"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

26 ఏప్రిల్, 2026

పసి పిల్లలు.. పద్య పారిజాతాలు

 ఆదివారము వచ్చిన హాయి గొలుపు

శ్రీనివాసుని తోడను చిన్ననాటి

ఆటపాటల మునిగియు నలసటెరుగ

మరువలేనట్టి తీయని మమతలివియె!


చిన్ని బాబుతో నాటలు చెలగి ఆడ

కలుగు నెమ్మది నాకెంతొ కమ్మనైన

లోకమంతయు మరతును జోకతోడ

శ్రీనివాసుని నవ్వుల చిందు చూసి!


ఆదివార మయ్యె నలసట తీరెను

శ్రీనివాసు తోడ జేరి యాడ

తనివి తీరదాయె తండ్రికి నెప్పుడు

బుజ్జి బాబు ఆట పొందు చూసి!


అలసి వచ్చిన నాకును హాయి నిచ్చు

శ్రీనివాసుని ముద్దుల చిన్ని మాట

ఆటపాటల యందున నలపు మరచి

అలరుచుందుము మేమిద్ద మమత తోడ!


ఆ.వె.

పనుల భారమెల్ల పక్కకు నెట్టేసి

శ్రీనివాసు తోడ జేరి యాడ

స్వర్గమన్న దిక్కె సతము నీ ధర పైన

మురిసిపోవు నాదు ముద్దు బాబు!


చిన్ని పాపల నవ్వుల చిందు చూసి

మరచి పోదురు పెద్దలు మమత తోడ

కష్ట భారము తీరిన కైవడిగను

తేలు చుందురు హాయిగా దివిని మరిచి!


సరసి లోపల వికసించు జలజము వలె

ముద్దు లొలికెడి పిల్లల ముఖము జూడ

కష్ట భారము తొలగును కమ్మనైన

తేట గీతుల మాధురి తీరు గాగ!


కలువ వికసించు వెన్నెల గాంచినట్లు

పిల్ల లాటలు గన్నట్టి పెద్దలంత

మురిసి పోదురు మనసున మోద మలర

చిన్ని పాపల నవ్వుల చిందు చూసి!


ఎండ కాయగ వానజల్లులును కురియ

పుడమి పులకించి హాయిని పొందు నట్లు

ఆట పాడెడి బిడ్డల నరసి నంత

మరచి పోదురు లోకము మమత తోడ!


విరిసినట్టి పూదోటలో విహరి నట్టి

తేనె టీగలు పొందును తీపి నట్లు

చిన్ని పాపల చెంతను జేరు నట్టి

పెద్ద లందరు పొందుదు రద్ది నంత!


నదియు పారి పోయి నలధిలో గలిసిన

రీతి గాగ మనసు ప్రీతి తోడ

పిల్ల లాట లందు పల్లవించిన యెడ

మరచి పోదు రంత మమత తోడ!


దీప మొకటియు రాగానె దిశల వెలుగు

చిన్ని నవ్వులు చూడగ చింత వీడు

ఆట పాటల లోనను హాయి మీర

సత్య మిదియె సుమీ స్వర్గ సౌఖ్య మనగ.


నీల మేఘము గాంచిన నెమలి భంగి

పిల్ల లాటల గన్నట్టి పెద్ద లంత

మురిసి పోదురు మమతతో మోద మలర

పసిడి బాలల నవ్వుల ప్రబల గనుచు!


కమ్మ నైనట్టి పండులో కలుగు తీపి

తిన్న వారికే తెలియును తీరు గాగ

చిన్ని పాపల చెంతను జేరి నట్టి

కన్న వారికే తెలియును కమ్మ దనము!


విరిసి నట్టి పూదోటలో విరుల తావి

మెల్ల గాను వీవగ హాయి మీర నట్లు

ముద్దు లొలికెడి బిడ్డల ముచ్చటైన

మాట లాడగ మనసున మాధురులను!


వాన చినుకులు పడగను వసుధ పైన

కమ్మ నైనట్టి తావియు కలుగు నట్లు

ఆట లాడెడి బిడ్డల అరసి నంత

హాయి కలుగును మనసున హద్దు లేక.


చిలుక పలుకులు వినగను చిత్త మలరు

గోరు వంకల ఆటలు కోర్కె మీర

పసిడి బిడ్డల నవ్వుల ప్రబల గనుచు

మురిసి పోదురు తలిదండ్రు లుదిత మునను!


అలలు సాగర మందున అలపు లేక

తీర మందున జేరుచు తేలు నట్లు

బాల లాటల యందున పరవ శించి

మరచి పోదురు లోకము మమత తోడ!


పండు వెన్నెల కాయగ పరవశించి

జగము వెలుగుల నిండియు జనము నలరు

బుజ్జి పాపల నవ్వులు పొదలు నింట

హాయి నిచ్చును కన్నవ రాత్మ లందు!


వచ్చునువసంత కాలము వనము లోన

కోయి లమ్మల పాటలు కోర్కె మీర

బాల లాడెడి ఆటలు పరవ శించి

మురిసి పోదురు తలిదండ్రు లుదిత మునను!


విరిసి నట్టియు పుష్పము విలువ గలుగు

తేనె యుండును లోపల తీపి మీర

చిన్ని పాపల ఆటల చిందు లందు

మధుర మాధురి నిండును మమత తోడ!


పిల్లల ఆటపాటలు:

పెరిగి పెద్దవా డగుచును పిల్ల వాడె

చేత బట్టును సెల్ ఫోను చింత లేక

లోక మంతయు అందున లొగియు నుండ

కన్న వారితో ఆటలు కరువ యయ్యె!


టీవి లోపల బొమ్మల ఠీవి జూచు

కనుల నార్పక కార్టూను కథల యందు

బయట ఆటల సందడి పాడె ననగ

మురిసి పోవును ఆ మాయ ముసుగు లోన!


పిలువ పలకడు తండ్రియు ప్రియము తోడ

యంత్ర లోకాన మునిగియు యలపు లేక

తండ్రి తోడును విడనాడి తనదు ధ్యాన

మంతయు మొబైలు నందేను మగ్న మయ్యె!


టాము జెర్రీల పోరాట టాల జూచి

నవ్వు చుండును బాబు తా నలపు లేక

వింత బొమ్మల చేష్టలు విందు జేయ

కన్న వారల మనసున కలుగు హాయి!


భయము గొలిపెడి గ్రానీయు భయము నందు

ఆట లాడును బాబు తా అలపు లేక

వణికి పోవుచు నున్నను వదల డెపుడు

వింత లోకాన మునిగియు విందు జేయు!


వణికి పోవుచు నున్నను వదల డెపుడు

భయము గొలిపెడి గ్రానీయు భయము తోడ

ఆట లాడును బాబు తా అలపు లేక

వింత లోకాన మునిగియు విందు జేయు!


పిలువ పలకడు బాబు తా ప్రియము తోడ

యంత్ర లోకాన మునిగియు యలపు లేక

తండ్రి పిలుపును వినకను తనదు ధ్యాన

మంత గేమ్ పైన నుండును మగ్న మయ్యె!


నాడు మనతోడ ఆటలు నయము గాను

ఆడె నప్పుడు బాబు తా అలపు లేక

నేడు ఫోనుల మాయలో నిలచి పోయె

మరచి పోయెను లోకము మమత తోడ.


హగ్గి బగ్గీయు ననెడి ఆ హరువు రూప

మొకటి జూచుచు బాబు తా మురిసి పోవు

భయము గొలిపెడి చేష్టల భంగి గనుచు

నవ్వు చుండును వింతగ నలపు లేక!


పాపి బొమ్మల వింతైన పాట జూచి

వణికి పోవుచు నున్నను వదల డెపుడు

భయము గొలిపెడి చేష్టల భంగి గనుచు

నవ్వు చుండును బాబు తా నలపు లేక.


డోరె మానును జూచుచు డోల నూగు

చిన్ని గాడ్జెట్ల వింతల చింత వీడి

నోబి తాతోడ బాబు తా నోల లాడు

వింత లోకాన మునిగియు విందు జేయు.


గనిన షిన్ ఛాను నల్లరి గౌరవమున

నవ్వు చుండును బాబు తా నలపు లేక

వింత మాటల విడ్డూర విందు గనుచు

మరచి పోవును లోకము మమత తోడ!


కనిన మోగ్లియు సాహస కథల యందు

వరుసను భగీర తోడును వరుస గనుచు

అడవి లోకాన తానొక అతిథి వోలె

మురిసి పోవును బాబు తా ముదము తోడ!


చూడ రుద్రుని సాహస జూటతనము

ఉరికి దుష్టుల గొట్టెడి ఉరవడినియు

తానె హీరోగ నటియించు తలపు మీర

పసిడి నవ్వుల బాబు తా పరవశించు!


ఆట లాడడు నేడట అనిశ మందు

కరువ యయ్యెను నేడట కలత మీర

వరుస వాలిబా లాటలు వనము నందు

బోసి పోయెను నేడట పొలము లెల్ల!


పల్లె కాదిది నేడట పసను లేక

గోలి లాటలు నేడట కొరవ డెనులె

గ్రామ సీమల మాయమౌ గరిమ జూడ

బోసి పోయెను వీధులు పొదులు మీర!


తల్లి దండ్రుల కిప్పుడు తలపు లేక

లేక పోయెను బిడ్డల లేమ నంగ

పనుల భారాన మునిగియు పరవ శించి

మరచి పోదురు పిల్లల మమత తోడ!


వృత్తి పనులలో నందరు వివశ మొంది

చేర దీయరు సుతులనూ చెంత నిలిచి

అలసి సొలసియు ఇంటికి అరుగు దేర

నిదుర పోదురు బిడ్డలు నిఖిల మరచి!


వీథి యందున సందడి విరియ దాయె

గోల లేకను గ్రామము కొమరు దప్పె

నాడు ఆడిన బొంగర నడక లాగె

చూడ రెవ్వరు నేడట చూపు నిలిపి!


రంగు రంగుల తెరలపై రక్తి నిలిపి

గాల మెరుగక మునిగిరి గడుసు గాను

సంత సమ్మున జూడరు సకల మెపుడు

బంది లయ్యారు యంత్రాల పంజ రమున.


కలసి మెలసియు నుండెడి కలత నేడు

పల్లె లందున గానము పడదు నేడు

ముసలి వారలు లేకను ముద్దు లొలుకు

బాల లాడెడి తోడెట పాడె నయ్యె!


వనము బాసియు బందీగ వసము నందు

శాల లందున నుంచెడి సరణి గనుచు

పశువు లన్నిటి జూపగ ప్రజలు నేడు

మురిసి పోదురు వింతగ ముదము తోడ.

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 26.4.2026












కామెంట్‌లు లేవు: