అమ్మ కొంగు
అమ్మ చీర కొంగు
ఒక వస్త్రపు చివర కాదు
ఇళ్ళంతా ఊపిరి పీల్చే
ప్రేమకు వేలాడే జెండా.
పొయ్యిమీద మరిగే పాత్రను
చేతులు కాలిపోకుండా
దించేది అదే,
మా కళ్లలో పడిన దుమ్మును
ఊపిరితో వెచ్చబెట్టి
తుడిచేది అదే.
పాఠశాల నుంచి
చెమటోడ్చుకుంటూ వస్తే
మా ముఖాలపై జారే చెమటను
చల్లని మేఘంలా తుడిచేది
అమ్మ కొంగే.
మా బాల్యం
అమ్మ ఒడిలో నిద్రపోయిన రాత్రులైతే
ఆ రాత్రులకు దుప్పటి
అమ్మ కొంగే.
కొత్త మనుషులు ఇంట్లోకి అడుగుపెడితే
భయపడిన పిట్టల్లా
మేమంతా
అమ్మ కొంగు వెనకాలే దాక్కునేవాళ్ళం
ప్రపంచం ఎంత పెద్దదైనా
అమ్మ కొంగు పట్టుకున్న చిన్నచేతికి
అది అంతా
ఒక సురక్షితమైన గూటిలా అనిపించేది.
వర్షం పడితే
అది గొడుగయ్యేది,
చలి పెరిగితే
అది వెచ్చని పొయ్యయ్యేది,
కన్నీళ్లు వస్తే
అది తుడిచే గాలయ్యేది.
చెట్లకింద రాలిన పూలను
పండ్లను
ప్రసాదాలను
తనలో దాచుకుని తెచ్చేది.
అదొక చీర కొంగు కాదు
ఇళ్ళంతా మోసే
ఓ చిన్న ప్రపంచం.
అమ్మ కొంగులో
వేసిన ముడి
ఓనమ్మకం.
పోయిన వస్తువు దొరుకుతుందని
పిల్లల అదృష్టం తిరుగుతుందని
ఇంట్లో సంతోషం నిలిచిపోతుందని
నమ్మించే చిన్న మంత్రం.
కొన్నిసార్లు
ఆ ముడిలోంచి జారిపడిన రెండు నాణేలు
మా చిన్ననాటి పండుగలు.
అమ్మ చీర కొంగు
మా కన్నీళ్లకు తువ్వాలు,
మా భయాలకు కవచం,
మా అలసటకు దుప్పటి,
మా బాల్యానికి చిరునామా.
కానీ ఇప్పుడు
కాలం అలమారాలో
చీరలు మడిచిపెట్టబడ్డాయి.
జీన్స్ జేబుల్లో
ఆ వెచ్చదనం దొరకడం లేదు.
ఇప్పుడు పిల్లలు
అమ్మ చేతిని పట్టుకుంటున్నారు గానీ
ఆ కొంగును పట్టుకుని
ప్రపంచాన్ని గెలిచిన భద్రతను
అనుభవించడం లేదు.
అందుకే
ఇప్పటికీ ఎక్కడైనా
గాలిలో ఎగిరే చీరకొంగు కనిపిస్తే
అది కేవలం వస్త్రంలా
మన బాల్యంలా
ఇంకా ఎక్కడో బ్రతికే ఉందని
గుర్తు చేసే జ్ఞాపకం…!
— ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
5.9.2019

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి