"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

20 జూన్, 2026

ఆచార్య జె.భీమయ్యగారిలో ప్రవహించే శ్రామిక జ్వలన కవిత్వం

 ఆచార్య జె.భీమయ్యగారిలో ప్రవహించే

       శ్రామిక జ్వలన కవిత్వం 

నినాదం దినపత్రిక, 21.6.2026 సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' సౌజన్యంతో 

కొన్ని వందల యేండ్లుగా అక్షరాలు నేర్చుకోవడానికే అవకాశం లేని సామాజిక వర్గంలో జన్మించిన భీమయ్యగారు ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్ చేసి, కళాశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా, శాఖాధ్యక్షులుగా ఉన్నతమైన పదవుల్ని అలంకరించారు. దళితుడు తాను ఎన్ని ఉన్నత పదవుల్ని అలంకరించినప్పటికీ, వాటితో పాటే అనుమానపు చూపులు, అవకాశం చూసి చేసే అవమానాలు ఎదుర్కొంటున్న దళితుల స్థితిగతులను ఆచార్య జె. భీమయ్యగారు కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. తాను నిలబడిన నేలను ఎప్పుడూ ఆయన మరిచిపోలేదు. తాను పుట్టి పెరిగిన జీవితాల్ని విస్మరించలేదు. అటువంటి వాటినీ, అటువంటి మనుషుల్నీ చూస్తున్నప్పుడల్లా చాలామంది హృదయం దగ్దమైపోతుంది. భీమయ్యగారు దాన్ని చూసి అలాగే ఊరుకోలేదు, దాన్ని కవిత్వంగా వర్ణించారు. వాటిలో సుమారు నలభై కవితలను "TOILING MOTHER" పేరుతో ఒక కవితా సంపుటిగా ప్రచురించారు. ఈ కవితా సంపుటిలోని కవితలన్నీ గ్రామీణ జీవితం, సామాజిక వర్గీకరణ, అట్టడుగు వర్గాల నిరంతర పోరాటాన్ని లోతుగా ఆవిష్కరిస్తుంది. 

ఆచార్య జె. భీమయ్యగార్ని నేను గత మూడు దశాబ్దాలుగా గమనిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా పీడిత వర్గాలపైనా, భారత దేశవ్యాప్తంగా దళితులపైనా జరుగుతున్న అమానవీయ సంఘటనలకు ప్రతిస్పందిస్తూ భీమయ్యగారు పత్రికల్లో రాసిన వ్యాసాల్ని, ఉత్తరాల్ని, పరిశోధన వ్యాసాల్ని గమనిస్తున్నాను. ఆయనలోని సామాజిక సాంస్కృతిక అవగాహనకు సంతోషపడి ఆయనతో అనుబంధాన్ని పెంచున్నాను కూడా! అయితే, చిత్రం ఏమిటంటే ఆయనలోని అనేక భావోద్వేగాలను సైద్థాంతీకరిస్తారనే తెలుసు తప్ప, కవిత్వం కూడా రాస్తారని తెలియదు. తనలో తాను పడిన మానసిక సంఘర్షణను రహస్యంగా దాచుకోలేదు. వాటిని కవిత్వంగా రాసుకున్నారు. దాన్ని ఆంగ్లంలోనే వర్ణించారు. తన కవిత్వంలో వస్తువుకి మించి అభివ్యక్తి నైపుణ్యాన్ని ప్రదర్శించాలనుకోవడం కోసం రాయలేదు. తాను కూడా కవిత్వం రాస్తానని నిరూపించుకోవడం కోసం కూడా కవిత్వం రాయలేదు. మరెందుకు రాశాడు? ఆయన కవిత్వం చదువుతున్నప్పుడు సామాన్యంగా కనిపించే ఆ వస్తువు సాహిత్యంగా మార్చే క్రమంలో చరిత్రను, సంస్కృతిని, ఆ పనిలోని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా చేయడం అవసరమని భావించి రాశాడనిపించింది. తల్లి, తండ్రులపై వర్ణించిన కవిత చూస్తే వాళ్ళ త్యాగంతో పాటు తాము చేసే పనిలో ప్రదర్శించిన నైపుణ్యం తెలిసి, ప్రతి పనిలోనూ ఉండే మహాదాత్తత ఉంటుందని పాఠకులు భావిస్తారు.

‘’He gave you all his love, his only daughter.

But destiny wove you into hardship still

Married to a cattle herder turned cobbler

You carried the legacy of toil

Until your last breath. (Toiling Mother, 10)

‘‘ఆయన తన ప్రేమనంతా/ఏకైక కుమార్తెవైన/నీ కోసమే దాచిపెట్టాడు/అయితే విధి/నిన్ను సుఖాల దారిలో కాకుండా/కష్టాల పొలిమేరల్లో నడిపించింది/.పశువుల కాపరిగా జీవితం మొదలుపెట్టి,/చర్మకారవృత్తితో జీవించే వ్యక్తికి సహచరివై,/ఆ శ్రమనే వంశపారంపర్యంగా స్వీకరించి/నీవు మళ్ళీ ఈ శ్రమ వారసత్వాన్నే మోసావు/నీ చివరి శ్వాస వరకూ! అనడంలో దళిత స్త్రీ తన జీవితపర్యంతం చేసే త్యాగాన్ని లోతైన పరిశీలనతో గుర్తించి వర్ణించినట్లయ్యింది.కుటుంబ సంబంధాలలో స్త్రీ త్యాగం అనేది ఒక అంతులేని ప్రయాణం; పుట్టినింట్లో ఎంతో ప్రేమగా పెరిగినా, పెరగకపోయినా వివాహానంతరం విధి విసిరే సవాళ్లను స్వీకరిస్తూ తన వ్యక్తిగత సుఖాలను తృణప్రాయంగా వదులుకోవడం ఆమె గొప్పతనం. కవితలో వివరించినట్లుగా భర్త చేసేది చర్మకారవృత్తి. కష్టమెక్కువున్నా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకతప్పదు. అయినా కూడా ఆమె తన కుటుంబ బాధ్యతలను విస్మరించదు. ఆఖరి శ్వాస వరకు కుటుంబ భారాన్ని మోస్తూ, శ్రమనే ఆభరణంగా మార్చుకుని, మౌనంగా త్యాగం చేసే స్త్రీ మూర్తి ఆ ఇంటికి వెన్నెముకగా నిలుస్తుంది. అవసరమైతే భర్తతో పాటు కలిసిపనిచేస్తుంది. ఇది భారతదేశంలో ప్రతి దళిత స్త్రీకి చెందిన జీవితం. ఇంకా విస్తృత పరిధిలో చూస్తే, ప్రపంచ వ్యాప్తంగా బాధలను సహిస్తూ జీవితాల్ని మోసే పీడిత వర్గ స్త్రీ జీవితం కూడా ఇలాగే ఉంటుంది. ఆ విధంగా ఒక విశ్వజనీన వేదనను తన కవిత్వంలో పలికించారు.

ఆచార్య జె.భీమయ్యగారి అనేక కవితల్లో ఒక విశేషం ఉంది. అది ఒక చిన్నకవితగా కనిపించినా, అది కావ్య తత్వాన్ని కలిగి ఉంటుంది. దానిలో ఆయన ఒక సంపూర్ణమైన కథలా ఆ విషయాన్ని వర్ణిస్తారు. ఒకతల్లి శ్రమను, త్యాగాన్ని వర్ణించిన ఓ కవితలో ఒక తండ్రి అంకిత భావంతో చేసే తన చర్మకారవృత్తి, దానిలోని అనేక అంశాలను వర్ణించేటప్పుడు ఈ కథాకథన అభివ్యక్తి పద్ధతిని చూడొచ్చు.

‘’No one walks without sandals, 

a known fact.

If so, one must be homeless,

Or insane, or an animal.

Sandals are as vital as a mobile phone today

No foot moves an inch without them.

Yet the cobbler is remembered

Only in the hour of need.’’ అనే అద్భుతమైన పాదాలతో ప్రారంభమైన ‘Cobbler’s Craft’ అనే కవిత చర్మకారుని వృత్తి కేవలం చెప్పులు కుట్టడం మాత్రమే కాదనీ, అది ఒక సంక్లిష్టమైన హస్తకళగా కూడా అభివర్ణిస్తారు.‘‘ప్రతి అడుగులో చెప్పులు గుర్తొస్తున్నా, వాటిని కుట్టిన చెప్పులవాడు మాత్రం ఆ చెప్పులు తెగిన సమయంలో మాత్రమే గుర్తుకు వస్తాడు.’’ అనడం వల్లనే అద్భుతమైన కవిత్వమయ్యింది.Top of Form Bottom of Form చనిపోయిన పశువుల చర్మం నుండి ఉపయోగపడే వస్తువులను తయారు చేయడం వెనుక ఎంతో సాంకేతికత దాగిఉందని చెప్తాడు కవి.వృత్తి పట్ల అంకితభావం ఉన్నప్పుడు, ఆ పనివాడు తన నైపుణ్యం గురించి స్వయంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనీ, అతను సృష్టించిన వస్తువే అతని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతుందని నిర్ధారిస్తారు. చర్మకారుని చేతుల్లో ఉండే ఆ 'మాయాజాలం' (Magic Spell) కేవలం కష్టపడటం వల్ల మాత్రమే వచ్చింది కాదనీ, అది అతనికి తన వృత్తి పట్ల ఉన్న ప్రేమ, అంకిత భావం, నిరంతరం దాన్ని పరిశీలించడం వల్లనే కళాత్మకంగా మారిందని వర్ణించారు.

సామాజిక, ఆర్థిక కోణాల నుండి చూస్తే, ఈ కవితలు శ్రమకు, సామాజిక హోదాకు మధ్య ఉన్న అగాధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతాయి. చెప్పులు కుట్టేవాడు, డప్పు కొట్టేవాడు వంటి శ్రమజీవుల వృత్తులను వర్ణించేటప్పుడు, కవి వారి ఆర్థిక వెనుకబాటుతనాన్ని మాత్రమే కాకుండా, సమాజం వారి పట్ల ప్రదర్శించే వివక్షా పూరిత వైఖరిని కూడా చర్చకు పెట్టారు. కుల వివక్షను ఒక సామాజిక రుగ్మతగా (Social Malady) పరిగణిస్తూ, అది తరతరాలుగా మనిషి ఆలోచనా విధానాన్ని ఎలా కలుషితం చేస్తోందో 'కుల కరోనా' వంటి కవితల ద్వారా తార్కికంగా విశ్లేషించారు.

కొన్ని చట్టాలు కొంతమందికి ఎంతగా రక్షణకవచాలు అవుతాయో, వాటిలోని చిన్నచిన్నలోపాలు ఇతరుల పాలిట అంతే కఠినంగా మారుతుంటాయి. మహిళల రక్షణకు ఏర్పడ్డ 498 A చట్టం దుర్వినియోగం అయ్యే తీరుని, ఆ వ్యక్తి పొందే తీవ్రమైన మానసిక సంఘర్షణను ఒక కావ్యంలా వర్ణించారు కవి. చట్టాలు (ఉదాహరణకు 498-A) కొన్నిసార్లు ప్రతీకార చర్యల కోసం ఆయుధాలుగా మారుతున్నాయి. కవితలో వివరించినట్లుగా, నిజమైన బాధితులు కాకపోయినా, కేవలం ఎదుటివారిని మానసికంగా, సామాజికంగా దెబ్బతీయడానికి చట్టాన్ని వాడుకోవడం ఒక చేదు సామాజిక వాస్తవం.

ఒక నేరపూరిత నాటకం రక్తికట్టింది,

ఆ అమాయక యువకుడిని 

ఇబ్బంది పెట్టే కుట్ర పన్నబడింది.

లోకానికి నిజం తెలియాలి, కల్పితం కాదు

నేర్పుగా అల్లిన కుట్ర, కుయుక్తితో వండిన కథ.

ఆధారం లేనిదే ఏదీ నిలబడదు.

చట్టంలోని వెసులుబాటు దుర్వినియోగం చేయబడింది

నీ పేరే 498(A)!

A criminal drama was enacted,

  A plot to trouble the innocent lad.

  The world must know the truth, not fiction

  Shrewdly framed, cleverly cooked up.

  Nothing can stand without evidence.

  The law’s provision stood misused

  Thy name is 498(A)!

 ఇది వ్యవస్థపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. సామాజిక వాస్తవికత అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. న్యాయం జరగాల్సిన చోట అన్యాయం, రక్షణ ఇవ్వాల్సిన చోట వేధింపులు చోటుచేసుకోవడం సమాజంలోని సంక్లిష్టతను తెలియజేస్తుంది. దీన్ని "A Misused Clause! Thy Name is 498 (A)" అనే కవితలో ఆచార్య జె. భీమయ్య, ఒక ఆదర్శవంతుడైన ఉపాధ్యాయుడు. ఈ కవితను తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలతో వర్ణించారో లేదా తనకు బాగా తెలిసిన ఒక వ్యక్తి జీవితాన్ని కేంద్రంగా చేసుకొని ఈ కవితను వర్ణించారో అనిపిస్తుంది. ఆ వ్యక్తి మనసుల కలయికే శాశ్వతమని నమ్మి కట్నకానుకలు లేకుండా వివాహం చేసుకున్నప్పటికీ, మతపరమైన భేదాల వల్ల తలెత్తిన గొడవలతో మానసిక సంఘర్షణలకు గురయ్యాడు. చివరకు న్యాయం కోసం అతడు కోర్టు వరకు వెళ్లడం, దానికి ప్రతికారంగా ఆ మహిళ 498(A) సెక్షన్‌ను ప్రయోగించి, ఒక నిర్దోషిని నేరస్థుడిగా చిత్రించే ప్రయత్నం చేసింది. ఈ కవితలో చట్టం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో చెబుతూ, "The law’s provision stood misused—Thy name is 498(A)!" అని కవి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం లింగ వివక్షను ఆసరాగా చేసుకుని, ఎటువంటి ఆధారాలు లేని అబద్ధపు కేసులతో ఒక వ్యక్తి జీవితాన్ని, గౌరవాన్ని ఎలా దెబ్బతీస్తారో ఈ కవిత ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. అయితే, లింగవివక్ష జరగడాన్ని కూడా వ్యతిరేస్తాడు కవి.

సమాజంలో వస్తున్న పరిణామాలను గమనించడంలో కవిగా ఆచార్య జె.భీమయ్యగారి దృక్పథం వాస్తవికతకు అద్దం పడుతుంది. రాజ్య వ్యవస్థలోని లోపాలు, అధికార యంత్రాంగం సామాన్యుల పట్ల వ్యవహరించే తీరు, పట్టణీకరణలో కనుమరుగవుతున్న మానవీయ సంబంధాలను ఆయన నిశితంగా పరిశీలించారు. లింగ వివక్ష (Gender Discrimination) వంటి అంశాలపై స్పందిస్తూ, ప్రకృతి సహజమైన జీవనానికి, సమాజం నిర్మించిన కృత్రిమ ఆంక్షలకు మధ్య ఉన్న సంఘర్షణను ఆయన తన కవిత్వంలో ప్రతిబింబించారు. ఈ పరిణామాలన్నీ సమాజం ఎటువైపు పయనిస్తుందో ఆలోచింపజేస్తాయి.

భీమయ్య గారి కవితా సృజనలో వస్తువుకు, వ్యక్తీకరణకు మధ్య ఒక సేంద్రీయ బంధం కనిపిస్తుంది. ఉదాహరణకు, "Stray Dog" కవితలో ఆయన వాడిన “No caste, no religion / Except hunger, it has no identity” అనే పంక్తులు కేవలం ఒక ప్రాణి స్థితిని మాత్రమే కాక, ఆకలి అనే విశ్వజనీన సత్యాన్ని కులమతాల చట్రంలో బంధించలేమని చాటిచెబుతాయి. అణగారిన వర్గాల అస్తిత్వాన్ని ఏ గుర్తింపులకూ నోచుకోని ఆ అనాథ జీవిలో ఆయన దర్శించడం ఒక సామాజిక రూపకం. ఇది అట్టడుగు మనుషుల అదృశ్య ఉనికిని పాఠకుడి కళ్లముందు నిలబెడుతుంది.

రాజ్య హింసను, ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ఆయన వెలువరించిన అభివ్యక్తి అత్యంత సాహసోపేతమైనది. "Murder! Thy Name is Encounter" కవితలో “Every drop of blood spilled turns into a seed” అని పేర్కొనడం ద్వారా, అణచివేత ఎన్నటికీ అంతిమ విజయం సాధించలేదని కవి స్పష్టం చేశారు. విప్లవ వీరుల ప్రాణత్యాగం వృధా పోదని, అది భవిష్యత్ చైతన్యానికి ఒక విత్తనమై మొలుస్తుందని చెప్పడంలో ఆయనకున్న సామాజిక పరిణామాల అవగాహన కనిపిస్తుంది. రాజ్య కుతంత్రాల ముందు భావజాలం ఓడిపోదని, అది రక్తపు చుక్కల ద్వారా మరింత విస్తరిస్తుందని ఆయన దృఢంగా నమ్ముతారు.

ఈ సంకలనానికి మూలస్తంభం "Toiling Mother". ఇందులో కవి తన తల్లి శ్రమను కేవలం వ్యక్తిగత జ్ఞాపకంగా మాత్రమే కాకుండా, అణగారిన వర్గాల మహిళల సహనానికి చిహ్నంగా కూడా మలిచారు. "Cobbler’s Craft", "Unlettered Surgeon" కవితల్లో చెప్పులు కుట్టే వృత్తిలోని సృజనాత్మకతను, ఒక చనిపోయిన పశువు చర్మాన్ని వలిచే పనిలో ఉండే నైపుణ్యాన్ని వైద్యుడు చేసే 'సర్జరీ'తో పోల్చి, ఆ వృత్తులకు దక్కాల్సిన గౌరవాన్ని చాటారు. "Bearers of Dead Cattle" కవితలో సమాజానికి అవసరమైన పారిశుధ్య సేవలు అందిస్తూనే, 'అంటరానివారు'గా ముద్రవేయబడిన వారి వేదన కనిపిస్తుంది.

"Village Stray Dog" కవిత కృతజ్ఞతకు మారుపేరుగా ఉండే ఊర కుక్క, మనుషుల కంటే ఉన్నతమైన ప్రవర్తనను ఎలా కలిగి ఉంటుందో వర్ణిస్తుంది. "Childhood Memories" & "Green Beetles" కవిత బాల్యంలో పచ్చని తుమ్మెదలతో ఆడుకున్న జ్ఞాపకాలను, పల్లెటూరి పచ్చదనాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాయి."Thunderbolt" & "Street Well" కవిత ప్రకృతి శక్తుల పట్ల పల్లె ప్రజల నమ్మకాలను, ఆ కాలపు సామాజిక జీవన కేంద్రాలైన బావుల ప్రాధాన్యతను వివరిస్తాయి."Flight of Vultures"కవిత ఒకప్పుడు పల్లెల్లో కనిపించిన రాబందుల గుంపులు మరియు పర్యావరణ చక్రంలో వాటి పాత్రను గుర్తుచేస్తాయి."Drunken Wolves" & "I Cannot Breathe" కవిత స్త్రీలపై జరిగే అత్యాచారాలను (నిర్భయ, దిశ ఉదంతాలు), మరియు అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య ద్వారా వెల్లడైన వర్ణ వివక్షను తీవ్రంగా ఖండించాయి."Murder! Thy Name is Encounter" & "Brutal Cops" కవిత చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఎన్‌కౌంటర్ల సంస్కృతిని, పేద యువకులపై పోలీసులు చూపే కర్కశత్వాన్ని ప్రశ్నిస్తాయి."Tragic Vasista" కవిత గోదావరి పడవ ప్రమాదంలో చనిపోయిన వారికి నివాళిగా, ఆ విషాదాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది."The Outspoken Leper" & "Ortho-Bracing"కవిత వ్యాధిగ్రస్తుల పట్ల జాలిని, వైద్య నైపుణ్యం వెనుక ఉండే కళాత్మకతను ప్రతిబింబిస్తాయి."Caste Corona" & "Beware of Dalit Brahmins" కవిత కుల వ్యవస్థను కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన మహమ్మారిగా వర్ణిస్తూ, అధికారం దక్కాక స్వవర్గీయులనే అణచివేసే 'దళిత బ్రాహ్మణుల' పట్ల హెచ్చరిస్తాయి."Political Chameleons" & "Celebrate it Your Way" కవిత రాజకీయ నాయకుల స్వార్థాన్ని, దీపావళి వంటి పండుగల వెనుక ఉన్న ధన వ్యయాన్ని మరియు రాజకీయ పరమార్థాన్ని విశ్లేషిస్తాయి.

"Peasant’s Predicament" & "A Hungry Belly" అనే కవిత అన్నదాతల ఆకలి కేకలను, హాస్టల్ జీవితంలోని కష్టాలను పంచుకుంటాయి."Father as ATM" & "Mother’s Day" కవిత నేటి యాంత్రిక జీవనంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఒంటరితనాన్ని, కేవలం ఒక రోజుకే పరిమితమైన కృత్రిమ ప్రేమని ఎండగట్టాయి."Ring in and Ring out" , "A Blame Game" కవితల ద్వారా సమయం గడిచిపోతున్నా, మనుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రానంత వరకు కొత్త సంవత్సరం వచ్చినా ప్రయోజనం లేదని కవి స్పష్టం చేశారు. "Invitation" ద్వారా సహచరులతో స్నేహాన్ని, "Gender" ద్వారా సమానత్వాన్ని కోరుకునే ఈ సంకలనం సమసమాజ స్థాపన కోసం పరితపించే ఒక మేధావి అంతరంగ ఆవిష్కరణ.

చివరగా, సమాజంలో వేళ్లూనుకున్న కపటత్వాన్ని ఎండగట్టడంలో భీమయ్య గారి శైలి నిశితంగా ఉంటుంది. "The Outspoken Leper" కవితలో “The world avoids you / Not because your disease is contagious, but because your truth is frightening” అని రాయడం ద్వారా, సత్యం అనేది నేటి సమాజంలో ఎంతటి భయానక వస్తువో ఆయన గుర్తుచేశారు. కుష్టు రోగిని ఒక నిక్కచ్చి నిజానికి ప్రతినిధిగా నిలబెట్టడం ద్వారా, మచ్చలు లేని మనసుతో వ్యవస్థలోని మచ్చలను ఎత్తిచూపే ధైర్యాన్ని ఆయన అభినందించారు.

"Childhood Memories" (బాల్య జ్ఞాపకాలు) "బాల్య జ్ఞాపకాలు" కవితలో కవి గతాన్ని గుర్తుచేసే భావచిత్రాల ద్వారా స్వచ్ఛమైన బాల్యానికి, సంక్లిష్టమైన వర్తమానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపారు. "చిరిగిన పుస్తకాలలో దాచుకున్న నెమలి ఈక" అనేది పేదరికంలో కూడా ఉండే సుకుమారమైన కలలకు, చిన్నపాటి సంతోషాలకు ప్రతీక. "వానలో కాగితపు పడవలు" కాలం యొక్క వేగాన్ని మరియు అమాయకత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కవి వాడిన "ఇనుప గోడలు" అనే రూపకం, పెద్దయ్యాక సమాజం విధించే ఆంక్షలను, బంధనాలను సూచిస్తుంది. ఈ క్రమంలో అమ్మ కౌగిలి, నాన్న ఓదార్పు అనేవి అలసిపోయిన ప్రాణానికి ఒక సేదతీర్చే నిలయాలుగా కనిపిస్తాయి. "వీధి బావి" కవితలో, కవి బావిని సామాజిక జీవనానికి,వెలివేతకు ప్రతీకగా వాడారు. "రాట్నం కిర్రుమనే శబ్దం", "బిందెల చప్పుడు" వంటి భావచిత్రాలు పల్లెటూరి సందడిని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. అయితే, బావి చుట్టూ ఉన్న "అదృశ్యమైన గోడలు" అనే రూపకం ద్వారా, నీటిని కూడా దూరం చేసే కుల వివక్షను కవి ఎండగట్టారు. బావి కేవలం దాహాన్ని తీర్చేది మాత్రమే కాదు, అది ఒక "సామాజిక గాయం". ప్రాథమిక అవసరమైన నీటిలో కూడా వివక్ష అనే విషం ఎలా కలిసి ఉందో ఈ ప్రతీక తెలియజేస్తుంది. ఇంగ్లీషులోని ఈ కవితలను తెలుగులోకి అనువాదం చేస్తున్న నేపథ్యంలో నా ఆనందానుభూతులను పాఠకులకు కూడా ముందుగానే పరిచయం చేయాలనే తపనతో ఈ వ్యాసాన్ని రాస్తున్నాను.కవితాభివ్యక్తి పరంగా, భీమయ్య గారు వస్తువుకు తగ్గ శైలిని ఎంచుకున్నారు. క్లిష్టమైన ప్రతీకలను వాడకుండానే, నిత్య జీవితంలో మనం చూసే కుక్క, బావి, పిడుగు వంటి అంశాల ద్వారా లోతైన సామాజిక సత్యాలను ఆవిష్కరించారు. ఆయన కవిత్వంలో అలంకారాల కంటే నిఖార్సైన నిజాయితీ ఎక్కువగా కనిపిస్తుంది. అణగారిన వర్గాల గొంతుకగా నిలబడటమే కాకుండా, ఒక నూతన సామాజిక స్పృహను కలిగించే దిశగా ఈ సంకలనం సాగుతుంది. విద్యావంతులకు, సామాజిక కార్యకర్తలకు, సాధారణ పాఠకులకు ఈ పుస్తకం ఒక మంచి చర్చా వేదికగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 21.6.2026

https://epaper.ninadam.in/category/10/sahitininadam

21.6.2026.నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' సౌజన్యంతో 

కామెంట్‌లు లేవు: