ప్రయాణంలో మిగిలేది
ఒకప్పుడు
నా పక్కన ఎంతమంది ఉన్నారని
లెక్కపెట్టుకునేవాడిని.
ఇప్పుడు
నాతో ఎవరు నడుస్తున్నారని కాదు,
నా నడకకు ఎవరి అడుగులైనా
అడ్డం పడుతున్నాయా అని
గమనిస్తున్నాను.
జీవితం
మనుషుల్ని పరిచయం చేస్తుంది,
కొంతకాలం మన పక్కన కూర్చోబెడుతుంది,
మరికొంతకాలానికి
వాళ్ల జ్ఞాపకాల్ని మన చేతుల్లో పెట్టి
తన దారిన తాను వెళ్లిపోతుంది.
కొన్ని పరిచయాలు
తలుపు తట్టకుండానే వస్తాయి,
ఇల్లు తమదైనట్టు సందడి చేస్తాయి,
వెళ్లిపోయాకే తెలుస్తుంది
మనసులో ఒక గది
వాటి పేరుమీద ఉందని!
కాలం
ఎవరి ముఖాన్నీ మార్చకపోవచ్చు,
మనకు కనిపించే మనుషుల్ని మాత్రం
మార్చి చూపిస్తుంది.
నిన్నటి ఆత్మీయత
ఈరోజు అపరిచితంగా పలకరిస్తుంది,
నిన్నటి అపరిచితం
ఈరోజు మన కన్నీటిని
తన చేతులతో తుడుస్తుంది.
జీవితం నేర్పే పాఠాలన్నీ
పుస్తకాల్లో దొరకవు;
కొన్ని మనుషుల దగ్గర నేర్చుకుంటాం,
కొన్ని వాళ్లు వెళ్లిపోయాక నేర్చుకుంటాం,
మరికొన్ని
మనమే ఎవరికో దూరమైనప్పుడు
అర్థమవుతాయి.
ఇప్పుడు
నా పక్కన ఎంతమంది ఉన్నారని
ఆలోచించడం మానేశాను.
ఎవరితో ఉన్నప్పుడు
నాలోని నేను
నాతోనే ఉంటున్నానో,
ఎవరిని కలిసినప్పుడు
నా మనసుకు నటించాల్సిన అవసరం
కలగడం లేదో,
వాళ్లతో గడిచిన క్షణాలనే
జీవితపు నిజమైన సంపదగా
దాచుకుంటున్నాను.
ఎందుకంటే
చివరకు మనిషి వెంట
మనుషులంతా రారు,
వాళ్లతో గడిపిన అనుభవాలు వస్తాయి;
ఆస్తులన్నీ వెంట రాకపోయినా
ఒకరి జీవితంలో
మనమొదిలిన మంచితనం
మరో హృదయంలో వెలుగవుతుంది.
అందుకే
ఎవరైనా కలిసినప్పుడు
వాళ్లతో ఒక దారి నడవాలి,
విడిపోయేటప్పుడు
వాళ్ల దారికి ఒక దీపం వెలిగించాలి.
మనతోనే ఉండాలని
ఎవరినీ బంధించకూడదు,
మన వల్ల బాధపడుతూ
ఎవరూ ఉండాల్సిన పరిస్థితి
కల్పించకూడదు.
జీవితం
ఎవరు చివరివరకు మనతో ఉంటారో
చెప్పే ప్రయాణం కాదు;
మనతో ఉన్నంతకాలం
ఎవరి జీవితంలో ఎంత వెలుగు నింపామో
తెలిపే ప్రయాణం!
చివరికి
మనిషి వెళ్లిపోయినా
అతను పంచిన ప్రేమ
మరో మనిషి ప్రవర్తనలో బతికుంటే
అదే అతని జీవితానికి
నిశ్శబ్ద చిరునామా!
…
మనిషి వెళ్లిపోయాక
అతని కుర్చీ ఖాళీ అవుతుంది,
అతను నడిచిన దారి
అతని అడుగుల్ని మర్చిపోతుంది,
అతను తెరిచిన తలుపులు
మరో చేతి స్పర్శ కోసం ఎదురుచూస్తాయి.
ఒక్కోసారి
అతను వాడిన వస్తువులే
అతని ఉనికిని గుర్తుచేస్తుంటాయి
మడతలు పడిన పాత చొక్కా
పేజీ మధ్యలో ఆగిపోయిన పుస్తకం
తాగకుండా వదిలేసిన కాఫీ కప్పు
వాటిని చూస్తుంటే
కాలం ఎంత ముందుకు వెళ్లినా
కొన్ని క్షణాలు
అక్కడే ఉండిపోతాయని అనిపిస్తుంది.
మనుషులు వెళ్లిపోతారు,
వాళ్లతో పాటు
మనలోని కొన్ని అలవాట్లూ వెళ్లిపోతాయి
వాళ్ల కోసం
ఎదురుచూసే కళ్లు,
వాళ్ల గొంతు వినాలని చూసే చెవులు,
వాళ్లు వస్తే చెప్పాలనుకున్న సంగతులు
ఒక్కొక్కటిగా నిశ్శబ్దంలో కలిసిపోతాయి.
అయినా జీవితం
ఖాళీని చూసి ఆగిపోదు,
విరిగిన చోటే
మరో అనుభవానికి చోటిస్తుంది
ఎండిన కొమ్మ చివర
చిగురు తొంగిచూసినట్టు
నిరాశ మధ్యలో
చిన్న ఆశ మొలకెత్తుతుంది.
నిన్న
మనల్ని వదిలి వెళ్లినవాళ్లను
తలచుకుంటూ ఉండగానే
ఈరోజు ఎవరో మన కోసం తలుపు తడతారు
మన బాధ గురించి అడుగుతారు,
మన మౌనాన్ని చదువుతారు,
మనసు విప్పుకునేందుకు ఒక చిన్న చోటిస్తారు.
అప్పుడు తెలుస్తుంది
జీవితం మనకు ఇచ్చినవాళ్లను
తిరిగి ఇవ్వకపోవచ్చు,
వాళ్లు నేర్పిన ప్రేమను మాత్రం
మరో మనిషికి అందించే
అవకాశాన్ని ప్రతిరోజూ ఇస్తుందని!
అందుకే ఎవరినైనా కలిసినప్పుడు
వాళ్ల రేపటిని అడగాలి,
వాళ్ల నిన్నటిని వినాలి,
వాళ్ల ఈరోజుకు మన వంతు తోడుగా నిలవాలి.
ప్రతి మనిషి నవ్వు వెనుక
మనకు తెలియని కథ ఉంటుంది
ప్రతి మౌనం వెనుక
చెప్పుకోలేని బాధ ఉంటుంది
ప్రతి ప్రయాణం వెనుక
ఎవరో ఒకరి జ్ఞాపకం నడుస్తూనే ఉంటుంది.
మనిషిని అర్థం చేసుకోవడం అంటే
అతని మాటల్ని వినడం మాత్రమే కాదు
అతను చెప్పలేకపోయిన
బాధకు మనసులో చోటివ్వడం కూడా!
మనతో నడిచేవాళ్లందరూ
మన గమ్యానికి చేరకపోవచ్చు,
మన గమ్యాన్ని చేరినవాళ్లందరూ
మనతో మొదలైనవాళ్లు కాకపోవచ్చు
అయినా ప్రతి పరిచయం
మనలో ఏదో ఒక మార్పును వదిలి వెళ్తుంది,
ప్రతి వీడ్కోలు మనలో
ఏదో ఒక అవగాహనను మిగులుస్తుంది.
చివరకు జీవితం
వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు
ఎన్ని అడుగులు వేశామన్నది
గొప్ప లెక్క అనిపించదు
ఎన్ని హృదయాలకు
మన అడుగుల శబ్దం
ఆశను కలిగించిందన్నదే
అసలైన లెక్కగా మిగులుతుంది.
మనిషి జీవితం
ఒకరోజు ముగిసిపోవచ్చు,
అతని మాటలు కాలంతో మసకబారవచ్చు,
అతని రూపం
జ్ఞాపకాలలో కలిసిపోవచ్చు
అయితే,
తన వల్ల మరో మనిషి
కొంచెం ధైర్యంగా బతకగలిగితే,
కొంచెం ప్రేమగా ఆలోచించగలిగితే,
కొంచెం మానవీయంగా మారగలిగితే
అతని ప్రయాణం
అక్కడితో ముగిసిపోనట్టు కాదు
మరో మనిషి జీవితంలో కొనసాగుతున్నట్టే!
— దార్ల వెంకటేశ్వరరావు
24.10.2026.
సిటిజన్ ఆసుపత్రి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి