ఒక్క పచ్చని మొక్క చాలు!!
ఎక్కడ మొదలైందని నన్ను అడగకు,
ఏ పర్వతపు గుండెలో
ఏ మంచు బిందువు కరిగిందో
నాకూ గుర్తులేదు!
నేను ఒక ప్రవాహాన్ని,
నాలో ఎన్నో వాగులున్నాయి,
ఎన్నో కన్నీటి చారికలున్నాయి,
ఎన్నో నేలల జ్ఞాపకాలున్నాయి!
నాకు సముద్రం మీద మమకారం ఉంది,
అయినా సముద్రంలో కలిసిపోవాలని తొందరలేదు!
నా ఉనికిని కోల్పోవడం కంటే
నా ప్రయాణాన్ని విస్తరించడం ఇష్టం!
ఎదురుగా కొండ అడ్డొస్తే
దాని చుట్టూ తిరుగుతాను,
రాయి ఎదురైతే
దాని పక్కనుంచి జారుకుంటాను,
లోయ ఎదురైతే
జలపాతమై దూకుతాను!
నన్ను ఆపాలని చూసిన ప్రతిచోట
నా ఉనికికి మరో రూపం పుడుతుంది!
నేను దాచుకున్న సంపద
నా అడుగుజాడల్లో లేదు,
నేను తాకిన నేలల్లో ఉంది!
నాతో నడిచిన చెట్లు
నా నీడను గుర్తుపెట్టుకుంటాయి,
నా నీటిని తాగిన పక్షులు
నా పేరుతో పాటలు పాడతాయి!
నాకు వారసత్వంగా
ఆస్తులు అక్కర్లేదు,
నా దారిలో మొలిచిన
ఒక్క పచ్చని మొక్క చాలు!
నిన్నటి ఒడ్డును
వెనక్కి తిరిగి చూడను,
రేపటి సముద్రాన్ని
ముందుగానే సొంతం చేసుకోను!
ప్రతి మలుపులో
నన్ను నేను కొత్తగా కనుక్కుంటాను,
ప్రతి ప్రయాణంలో
నాలోని తెలియని ప్రపంచాన్ని పలకరిస్తాను!
నాకు చిరునామా లేదు,
నా ఉనికికి సరిహద్దులు లేవు,
నన్ను కొలవడానికి
ఏ తీరం దగ్గరా కొలబద్ద లేదు!
నేను ఎవరి సొత్తునీ కాను,
ఎవరి దారిలోనూ బందీని కాను!
నేను ఒక ప్రవాహాన్ని,
నాలో ప్రయాణమే పరిచయం,
స్వేచ్ఛే నా సహచరి,
అనుభవమే నా సంపద!
నేను చేరే చోటు నా గమ్యం కాదు,
నేను ప్రవహించినంత కాలం
ఈ భూమి మీద
నాదొక జీవన సంతకం!!
— దార్ల వెంకటేశ్వరరావు 6.9.2018
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి