నేను...నా హైదరాబాదు చౌరస్తాలో…! (కవిత)
(నినాదం దినపత్రిక, 7.6.2026 సౌజన్యంతో)నన్ను హృదయానికి హత్తుకున్న
భారతమాత ఒడిలోని
ఒక వెచ్చని స్పర్శ నా హైదరాబాద్.
నేను ఎక్కడి నుంచి వచ్చినవాడినైనా
ఈ నగరం
నన్ను పరాయివాడిలా చూడలేదు.
వానలో తడిసిన పక్షికి
చెట్టు ఎలా ఆశ్రయం ఇస్తుందో
నన్ను తన నీడలో అలాగే నిలబెట్టుకుంది.
ఇక్కడి రోడ్లపై నడుస్తుంటే
దేశం మొత్తం
ఒకే చోట నడుస్తున్నట్టుంటుంది.
తెలుగు మాట పక్కనే
హిందీ నవ్వుతుంది
ఉర్దూ పలుకుతుంది
ఇంగ్లీష్ కలలు కంటుంది.
మనుషుల గుండెల భాష మాత్రం ఒకటే!
నా హైదరాబాద్ భిన్నమైన మనుషులు
ఒకే గుండెలో చోటు చేసుకోవచ్చని
నాకు నేర్పిన భరతమాత చిరునవ్వు.
గోల్కొండ కోట
కాలం మర్చిపోని
సర్దార్ పాపన్న గౌడ్ నిమిషాల పాలన
ఇరానీ చాయ్ వాసనతో
ద్వారకా హటల్ అంతా గభాళించే కవిత్వం!
హైటెక్ సిటీని చూస్తే నా దేశ యువత
కలలను కంప్యూటర్లలో నాటుతున్న
కొత్త యుగపు పొలంలా కనిపిస్తుంది!
ఈ మహా నగరం
నా వేల అడుగుల జ్ఞాపకాలను మోసే నేల.
ఇక్కడి రోడ్లపై నడుస్తుంటే
దేశం మొత్తం
ఒకే చోట కలిసి నడుస్తున్నట్టే ఉంటుంది
ఒక వైపు
చార్మినార్ గడియారాల్లో నిద్రలేపే చరిత్ర
మరో వైపు
హైటెక్ అద్దాల్లో మేల్కొనే భవిష్యత్తు.
ఒక చెవిలో అజాన్ ప్రతిధ్వని వినిపిస్తుంటే
మరో చెవిలో మెట్రో రైలు శబ్దం దూసుకుపోతుంది.
ఒక చేతిలోపాత జ్ఞాపకాల ధూళి అంటుకుని ఉంటే
మరో చేతిలో రేపటి కలల వెలుగు మెరుస్తోంది
ఈ నగరం కూడా నాలాగే ఉంది
భిన్న తీరాల మధ్య
తనని తాను అర్థం చేసుకోవాలని ప్రయత్నించే
ఒక అంతర్ముఖ ప్రయాణంలా!
నేను ఈ నగరాన్ని చూస్తున్నానా?
లేక
ఈ నగరమే నన్ను చదువుతోందా?
హైదరాబాద్ గాలిలో వివిధ భాషల ఊపిరి
వివిధ మతాల ప్రార్థన
ఆ సంగమం మధ్యలో నిలబడ్డ నేను మాత్రం
ఇంకా నా అంతరంగానికి చేరే దారిలోనే…!
చరిత్ర నన్ను వెనక్కి పిలుస్తుంటే
భవిష్యత్తు ముందుకు నెడుతోంది.
ఒక వైపు
అమాయకత్వం నా చేతిని పట్టుకుంటే
మరో వైపు
అనుభవం నన్ను అప్రమత్తం చేస్తోంది.
ఈ మహానగరంలో నేను
కేవలం ఒక మనిషినేనా
ఒక సగటు మషిగా నిలువగలనా?
భిన్న సంస్కృతుల మధ్య
భిన్న భావాల మధ్య, భిన్న కాలాల మధ్య
తన అసలైన తీరాన్ని వెతుక్కుంటున్న
ఓ సంఘర్షణగానే మిగిలిపోతుంటాను
నిరుద్యోగుల ఆశల పల్లకీ…!
హైదరాబాదు…దూరం నుంచి చూస్తే
వెలుగులతో కట్టిన స్వప్నం
ఉద్యోగ ప్రకటనలు
వానాకాల మేఘాల్లా వస్తుంటాయి…
కొన్ని వానచినులే తప్ప కుంభ వర్షం పడేదెప్పుడో
ఈలోగా కోచింగ్ సెంటర్ల పంట!
హాస్టల్ గదులు
ఇక్కడ కలల సమాధుల్లా ఉంటాయి.
నాలుగు గోడల మధ్య
గ్రామం నుంచి వచ్చిన అబ్బాయి
తల్లిదండ్రుల ఆశలను నిశ్శబ్దంగా మోస్తుంటాడు.
సాఫ్ట్‌వేర్ టవర్లు
రాత్రివేళ నక్షత్రాల్లా మెరుస్తుంటాయి.
ఆ గాజు గోడల కింద
రెజ్యూమ్ పట్టుకుని తిరిగే యువత
తన ప్రతిబింబాన్నే చూస్తుంటుంది
అది ఉద్యోగమో, అది తన నిరీక్షణో
ఎంత కాలం ఉంటుందో
ఊడిపడే ముక్కునెంతకాలం కాపాడుకోవాలో!
ఈ నగరం ఓ మాయలమారేమో
ప్రతీ మనిషి జీవితంమారిపోతుందనిపిస్తుంది
ఎవరిని పైకి లేపాలో
ఎవరిని కిందికి నెట్టాలో
తనకే తెలిసిన ఆటలా ఆడుతుంది.
అయినా ప్రతి ఉదయం
బస్ స్టాండ్‌ల్లో, రైల్వే ప్లాట్‌ఫామ్‌ల్లో
కొత్త కళ్లలో కొత్త ఆశలు దిగుతూనే ఉంటాయి.
మనిషి ఆశ కూడా హైదరాబాద్‌లాగే ఉంటుంది
ఎన్ని సార్లు మోసం చేసినా
మళ్లీ ఒక కొత్త కలనే నమ్ముతుంది.
***
ఉదయం తొమ్మిది గంటలైతే చాలు
రోడ్లన్నీ
ఇనుప పాముల్లా మెలికలు తిరుగుతాయి.
కార్ల హారన్‌లు చెవుల్లో కాకుండా
మనసులోనే గుచ్చుకుంటాయి.
మెట్రో స్తంభాల కింద
కాలం నిలిచిపోయినట్టుంటుంది.
ఓ కిలోమీటర్ ప్రయాణం
కొన్నిసార్లు ఒక జీవితకాల నిరీక్షణే!
హైదరాబాద్ ట్రాఫిక్ ఓ సహన పరీక్ష
సిగ్నల్ దగ్గర ఆగిన ప్రతి మనిషీ
తన జీవితాన్నే
ఓ రెడ్ లైట్‌లో నిలిపేస్తున్నట్టు కనిపిస్తాడు.
హైటెక్ సిటీ వైపు వెళ్లే రోడ్లు
ఉద్యోగాల కోసం పరుగెత్తే కలల నదులు.
ఆ నదుల్లో
వాహనాలే వరదలై ఉప్పొంగుతుంటాయి.
వాన పడితే ఇంకో యుద్ధం.
ఫ్లైఓవర్‌లు పెరుగుతున్నాయి
ప్రయాణం మాత్రం తగ్గడం లేదు.
రోడ్లు వెడల్పవుతున్నాయి
మనుషుల మధ్య దూరాలే పెరుగుతున్నాయి.
ఒకప్పుడు చార్మినార్ చుట్టూ
నడకలతో పలకరించిన నగరం
ఇప్పుడు మాట్లాడుతోంది ఫాస్ట్యాగులతోనే!
ఈ ట్రాఫిక్‌లోమనిషి ముందుకు కదలడు
అతని ఆలోచనలు మాత్రమే
సిగ్నల్‌ల మధ్య ఎరుపు-ఆకుపచ్చ రంగుల్లో ఊపిరాడక కొట్టుమిట్టాడుతుంటాయి.
ఈ నగరం ఇప్పుడు
శ్వాస తీసుకోవడానికి కూడా
వాహనాల మధ్య చోటు వెతుక్కుంటోంది.
సగటు వేగం తగ్గిపోతూ
నగరం మొత్తం నత్త నడకలో సాగుతోంది.
ప్రతీ ఉదయం మళ్లీ అదే రోడ్డు
ప్రతీ పౌరుడూ ఓడిపోని నిత్య యోధుడే!
భాగమతి ప్రేమే… ఓ నగర నిర్మాణం
కొన్ని నగరాలు
ఒక మనసు ఊపిరితో పుడతాయి.
మూసీ నదికి వాలిన చంద్రకాంతిలా
ఒక హృదయం
మరో హృదయాన్ని తాకిన క్షణం
భాగమతి ప్రేమాయణం!
చెట్టు తన నీడను నేలపై పరచినట్టుగా
ఆ ప్రేమ ఒక రాజు కలలపై పరచుకుంది.
మట్టిలో రహదారులు మొలిచాయి…
రాళ్లలో రాజభవనాలు పెరిగాయి…
నిశ్శబ్దంలో బజార్లు పలకరించాయి.
ఒక దీపం
మరో దీపాన్ని వెలిగించినప్పుడు
వెలుగు ఎలా వీధంతా వ్యాపిస్తుందో
ఒక ప్రేమ
మొత్తం నగరానికి అలాగే ఆత్మ అయ్యింది.
భాగమతి పేరే‘భాగ్యనగరం’
అదే మన హైదరాబాదు!
కొన్ని పేర్లు గాలిలో కలిసిపోయినా
ఆమె జ్ఞాపకం ఎప్పటికీ హైదరాబాద్ వీధుల్లో
ఆమె పరోపకారం జెండాలా రెపరెలలాడుతోంది!
పాతబస్తీ గల్లీల్లో
చాయ్ ఆవిరిలా ఎగసిపడుతుంది
ముత్యాల దుకాణాల్లో వెలుగులా మెరుస్తుందీ
మసీదు అజాన్‌లో
దేవాలయ ఘంటికల్లో
ఒకే ఆత్మలా వినిపిస్తుంది
భారతదేశ ప్రశాంతత లౌకిక స్వప్నంలా!
నది
తన రెండు ఒడ్డులను వేరు చేయదు.
ఆకాశం
తన కింద ఎగిరే పక్షులను వర్గీకరించదు.
ప్రేమ కూడా అంతే!
అది మతం అడగదు, భాష అడగదు
మనిషిని మాత్రమే ఆలింగనం చేస్తుంది.
భాగ్యనగరం ఒక ప్రేమకు ప్రతి రూపం
రాతిలో నిలిచిన శాశ్వతరూపం.
మహానగరం మిణుగురుల మహా మాయ!
నగరపు రాత్రి కొన్ని వీధుల్లో
అందమైన యువతుల నవ్వులే
మిణుగురుల వెలుగుల్లా
నగరమంతా విద్యుద్దీపాలతో మెరుస్తుంటాయి.
దూరం నుంచి చూస్తే
అవి వసంతం పిలిచే ఆహ్వాన పత్రాల్లా కనిపిస్తాయి
ఆ పిలుపుల వలపుల్లో ఎన్ని కన్నీటి చుక్కలో…!
ఆ చిరునవ్వుల రంగుల్లో కలిసిపోయాయో !
కొన్ని చూపులు
చేపలను ఆకర్షించే గాలంలా ఉంటాయి,
కొన్ని మాటలు
వేటగాడు అడవిలో చల్లిన గింజల్లా ఉంటాయి,
కొన్ని నవ్వులు
ఎడారిలో మెరిసే ఎండమావుల్లా ఉంటాయి.
చందమామ వెలుగులా కనిపించే
ఆ ముఖాల వెనుక
ఎన్ని అర్థరాత్రుల నిశ్శబ్దాలు
గాయాలుగా దాగి ఉంటాయో!
ఇప్పుడు వీధిదీపం కింద నిలిచిన
ఆమె ఒకప్పుడు
తల్లిపాటలో నిద్రపోయిన పాపే కదా
ఆమె కూడా ఎప్పుడో ఒకప్పుడు
రంగురంగుల కలలతో
భవిష్యత్తును గీసుకున్న అమ్మాయే కదా!
కాలమనే వ్యాపారి ఆ కలలను నాణేలుగా మార్చి
సమాజమనే బజారు ఆమె జీవితాన్ని
ధరల పట్టికగా వేలాడదీసేసింది!
ఆ ఆకర్షణల వెనుక ఉన్న
ఆర్తనాదాలు వినబడుతున్నా
విననట్లే చెవులెన్నో నటిస్తుంటాయి!
కొన్ని మిణుగురులు వెలుగు కోసం కాదు,
చీకటిని తట్టుకుని
బతకడం కోసం మాత్రమే మెరుస్తాయి.
ఆ నవ్వుల వెనుక దాగిన
నిశ్శబ్దాన్ని కొంతైనా చదవాలనిపిస్తుంది !
హైదరాబాద్ ఓ మెరుపుల నగరం!
స్టార్ హోటళ్లలో
గాజు గోడల మధ్య
సినీతారల మెరుపులు
నక్షత్రాల్లా తళుక్కుమంటుంటాయి.
క్లబ్బుల్లో సంగీతపు అలలపై తేలుతూ
వారి నవ్వులు
రాత్రిని రంగురంగులుగా చిత్రిస్తుంటాయి.
పబ్బుల్లో గ్లాసుల అంచులపై జారే వెలుగులు
క్షణిక ఆనందాల సంతకాలు చేస్తుంటాయి.
ఫామ్‌హౌస్‌లలో
పచ్చిక బయళ్ల నిశ్శబ్దం మధ్య
విలాసాల వసంతం
తన రెక్కలను విప్పుకుంటుంది.
దూరం నుంచి చూస్తే
అది నేలపై కనిపించే స్వర్గపు వేడుక
ఒక్కోసారి అధికారిక రక్షణకవచాలు!
ఆ వెలుగుల వెనుక
ఎన్ని ఒంటరితనాలు నీడల్లా నడుస్తున్నాయో!
ఆ నవ్వుల వెనుక
ఎన్ని నిశ్శబ్ద ప్రశ్నలు గుండెల్లో చిక్కుకున్నాయో!
ఆ మెరుపుల వెనుక
ఎన్ని కృత్రిమ రంగులు
జీవితపు నిజాలను కప్పిపుచ్చుతున్నాయో!
నగరం మాత్రం
వాటిని విజయాలను ఏవో ప్రతీకలుగా చూపిస్తుంది.
చిమ్మచీకటిలో
దీపం చుట్టూ తిరిగే చిమ్మటాల్లా
మనుషులు కూడా
ఆ మెరుపుల వైపే ఆకర్షితులవుతుంటారు.
అదే మెరుపు స్వభావం
క్షణం కనిపించి
మాయమయ్యే వెలుగుల జిలుగులు!
మనిషి హృదయం శాశ్వతంగా వెతికేది
కషణకాలపుమెరుపు కాదు
శాశ్వతంగా వెలిగే ఒక చిన్న దీపమే…
అది తెలిసేది మాత్రం
జీవితపు చివరిఅధ్యాయంలోనే!
ఆ రైడ్లెప్పుడూ చిన్న చిన్న క్లబ్బుల మీదే
చీకటి సందుల్లో ఉన్న
పేదల పబ్బుల తలుపులే విరిగిపోతాయి
ఆకాశాన్ని తాకే నక్షత్రాల హోటళ్లలో
అర్థరాత్రి తర్వాత ఏ ఆటలు జరుగుతాయో
మూసిన గదుల వెనుక
ఎన్ని ఒప్పందాలు చేతులు మారుతాయో
మత్తు వెలుగుల మధ్య
ఎన్ని జీవితాలు వస్తువులుగా మారుతాయో
ఎన్ని అధికారాలు, ఎన్ని సంపదలు
ఒకే టేబుల్ మీద
గ్లాసుల్లా ఢీకొంటాయో ఎవరికేమి ఎరుక?
చిన్న చేపల్ని పట్టే వలలు
ప్రతిరోజూ సముద్రంలోకి విసురుతారు.
తిమింగలాలు ఈదే లోతుల్లోకి
ఎన్ని వలలు వెళ్తాయి?
చట్టం కళ్లకు
చిరిగిన చొక్కా మాత్రమే త్వరగా కనిపిస్తుంది.
ఖరీదైన ఆ కోటు జేబుల్లో
దాగిన రహస్యాలు ఎందరికి కనిపిస్తాయో?
ఫిలింనగర్ చుట్టూ గిరకీలు కొట్టే
యువ కళాకారులెంతమందో…!
చేతిలో ఫొటో ఫైల్, జేబులో చిరిగిన ఆశలు,
కళ్లలో నిద్రలేని నక్షత్రాల కలలు
కళా ప్రదర్శనల కోసమే!
ఒక్క అవకాశం కోసం
వాళ్లు రోజుల్ని కాదు,
యవ్వనమంతా ఖర్చు పెడుతుంటారు.
ఆడిషన్ గదుల ముందు
వరుసగా నిలబడిన ముఖాలు
ఆకలి కళ్లతో దగ్దమవుతున్న రంగుల కలలు.
దూరం నుంచి చూస్తే
నక్షత్రాలు పూసిన ఆకాశంలా ఉంటుంది.
అది కొందరికి
వేలాది కలల శ్మశానంలా కమురువాసన.
వాళ్లు
తమ ముప్పై ఏళ్ల యవ్వనాన్ని
నిశ్శబ్దంగా దహనం చేసుకుంటున్నారు.
ఎప్పటికీ తిరుగుతూనే ఉంటారు
కులం వాసన గిట్టాలి
మతం మాటువేయాలి
ధనం నిలువెత్తున అభిషేకించాలి
అందమంతా తెలివిగా ఆరబొయ్యగలగాలి
లేదంటే తమను తామే గుర్తుపట్టలేని
స్థితికి చేరుకుంటూ చిద్రమైపోవాల్సిందే!
***
మూసీ నది ఒడ్డున
చరిత్ర తన జ్ఞాపకాలను దాచుకుంటే,
కొత్త ఫ్లైఓవర్లపై భవిష్యత్తుకు
కొత్త చరిత్రతో అడుగులు వేస్తుంది.
బస్తీలోని చిన్న గుడిసె నుంచి
ఆకాశాన్ని తాకే అపార్ట్‌మెంట్ వరకు,
రిక్షా తొక్కే చెమట నుంచి
కార్పొరేట్ గదుల్లో తీసుకునే నిర్ణయాల వరకు
అన్నీ ఇక్కడి కథలన్నీ కొత్త వస్తువులే
ఇక్కడ చార్మినార్ నీడలో
అత్తర్ పరిమళం అమ్మే చేతి నుంచీ,
సైబర్ టవర్ల వెలుగుల్లో
సాఫ్ట్‌వేర్ కలలు కనే యువకుడి వరకు
అందరికీ చోటుంది.
ఇదెవరి జన్మస్థలం కాకపోయినా,
ఎందరికో జీవనస్థలం...
చిరునామా లేని కలలకు
ఒక చిరునామా ఇచ్చిన నగరం.
పల్లెల నుంచి వలసొచ్చిన అలసిన కళ్లలో
ఆశల దీపాలు వెలిగించిన నగరం.
అనేక దారులు వచ్చి కలిసే కూడలి
అనేక సంస్కృతులు చేయి చేయి పట్టుకునే వేడుక
అనేక జీవితాలు తమ తమ కథలను రాసుకుంటూనే
ఒకే మహాకావ్యంగా మారిపోయే స్థలం.
***
ఒక నది
అడవిలో ప్రవహించినప్పుడు
తానెటు నుంచి వచ్చిన జలమో అడగదు.
వనభోజన బస్సుల్లో మాత్రం
ఇంటిపేర్లే ప్రత్యేక టికెట్లుగా మారిపోతుంటాయి
ఇక్కడి ఫంక్షన్ హాళ్లు
సంతోషాల మందిరాల్లా కనిపిస్తాయి.
కొన్ని సందర్భాల్లో
అవి కుల గర్వానికి కట్టిన కోటల్లా మారిపోతాయి.
ఒకే నగరంలో
ఒకే భాష మాట్లాడే మనుషులు
ఒకే గాలిని పీల్చుకుంటూ కూడా
భిన్న సంఘాలు, భిన్న కులాలు, భిన్న వర్గాల
చిన్న చిన్న గీతలతో
తమను తాము విడదీసుకుంటారు.
ఈ మహానగరం టెక్నాలజీతో ఎదిగినా
కొన్ని మనసుల అప్‌డేట్ మాత్రం
ఇంకా పూర్తికాలేదేమో!
***
ఈ నిజామ్ కళాశాల మైదానంలోనే
తొలిసారిగా నా గుండె దండోరా మ్రోగింది
ఈ బషీరాబాగ్ సెంటర్లోనే
ఉద్యమకారులపై లాఠీలు కదనరంగం చేశాయి
సెంట్రల్ వర్సిటీలో మొలకెత్తి
ఈ ప్రెస్ క్లబ్ లోనే
నా మాదిగ చైతన్యాక్షరాలు
కొత్తగొంతునాలపించాయి
ఈ ఇందిరా ప్రియదర్శినిలోనే
సహానుభూతినందించిన వారందరిమెడల్లో
నా మాదిగ గోల్డ్ మెడల్స్ పులకించాయి
ఈ జింఖానా గ్రౌండ్ లోనే
సామాజిక న్యాయం కోసం
ఎన్నిసార్లు దిక్కులు పిక్కటిల్లేలా
నా గొంతు బొంగురు పోయేలా అరిచానో!
ఈ నగరంలో ఉదయం కళ్లుతెరిచేలోపే
ఒక వార్త
గోడలపై పాత పోస్టర్‌లా కనిపిస్తుంది
ఏది చరిత్రకెక్కతుందో
ఏది చరిత్రను తొక్కుతుందో
చరిత్రకే తెలియాలి!
అవన్నీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బుక్ ఫెయిర్!
ఎక్కడేం జరిగిందో
ఒక ఫ్లైవోవర్ మీద ట్రాఫిక్ నిలిచిపోతుంది
మరోచోట
ఒక చిన్న టీ దుకాణం దగ్గర
దేశ రాజకీయాలన్నీ మరిగిపోతుంటాయి.
ఇక్కడ వాన పడితే
రోడ్లు నదులవుతాయో
నదులే రోడ్లవుతాయో
అర్థంకాని అయోమయం
అచ్చం రాజకీయ ఊరేగింపుల్లాగే!
హైదరాబాద్ ఒక విచిత్ర గడియారం
రవీంద్ర భారతి, శ్రీత్యాగరాయగానసభ,
హరిహరకళాభవన్, సిటీ సెంట్రల్ లైబ్రరీ…
వేదికలపై ఎవ్వర్ని సత్కరిస్తారో
ఏమైకులో ఏ కవిత్వం వినిపిస్తుందో
ఎక్కడ చూసినా, పొగడ్తల పూలో
ఉద్యమనినాదాలో తగులుతూనే ఉంటాయి!
కొన్నిసార్లు వీళ్ళేనా అనిపిస్తుంది
సివిల్ సర్వెంట్లై
ప్రదర్శించే అధికార దర్పాన్ని చూసినప్పుడల్లా
అశోక్ నగర్ లో పూటకూళ్ళుతింటూ
ఇరుకుగదుల్లో సర్దుకుపోయిన వాళ్ళు?
వీళ్ళేనా అనిపిస్తుంది
టీవీల్లోనో, సినిమాల్లోనో, పాఠ్యాంశాల్లోనో
చూసినప్పుడల్లా
మనతో సామాన్యుల్లా మెలిగిన
ప్రతిభావంతలైన కవులు, కళాకారులు?
ఒక మనిషి ఉద్యోగం కోల్పోయి
మెట్రో స్టేషన్ మెట్లపై కూర్చుంటే
మరో మనిషి కొత్త స్టార్టప్ కలలతో
రాత్రంతా కాఫీ తాగుతుంటాడు.
ఇందిరాపార్క్ ముందు ఆమరణ నిరాహారదీక్షలు
ఎప్పుడు ఎందుచేస్తారో
ఎప్పుడెందుకు ఆపేస్తారో
అర్థంకాని ఉద్యమ ఉద్రిక్త క్షణాలు!
ఈ నగరంలో ఎప్పుడు ఎవరు కలుస్తారో
ఎప్పుడు ఎవరు దూరమవుతారో ఎవరూ చెప్పలేరు.
ఇక్కడ స్నేహాలు కూడా సిగ్నల్ లైట్ లాంటివే
కొన్ని క్షణాలపాటు మాత్రమే
పచ్చగా వెలిగినా
అంతలోనే మనసును దాటిపోతుంటాయి.
నగరంలో ఎన్నో జరుగుతూనే ఉంటాయి.
బుద్ధుడు మాత్రం
సరస్సు మధ్యలో నిలిచిన ఒక నిశ్శబ్దపు ప్రశ్నలా అలాగే నిలబడి ఉంటాడు.
అలలు
తన పాదాలను తాకి వెనక్కి వెళ్తుంటాయి.
ఏ అలనూ తనలో దాచుకోడు.
మనుషులు కూడా అలలలాంటివారేనంటాడు!
కోపం… గర్వం… ద్వేషం వస్తుంది,
అన్నీ మళ్లీ వెళ్లిపోతాయి.
మనమే వాటిని శాశ్వత సత్యాలుగా
మన మనసులోనే నిల్వ చేసుకుంటాం.
హుస్సేన్ సాగర్ లోని ఈ బుద్ధుడు
సరస్సులో వికసించిన
తామరపువ్వులా ఉంటాడు.
బురదలో పుట్టినా
బురదను మాత్రం మోసుకెళ్లడు.
హైదరాబాద్ రాత్రి
వేల విద్యుద్దీపాలతో మెరిసిపోతుంటే
బుద్ధుడు మాత్రం
ఒకే సత్యాన్ని చెబుతున్నట్టుంటాడు
"వెలుగు బయట లైట్లలో కాదు,
మనిషి అంతరంగంలో వెలగాలి."
నగరాలు రోడ్లతో నిర్మించబడతాయి.
సామ్రాజ్యాలు ధనంతో నిర్మించబడతాయి.
మానవత్వం మాత్రమే
ప్రశాంతమైన మనసులతో నిర్మించబడుతుంది.
హైదరాబాద్ ఎంత మారిపోయినా
హుస్సేన్‌సాగర్ మధ్యలో నిలిచిన బుద్ధుడు
కేవలం ఓ శిల్పం కాదు
ఈ నగరం ఇంకా నేర్చుకోవాల్సిన పాఠం.
ఎండలో నిలిచిన మర్రిచెట్టులా అతడు నీడనిస్తాడు
ఎవరినీ తనవైపు రమ్మని పిలవడు.
ఆకాశంలో మెరిసే చంద్రుడిలావెలుగునే ఇస్తాడు,
తన వెలుగుకు ఏ ప్రతిఫలాన్నీ కోరడు.
సరస్సు ఒడ్డున
రోజూ వేల అడుగులు నడుస్తుంటాయి.
బుద్ధుడు అడిగే ప్రశ్న మాత్రం ఒక్కటే
"నీ ప్రయాణం ప్రపంచాన్ని జయించడానికా?
లేకనిన్ను నువ్వు తెలుసుకోవడానికా?"
హుస్సేన్‌సాగర్‌లోని ఈ బుద్ధుడు
కాలం మధ్యలో నిలబడి మనిషి మరచిపోయిన
మనిషితనాన్ని గుర్తు చేసే మౌనసందేశం!
డా.దార్ల వెంకటేశ్వరరావు , 29.5.2026
(నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'లహరి' 7.6.2026 సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి