భారతీయ సాహిత్యంలో ‘వాల్మీకి - రామాయణం’
(నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 25.10.2026 సౌజన్యంతో )
భారతీయ సాహిత్య చరిత్రలో మహర్షి వాల్మీకి స్థానం అత్యంత విశిష్టమైనది. సంస్కృతంలో మొట్టమొదటి కావ్యాన్ని సృష్టించి, భారతీయ కావ్య పరంపరకు అంకురార్పణ చేసిన మహానుభావుడు. వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర, ఆయన ఆధ్యాత్మిక పరివర్తన, ఆయన రచనలు భారతీయ సాహిత్యంపై ఆయన చూపిన ప్రభావం అనన్యసామాన్యమైంది. వాల్మీకి మహర్షి పూర్వ జీవితం గురించి పురాణాలలో పౌరాణిక గాథలలో విపులంగా ప్రస్తావించబడింది.వాల్మీకి తన పూర్వాశ్రమంలో 'రత్నాకరుడు' అనే పేరుతో పిలువబడేవారు. కొందరు పౌరాణిక కథనాల ప్రకారం ఆయన వేటగాళ్ల కుటుంబంలో పెరిగారని, జీవనం కోసం అడవి దారిలో వెళ్లే ప్రయాణికులను దోచుకునేవారని ప్రతీతి.
ఒకసారి ఆ దారిన వెళుతున్న నారద మహర్షిని రత్నాకరుడు దోచుకోవడానికి ప్రయత్నించగా, నారదుడు ఆయనలో పరివర్తన తెచ్చేందుకు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. "నీవు చేస్తున్న ఈ పాప కార్యంలో నీ భార్యాపిల్లలు భాగస్వాములు అవుతారా?" అని ప్రశ్నించగా, రత్నాకరుడు ఇంటికి వెళ్లి తన కుటుంబాన్ని అడుగుతాడు. ఎవరికీ ఆ పాపంలో భాగం తీసుకోవడం ఇష్టం లేదని తేలిన తర్వాత ఆయన కళ్లు తెరుచుకుంటాయి. పశ్చాత్తాపంతో కుమిలిపోయిన రత్నాకరుడికి నారదుడు 'రామ' నామాన్ని ఉపదేశిస్తారు. పాపపు సంస్కారాల వల్ల 'రామ' అనలేని ఆయనకు, ఆ పదాన్ని తిరగేసి 'మర-మర' అని జపించమంటారు. అలా నిరంతరం 'మర' జపిస్తూ, కాలక్రమేణా అదే 'రామ' నామంగా మారిపోతుంది. ఆయన ఏళ్ల తరబడి కదలకుండా తపస్సు చేయడంతో శరీరంపై పుట్టలు (వల్మీకం) కమ్ముకుంటాయి. ఆ పుట్టలను బద్దలు చేసుకుని బయటకు రావడంతో ఆయనకు 'వాల్మీకి' అనే పేరు స్థిరపడింది.
వాల్మీకి మహర్షి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు తమసా నదీ తీరంలో చోటు చేసుకుంది. ఒకరోజు ఆయన తమసా నదీ తీరంలో విహరిస్తుండగా, ఒక జంట క్రౌంచ పక్షులలో (క్రౌంచ మిధునం) మగ పక్షిని ఒక బోయవాడు బాణంతో కొట్టి చంపుతాడు. ఆ ఆడ పక్షి పడే వేదనను, రోదనను చూసి వాల్మీకి హృదయం ద్రవించిపోతుంది. ఆ కరుణ, ఆగ్రహం కలగలిసి ఆయన నోటివెంట అప్రయత్నంగా ఒక శ్లోకం వెలువడుతుంది.
మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీః సమాః | యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితమ్ ||
(ఓ బోయవాడా! కామమోహితమైన క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని చంపిన నీకు ఎప్పటికీ శాశ్వత ప్రతిష్ట లభించదు గాక!) ఛందోబద్ధంగా, కరుణ రస ప్రధానంగా వెలువడిన ఈ శ్లోకమే సంస్కృత సాహిత్యానికి 'ఆది శ్లోకం' అయింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఇదే ఛందస్సులో శ్రీరామచంద్రుని చరిత్రను లోకానికి అందించమని వాల్మీకిని ఆదేశిస్తాడు. అలా రామాయణ రచనకు శ్రీకారం చుట్టబడింది.
వాల్మీకి రామాయణం:
వాల్మీకి మహర్షి రచించిన 'శ్రీమద్ రామాయణం' ప్రపంచ సాహిత్యానికే తలమానికమైన గ్రంథం.ఇది 24 వేల శ్లోకాలతో కూడుకుని, ఆరు కాండలుగా (బాల, అయోధ్యా, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలు) తరువాత ఉత్తర కాండతో కలిపి మొత్తం ఏడు కాండలుగా విభజింపబడింది. మానవ సంబంధాలు, పితృవాక్య పాలన, భ్రాతృప్రేమ, ధర్మనిష్ఠ, ఆదర్శ కుటుంబ వ్యవస్థకు రామాయణం ప్రతీకగా నిలిచింది. రావణునిపై రాముని విజయం ధర్మానికి అధర్మంపై లభించిన శాశ్వత విజయంగా నిరూపించబడింది.యోగవాసిష్టం, లఘువాసిష్టం వంటి తత్వశాస్త్ర గ్రంథాలు కూడా వాల్మీకి మహర్షి ద్వారానే ప్రవచించబడినట్లు సంస్కృత సంప్రదాయం చెబుతుంది.
1. బాలకాండలో రాముని జననం, బాల్యం, విశ్వామిత్రునితో ప్రయాణం, తాటక వధ, అహల్య కథ, సీతాస్వయంవరం, సీతారాముల వివాహం ఇందులో ప్రధాన ఘట్టాలు. రాముని వ్యక్తిత్వ నిర్మాణానికి ఈ కాండ పునాది వేస్తుంది.
2. అయోధ్యాకాండలో దశరథుని వరప్రదానం, కైకేయి కోరికలు, రాముని వనవాసం, భరతుని సోదరభక్తి ప్రధానాంశాలు. అధికారం, వాగ్దానం, కుటుంబ బాధ్యత, త్యాగం వంటి అంశాలు ఇందులో సంఘర్షణలుగా కనిపిస్తాయి.
3. అరణ్యకాండలో అరణ్యవాసం, శూర్పణఖ ఘట్టం, మారీచుని మాయలేడి, సీతాపహరణం, జటాయువు పోరాటం ఇందులోని ముఖ్య సంఘటనలు. అరణ్యం కథలో ప్రకృతి ప్రదేశంగానే కాకుండా ప్రమాదం, అనిశ్చితి, నైతిక పరీక్షల వేదికగా నిలుస్తుంది.
4. కిష్కింధాకాండలోరామసుగ్రీవుల స్నేహం, వాలి వధ, సీతాన్వేషణ కోసం వానరసేనల పంపకం ఇందులో ప్రధాన ఘట్టాలు. స్నేహం, రాజ్యాధికారం, కూటమి, న్యాయం వంటి అంశాలను ఈ కాండ చర్చకు తెస్తుంది.
5.సుందరకాండలో హనుమంతుని సముద్ర లంఘనం, లంకలో సీతాన్వేషణ, అశోకవనంలో సీతను కలుసుకోవడం, లంకాదహనం ఇందులో ముఖ్య ఘట్టాలు. హనుమంతుని ధైర్యం, బుద్ధి, కార్యదీక్ష ఈ కాండకు ప్రత్యేక ఆకర్షణ.
6. యుద్ధకాండలో సముద్రంపై వారధి నిర్మాణం, లంకాయుద్ధం, రావణవధ, సీతను తిరిగి పొందడం, అయోధ్యకు రాముని పునరాగమనం, పట్టాభిషేకం ఈ కాండలోని ప్రధాన ఘట్టాలు.
7. ఉత్తరకాండలోసీతను అడవికి పంపడం, వాల్మీకి ఆశ్రమంలో లవకుశుల పెంపకం, వారు రామాయణాన్ని గానం చేయడం, సీత భూదేవిలోకి ప్రవేశించడం వంటి సంఘటనలు ఇందులో ఉంటాయి. రాజధర్మం, ప్రజాభిప్రాయం, స్త్రీ గౌరవం, కుటుంబ విషాదం వంటి ప్రశ్నలకు ఈ కాండ ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది.
ఈ ఏడు కాండలు రామాయణ కథను వరుస సంఘటనల సమాహారంగా మాత్రమే కాకుండా, వ్యక్తిగత జీవితం నుంచి రాజ్యపాలన వరకు విస్తరించే సామాజిక కథనంగా తీర్చిదిద్దుతాయి. అయితే, ఏడు కాండలూ ఒకే సమయంలో రూపుదిద్దుకున్నాయని నిర్థారించలేమనే పరిశోధకులు ఉన్నారు. రామాయణం పూర్తయ్యే కాలక్రమేణా జరిగిన విస్తరణ, పాఠాంతరాల పరిశీలన చేయడం ముఖ్యం.
వాల్మీకిపై వచ్చిన రచనలు:
భారతీయ సాహిత్యంలో వాల్మీకి కవులందరికీ ఆరాధ్య దైవం. ఆయనపైన, ఆయన రామాయణం ఆధారంగానూ అనేక గ్రంథాలు రూపుదిద్దుకున్నాయి.సంస్కృత సాహిత్యంలో మహాకవి కాళిదాసు, భవభూతి, భారవి వంటి ప్రాచీన కవులు తమ గ్రంథాలలో వాల్మీకిని 'ఆది కవి'గా స్మరించుకున్నారు. భవభూతి తన 'ఉత్తర రామచరితం' నాటకంలో వాల్మీకిని ఒక పాత్రగా తీర్చిదిద్ది, లవకుశులకు ఆశ్రయమిచ్చి విద్యాబుద్ధులు నేర్పిన గురువుగా గొప్పగా కీర్తించారు. అశ్వఘోషుడు, భరతుడు వంటి వారు వాల్మీకి రామాయణ శిల్పాన్ని తమ రచనలకు పునాదిగా చేసుకున్నారు.
వాల్మీకి జీవితం -కోర్టు వివాదాలు:
వాల్మీకి మహర్షి పూర్వాశ్రమంలో దొంగ, దారి దోపిడీదారుడనే ప్రచారానికి ఎలాంటి చారిత్రక, ప్రామాణిక ఆధారాలు లేవు. ఇలపావులూరి పాండురంగారావు గారు తమ రచనలలో స్పష్టం చేసినట్లుగా, శాస్త్రీయ దృక్పథం, రసజ్ఞత గలిన మహానుభావుడిపై ఇటువంటి కట్టుకథలు ప్రచారంలోకి రావడం ఆయనను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమేనని వివరించారు. పంజాబ్, హరియానా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో (డాక్టర్ సహదేవ నేతృత్వంలో) జరిగిన పరిశోధనలు, న్యాయస్థానపు తీర్పులు కూడా వాల్మీకి మహర్షిని కించపరిచేలా లేదా దొంగగా చిత్రీకరించే ప్రచారాలు నిరాధారమైనవని స్పష్టం చేస్తున్నాయి.
శ్రీమద్భాగవతం (చతుర్థ స్కంధం) ప్రకారం, ప్రచేతసుల వంశంలో, క్షత్రియ కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి గురించి కొంతమంది వివరిస్తున్నారు. కానీ, బోయ జాతికి చెందిన వ్యక్తిగానే వాల్మీకి మహర్షి నేటికీ ప్రాచుర్యంలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం వృత్తి కావొచ్చు. భారతదేశ వ్యాప్తంగా వాల్మీకి కులం కొన్ని చోట్ల గిరిజన తెగలకు, మరికొన్ని చోట్ల షెడ్యూల్డు కులం, ఇంకొన్ని చోట్ల వెనుకబడిన తరగతులకు చెందిన సామాజిక వర్గంగా గుర్తింపు పొందారు.
నారద మహర్షి ఉపదేశంతో, తరతరాల భక్తి విశ్వాసాలతో వారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి చేరుకున్నారు. వాల్మీకి పేరుతో మరికొందరు వ్యక్తులు (రత్నాకరుడు, అగ్నిశర్మ వంటి పేర్లతో) ఉండి ఉండవచ్చని, వారిని ఈ మహర్షిగా పొరబడటం వల్లే ఇటువంటి వదంతులు పుట్టుకొచ్చాయని పరిశోధకులు భావిస్తున్నారు. కేవలం 'శ్రీమద్ రామాయణం' మాత్రమే కాకుండా, శ్రీరాముని బాల్యంలో మానసిక అశాంతిని తొలగించడానికి వశిష్టుల ద్వారా బోధింపబడిన 'యోగవాశిష్టం', నిత్య పారాయణీయమైన 'ఆదిత్య హృదయం', సమస్త విజ్ఞాన సర్వస్వమైన 'అక్షరలక్ష' వంటి గ్రంథాలను అందించిన మహాజ్ఞాని వాల్మీకి. రాముడిని ఒక ఆదర్శ పురుషుడిగా లోకానికి పరిచయం చేయడమే తన ధ్యేయంగా భావించిన ఆదికవి, తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు.
నారదుడు చెప్పిన ఆదర్శ మానవుని కథ:
బాలకాండ ప్రారంభంలో వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. సత్యవంతుడు, ధర్మజ్ఞుడు, ధైర్యశాలి, కృతజ్ఞుడు, ప్రజాహితాన్ని కోరేవాడు, ఆత్మనిగ్రహం కలిగినవాడు అయిన ఉత్తమ మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? అని అడిగితే నారదుడు రాముని గురించి వివరిస్తాడు. ఈ కథనంలో రాముడు ఒక వ్యక్తిగానే కాకుండా, మానవ ప్రవర్తనకు సంబంధించిన విలువలను పరిశీలించడానికి ఉపయోగపడే పాత్రగా రూపుదిద్దుకుంటాడు. ఆదర్శ మానవుని లక్షణాలను ప్రశ్నించడం ద్వారా మహాకావ్యం ప్రారంభం కావడం విశేషం.
అహల్య కథ
విశ్వామిత్రునితో రామలక్ష్మణులు ప్రయాణిస్తున్నప్పుడు అహల్య కథ ఎదురవుతుంది. గౌతమ మహర్షి శాపం, అహల్య స్థితి, రాముని రాకతో ఆమెకు విముక్తి లభించడం ఈ కథలోని ప్రధాన అంశాలు.అహల్య కథను కేవలం శాపవిమోచన కథగా మాత్రమే కాకుండా, స్త్రీపై విధించబడిన సామాజిక నియమాలు, పాపం–శిక్ష భావనలు, విముక్తి వంటి ప్రశ్నలతో కూడా పరిశీలించవచ్చు. వివిధ రామాయణ సంప్రదాయాల్లో అహల్య కథకు భిన్నమైన రూపాలు కనిపిస్తాయి.
భరతుని పాత్ర
రాముడు వనవాసానికి వెళ్లిన తర్వాత భరతుడు రాజ్యాన్ని స్వీకరించడానికి నిరాకరించి, రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి పాలన నిర్వహిస్తాడు.ఈ ఘట్టం సోదరప్రేమకు సంబంధించిన కథ మాత్రమే కాదు. రాజ్యాధికారం ఎవరికి చెందాలి? వ్యక్తిగత ప్రయోజనం కంటే నైతిక బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వగలమా? అనే ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. భరతుని పాత్ర ద్వారా వాల్మీకి అధికారం పట్ల నిగ్రహం, కుటుంబ సంబంధాల్లో నిబద్ధత, బాధ్యతాయుతమైన పాలన వంటి విలువలను కథలో భాగం చేస్తాడు.
శబరి కథ
అరణ్యకాండలో శబరి రాముని కోసం ఎదురుచూస్తూ, తన భక్తితో ఆయనను ఆహ్వానిస్తుంది. ఈ ఘట్టం భక్తి సాహిత్యంలో విశేష ప్రాచుర్యం పొందింది. శబరి కథను సామాజిక దృష్టితో పరిశీలించినప్పుడు, రాజకుమారుడైన రామునికి అరణ్యంలో నివసించే ఒక ఆదివాసి లేదా గిరిజన స్త్రీ ఆతిథ్యం ఇవ్వడం, ఆమె భక్తికి కథలో లభించిన ప్రాధాన్యం వంటి అంశాలు కనిపిస్తాయి. అయితే, శబరి సామాజిక గుర్తింపు, ఆమె గురించి చెప్పబడే అనేక వివరాలు వివిధ రామాయణ పాఠాలు, తరువాతి భక్తి సంప్రదాయాల్లో వేర్వేరుగా రూపుదిద్దుకున్నాయని గుర్తించాలి. అలా ఆ యా పాత్రలను తీర్చిదిద్దడంలో ఎంతో వ్యూహం కూడా ఉండి ఉండవచ్చు.
వాలి వధ
కిష్కింధాకాండలో రాముడు చెట్టు చాటునుంచి వాలిని బాణంతో సంహరిస్తాడు. దీనిపై వాలి రాముడిని ప్రశ్నిస్తాడు. రాముడు తన చర్యకు ధర్మపరమైన వివరణ ఇస్తాడు. ఈ సంఘటన రామాయణంలోని ముఖ్యమైన నైతిక సంఘర్షణల్లో ఒకటి. రాజధర్మం, వ్యక్తిగత న్యాయం, యుద్ధ నియమాలు, శిక్ష విధించే అధికారం వంటి అంశాలపై చర్చకు ఇది అవకాశం కల్పిస్తుంది. వాలిని సంహరించిన రాముడి చర్యను సంప్రదాయ ధర్మవాదంతో సమర్థించే వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆధునిక విమర్శనాత్మక అధ్యయనాలు ఆ చర్యలోని నైతిక సందిగ్ధతను ముందుకు తెస్తాయి. ఈ రెండు దృక్కోణాలనూ పరిశీలించడం సాహిత్య విమర్శ, పరిశోధనలకు ఎంతో అవసరం.
సీతాపహరణం, హనుమంతుని అన్వేషణ
సీతాపహరణం కథలో కీలక మలుపు. సీతను వెతుకుతూ రాముడు వివిధ ప్రాంతాల్లో ప్రయాణిస్తాడు. హనుమంతుడు లంకకు చేరి సీతను గుర్తించడం, ఆమెకు రాముని సందేశం అందించడం, తిరిగి వచ్చి సమాచారాన్ని నివేదించడం కథను యుద్ధం వైపు నడిపిస్తాయి.ఈ కథనంలో వియోగం, ఆశ, నమ్మకం, కార్యదక్షత, సమాచార ప్రసారం వంటి అంశాలు పరస్పరం కలుస్తాయి. సుందరకాండలో హనుమంతుని పాత్ర కథాగమనాన్ని ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా నిలుస్తుంది.
సీత అగ్నిప్రవేశ ఘట్టం
యుద్ధకాండలో రావణవధ తర్వాత సీత పవిత్రతకు సంబంధించిన ప్రశ్న కథలోకి వస్తుంది. సీత అగ్నిలో ప్రవేశించే ఘట్టం భారతీయ సాహిత్యంలో విస్తృతమైన చర్చలకు కారణమైంది. ఈ ఘట్టాన్ని సంప్రదాయ వ్యాఖ్యానాలు సీత పవిత్రతకు దైవికమైన సాక్ష్యంగా అర్థం చేసుకుంటాయి. స్త్రీవాద, ఆధునిక విమర్శనాత్మక దృష్టి మాత్రం స్త్రీపై విధించబడే ఆంక్షలను, పురుషాధిక్య సామాజిక నియమాలను, సమాజంలలో స్త్రీకున్న అస్తిత్వం, గౌరవాలను చర్చకు తీసుకొస్తాయి. ఇక్కడ సీతను కేవలం పరీక్షకు గురైన పాత్రగా మాత్రమే కాకుండా, తన గౌరవం గురించి స్పష్టమైన వైఖరి ప్రకటించే వ్యక్తిగా కూడా చదవవచ్చు.
లవకుశుల కథ, సీత వనవాసం
ఉత్తరకాండలో ప్రజల అపవాదుల నేపథ్యంలో రాముడు సీతను అడవికి పంపుతాడు. వాల్మీకి ఆశ్రమంలో సీత లవకుశులకు జన్మనిస్తుంది. వారు పెరిగి రామాయణాన్ని గానం చేస్తారు. రాముడు తన కుమారుల ద్వారా తన జీవితకథను తిరిగి వింటాడు.ఈ కథనంలో ఒక విశేషమైన సాహిత్య నిర్మాణం కనిపిస్తుంది. కథానాయకుడి జీవితమే అతని ముందు గానరూపంలో కథగా తిరిగి ప్రత్యక్షమవుతుంది. అదే సమయంలో సీత అనుభవించిన అన్యాయం, రాజధర్మం పేరుతో వ్యక్తిగత జీవితంపై పడిన భారం, ప్రజాభిప్రాయానికి పాలకుడు ఇచ్చే ప్రాధాన్యం వంటి అంశాలను ఈ ఘట్టం ద్వారా విమర్శనాత్మకంగా పరిశీలించడానికి వీలుంది. అయితే, ఉత్తరకాండ, ఇతర కాండలతో దాని సంబంధం గురించి పండితుల మధ్య ఏకాభిప్రాయం లేదు.
భారతీయ సాహిత్యంలో వాల్మీకి ప్రభావం:
వాల్మీకి రామాయణం భారతీయ సాహిత్యానికి ఒక ప్రధాన కథా మూలంగా నిలిచింది. అనేక భాషలు, మత సంప్రదాయాలు, ప్రాంతీయ సంస్కృతులు ఈ కథను తమ అవసరాలకు అనుగుణంగా పునర్నిర్మించుకున్నాయి. పరిశోధనల్లో వందలాది రామాయణ రూపాలు గుర్తించబడ్డాయి. వాల్మీకి రామాయణం తరువాతి సంస్కృత కవిత్వం, నాటక సాహిత్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. కాళిదాసు రచించిన రఘువంశం, అభిజ్ఞానశాకుంతలం వంటి రచనల్లో రామకథకు సంబంధించిన సంప్రదాయాలు, పాత్రలతో పోల్చి పరిశీలించదగిన కావ్య నిర్మాణాలు కనిపిస్తాయి. భవభూతి రచించిన మహావీరచరితం, ఉత్తరరామచరితం రామకథను నాటకరూపంలో పునర్నిర్మించిన ముఖ్యమైన రచనలు.
భారతీయ సాహిత్య మూలస్తంభమైన వాల్మీకి రామాయణ ప్రభావం తెలుగు సాహిత్యంపై అత్యంత గాఢంగా కనిపిస్తుంది. తెలుగులో రామకథ వివిధ ప్రక్రియల్లో, అనేక రూపాల్లో విస్తృతంగా వికసించింది. గోన బుద్ధారెడ్డి రచించిన ద్విపద కావ్యమైన 'రంగనాథ రామాయణం' తెలుగు రామకథా సంప్రదాయానికి ఒక ప్రత్యేక ఒరవడిని తెచ్చింది. అలాగే, తెలుగు రామకథా సాహిత్యంలో విశేష ఖ్యాతిగాంచిన 'భాస్కర రామాయణం', సరళమైన శైలితో సామాన్య ప్రజలకు అత్యంత చేరువైన మొల్ల రచించిన 'మొల్ల రామాయణం', ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలో మైలురాయిగా నిలిచిన విశ్వనాథ సత్యనారాయణ మహాకావ్యం 'శ్రీమద్రామాయణ కల్పవృక్షం' వంటి రచనలు తెలుగు సాహిత్య భాండాగారాన్ని సుసంపన్నం చేశాయి. అయితే, ఈ విశిష్టమైన రచనలను సంస్కృత వాల్మీకి రామాయణానికి కేవలం అనువాదాలుగా మాత్రమే చూడటం సరైనదికాదు. ఆయా కవుల సృజనాత్మక దృష్టి, భక్తితత్వం, స్థానిక ప్రాంతీయ సంస్కృతి, జీవన భాషా సౌందర్యం ఈ రచనల రూపాన్ని, వైవిధ్యాన్ని పూర్తిగా ప్రభావితం చేశాయి. సంస్కృత మూలాన్ని తెలుగు నేలపైన తమదైన ప్రతిభతో ఆవిష్కరిస్తూ, తెలుగువారి సాంస్కృతిక జీవన విధానానికి అద్దం పట్టిన ఈ కావ్యాలు మన సాహిత్య చరిత్రలో అత్యున్నత స్థానాన్ని పొందాయి.
వాల్మీకి రామాయణం కేవలం సంస్కృతానికే పరిమితం కాకుండా, భారతదేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో విభిన్న రూపాలు సంతరించుకుంది. ఆయా ప్రాంతాల సంస్కృతులు, సాహిత్య ధోరణులకు అనుగుణంగా రామకథ విస్తృతి చెందింది.తమిళంలోకంబన్ రచించిన 'ఇరామావతారం' (కంబ రామాయణం) తమిళ సాహిత్య లోకంలో అత్యున్నత కావ్యంగా నిలిచింది. అవధీ భాషలో తులసీదాసు రచించిన 'రామచరితమానస్' ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమానికి ప్రతీకగా నిలిచి, సామాన్య ప్రజల హృదయాలను కూడా గెలుచుకుంది. బెంగాలీ, ఒడియా, మరాఠీ, మలయాళం తదితర భారతీయ భాషల్లో స్థానిక జీవన విధానాన్ని ప్రతిబింబించే అనేక రామాయణ రూపాలు వెలువడ్డాయి. కేవలం హిందూ పురాణ సంప్రదాయమే కాకుండా, బౌద్ధ (దశరథ జాతకం వంటివి) జైన సంప్రదాయాల్లోనూ రామకథకు భిన్నమైన, నైతిక దృక్పథంతో కూడిన కథనాలు రూపుదిద్దుకున్నాయి. ఆరుద్ర ‘రాముడికి సీత ఏమవుతుంది’ గ్రంథం ఈ విషయాలను స్పష్టంగా తెలుపుతుంది. ఈ విభిన్న భాషా రచనల్లో పాత్రల స్వభావం, ధర్మ భావన, దైవత్వం మరియు సామాజిక విలువలు కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి మారుతూ వచ్చాయి. కొన్ని రచనలు రాముని దైవత్వాన్ని ప్రధానంగా ఆవిష్కరిస్తే, మరికొన్ని ఆయనలోని మానవ నైజం, ఆదర్శప్రాయమైన మానవ స్వభావాన్ని ముందుకు తెస్తూ విభిన్న దృక్కోణాలను అందిస్తాయి.
రామాయణం పై వివిధ విమర్శ దృక్పథాలు:
వాల్మీకి రామాయణాన్ని కేవలం సాంప్రదాయక భక్తి గ్రంథంగానే కాకుండా, ఆధునిక సాహిత్య విమర్శలో స్త్రీవాద కోణం నుంచి తీవ్రంగా విమర్శిస్తూ పునఃసమీక్షిస్తున్నారు. రామాయణంలోని అనేక అంశాలను తీసుకుని కవిత్వం కూడా రాస్తున్నారు. సీత, శూర్పణఖ, కైకేయి వంటి ప్రముఖ పాత్రల అనుభవాల ఆధారంగా పురుషాధిక్య సమాజంలో స్త్రీల స్వాతంత్ర్యం, వారి శరీరంపై అధికారం, సామాజిక నియంత్రణ స్త్రీలపై విధించే కఠినమైన నైతిక ప్రమాణాలను ఈ విమర్శలు నిశితంగా ప్రశ్నిస్తున్నాయి. పురాణ గాథల్లో మహిళల అస్తిత్వాన్ని, వారి గొంతును అణచివేసే పితృస్వామ్య భావజాలాన్ని ఈ కోణం బట్టబయలు చేస్తుంది. అదేవిధంగా, దళిత,బహుజన వాద కోణం నుంచి కూడా ఈ గ్రంథంపై గట్టి విమర్శలు, కవిత్వం వెలువడ్డాయి. రాజ్యవ్యవస్థలో వర్ణ వ్యవస్థ పాత్రను, అరణ్యవాసులు, వానరులు, రాక్షసులుగా చిత్రీకరించబడిన సమూహాల సామాజిక స్థానాన్ని, అలాగే, జ్ఞానంపై హక్కు వంటి అంశాలను ఈ విమర్శకులు విమర్శనాత్మకంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా శంబూకుని వధ వంటి ఘట్టాలను ఉదాహరిస్తూ, ధర్మం పేరుతో అమలయ్యే సామాజిక అసమానతలను, అణచివేత ధోరణులను వారు నిలదీస్తున్నారు. కాలాలు మారుతున్నకొద్దీ రామాయణం శతాబ్దాలుగా ఎన్నో రూపాల్లో పునర్వ్యాఖ్యానించబడుతూ రావడం దాని అసాధారణ సాహిత్య శక్తికి నిదర్శనం. ఒకే మూలకథ కాలాలకనుగుణంగా విభిన్న దృక్కోణాలను, కొత్త ప్రశ్నలను, సరికొత్త అర్థాలను సృష్టించగలగడమే ఈ కావ్యం యొక్క నిజమైన జీవన సౌందర్యం. కేవలం ఒక పురాణ గాథగానే కాకుండా, భారతీయ సాహిత్య, సాంస్కృతిక చైతన్యానికి మూలస్తంభంగా నిలిచిన మహర్షి వాల్మీకి స్థానం ఎప్పటికీ కాలాతీతమైనది, అత్యంత విశిష్టమైనదిగా తెలియజేస్తుంది.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు.
(నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 26.10.2026 సౌజన్యంతో)

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి