భారతీయ సాహిత్యం అంటే ఏమిటి?
‘‘ఈ నేల మీద ఒక అనుభూతి
ఋషుల నిశ్శబ్దంలో మంత్రంగా
మారింది
తరతరాల జ్ఞాపకాల్లో కథగా
నిలిచింది
ఈ నేలమీద అనుభవం
మనిషిని నడిపించే
విజ్ఞానమయ్యింది
వేదాల నుంచి ఉపనిషత్తుల దాకా
మనిషి బయట ప్రపంచాన్ని చూస్తూనే
తనలోని విశ్వాన్ని వెతుక్కుంటూ
వచ్చాడు.
ఇక్కడ పుట్టిన కథ, పద్యం, గేయం,
కావ్యం, పురాణం...
జీవితాన్ని చూసే ఒక కొత్త
చూపునిచ్చింది
భిన్నత్వంలో ఏకత్వాన్ని
చాటింది...’’ ఈ కవిత భారతీయ సాహిత్యం గురించి
గతంలో నేను రాసుకున్నది. ఆ కవితలోని భాగాలను సందర్భానుసారంగా ఈ వ్యాసంలో
పెడుతున్నాను.
భారతీయ సాహిత్యం అంటే ఏమిటనే ప్రశ్నకు ఒకటి రెండు మాటల్లో సరైన సమాధానాన్ని చెప్పేయలేం. ఈ రంగంలో విశేషమైన కృషిచేసిన వారు దీన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. భారతదేశంలో విభిన్న కాలాల్లో, వివిధ ప్రాంతాల్లో, అనేక భాషలలో సృష్టించబడిన సమగ్ర సాహిత్య సంపదనే "భారతీయ సాహిత్యం" (Indian Literature) అంటారు. భారతదేశం బహుభాషా సంస్కృతికి నిలయం. అస్సామీ, బెంగాలీ, గుజరాతి, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి ఎన్నో అధికారిక, ప్రాంతీయ భాషలు ఉన్నాయి. భారతరాజ్యాంగం గుర్తించిన 22 భాషలతో పాటు మరికొన్ని గుర్తింపులేకపోయినా, సాహిత్యాన్ని సృష్టిస్తున్న భాషల సాహిత్యం, ఈ భాషలన్నింటిలోనూ వచ్చిన మౌఖిక, లిఖిత, పద్య, గద్య, దృశ్య (నాటక) రూపాలన్నింటినీ కలిపి సాధారణ పరిభాషలో 'భారతీయ సాహిత్యం' గా పరిగణిస్తారు. నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయం ప్రకారం.. "భారతీయ సాహిత్యం అంటే బహుళ భాషల్లో, వైవిధ్యమైన సంస్కృతుల్లో వ్యక్తమవుతున్న 'ఒకే భారతీయ ఆత్మ' అనంతమైన సృజనాత్మక ప్రయాణం. ఇది సంకుచిత పరిధులకు అతీతంగా, యావత్ మానవాళికి భారతదేశం ఇస్తున్న ఆత్మీయ సందేశం.
భారతీయ సాహిత్యాన్ని
కొంతమంది ప్రత్యక్షంగా నిర్వచిస్తే, మరికొంతమంది తమ సాహిత్యంలో భాగంగా అక్కడక్కడా
సందర్భానుసారంగాను, సృజనాత్మక సాహిత్యంలో తమ భావజాలంగాను వివరించారు. "భారతీయ సాహిత్యం
అంటే
ఒకటిగా
కనిపిస్తుంది, కానీ అది అనేక భాషలలో లిఖించబడిందని (Indian
literature is one though written in many languages) డా. సర్వేపల్లి
రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రముఖ బెంగాలీ
కవి, విమర్శకులు శిశిర్ కుమార్ దాస్ తన "A History of
Indian Literature" గ్రంథంలో భాషాపరమైన
వైవిధ్యం ఉన్నప్పటికీ, ఇతివృత్తాలు, సామాజిక స్పృహ భారతీయులందరికీ
ఉమ్మడిగా ఎలా ఉంటాయో చెప్తూ "భారతీయ సాహిత్యం అనేది వివిధ భారతీయ భాషలలో వెలువడిన సాహిత్యాల సముదాయం. భాషలు
వేరైనా ఇవన్నీ చారిత్రక, భౌగోళిక మరియు సాంస్కృతిక బంధాలతో విడదీయరాని విధంగా పెనవేసుకుని ఉంటా’’యని
అన్నారు. మాతృభాష బెంగాలీ అయినప్పటికీ, ఆయన తన సాహిత్య విమర్శ, పరిశోధనా గ్రంథాలను
ప్రధానంగా ఆంగ్లంలో రచించిన సుజిత్ ముఖర్జీ రాసిన "Towards a Literary History of India" అనే గ్రంథంలో కేవలం సంస్కృతం లేదా హిందీ మాత్రమే
కాకుండా, ప్రాంతీయ భాషలన్నింటినీ
సమానంగా పరిగణించి కలుపుకుని చూసినప్పుడే 'భారతీయ సాహిత్యం' అనే పదానికి సార్థకత
చేకూరుతుందని ముఖర్జీ నిర్వచిస్తూ ‘‘"భారతీయ సాహిత్యాన్ని విడివిడి భాషల చరిత్రగా కాకుండా, బహుభాషా సమాజం సృష్టించిన ఒకే ఏకీకృత (Pluralistic) సాహిత్య సంప్రదాయంగా చూడాలి." అన్నారు. ప్రముఖ
గుజరాతీ కవి, విమర్శకులు ఉమాశంకర్ జోషి ‘"నేను ఒక భారతీయ రచయితను, కానీ గుజరాతీలో రాస్తాను." (I am an Indian
writer writing in Gujarati) అని వ్యక్తపరిచిన ఈ
ప్రసిద్ధ వాక్యం భారతీయ సాహిత్య స్వభావాన్ని అత్యంత క్లుప్తంగా నిర్వచిస్తుంది.
రచయిత ఉపయోగించే మాధ్యమం (భాష) ప్రాంతీయమైనప్పటికీ, అతని ఆలోచన, అస్తిత్వం 'భారతీయత'కు ప్రతిరూపంగా కనిపిస్తుంది. బెంగాలీ భాషకు చెందిన సునీతి కుమార్
ఛటర్జీ అభిప్రాయంలో "భారతీయ సాహిత్యం అనేది
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ఒక మేధోపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రయాణం. ఇందులో
రామాయణ, మహాభారతాల వంటి ఇతిహాసాల నుండి ఆధునిక కవిత్వం వరకు ఒకే విధమైన సామాజిక
విలువలు ప్రతిబింబిస్తాయి." తెలుగులో
జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన విశ్వనాథ సత్యనారాయాణ అభిప్రాయంలో 'భారతీయ దర్శనం' (Indian Philosophical
Vision) లేనిదే భారతీయ సాహిత్యం లేదు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాల్లో చెప్పబడిన 'ధర్మం', 'కర్మ సిద్ధాంతం', 'పునర్జన్మ విశ్వాసం' వంటి తాత్విక పునాదుల మీద నిర్మితమైనదే నిజమైన భారతీయ సాహిత్యం. గుర్రం జాషువా
భారతీయ సాహిత్యం మనిషిని మనిషిగా గౌరవించే మానవతావాదాన్ని బోధించాలని నమ్మారు. రాతి విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తూ, తోటి మనిషిని తాకితే మైల పడతామని భావించే నాటి
హిందూ సమాజపు ద్వంద్వ ప్రమాణాలను ఆయన తన కవిత్వం ద్వారా తీవ్రంగా ప్రశ్నించారు.
ఆయన కవిత్వానికి కేంద్ర బిందువు నిఖార్సయిన 'విశ్వమానవ సౌభ్రాతృత్వం'. జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా. సి.నారాయణ రెడ్డి
భారతీయ సాహిత్యాన్ని భాషాపరమైన గోడలు లేని ఒక 'అభ్యుదయ,
మానవతావాద స్రవంతి'గా చూశారు. భాషలు అనేవి కేవలం దేహాలు మాత్రమేనని, వాటిలో ప్రవహించే 'ఆధునిక మానవతా వాదమే' నేటి భారతీయ సాహిత్య ఆత్మ అని ఆయన సమన్వయించారు. గుంటూరు శేషేంద్ర శర్మ భారతీయ సాహిత్యం అనేది కేవలం మత గ్రంథాల సముదాయం కాదని, అదొక గొప్ప సామాజిక, మానసిక విజ్ఞాన శాస్త్రమని (Science of human consciousness) అభిప్రాయపడ్డారు.
తెలుగు కవులు, విమర్శకుల అభిప్రాయం ప్రకారం భారతీయ సాహిత్యం అంటే గతం నుండి
వారసత్వంగా వస్తున్న 'ప్రాచీన తాత్విక దర్శనం'గాను, వర్తమానంలో సామాన్యుడి పోరాటాలను
ప్రతిబింబించే 'సామాజిక వాస్తవికత'ల సమ్మేళనంగా భిన్న దృక్పథాలతో చూశారు. ప్రపంచంలోని
పీడిత వర్గాలందరి ఆవేదన ఒకటేనని, భారతీయ సాహిత్యం ఆ అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాటంలో ఒక భాగం కావాలని శ్రీశ్రీ
భావించారు. ఇలా ఒక్కొక్కరి అభిప్రాయాలను క్రోడీకరించే అవకాశం ఉంది. మొత్తం మీద
భిన్న దృక్పథాలు ఉన్నప్పటికీ, భారతీయ సాహిత్యాన్ని సంస్కృతం వంటి ప్రాచీన భాషల
నుంచి ప్రాకృత భాషగా విస్తరించి, జానపద కళారూపాల వరకు ప్రతిదీ ఈ సాహిత్య
నిర్మాణంలో భాగమే భారతీయ సాహిత్యం. అందుకే "అనేక భాషలు - ఒకే అంతరాత్మ" అనేది భారతీయ సాహిత్యానికి సరైన నిర్వచనంగా చెప్పవచ్చు.
భారత దేశంలోని వివిధ భాషల్లో వేర్వేరు సాహిత్యాలు వచ్చినప్పటికీ, వాటి అంతర్వాహినిగా భారతీయ జీవన విధానం, ఆధ్యాత్మికత, మానవతా విలువలు ఒకే రకంగా కనిపిస్తాయి. ఇది భిన్నత్వంలో ఏకత్వాన్ని (Unity in Diversity) సూచించే ఒక ముఖ్యమైన లక్షణం. రామాయణ, మహాభారతాలు అనే ఇతిహాసాలు భారతీయ సాహిత్యానికి రెండు కళ్ళలాంటివి. దేశంలోని ఏ
భాషా సాహిత్యాన్ని పరిశీలించినా ఈ ఇతిహాసాల ప్రభావం, వాటి ఆధారంగా రూపుదిద్దుకున్న కథలు స్పష్టంగా గోచరిస్తాయి. భారతీయ సాహిత్యంలో ధర్మం (కర్తవ్యం), సత్యం, అహింస, గురుభక్తి, పితృవాక్యపాలన వంటి నైతిక విలువలకు అత్యధిక
ప్రాధాన్యత ఇవ్వడం మరో ముఖ్యలక్షణం. భారతీయ సాహిత్యం వేద కాలం నాటి మౌఖిక సంస్కృతి (శ్రుతులు, స్మృతులు) నుండి ప్రారంభమై, సంస్కృత-ప్రాకృత సాహిత్యాల ద్వారా మధ్యయుగ భక్తి సాహిత్యం సంతరించుకుని, నేటి ఆధునిక ప్రజాస్వామ్య, విప్లవ, ప్రగతిశీల సాహిత్యాల వరకు నిరంతరం ప్రవహిస్తుందనే
కాలక్రమ పరిణామాన్ని సూచిస్తుంది.
‘‘ఇది ఒక్క భాషో
ఇది ఒక్క సాహిత్యమో కాదు
కాశ్మీర్ మంచులోంచి
కన్యాకుమారి సముద్రం దాకా
బెంగాల్ నది ఒడ్డునుంచి
గుజరాత్ ఎడారి దాకా
ఎన్ని భాషలు, ఎన్నిపలుకుబడులు
ఎంతమంది దేవతలు,ఎన్నితిరుగుబాట్లు
,ఎన్నికన్నీళ్లు, ఎన్నికలలు!
అన్నీ కలిసి
ఒకే భారతీయ అనుభూతిని నిర్మించాయి.’’
భారతీయ
సాహిత్యాన్నెందుకు అధ్యయనం చేయాలి?:
భారతీయ
సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అనేది ఒక జాతి ఆత్మను అర్థం చేసుకోవడం కోసం
చదవాలి. అది భారతీయ సాహిత్యమే కాదు, ఏ దేశ సాహిత్యమైనా మౌలికంగా ఇదే పనిచేస్తుంది. అయితే, ప్రపంచంలో మరే
దేశానికీ లేనంత సుదీర్ఘమైన, వైవిధ్యమైన సాహిత్య చరిత్ర భారతదేశానికి ఉందని
సాహితీవేత్తలు భావిస్తుంటారు. ఈ కింది అంశాల ద్వారా భారతీయ సమగ్రతను,
సమైక్యతను కాపాడుకోవడానికి భారతీయ సాహిత్యాన్ని చదవాలి. అంతే కాదు, ఎందుకు చదవాలో
ఈ ఉపశీర్శికల ద్వారా అవగాహన చేసుకోవచ్చు.
‘‘ఇక్కడ
భాషలు
వేరు భావం ఒకటే.
పేర్లు
వేరు మనిషి అనే వృక్షం ఒక్కటే
కథలు
వేరు జీవితం ఒకటే.
భారతీయ
సాహిత్యం
ఒక
పుస్తకం కాదు.
అది
వేల సంవత్సరాలుగా
మనిషి
తనను తాను
చదువుకుంటున్న
ఒక
అనంతమైన సమైక్య గీతం.’’
సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ
‘‘వ్యాసుడు
మనిషి హృదయంలోని
అన్నిరంగులనూ చూపించే
ఒక అద్దం
తనను తాను ఒక నదిలా ప్రవహించుకుంటూ
తీరాలన్నీ మానవ
జీవనాలయ్యాయి;
ఆ ప్రవాహం చివరికి
విశ్వమే ఒక మహాకథగా
తనలోతాను
ప్రతిధ్వనించింది.’’
భారతీయ సాహిత్యం మన ప్రాచీన ఆచార వ్యవహారాలకు, కళలకు, సాంస్కృతిక వారసత్వానికి
సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. రామాయణ, మహాభారతాల వంటి ఇతిహాసాలు నాటి ఉమ్మడి కుటుంబ, సామాజిక విలువలను భద్రపరచాయి.
‘‘వాల్మీకి
ఒక మనిషి
మరొక మనిషి కోసం
కరిగిపోయిన క్షణాల్ని కావ్యంగా
మార్చాడు.
ఒక కన్నీటి చుక్కలో
మానవ హృదయపు విశ్వాన్ని చూపాడు
ఆ స్పందనే
రామాయణమై యుగాల్ని దాటింది.’’
రామాయణ, భారత, భాగవతాలతో పాటు భారతీయ సాహిత్యం ద్వారా 'క్రీడాభిరామం', 'పల్నాటి వీరచరిత్ర' వంటి కావ్యాలు స్థానిక జనజీవనాన్ని, వినోదాలను కళ్లకు కట్టాయి. అలాగే బసవన్న, కబీరు, పోతన వంటి కవుల భక్తి, జానపద రచనలు అగ్రవర్ణాలకే పరిమితం కాకుండా సామాన్యుల శ్రమను, పల్లె వాతావరణాన్ని అద్భుతంగా రికార్డు చేశాయి. మొత్తంగా ఈ సాహిత్యం ఎగువ
స్థాయి నుండి సామాన్యుల వరకు అందరి జీవన విధానాలను పొందుపరిచి, ఒక తరం నాటి సాంస్కృతిక చిత్రాన్ని భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించే
కాల యంత్రం (టైమ్ మెషీన్) లా పనిచేస్తుంది.
‘‘అతడు
ధర్మంముందు
మనిషిగా నిలబడిన ఒక
ప్రశ్న
ఆమె
ఎన్నిఅరణ్యాలు దాటినా
తన అంతరంగంలో
తన
అస్తిత్వాన్నికాపాడుకునే
స్త్రీ శక్తికి
ఒకనిశ్శబ్ద ప్రతీక.’’
భిన్నత్వంలో ఏకత్వం
భారతదేశం బహుభాషా, బహుళ సంస్కృతుల నిలయమైనప్పటికీ, భారతీయ సాహిత్యమంతటా 'భిన్నత్వంలో ఏకత్వం' అనే ఒకే భావజాలం అంతర్లీనంగా ప్రవహిస్తుంది. వివిధ భాషల్లో వెలువడిన రామాయణ,
భారతాలు బోధించే ఉమ్మడి ధర్మం, దేశవ్యాప్తంగా
సాగిన భక్తి ఉద్యమ కవుల రచనలు జాతిని ఆధ్యాత్మికంగా ఎలా ఏకం చేశాయో; ఆధునిక కాలంలో ఠాగూర్, సుబ్రహ్మణ్య భారతి, ప్రేమ్ చంద్, గురజాడ వంటి రచయితలు విభిన్న భాషల్లో పేదరికం, అంటరానితనం, వలసవాద వ్యతిరేకతలపై చేసిన సమాంతర పోరాటం కూడా అదే
ఏకత్వాన్ని చాటుతుంది. భాషలు, స్థానిక వర్ణనలు
వేరైనా వాటి ఆత్మ, సామాజిక ఆవేదన ఒకటేనని నిరూపిస్తూ.. ఈ ప్రాంతీయ
సాహిత్యాలన్నీ కలగలిపి 'భారతీయత' అనే సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి. భారతంలో శ్రీకృష్ణుడు గురించి
భారతీయులు ఇలా భావిస్తారు.
‘‘మరొకరు
సందేహంలో నిలిచిన
మనిషి చెవిలో వినిపించిన సంభాషణ.
సందేహంలో గీతగా పలికాడు.
ప్రేమలో రాధ తత్వమయ్యాడు.
జీవితంలో కర్మకు అర్థమయ్యాడు.’’
సామాజిక, చారిత్రక పరిణామాల అవగాహన
సాహిత్యం తాను పుట్టిన కాలానికి, సమాజానికి సజీవ
దర్పణం లాంటిది. రాజకీయ, సామాజిక
పరిణామాలను తెలుసుకోవడానికి చరిత్ర పుస్తకాల కన్నా సాహిత్యమే అత్యంత ప్రామాణికం. సంస్కృత రచనలను తెలుగులోకి తీసుకొని రావడంలో భారతీయ
సాహిత్య ఆత్మ ఉంది.
‘‘బుద్ధుని మౌనం
పదాలకు అందని ఒక కవిత.
కబీర్ పలికిన మాట
గుడి గోడలకూ
మసీదు గోడలకూ
అవతల నిలిచిన మనిషి స్వరం.
అన్నమయ్య కీర్తనలో భక్తి ఉంది,
వేమన పద్యంలో నిజం ఉంది,
తిరువళ్ళవర్ మాటల్లో జీవితం
ఉంది.
తెలుగు నేలపై
నన్నయ అక్షరాలకు, తిక్కన
ప్రవాహం చేరింది
ఎర్రన చేతుల్లో మహాకథ మరొక
శ్వాస తీసుకుంది.
మనిషి హృదయం
ప్రేమను తాకినప్పుడు
భక్తి ఎలా
సంగీతమవుతుందో చూపిన
ఒక అనంత తరంగం పోతన
పద్యమయ్యింది
శ్రీనాథుని పదంలో భాషకు వైభవం
వచ్చింది.’’
'రాజతరంగిణి', 'రాయవాచకం' వంటివి నాటి రాజకీయ, సైనిక పరిస్థితులను చారిత్రక ఆధారాలతో వివరిస్తే; గురజాడ 'కన్యాశుల్కం', ఉన్నవ 'మాలపల్లి', మున్షీ ప్రేమ్‌చంద్ 'గోదాన్' వంటి రచనలు నాటి సామాజిక రుగ్మతలను, అంటరానితనాన్ని, రైతుల దయనీయ స్థితిని కళ్లకు కట్టాయి. అలాగే
మధ్యయుగ భక్తి సాహిత్యం కులమత భేదాలపై పోరాడగా, ఆధునిక సాహిత్యం జాతీయోద్యమాన్ని రగిలించింది. ఈ విధంగా, పాలకుల చరిత్రతో పాటు అట్టడుగు వర్గాల పోరాటాలను, సామాజిక మార్పులను రికార్డు చేసిన ఈ సాహిత్య అధ్యయనం ద్వారా మన సమాజం గతం
నుండి ఆధునిక దశకు ఎలా పరిణామం చెందిందో మనం సంపూర్ణంగా అవగాహన చేసుకోవచ్చు.
నైతిక విలువలు, తాత్విక చింతన
భారతీయ సాహిత్యం ప్రపంచానికి అందించిన అత్యున్నత కానుక నైతిక ప్రబోధం , తాత్విక చింతన. రామాయణ, మహాభారతాలతో పాటు 'భగవద్గీత' నిష్కామ కర్మను, మానసిక ధృడత్వాన్ని బోధించగా.. 'పంచతంత్రం', 'జాతక కథలు' జంతు పాత్రల ద్వారా లౌకిక జ్ఞానాన్ని, రాజనీతిని ఆసక్తికరంగా నేర్పుతాయి. కాళిదాసు మహాకవి ప్రకృతి ద్వారా శాశ్వతంగా ముద్రపడే అద్భుతమైన కవిత్వాన్ని అందించాడు.
‘‘కాళిదాసు
ప్రకృతికి మనిషి హృదయాన్ని
అద్దంగా ఇచ్చాడు.
మేఘం అతని చేతిలో
విడిపోయిన రెండు హృదయాల మధ్య
వార్తను మోసే దూతగా మారింది
ఋతువులు అతని పద్యంలో
కాలం గడిచే దృశ్యాలేనా
మనిషి హృదయంలో మారే అనుభూతులకు
ప్రకృతి వేసుకున్న ఆరు ముఖాలు.’’ అలాగే పండితులకే కాక పామరులకు సైతం జీవిత
సత్యాలను ఉద్బోధించడంలో తమిళ 'తిరుక్కురళ్', తెలుగు 'సుమతీ', 'వేమన' శతకాలు అద్భుతమైన పాత్ర పోషించి, సమాజంలోని మూఢనమ్మకాలను ఎండగట్టాయి. ధర్మం, న్యాయం, కర్మాచరణ వంటి శాశ్వత విలువలను విశ్వజనీనంగా
బోధించే ఈ అపురూపమైన సాహిత్య అధ్యయనం.. నేటి యాంత్రిక సమాజంలో మనిషి ఎదుర్కొంటున్న
నైతిక పతనానికి, మానసిక ఒత్తిడికి సరైన పరిష్కారాలను చూపుతూ నిత్య
మార్గదర్శిగా నిలుస్తుంది.
సామాజిక చైతన్యం, సంస్కరణల అధ్యయనం
సాహిత్యం కేవలం వినోదానికే పరిమితం కాకుండా, సామాజిక రుగ్మతలను పారద్రోలి ప్రజలను మేల్కొల్పే పదునైన ఆయుధంగా ఎలా
పనిచేసిందో భారతీయ సాహిత్య చరిత్ర నిరూపిస్తుంది. కందుకూరి వీరేశలింగం 'రాజశేఖర చరిత్రము', వంటి రచనలు స్త్రీ సాధికారతకు బాటలు వేస్తూనే
అంటరానితనం, భూస్వాముల దోపిడీలను తీవ్రంగా ప్రశ్నించాయి. అలాగే, జాతీయోద్యమ కాలంలో బంకించంద్రుని 'వందేమాతరం' (ఆనందమఠ్), గురజాడ 'దేశమంటే మనుషులోయ్', శ్రీశ్రీ 'మహాప్రస్థానం', సుబ్రహ్మణ్య భారతి కవితలు నిద్రాణమైన ప్రజల్లో అఖండమైన దేశభక్తిని, విప్లవ స్ఫూర్తిని రగిలించాయి. సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు జాతికి
దిశానిర్దేశం చేసి, మూఢనమ్మకాలపై పోరాటం నుండి స్వాతంత్ర్య కాంక్ష వరకు
సామాజిక చైతన్యాన్ని తీసుకురావడంలో సాహిత్యం పోషించిన అసమాన పాత్రను ఈ అధ్యయనం
స్పష్టం చేస్తుంది.
‘‘గురజాడ కవితల్లో
సమాజం తన ముఖాన్ని తానే
చూసుకుంది.
శ్రీశ్రీ కవితలో శ్రమే
మాట్లాడింది,
కూలీ చేతి చెమటే అక్షరమైంది.
దళితుని గొంతులో
ఎన్నాళ్లుగానో మూగబోయిన
చరిత్ర కవితగా ఆత్మగౌరవంతో
మేల్కొంది.
స్త్రీ తన గదిలోంచి
బయటికి వచ్చినప్పుడు
సాహిత్యం మరో కిటికీ తెరిచింది.
ఆదివాసిఅడవుల్లో
పుట్టిన పాటలు
భూమి జ్ఞాపకాలను ఫుప్పించాయి’’
భాషా పరిణామం, శాస్త్రీయతను అవగాహన
భారతీయ భాషల పరిణామ క్రమాన్ని, ద్రావిడ , ఇండో-ఆర్యన్ భాషల మధ్య జరిగిన భావ వినిమయాన్ని
శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి సాహిత్యమే ప్రాథమిక ఆధారం. వేల ఏళ్ల క్రితమే మన
భాషా నిర్మాణం ఎంత పకడ్బందీగా ఉందో సంస్కృతంలో పాణిని రచించిన 'అష్టాధ్యాయి', తమిళంలోని 'తొల్కాప్పియం' వంటి ప్రాచీన వ్యాకరణ గ్రంథాలు నిరూపిస్తాయి.
కాలక్రమంలో మాండలికాలు ప్రామాణిక గ్రంథ భాషలుగా ఎలా మారాయో, ఒక భాష మరో భాషను ఎలా ప్రభావితం చేసిందో కవుల రచనల ద్వారా తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు, నన్నయ వాడుక తెలుగుకు సంస్కృత పదాలను జోడించి
సుసంపన్నమైన కావ్య భాషగా తీర్చిదిద్దగా; పారశీక, హిందీ భాషల కలయికతో 'ఉర్దూ', 'హిందుస్తానీ' భాషలు ఎలా పుట్టాయో అమీర్ ఖుస్రో రచనలు స్పష్టం చేస్తాయి. ఈ విధంగా భాషా
శాస్త్రీయతను, వాటి మధ్య ఉన్న విడదీయరాని సంబంధాలను సాహిత్య
చరిత్ర మనకు స్పష్టంగా వివరిస్తుంది.
7. ప్రపంచ వేదికపై భారతీయ గుర్తింపు
భారతీయ సాహిత్యం ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు తన గొప్ప తాత్విక
చింతనతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ, దేశానికి అత్యుత్తమ సాంస్కృతిక రాయబారిగా (సాఫ్ట్ పవర్) నిలిచింది. పాశ్చాత్య
ప్రపంచం మన వేదాంతం, ఇతిహాసాల పట్ల
చూపుతున్న ఆసక్తికి చారిత్రక నిదర్శనంగా.. 18వ శతాబ్దంలో సర్ విలియం జోన్స్ అనువదించిన కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం' చదివి జర్మన్ కవి గెథే పరవశించిపోవడం, రవీంద్రనాథ్ ఠాగూర్ 'గీతాంజలి'కి నోబెల్ బహుమతి లభించి ఆసియా సాహిత్య
గొప్పదనాన్ని ప్రపంచ వేదికపై శిఖరాగ్రాన నిలపడం వంటి ఘట్టాలను పేర్కొనవచ్చు.
ఖండాంతరాలలో భారతీయ మేధో సంపత్తిని చాటిచెప్పిన ఈ సాహిత్య విశిష్టతను బట్టి, మన స్వంత సాహిత్యాన్ని మనం సమగ్రంగా అధ్యయనం
చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టమవుతుంది. ఆధునిక యుగంలో ఆర్.కె. నారాయణ్, అరుంధతీ రాయ్, అరవింద్ అడిగ వంటి రచయితలు
తమ ఆంగ్ల రచనల ద్వారా భారతీయ సామాజిక వాస్తవాలను, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తూ అంతర్జాతీయ
పురస్కారాలు (బుకర్ ప్రైజులు) సాధించడంతో మన సాహిత్య ప్రస్థానం ఖండాంతరాల్లోనూ
అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, భారతీయ సాహిత్యాధ్యయనం అనేది కేవలం భాషాభిమానానికి మాత్రమే పరిమితం కాక, మన గతాన్ని, సంస్కృతిని, బలాబలాలను నిష్పాక్షికంగా
అర్థం చేసుకునే 'ఆత్మపరిశీలన' లాంటిది. గతాన్ని గౌరవిస్తూ, వర్తమాన సామాజిక లోపాలను సవరించుకుంటూ, నైతికంగా ఉన్నతమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికీ,
ప్రపంచ పటంలో మనకంటూ ఒక విశిష్టమైన అస్తిత్వాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకోవడానికీ నేటి యువతకు ఈ
సాహిత్య అధ్యయనం చేయడం ఎంతైనా అవసరం ఉందని గుర్తించాలి.
ఒక ఋషి
ఆకాశం వైపు చూసినప్పుడు
ఆ చూపులోనే వేదం పుట్టింది.
ఒక శిష్యుడు
గురువు ముందు ఓ ప్రశ్నయ్యాడు
ఆ ప్రశ్నవేసిన నిశ్శబ్దంలో
ఉపనిషత్తు పుట్టింది.
ఒక రైతు
నాగలితో నేలను చీల్చినప్పుడు
ఆ చీలికలోనూ
ఒక పద్యం మొలిచింది.
ఒక తల్లి
పిల్లవాడి కోసం
తలుపు దగ్గర ఎదురు చూసినప్పుడు
ఆ నిరీక్షణలోనూ
ఒక మహాకావ్యం పుట్టింది.
ఒక కార్మికుడు
తన చెమటను
చేతి వెనుక భాగంతో తుడిచినప్పుడు
ఆ చెమటలో
సమాజం నిర్మించిన
అనేక భవనాల కథలు కనిపించాయి.
ఒక భాష
మరో భాషను కలిసినప్పుడు
అనేక నదులు
ఒకే సముద్రాన్ని చేరినట్లుగా
కొత్త పదాలు పుట్టాయి.
ఆ సంగమంలోనే
భారతీయ సాహిత్యం
తన విశాలతను పొందింది.
-
డా.దార్ల
వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, తెలుగుశాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
(నినాదం దినపత్రిక సాహిత్య లహరి సాహిత్య
అనుబంధం, 8.9.2026 సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి