మళ్లీ నాన్న...
సాయంత్రం గుమ్మం తెరుచుకోగానే
ఇల్లు ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టేది.
ఆ రెండు చేతులంత ప్రపంచం
నన్ను చుట్టేసుకునేది.
ఆ భుజాల మీద కూర్చొని
చెట్టుకొమ్మలతో మాట్లాడిన రోజులు,
ఆ నవ్వుల వెనక
ఎన్ని ఎండలు ముడుచుకుని వచ్చాయో
అప్పుడు నాకు తెలియదు.
ఆడుకుంటూ ఆడుకుంటూ
ఎప్పుడో నిద్ర ఒడిలో జారిపోతే,
కలకూడా మేలుకోకుండా
మంచం నన్ను చేరుకునేది.
ఇప్పుడు
తలుపు తెరుచుకున్న శబ్దానికి
మరో జత చిన్న కాళ్లు
నావైపు పరిగెత్తుకొస్తాయి.
నా చేతిని పట్టుకుని
ఎక్కడికో తీసుకెళ్లాలని
అతని కళ్లే మాట్లాడుతుంటాయి.
నేను నవ్వుతాను.
అతడూ నవ్వుతాడు.
ఆ నవ్వుల మధ్యలోనే
గడియారం మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది.
కొద్దిసేపటికి...
బొమ్మలన్నీ అలాగే ఉండిపోతాయి.
చిన్న అరచేయి
ఒక బొమ్మను కౌగిలించుకుంటుంది.
నిద్ర మాత్రం
నాతో ఆడకుండా
అతనితో వెళ్లిపోతుంది.
ఆ రాత్రిళ్లు...
నిద్రలో అతని నుదుటిపై
జారిన జుట్టును సవరిస్తుంటే,
నా వేళ్లను కాదు
ఎప్పుడో నన్ను నిద్రలో మోసుకొచ్చిన
నాన్న చేతులనే తాకుతున్నాననిపిస్తుంది.
అప్పుడు తెలిసేది ఒక్కటే...
నేను పెరిగింది
సమయం ఇచ్చిన తండ్రి చేతుల్లో.
నా కొడుకు పెరుగుతోంది మాత్రం
సమయం కోసం ఎదురుచూసే కళ్లలో.
— దార్ల వెంకటేశ్వరరావు
30.07.2026

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి