మే 9, 2026, ప్రపంచ వలస పక్షుల దినోత్సవం
(World Migratory Bird Day).
చెట్టు నమ్ముక పక్షులు చేరు నచట
ఫలము లొసగెడు తరువును మరువ వవియు
అతిథి వచ్చిన యప్పుడు ఆదరించి
గౌరవము నిచ్చెడి గృహస్థు కరణి నవియు.
దూర తీరము లేగియా పులుగు గూడు
నింపు కోరిక తోడను నెమ్మి జేరు
పనుల కైబోయి తనయింటి బాట పట్టి
నరులు ముదమున జేరున న్నటుల గనుము.
ఏటి లోనున్న నీటిని నెమ్మి కోరి
దివిని నెగయుచు వచ్చెడు ద్విజము లెపుడు
తల్లి ప్రేమను చవిచూడ తనయ లేగు
పుట్టి నింటికి వేడ్కతో బోవు నట్లు.
ధరణి పక్షిస మూహముల్ దనరు చోట
పాడి పంటలు వృద్ధిని బడయు నెలమి
మంచి బిడ్డలు పుట్టిన యింట నెపుడు
సిరులు సంపదలుప్పొంగి చెలగు నట్లు.
విహృతి కైబోవు విహగముల్ వేడ్క మీర
తిరిగి చేరును గూటికి తీపి తోడ
కష్టమార్జించి గృహమున కలుగు సుఖము
గోరుచుండెడు మానవ గుణము వోలె.
డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు
(ఈ దినోత్సవాన్ని ఏడాదిలో రెండుసార్లు మే మరియు అక్టోబర్ నెలల్లో వచ్చే రెండవ శనివారం, నిర్వహిస్తారు.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి