సిద్ధాంత గ్రంథ రచన- మెలకువలు
(31 ఆగష్టు, 2019న ఓయూ సాహిత్య వేదిక నిర్వహించిన
సదస్సు సంక్షిప్త నివేదిక)
పి. నాగరాజు
విద్యార్థి, స్నాతకోత్తర తెలుగు శాఖ,
ఏ. వి. కళాశాల.
ఉస్మానియా
విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పరిశోధక విద్యార్థులు ఓ.యూ. సాహిత్య వేదిక పేరుతో ప్రతి
నెలా ‘తెలుగు పరిశోధన’పై కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదిక ద్వారా పరిశోధనా
రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందిన పరిశోధకులను, ఆచార్యులను పిలిపించి విద్యార్థులకు,
పరిశోధక విద్యార్థులకు పరిశోధనలో మెలకువలు నేర్పిస్తారు. ఈ క్రమంలో 31 ఆగష్టు,
2019 నాడు ఓ.యూ. సాహిత్యవేదిక నిర్వహించిన నాలుగో సమావేశానికి స్నాతకోత్తర తెలుగు
శాఖ, ఏ. వి. కళాశాలనుంచి హాజరయ్యాం. ఈ సదస్సులో ‘సిద్ధాంత గ్రంథ రచన- మెలకువలు’
అనే అంశంపై ప్రముఖ పరిశోధకులు, హైదరాబాదు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు దార్ల
వెంకటేశ్వర రావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్
ఆచార్య డి. రవీందర్ గారు, తెలుగుశాఖ అధ్యాపకులు డాక్టర్ సి. కాశీం గారు, ఇతర
పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ
ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఓ.యూ. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డి.
రవీందర్ గారు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, మీ వంటి యువ పరిశోధకులు చేసే పరిశోధనలు
కేవలం గ్రంథాలయాలకే పరిమితం కాకుండా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలని
ఆకాంక్షించారు. ఓయూ సాహిత్య వేదిక కేంద్రంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
తదనంతరం ముఖ్య ప్రసంగ కర్త ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు పరిశోధన స్వరూప,
స్వభావాలను, సాంకేతిక విషయాలను, ఆకరాల కూర్పు, ఉపయుక్త గ్రంథ నివేదిక, పరిశోధన
పత్ర సంక్షిప్తి మొదలైన మౌలిక విషయాలపై ప్రసంగించారు. వారి ప్రసంగ పాఠం ఈ కింది
విధంగా సాగింది.
పరిణాత్మక,
గుణాత్మక పరిశోధనలు (Qualitative & Quantitative Research)
ఆచార్య
దార్ల వెంకటేశ్వర రావు గారు మాట్లాడుతూ, పరిశోధకులు విశ్లేషణాత్మకమైన పరిశోధనలు
చేయాలన్నారు. పరిశోధనలు పరిణామాత్మక(క్వాంటిటేటివ్), గుణాత్మక(క్వాలిటేటివ్) పరిశోధనలు
అని రెండు విధాలని చెప్పారు. పరిణామాత్మక పరిశోధనలు చేయాలంటే చాలా కష్టంతో కూడిన
పని అని అన్నారు. దీనికి క్షేత్ర పర్యటన (ఫీల్డ్ వర్క్) అవసరమన్నారు. పరిణామాత్మక
పరిశోధన మౌలికమైన పరిశోధన. ఉదాహరణకు రచయితల గురించి పరిశోధన చేయాలంటే సమాజంలోకి
వెళ్లి, ఆ రచయితల పుట్టుపూర్వోత్తరాలు సేకరించి, వారి రచనా వ్యాసంగాన్నంతటినీ
(గ్రంథాలను) ఒక వరుస క్రమంలో కూర్చుకొని, పరిశోధిస్తేనే, ఆ పరిశోధన ఎక్కువ కాలం
నిలుస్తుందని అన్నారు. గుణాత్మక పరిశోధన అప్పటికే వచ్చిన లిఖిత రచనలపైన చేయాల్సి
ఉంటుంది. ఆయా గ్రంథాల్లో ఉన్న సమాచారం ఎంతవరకు సమగ్రంగా ఉన్నదో సరిచూసుకొని,
దానికి అనుగుణంగా దాన్ని అనుసరిస్తూ రాయడమే గుణాత్మక పరిశోధన అని నిర్వచించారు. ఈ
గుణాత్మక పరిశోధన భుజబలం మీద, విస్తృత అన్వేషణల మీద ఆధారపడి ఉంటుందన్నారు. ఈ రెండు
రకాల పరిశోధనల్లో విద్యార్థులు ఏ రకమైన పరిశోధన విధానాన్ని అనుసరించాలో ముందే
నిర్ణయించుకోవాలన్నారు. ఒక పుస్తకాన్ని అనువాదం చేసినప్పుడు మూల గ్రంథ రచయిత
పేరును, అనువాదకుని పేరును తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుందని నొక్కి చెప్పారు.
‘పరిశోధన పరిచయం’లో ఈ కింది విషయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. అవి:
1.
పరిశోధన లక్ష్యాలు
2.
క్షేత్ర పరిశోధన లేదా గ్రంథ పరిశోధన
3.
పూర్వ పరిశోధనల సమీక్ష
అదేవిధంగా
సిద్ధాంత గ్రంథ రచనలో, అనుబంధాల కూర్పులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పారు.
పరిశోధన గ్రంథం ఐదు అధ్యాయాలు తగ్గకుండా ఉండాలని, 250 పేజీల కంటే ఎక్కువ ఉండాలని
చెప్పారు. ఆ తరువాత ప్రస్తుతం ఆకర సూచిని ఎలా ఇస్తున్నారో సవివరంగా ఈ కింద
చెప్పారు.
ఆకర సూచి
పద్ధతులు
ఆకరాల్లోని రకాలకు కూడా
వివరిస్తూ, ప్రాథమిక, మాధ్యమిక ఆధారాలతో పాటు, తృతీయాధారాలను కూడా సోదాహరణంగా వివరించారు. ఆ
ఆధారాల్లో సిద్ధాంత గ్రంథంలో తీసుకోవాల్సిన మౌలిక ఆధారాలు గురించి వివరించారు. రిఫరెన్సులనేవి మేధోసంపత్తిని కాపాడే ఆకరాలు. వాటిని
భావచౌర్యం చేయకుండా, ఇతరుల అభిప్రాయాలను వాడుకుంటూనే, మన ప్రతిపాదనలను చేయడానికి అవి
ఉపయోగపడతాయి. అప్పుడే పరిశోధనకు శాస్త్రీయమైన విధానం అలవడుతుంది. ఈ లోపం తెలుగు
పరిశోధనల్లో విరివిగా కనిపిస్తుందన్నారు. తెలుగు సాహిత్యం, భాషా శాస్త్రాల్లో ఉపయోగిస్తున్న
పరిశోధన పద్ధతులను వివరించారు.
అలాగే ఆధార గ్రంథాల సూచి గురించి చెప్పిన విధానం
ఉదాహరణగా రెండు ఇచ్చారు. అది APA పద్ధతిలోవే వివరించారు. అది మీరు చెప్పాలి. నిజానికి
ఇలాంటివి రిపోర్టింగ్‌లో పేజీకిల్లర్స్. ఇస్తే రెండు పద్ధతులు ఇవ్వాలి. అలాగే, MLA పద్ధతి
గురించి ఒక విద్యార్థి వివరణ సమయంలో మాత్రమే దాని పూర్తి సాంకేతిక పారిభాషిక వివరణ
చేయలేదు. ముందే దాన్ని చెప్పి, వివరణ సమయంలో మళ్ళీ చెప్పాను. ఆకరాలను(రిఫరెన్సు)
ఇచ్చే పద్ధతిలో కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉన్నా, రకరకాలుగా ఇస్తున్నారు. కొందరు
పరిశోధకులు ఏ పుటకు ఆ పుటలోనే కింద (పాద సూచికగా) ఇస్తున్నారు. మరికొంతమంది పరిశోధకులు రిఫరెన్సుల నెంబర్ ఇచ్చి, ఆ రిఫరెన్సులు
తెలిపే వివరాలను అద్యాయానికి చివరలో ఇస్తున్నారు. ఇంకొంతమంది పరిశోధనలో
అంతర్భాగంగానే రచయిత పేరు, పుస్తకం పేరు,
పుటలను ఇస్తున్నారు. మరికొంతమంది రిఫరెన్సులు ఇవ్వకుండా ఆ గ్రంథాలను లేదా ఆ
రచయితలను ఉటంకిస్తూ చివరలో ఆధార గ్రంథాల జాబితాలను ఇస్తున్నారు. పరిశోధనా వ్యాసాల్లో కూడా కొంతమంది
రిఫరెన్సులు ఇవ్వకుండా కొంతమంది అభిప్రాయాలు చెబుతారు. ఆ ఆకరం ఎక్కడినుంచి
తీసుకున్నారో, ఆ మూల గ్రంథ కర్త ఎవరో స్పష్టంగా చెప్పట్లేదన్నారు.
సిద్ధాంత
గ్రంథ రచన- సాధారణ నియమాలు
ప్రస్తుతం
M.L.A. హ్యాండ్ బుక్ 8వ, ఇండియన్ (Edition)ఎడిషన్‌ను అనుసరిస్తున్నారు. M.L.A. అంటే `Modern
linguistic association of America’ అని ఒక విద్యార్థి అడిగిన
సందేహానికి సమాధానమిచ్చారు. I ఈ పద్ధతిలో రాస్తే, M.L.A. రచనా పద్ధతి (Style sheet)అంటారు. దీంతోపాటు A.P.A. అంటే `American psychological association’ రచనా
పద్ధతిని కూడా ఉపయోగిస్తున్నారని చెప్పారు. భాషాశాస్త్రంలో ఎక్కువగా A.P.A. పద్ధతి ద్వారా రిఫరెన్స్‌లను, ఉపయుక్త గ్రంథసూచిలను (Bibliography) ఇస్తున్నారన్నారు. పరిశోధనా గ్రంథం రచనా ప్రారంభానికి ముందే M.L.A. రచనా పద్ధతి (M.L.A. Style sheet) ప్రకారం రాయాలా? లేక A.P.A.
రచనా పద్ధతి (A.P.A Style sheet) ప్రకారం రాయాలా అని
పరిశోధకుడు నిర్ణయించుకోవాలి. పరిశోధకుడు తన గ్రంథ రచనా ప్రవేశికలో ఫలానా శైలీ
పద్ధతిని/రచనా పద్ధతిని (Style sheet) అనుసరిస్తున్నానని
ముందే చెప్పి దాని ప్రకారం సిద్ధాంత గ్రంథాన్ని రాయవలసి ఉంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది పరిశోధకులు ఎక్కువగా M.L.A. రచనా పద్ధతిని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం M.L.A.
రచనా పద్ధతి ఎనిమిదవ ఎడిషన్ అందుబాటులో ఉందని చెబుతూ, ఏడవ ఎడిషన్‌లో లేని కొత్త
అంశాలను సోదాదహరణంగా చూపించారు. సిద్ధాంత గ్రంథ రచనలో పాటించాల్సిన సాంకేతిక
విషయాలను ప్రస్తావించారు.
సిద్ధాంత
గ్రంథ రచన- సాంకేతిక, స్వరూప, స్వభావ విషయాలు
పరిశోధన
గ్రంథానికి మంచి తెల్ల కాగితాన్ని ముద్రణకోసం వాడాలి. తెలుగులో యూనికోడ్ ఫాంట్ గౌతమి- 12, పేజి మేకర్ అయితే, ప్రియాంక- 16 వాడుతున్నారన్నారు.
డబుల్ స్పేస్‌లో ఉంటే మంచిదని చెబుతూ, తెలుగులో దీన్ని సరిగ్గా పాటించడం
లేదన్నారు.
సాధారణంగా
ఎం. ఫిల్. పట్టాకోసం సమర్పించే సిద్ధాంత గ్రథంలో పరిశోధన పద్ధతులను (Research
Methodology) అభ్యసనం చేయడం ఉపయుక్తమవుతుంది. వాటిలో కొన్ని సిద్ధాంతాన్ని
ప్రతిపాదించేవి కూడా ఉంటే ఉండొచ్చు. కానీ, స్వభావం రీత్యా పరిశోధనా పద్ధతిని అనువర్తించడానికి
ప్రాథమిక దశలో విద్యార్థులు చేసే ప్రయత్నం ఎం. ఫిల్.లో ఉంటుందనవచ్చు. అందువల్ల దీన్ని
పరిశోధనా వ్యాసం అనడమే సమంజసమన్నారు. ఎం. ఫిల్. స్వరూపంలో మెథడాలజీని అనుసరిస్తూ
భాషా సాహిత్య పరిశోధనల్లో A4 సైజులో సుమారు 100-120 పుటల్లో ఉంటుంది. తెలుగు భాషా సాహిత్యాల్లో మొదట్లో
వీటిని చేతిరాతతో సమర్పించేవారు. తరువాత టైప్ చేయించేవారు. ప్రస్తుతం కంప్యూటర్‌లో
డి. టి. పి. చేసిన ప్రతులను సమర్పిస్తున్నారు. ఒక పుటలో సుమారు 25 నుండి 35
లైన్లలో ఉంటే బాగుంటుంది. అది 16 ఫాంట్‌లో ఉండి, డబుల్ లైన్ స్పేస్‌లో ఉంటే స్పష్టంగా ఉండి,
చదవడానికి అనుకూలంగా ఉంటుంది. పత్రికలకు పంపే పరిశోధనా పత్రంలో గౌతమి( యూనికోడ్) 12 ఫాంట్ సరిపోతుంది.
పవిత్ర
గ్రంథాలుగా భావించే భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి మత గ్రంథాలు, న్యాయ సూత్రాలు
వివరించే రాజ్యాంగం, రాజనీతి శాస్త్ర పత్రాలను వివరించే గ్రంథాలు మొదలైన ప్రఖ్యాత
గ్రంథాలను అండర్ లైన్ చేయడమో కొటేషన్స్ పెట్టడమో అవసరం లేదు. Preface, introduction, index, bibliography, appendix మొదలైన ప్రత్యేక హోదాలను తెలిపే పదాలను
అండర్లైన్/ కొటేషన్స్ పెట్టడం వంటివి చేయనవసరం లేదని చెప్పారు. పరిశోధన పద్ధతుల మీద ఇప్పటికే అందుబాటులో అనేక పుస్తకాలను వారు
వివరించారు. వారు సూచించిన పుస్తకాల్లో కొన్ని ఈ కింద విధంగా ఉన్నాయి.
ప్రవేశికలో పరిశోధకులు
పేర్కొనవలసిన లేదా ప్రస్తావించాల్సిన అంశాల్లో పరిశోధన లక్ష్యం, ఆశయం, పూర్వపరిశోధనల
సమీక్ష, పరిశోధన పరిధి, పరిశోధన పద్ధతి, క్షేత్రపరిశీలనాంశాలు మొదలైనవి ఉండాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు. సాహిత్య
పరిశోధనలో ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు పేర్కొన్న విధానాలను సూచించారు.
కవిజీవిత కావ్య సమన్వయ పరిశోధన, తులనాత్మక, చారిత్రక పద్ధతులతో పాటు, పరిష్కరణ
పద్ధతి మొదలైన వాటిని సోదాహరణంగా వివరించారు.
పరిశోధన
విధానం: కొన్ని తెలుగు పుస్తకాలు
1.
పరిశోధన పద్ధతులు- ఆర్. వి. ఎస్. సుందరం, హైదరాబాద్: యువభారతి. 1990.
2.
పరిశోధన విధానం- ఎన్. జయప్రకాష్. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లిషింగ్
హౌస్.1993.
3.
జి. వి. ఎస్. వ్యాసాలు- జి. వి. సుబ్రహ్మణ్యం, శ్రీవాణి ప్రచురణలు.1993.
4.
సాహిత్య పరిశోధన సూత్రాలు- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, హెచ్, ఎస్. బ్రహ్మానంద. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లిషింగ్. హౌస్, 1997.
5.
విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధ-వెలిదండ
నిత్యానందరావు. హైదరాబాద్: స్వీయ ప్రచురణ, 1998.
6.
సాహిత్య పరిశోధన పద్ధతులు-కె. కుసుమాబాయి, 2001.
7.
తెలుగు పరిశోధన పత్రిక ఎన్. గోపి, వాసిలి వసంతకుమార్ (సంపాదకులు
).
పరిశోధన పత్ర
సంక్షిప్తి (abstract)
పరిశోధన
సారాంశాన్ని అత్యంత సంక్షిప్తంగా రాయాలి. అంతేగాని ఒక పేరును, ఇతరుల అభిప్రాయాలను
రాయకూడదు. వివాదాస్పద ప్రకటనగానో, వ్యాఖ్యగానో కాకుండా పత్రాన్ని
చదివించేలా, పరిశోధకుని లోతైన విశ్లేషణ తెలిపేలా ఉండాలి. ఈ కింది రెండు అంశాల్ని
ప్రతిఫలించేలా సంక్షిప్త ఉండాలి.
1.
ఒక నూతన ప్రతిపాదన చేయడం లేదా సమస్య పరిష్కారాన్ని
వివరించేలా వర్ణనాత్మకంగా చెప్పడం.
2.
తాను అనుసరించబోయే పరిశోధనా పద్ధతిని
వివరించడం ఉండాలి.
ఆధార గ్రంథ
సూచి(work cited)
పరిశోధన
గ్రంథం రాయడం పూర్తి అయిన తరువాత చివర్లో ఉపయుక్త గ్రంథసూచిని కచ్చితంగా రాయాలి. మన
గ్రంథాన్ని రాసేటప్పుడు, ఇంతకుముందు పరిశోధకులు రాసిన గ్రంధాన్ని సమాచార సేకరణ
కోసం ఉపయోగించుకుంటాం కనుక, సంబంధిత పరిశోధకుని పేరు, వారు రాసిన గ్రంథ నామం,
మొదలైన వివరాలను ఇవ్వాలి. ఈ కింద APA పద్ధతిలో ఆధార గ్రంథ
సూచిని ఇవ్వడమైంది.
1.
ఇనాక్, కొలకలూరి.
1990. ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం. గుంటూరు: శ్రీ వాణి ప్రచురణలు. 18వ ముద్రణ.
2.
చంద్రశేఖర రెడ్డి, రాచపాలెం. 2010. తెలుగు
సాహిత్య విమర్శ పరిశోధనా వ్యాసాలు. హైదరాబాద్: విశాలాంధ్ర బుక్ హౌస్. ద్వితీయ ముద్రణ.
అదే విధంగా పై
గ్రంథాలను MLA పద్ధతిలో ఈ కింది విధంగా రాయవచ్చు.
1.
ఇనాక్, కొలకలూరి.
ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం. గుంటూరు: శ్రీ వాణి ప్రచురణలు. 18వ ముద్రణ, 1990.
2.
చంద్రశేఖర రెడ్డి, రాచపాలెం. తెలుగు సాహిత్య విమర్శ పరిశోధనా వ్యాసాలు. హైదరాబాద్: విశాలాంధ్ర బుక్ హౌస్. ద్వితీయ ముద్రణ, 2010.
ముఖ్య ప్రసంగ కర్త మాట్లాడిన తరువాత, ఓయూ తెలుగు శాఖ అధ్యాపకులు
డాక్టర్ కాశీం గారు తమ స్పందనను తెలియజేసారు. వారు విద్యార్థులు తప్పనిసరిగా
చదవాల్సిన కొన్ని పుస్తకాలను పరిచయం చేశారు. దేవులపల్లి రామానుజరావు గారి
సంపాదకత్వంలో వెలువడిన ‘తెలుగు పరిశోధన’ అనే పుస్తకాన్ని చదవమని సూచించారు. ఆయన చెప్పిందేమిటంటే, ఏ శాస్త్రానికైనా పద్ధతులు
కొన్ని ఉంటాయి. వాటిని పాటించడం వల్ల శాస్త్రీయత వస్తుంది. సమకాలీన సమాజానికి
కావలసిన నిత్యనూతన పద్ధతులను కూడా అన్వేషించాల్సివస్తుంది. అందువల్ల పాతవాటినే
పట్టించుకోవడం, కొత్తవాటిని విస్త్మరించడం మంచిది కాదన్నారు.
ఇలాంటి
ఎన్నో విషయాలను పరిశోధకులకు, మా వంటి స్నాతకోత్తర స్థాయి విద్యార్థులకు అర్థమయ్యే
రీతిలో ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు అందించారు. వారు ప్రసంగానంతరం
విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయటం చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది.
స్నాతకోత్తర స్థాయి పూర్తయ్యేవరకు విద్యార్థులు స్వంతంగా తమ పరిశోధనాంశాన్ని
ఎన్నుకోవడానికి ఇటువంటి సమావేశాలు ఎంతగానో దోహదపడుతాయి. ఇంతటి సదవకాశాన్ని
కల్పించిన ఓ.యు. సాహిత్య వేదిక నిర్వాహకులకు కృతజ్ఞతలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి