మళ్లీ నాన్న గుర్తొస్తున్నాడు...
ఆడుకొంటూ ఆడుకొంటూ నిద్రపోయిన
బాబుని భుజమ్మీద వేసుకొని
మంచంమీదికి తీసుకొస్తుంటే
మళ్లీ నాన్నే గుర్తొస్తున్నాడు.
నిద్ర చెదరకూడదని
అడుగులను పువ్వుల్లా పరచుకుంటూ
నడిచే ఆ నడకలో
మమతకే ఓ రూపం కనిపిస్తుంది.
తల దిండుమీద ఆనించాక
చెదిరిన జుట్టును సవరించే
ఆ మృదువైన వేళ్ల స్పర్శలో
నాకు చెప్పకుండా వెళ్ళిపోయిన
నాన్న ఆశీస్సులే వినిపిస్తున్నాయి
ఇప్పుడు
నా చేతుల్లో నా బిడ్డ నిద్రిస్తుంటే
నా భుజం మీద
నాన్న చేయి ఇంకా ఉన్నట్టే ఉంటుంది.
కాలం
మనిషిని తండ్రిని చేస్తుంది;
జ్ఞాపకం మాత్రం
కొడుకుగానే నిలబెడుతుంది.
ప్రతి రాత్రీ
నా బిడ్డను మంచంపై పడుకోబెడుతున్న వేళ
నా బాల్యాన్ని మోసుకొచ్చిన
ఆ భుజం బరువు
మళ్లీ నాన్ననే గుర్తు చేస్తుంది.
దార్ల వెంకటేశ్వరరావు
30.7.2026.
12: 23 ని. లు. తెల్లవారుజామున

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి