జ్ఞాన వాకిలి
చీకటినే పులుముకొనే కళ్ళు
వెలుగును తట్టుకోలేవు.
అసత్యాలే అమృతమయ్యే చెవులకు
సత్యం
సీసం పోసినట్లే ఉంటుంది.
అబద్ధాలే అలవాటుగా జీవించే నాలుకకు
నిజం
చేదుగానే తగులుతుంది.
మంత్రంలోని ధ్వనినే పట్టుకొని
అర్థాన్ని మింగేసినవారికి
ప్రతీక పలికిన పరమార్థం
పిడుగులానే తగులుతుంది.
ఒకప్పుడు
మంత్రంలో ఏముందన్నారు
ఇప్పుడు
ఆ మంత్రంలోని పరమార్థాన్ని
పనికిరాని వ్యాఖ్యానమంటున్నారు
సత్యాన్ని పలికే గొంతు
ఎప్పుడు పలికినా
సత్యాన్నే వర్షిస్తుంది
అది
కొందరికి వెన్నెల వాన
మరికొందరికి అగ్ని పర్వతం
నేడు చేయాల్సింది
ప్రతీకను
పీఠంపై పెట్టి పూజించడం కాదు
అది చూపించే
మనిషిని చూడాలి.
మంత్రాన్ని
మళ్లీ మళ్లీ అలాగే
యథాలాపం పలకడమే కాదు
అది మోసుకొచ్చిన అర్థాన్నీ వినాలి.
రండి
ధ్వని దాటి అర్థంలోకి;
అర్థం దాటి పరమార్థంలోకి;
పరమార్థం దాటి మనిషిలోకి.
అక్కడే
వెలుగు ఉంది.
అక్కడే
మనందరికోసం ఎదురు చూసే
ఒక మనిషున్నాడు!
దార్ల వెంకటేశ్వరరావు 16.8.2026.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి