే నిరంతర ప్రయత్నాన్ని ప్రతిపాదిస్తుంది.డిసెంబర్ 31 అనేది జీవన చక్రంలో ఒక ప్రతీక. ఇది ఒక ముగింపును సూచించినప్పటికీ, అదే సమయంలో పునఃప్రారంభానికి అవకాశాన్ని సృష్టిస్తుంది. ఇది చక్రాకార సమయ తాత్వికతకు సంకేతం. దీన్ని సంవత్సరాంతానికి ప్రతీకాత్మకతగా చెప్పుకోవచ్చు."రేపటి వెలుగును ఆస్వాదించడానికి" అనే భావం, ఆశావాద తత్వం యొక్క విభిన్న కోణాన్ని ప్రతిపాదిస్తుంది. కవిత భవిష్యత్ ఆశల వైపు దృష్టిని నిలిపి, జీవితంలో పునఃఆరంభాలు అర్థవంతమని సూచిస్తున్న ఆశావాద తత్వాన్ని చెప్పాడు కవి.

ఇలా ప్రతి కవితను వ్యాఖ్యానించుకుంటూ పోతే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. కవి గిన్నారపు ఆదినారాయణ మౌనంగా ఉంటాడు. మహా సముద్రం లాంటివాడు. ఆ సముద్రం ఎన్ని బడబాగ్నులను తనలో దాచుకుందో. అన్వేషిస్తే గాని తెలియదు. అతను కూడా అంతే. అతని వ్యక్తిత్వం కూడా అంతే. ఈమధ్య డాక్టర్ ఎన్. గోపి గారి కవిత్వాన్ని బాగా అధ్యయనం చేస్తున్నాడు. అది ఇతని కవిత్వంలో బాగా కనిపిస్తుంది. గోపిగారి గురించి కూడా దీనిలో ఒక గొప్ప కవితను రాశాడు. అయిన వ్యక్తిత్వాన్ని ఆయన రాసిన కవిత్వాన్ని ఆ కవితలో గొప్పగా ఆవిష్కరించాడు కవి. 


పేదరికం తారాస్థాయి ఎలా ఉంటుందో మరొక కవితలో చెబుతూ… 

‘’పాలు, పండ్లు, టిఫిన్లు 

మా ఇంటికి అతిథులయ్యాయంటే 

రోగం మా ఒంట్లో జేరినట్లు లెక్క 

రోజుతినే బువ్వకు సెలవిచ్చి 

ఇన్ని రకాల తిండి దొరుకుతుందంటే 

జరాన్ని ఎందుకు కోరుకోం మరి 

జరమొస్తనే గద దొరికేది 

మాకివ్వన్ని ఇంక నాల్రోజుల ఇట్లనే ఉంటె 

బాగుండు అనిపించేది’’ ఆరోగ్యం కోల్పోయినప్పుడు పేదవాళ్ళ జీవితాల్లో ఎదురయ్యే ప్రత్యేక పరిస్థితిని సూచిస్తుంది. నిత్యం అందుబాటులో లేని పౌష్టికాహారం, రోగ సమయంలో అందించినా, దాని వెనుక దారుణమైన అనుభవాల్ని కవి సూచిస్తున్నాడు. ఇది అనూహ్య తార్కికతకు ప్రతీక.

"ఇన్ని రకాల తిండి దొరుకుతుందంటే జరాన్ని ఎందుకు కోరుకోం మరి" అనడం ద్వారా సంతృప్తి, విచిత్ర ఆకాంక్షల ద్వంద్వాన్ని ఆవిష్కరిస్తుంది నాడు. రోగం కారణంగా దొరికే ప్రత్యేక సేవలు, ఇవన్నీ సాధారణ జీవితంలో దొరకడం అనుమానాస్పదమనే వ్యంగ్య స్వరాన్ని పలికిస్తున్నాడు కవి. "జరమొస్తనే గద దొరికేది" అనే వర్ణన మన జీవితంలోని ఐరనీ ఆఫ్ లైఫ్ ని ప్రతిపాదిస్తుంది. 

రోగం ద్వారా వచ్చే ప్రత్యేకతలను, కష్టాలపై ఉన్న వ్యంగ్య స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది అసాధారణ పరిస్థితుల్లో సహజ అనుభూతిఅనే సిద్ధాంతాన్ని చర్చిస్తుంది.

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ఇలాంటి వస్తువులే తీసుకొని కరుణ రసార్ధ్రంగా ఒక కథ రాశారు. పేదరికంతో బాధపడుతున్న ఒక అమ్మాయికి లారీ యాక్సిడెంట్ కావడం, ఆ సందర్భంగా అనేకమైన ఆహార పదార్థాలు వస్తూ ఉంటాయి. అందుకని ఆకలి వేసినప్పుడల్లా లారీ కింద పడిపోదామనుకుంటుంది. ఆ కథ విషాదాంతంగా, వాస్తవికతతో ముగిస్తుంది. ఆ కథ చదివిన తర్వాత పాఠకులు చాలా సేపు మామూలు మనుషులు కాలేరు. పేదరికం, వాస్తవిక అనుభవాలు రచయిత, కవులను ఒకే రకమైన వస్తువుతో రచనలను చేసేలా ప్రేరేపిస్తాయి. 

‘’కరోనా కాలంలో 

క్లాస్లూమ్ క్లాసులకు కత్తెరవేసి 

ఆన్లైన్ క్లాస్లకు ఆహ్వానం పల్కడం 

పురోగమనమో తిరోగమనమో కానీ 

బ్లాక్ బోర్డు మీదున్న ఫీలింగ్ స్క్రీన్ బోర్డులో లేదు’’

కరోనా కాలంలో జీవించిన కవి గాని, రచయితగాని దాన్ని స్పర్శించకుండా రచనలు కొనసాగించలేరు.కరోనా సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను కవి ఒక విద్యార్థిగా, ఒక అధ్యాపకుడిగా తన వాస్తవిక అనుభవాలను కవిత్వం చేశాడు. 

కవి డా.గిన్నారపు ఆదినారాయణ తన కవితా సంపుటికి పెట్టుకున్న పేరు ‘తొవ్వ నేర్పిన పాఠం’ పేరు తో ఒక కవిత రాశాడు. 

‘’ఆ తొవ్వను చూసినప్పుడల్లా

 ఆకాశంలో అందమైన చందమామను 

చూసినంత ఆనందం 

అందరు ఆ తొవ్వలో 

ముళ్ళుంటాయని 

చెప్పులు తొడుక్కొని నడిస్తే 

నేను అక్షరాలు తొడిగి నడిచాను.’’

ఈ కవితలో ఒక దళితుడు విద్యార్థిగా తనకు అంతకు ముందు అందని చందమామలా, అందని ద్రాక్షలా ఉన్న చదువుని తాను చదువుకోవాలని ఉంచుకున్నాడు. భారతీయ సామాజిక జీవన క్రమాన్ని, దళితుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుల్ని ఈ కవిత వర్ణిస్తుంది. ఆ క్రమంలో ఎదురైన అడ్డంకులను, అంతిమంగా సాధించిన విజయాల్ని కూడా చిత్రిస్తుంది. అది భారతదేశంలో కవి వ్యక్తిగత పోరాటం కాదు; తరతరాలుగా దళితులు చేసిన పోరాటానికి ఒక వ్యవస్థీకృత ప్రతీక. 'తొవ్వ' అనేది కేవలం ఒక భౌతిక వస్తువుగా కాకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ప్రతీకగా నిలుస్తుంది. అయినప్పటికీ, కవి ఈ సవాళ్లను అధిగమించి, దళితులు ఎలా విజయం సాధిస్తున్నారో ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఆదర్శనీయ దృక్పథంతో వర్ణించాడు.

ఒక వర్గం నుండి మరో వర్గానికి, ఒక స్థాయి నుండి మరో స్థాయికి వెళ్లే ప్రక్రియనే సామాజిక చలనశీలత అంటారు. భారతీయ దళితులు చదువుకొంటూ తమ సామాజిక స్థితిని మెరుగుపరచుకున్న పరిణామాలను వర్ణిస్తున్నాడు. 

'ముళ్ళుంటాయని చెప్పులు తొడుక్కొని నడిస్తే నేను అక్షరాలు తొడిగి నడిచాను' అనే వాక్యం సామాజిక వర్గాల మధ్య ఉన్న అంతరాన్ని, దాన్ని అధిగమించిన తెలివితేటలను చూపుతుంది. భారత రాజ్యాంగం అందించిన సమానత్వం అనే భావనను అందరికీ సమాన అవకాశాలు లభించాలనే ఆకాంక్షను తెలియజేస్తుంది. కవిత చివరిలో ఆకాశంలోని చంద్రునితో పోల్చడం ద్వారా ఆశావాదాన్ని ప్రదర్శిస్తుంది.

‘’ఆ తొవ్వలో అందరి ముఖాలు 

పౌడరేసుకొని మెరుస్తుంటే 

నాది మాత్రం

పరీక్షల్లో ఫస్టచ్చిన రోజే మెరిసేది. 

ఆ తోవ్వలో గాయాలు అందరికి 

శరీరానికి తాకితే

నాకు మాత్రం మనస్సుకు తాకేవి.’’

తొలి తరం దళితులు ఎదుర్కొనే భౌతిక, మానసిక సంఘర్షణలను ఇక్కడ కవి అద్భుతంగా వ్యక్తిగరించాడు. నేటికీ ప్రతిభావంతుడైన దళితుడు తాను ఏదైనా సాధించినప్పటికీ రిజర్వేషన్ తో మూడు పెట్టి చూడడమే తప్ప అతని ప్రతిభను గుర్తించని సమాజంలో ఉన్నాం. ఒక స్కూలులో విద్యార్థిగా చేరగానే, అతడు దళితుడు అని తెలియగానే తాను వేసుకునే బట్టలు, తినే ఆహారం, మాట్లాడే మాటలు అన్నింటిలోనూ ఈ మానసిక గాయాలను ఎదుర్కోకతప్పదు. 

పౌడర్ అనేది ముఖాన్ని అందంగా కనిపించేలా చేసే ఒక సామాజిక గుర్తింపులేదా బాహ్య ప్రదర్శనని సూచిస్తూ "ఆ తొవ్వలో అందరి ముఖాలు / పౌడరేసుకొని మెరుస్తుంటే" అని ఎంతో వ్యూహాత్మకంగా వర్ణించాడు. సామాన్యంగా, సమాజంలో మనం ఎలా కనిపిస్తున్నామో, మన ప్రతిష్ట ఎలాంటి ఉందో అనే దానిపై సామాజిక దృష్టి ఉంటుంది. సామాజిక అలవాట్లు అనేవి మానవుల ప్రవర్తనకు, వారిచ్చే మర్యాదలు, విజయాలపై ఆత్మ గౌరవం ఆధారపడుతుంది."నాది మాత్రం / పరీక్షల్లో ఫస్టచ్చిన రోజే మెరిసేది" అనడం ద్వారా ఎప్పుడన్నా, ఎవరైనా మెచ్చుకున్నా అది బాహ్య విజయంగానో, తాత్కాలిక గౌరవంగానో చూసే పరిస్థితిని తెలుపుతుంది. 

"ఆ తోవ్వలో గాయాలు అందరికి / శరీరానికి తాకితే/ నాకు మాత్రం మనస్సుకు తాకేవి" అని కవి అనడంలో తరతరాల దళితులు పడిన అవమానాలు, వాటి వల్ల మానసికంగా కుంగి పోవడాలను ఎన్నింటినో సూచిస్తుంది. మానసిక గాయాలుఅందరికీ స్పష్టంగా కనిపించవు. చేతన, అచేతన స్థితులు ఒకే కాలంలో సంభవించవచ్చు. ఇది ఇంటర్నల్ కంట్రాడిక్షన్ ని ప్రతిబింబిస్తుంది, ఎప్పుడు గమనించలేని బాధతో మనసు అశాంతిగా ఉంటుంది."నాకు మనస్సుకు తాకేవి" అనడం ద్వారా ఉపరితల సామాజిక గాయాలు కంటే ఆత్మ సంబంధ గాయాలు మరింత తీవ్రతను కలిగిస్తాయనేది భారతదేశంలో దళితులకు మాత్రమే తెలుస్తుంది. దాన్నిక్కడ ఎంతో శక్తివంతంగా ప్రయోగించాడు కవి. మొత్తం మీద ఈ కవితలో బాహ్య గాయాలు, అంతరంగ గాయాల మధ్య ఉన్న వ్యత్యాసంని చూపిస్తూ, సామాజిక సమీకరణలు, మానవ మానసిక స్థితి, ఆత్మగౌరవం గురించి తాత్త్వికంగా మాట్లాడుతున్నాడు కవి. కొన్ని భాగాలు కవి వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టినట్టుగా కూడా అనిపిస్తాయి. 

ఈ కవిత వస్తు పరంగాను, నిర్మాణ పరంగాను గొప్ప కవిత. ఇలాంటి కవితలు ఈ కవిత సంపుటిలో చాలా ఉన్నాయి. తన కూతురు గురించి వర్ణించిన ‘చిట్టితల్లి’ కవిత గాని, మట్టి మనిషి నాన్న, వారసత్వం వంటివన్ని అద్భుతమైన కవితలు. వీటితోపాటు దండోరా ఉద్యమం, తాను చదివి ఉద్యమాలలో తిరిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్, పారిశుద్ధ్య కార్మికులు ఇలా అనేక కవితలు ఈ కవి ప్రగతిశీలతను తెలియజేస్తాయి. సాధారణమైన పదాలతో అసాధారణమైన కవిత్వాన్ని చేయడం ఎలాగో ఆదినారాయణ తెలుసుకున్నాడు. పూర్వ కవులు వాడిన పదాలను తాను సాధ్యమైనంత వరకు తన కవిత్వంలో వదల్చుకుంటే తనదైన ముద్ర ఏర్పడుతుందనేది కూడా గమనించాలి. ఒక ఆత్మీయ స్పర్శ, ఒక సామాజిక ఉద్యమ కెరటం, సమకాలిన సమాజ ప్రతిబింబంగా ఈ కవితా సంపుటిని తీసుకొస్తున్న ఆదినారాయణకు కవిత్వం ఒక కళ, ఒక జీవిత వాస్తవికత.

(ప్రభంజనం దినపత్రిక, 14.8.2026 సౌజన్యంతో)