"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

26 మార్చి, 2026

తెలుగు సాహిత్యం -మహిళా చైతన్యం జాతీయ సదస్సులో దార్ల






 తెలుగు సాహిత్యంలో కాలానుగుణంగా మహిళా చైతన్యం



తెలుగు సాహిత్యంలో కాలానుగుణంగా మహిళా చైతన్యం వెల్లివిరిసిందని జాతీయ సదస్సులో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, పాలకొల్లు , తెలుగు విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నాడు ‘’తెలుగు సాహిత్యం-మహిళా చైతన్యం” అనే అంశంపై జరిగిన ఒకరోజు జాతీయ సదస్సు జరిగింది. ప్రారంభ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. సుమారు నూరు పరిశోధన పత్రాలతో సదస్సు ప్రత్యేక సంచికను కూడా విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి ప్రారంభోపన్యాసం చేస్తూ, తెలుగు సాహిత్యంలో మహిళల పాత్ర విశిష్టమైందని, వారి భావవ్యక్తీకరణ సమాజ అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు మహిళా రచయితలు తమ రచనల ద్వారా సమాజంలో మార్పు తీసుకువచ్చిన విషయాన్ని ఆమె వివరించారు. విద్యార్థులు ఇటువంటి సదస్సుల ద్వారా సాహిత్య అవగాహనను పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా మద్రాస్ విశ్వవిద్యాలయం, చెన్నైకు చెందిన ఆచార్య విస్తాలి శంకర్రావు, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్‌కు చెందిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు విచ్చేసి తమ విశిష్ట ప్రసంగాలతో సభను అలరించారు. మహిళా చైతన్యం తెలుగు సాహిత్యంలో ఎలా ప్రతిఫలించిందో, ప్రాచీన కాలం నుండి ఆధునిక సాహిత్యం వరకు మహిళల పాత్ర, వారి భావజాలం, సమాజంపై వారి ప్రభావం వంటి అంశాలను వారు విశదీకరించారు.ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళిత,అణగారిన వర్గాల మహిళలు తమ సాహిత్యం ద్వారా సామాజిక వివక్షను ఎలా ఎదుర్కొంటున్నారో ఆయన విశ్లేషించారు.ఆచార్య విస్తాలి శంకర్రావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ఆది నుంచీ మహిళలు ఏ విధంగా తమ గొంతుకను వినిపించారో , ముఖ్యంగా ప్రాచీన సాహిత్యంలో మహిళల పాత్రను సామాజిక కోణంలో విశ్లేషణ చేయాలన్నారు..సాహిత్యం ద్వారా మహిళా చైతన్యాన్ని పెంపొందించడంలో తెలుగు భాష పోషించిన పాత్రను ఆయన నొక్కి చెప్పారు.మహిళలు కేవలం గృహానికే పరిమితం కాకుండా, విద్యావంతులై సమాజంలో తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో సాహిత్య ఆధారాలతో చర్చించారు. 

ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని సదస్సును విజయవంతం చేశారు. తెలుగు సాహిత్యంలో మహిళల పాత్రను వెలికితీయడంలో ఇటువంటి సదస్సులు ఎంతో ఉపయోగకరమని వక్తలు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థి, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆచార్య ఏ నాగేశ్వరరావు,కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్వీ రంగారావు,జాతీయ సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు వైస్ ప్రిన్సిపల్ శ్రీ టి కృష్ణ, కన్వీనర్ , తెలుగు విభాగాధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి,కోకన్వీనర్ డాక్టర్ ఎం రామకృష్ణ, అర్థశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సిహెచ్ ఉషారాణి,డాక్టర్ వి విజయలక్ష్మి కళాశాలకు చెందిన అధ్యాపకులు ఇతర కళాశాలల కు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

....

ప్రసంగం.. ముఖ్యాంశాలు:

....

నిశ్శబ్దం నుండి నినాదం వరకు…

 తెలుగు సాహిత్యంలో మహిళా చైతన్యం

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ, పూర్వ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ - 500046, ఫోన్ :9989628049


కం.

అమ్మవు నీవే; తోడవు;

నమ్మికవై నిలుచు సగము నారివి నీవే!

కొమ్మవు కావవు;నీవే

అక్షర చైతన్య మూర్తి వౌదువు మహిళా!

అన్నట్లుగా... తెలుగు సాహిత్యంలో మహిళా చైతన్యం అనేది నేడు ఒక పరిణామశీలమైన మహా ప్రవాహం. నిన్నటి నిశ్శబ్దం నుండి నేటి నినాదం వరకు సాగిన ఈ అక్షర ప్రయాణాన్ని విశ్లేషించుకోవడమే ఈనాటి నా ఉపన్యాసంలోని ప్రధాన ఉద్దేశ్యం…


"చరిత్ర పుటల్లో నిన్నటి వరకు

స్త్రీ అంటే ఒక త్యాగం.. ఒక మౌనం!

కానీ నేడు,

అదే మౌనం అక్షరమై గర్జిస్తోంది..

చాదస్తాల చట్రాలను బద్దలు కొడుతూ

సొంత ఆకాశాన్ని తానే నిర్మించుకుంటోంది!

ఇది అణచివేతపై అక్షరం సాధించిన చైతన్య గీతం!”


ముందుగా మహిళా చైతన్యం అంటే ఏమిటో అవగాహన చేసుకుందాం….

నేను మనిషిని, నేను సమానమైన హక్కులు కలదాన్ని, నేను ఈ ప్రపంచాన్ని మార్చగలను' అనే ఒక అచంచలమైన నమ్మకం. 

నిర్బంధాల మధ్య కూడా నిశ్శబ్దాన్ని ఛేదించగలననే నమ్మకమే మహిళా చైతన్యం.

తన అస్తిత్వం పట్ల, తన ఆత్మాభిమానం పట్ల రాజీలేని నమ్మకాన్ని కలిగి ఉండటమే చైతన్యం.

విద్య ద్వారా కలిగే జ్ఞానం స్త్రీకి తనపై తనకు నమ్మకాన్ని ఇస్తుంది. ఆ నమ్మకమే ఆమెను చైతన్య మూర్తిగా మారుస్తుంది.

 ఈ దృష్టితో మహిళా చైతన్యాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సాహిత్యం వరకునే మన ప్రస్తుత పరిధి. కనుక, తెలుగు సాహిత్యం అంటే ఒకప్పుడు కేవలం పురుష విజయ గాథలు, రాజుల విజయాలే అనుకునేవారు. కానీ, పురాణ కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు స్త్రీ తన ఉనికిని, తన చైతన్యాన్ని అక్షరబద్ధం చేస్తూనే ఉంది. 'చైతన్యం' అంటే మేల్కొనడం. తన హక్కుల పట్ల, తన వ్యక్తిత్వం పట్ల, సమాజంలో తన స్థానం పట్ల స్త్రీ పొందిన ఎరుకే ఈ చర్చకు మూలం.

    తెలుగు సాహిత్యంలో మహిళా చైతన్యాన్ని మూడు ప్రధాన ఘట్టాలుగా విభజించవచ్చు. ప్రారంభ దశ (సంప్రదాయ కాలం)లో తాళ్లపాక తిమ్మక్క (సుభద్రా పరిణయం), మొల్ల (రామాయణం) వంటి వారు పురుష ఆధిక్య ప్రపంచంలో తమ ప్రత్యేక ముద్ర వేశారు. ఆ కాలంలోనే వారు సొంత గొంతుకను వినిపించడం ఒక గొప్ప సాహసం. ఆ తర్వాత రెండవ దశలో నాయక రాజుల కాలంలో మధురవాణి, రంగాజమ్మ వంటి కవయిత్రులు విద్వత్తులో పురుషులతో పోటీపడి 'మధుర కవితా' రీతులను సృష్టించారు. ఇది స్త్రీ మేధో చైతన్యానికి తొలి మెట్టు. మూడవదశ అంటే సంస్కరణోద్యమ కాలంలో కందుకూరి, గురజాడ వంటి వారు స్త్రీ విద్య, వితంతు వివాహం గురించి రాసినా, అది స్త్రీల గురించి పురుషులు చేసిన ఆలోచన. కానీ, ఇది మహిళల్లో ఆత్మవిమర్శకు దారితీసింది. ఆనాటి నుండే తమ అస్తిత్వాన్ని చైతన్యంగా మార్చుకోవడం ప్రారంభమైంది.


20వ శతాబ్దపు మధ్యకాలం నుండి తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

స్త్రీవాద కవిత్వం (1980-90లలో తెలుగు సాహిత్యంలో ఒక పెను తుపాను. "నీలి మేఘాలు" వంటి సంకలనాలు స్త్రీ శరీరం, శ్రమ, అనుభూతుల చుట్టూ ఉన్న సంకెళ్లను తెంచేశాయి. ఓల్గా, పి. సత్యవతి, విమల, కొండేపూడి నిర్మల వంటి వారు స్త్రీ దృక్కోణం నుండి ప్రపంచాన్ని చూడటం నేర్పారు.

చదువుకున్న మహిళలు తమ ఆకాంక్షలను కథల్లో చిత్రించారు. అబ్బూరి ఛాయాదేవి, భానుమతి వంటి వారు మధ్యతరగతి స్త్రీ మనోభావాలను ఆవిష్కరించారు.

'గురిచూసి పాడే పాట' (1990) అనేది తెలుగు సాహిత్యంలో వెలువడిన తొలి స్త్రీవాద కవితా సంకలనంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. 'నీలి మేఘాలు' రాకముందే స్త్రీవాద గొంతుకలను ఒకచోట చేర్చిన చారిత్రక గ్రంథం ఇది.కవయిత్రులు కేవలం భావకవిత్వపు రంగుల లోకంలో విహరించకుండా, స్త్రీ ఎదుర్కొంటున్న వాస్తవిక హింసను, సామాజిక వివక్షను ధైర్యంగా ప్రశ్నించారు.ఈ కవితల ప్రధాన లక్ష్యం స్త్రీని కేవలం ఒక 'అలంకార వస్తువు'గా చూసే పితృస్వామ్య దృక్పథాన్ని ఛేదించి, ఆమెలోని మనిషిని, ఆమె శ్రమను మరియు ఆమె ఆత్మగౌరవాన్ని సమాజానికి పరిచయం చేయడం. దీనిలో సావిత్రి గారి ‘బందిపోట్లు’ కవిత ఒక సంచలనం. 1984లో ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైంది. దీన్ని వెంటనే పాఠ్యాంశలో పెట్టారు.


"పాఠం ఒప్ప చెప్పక పోతే పెళ్ళి చేస్తాన”ని పంతులుగారన్నప్పుడే భయమేసింది.


"ఆఫీసులో నా మొగుడున్నాడు! అవసరమొచ్చినా సెలవివ్వడ"ని 

అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది 

"వాడికేం? మగమహారాజ"ని ఆడా, మగా వాగినప్పుడే అర్ధమైపోయింది 

-"పె"ళ్లంటే "పెద్దశిక్ష" అని "స్వేచ్ఛా భక్షకుడ"ని మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే 

మమ్మల్ని విభజించి పాలిస్తోందని!’’

ఈ కవిత ద్వారా మహిళలలో వచ్చిన చైతన్యం సామాన్యమైనది కాదు. దీని తర్వాత..తెలుగు సాహిత్యంలో 'నీలి మేఘాలు' (1993) కవితా సంకలనం మహిళా చైతన్యానికి ఒక చారిత్రక మలుపు, నిశ్శబ్దాన్ని నిరసనగా మార్చిన ఒక అక్షర విస్ఫోటనం. ఈ సంకలనం ద్వారా స్త్రీ కేవలం పురుష భావనలోని 'వస్తువు'గా కాక, తన సొంత శరీరం, శ్రమ, అనుభూతులు, అస్తిత్వంపై సర్వాధికారాలు కలిగిన’కర్త’గా తనను తాను ప్రకటించుకుంది. పితృస్వామ్య వ్యవస్థ గీసిన లక్ష్మణ రేఖలను చెరిపివేస్తూ, ఇల్లు - వంటిల్లు - సమాజం అనే పొరల్లో దాగి ఉన్న వివక్షను ఈ కవిత్వం అత్యంత ధైర్యంగా ప్రశ్నించింది. స్త్రీవాదాన్ని ఒక బలమైన సామాజిక సిద్ధాంతంగా నిలబెట్టడమే కాకుండా, స్త్రీల వేదనను ఒక రాజకీయ చైతన్యంగా మార్చి, తెలుగు కవిత్వ భాషను, దృక్కోణాన్ని సమూలంగా మార్చేసింది. ఇది కేవలం కవితల గుత్తి కాదు, తెలుగు నేల మీద స్త్రీల ఆత్మగౌరవ ప్రయాణంలో ఒక అప్రకటిత యుద్ధనౌక వంటిది.


ఈ మేధోమథనం ఆధునిక కాలంలో కథ, నవల, నాటకం వంటి ప్రక్రియల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కనపర్తి వరలక్ష్మమ్మ 'శారద లేఖలు' ద్వారా సామాజిక స్పృహను కలిగించగా, ఓల్గా 'స్వేచ్ఛ' వంటి నవలలు స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఆర్థిక స్వావలంబనను కొత్త కోణంలో ఆవిష్కరించాయి. పి. సత్యవతి 'ఇల్లాలు-ఇల్లెలుకమ్మ' వంటి కథల్లో స్త్రీల అదృశ్య శ్రమను ప్రశ్నించగా, నాటక రంగంలో స్త్రీల సమస్యల చుట్టూ కేంద్రీకృతమైన రచనలు వచ్చాయి. సాహిత్య విమర్శలో కూడా స్త్రీ దృక్కోణం (Female Gaze) పెరిగింది; "మనకు తెలియని మన చరిత్ర" వంటి రచనలు పితృస్వామ్య విలువలని సాహిత్య పరంగా ఎండగట్టాయి. ఈ ప్రక్రియలన్నీ మహిళలు తమ వేదనను ఒక సామాజిక ఆవేదనగా మార్చుకోవడానికి దోహదపడ్డాయి.


నా అభిప్రాయం ప్రకారం ఈ సదస్సులో మనం చర్చించాల్సిన ముఖ్యాంశాలు (Key Points):

అదృశ్య శ్రమ గుర్తింపుగా మిగిలిపోతున్న ఇంటి పనిలో, పంటి పనిలో, వ్యవసాయ క్షేత్రాల్లో స్త్రీ పడుతున్న వెలకట్టలేని శ్రమకు సమాజంలో గుర్తింపు లేకపోవడాన్ని నేటి సాహిత్యం బలంగా ప్రశ్నిస్తోంది. స్త్రీ శ్రమ దోపిడీని అక్షరీకరించడం చైతన్యంలో ఒక ముఖ్య భాగం.

స్త్రీ శరీరంపై ఆమెకే పూర్తి హక్కు ఉండాలనే భావన ఆధునిక కవిత్వంలో ప్రధానాంశంగా మారింది. వీటినే శరీర రాజకీయం (Body Politics) అంటున్నారు. ఓల్గా అంశంపై ప్రత్యేకించి కథలు కూడా రాశారు. పితృస్వామ్య వ్యవస్థ విధించిన ఆంక్షలను, శారీరక హింసను నిరసిస్తూ వెలువడిన రచనలు మహిళల్లో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. భావ కవిత్వంలో స్త్రీ ఒక సౌందర్య సాధనం అయితే తర్వాత కాలంలో స్త్రీ తన సౌందర్యాన్ని పునర్నిర్వచించుకున్న తీరులో మహిళా చైతన్యం కనిపిస్తుంది. జయప్రభ వంటి కవయిత్రి దీన్ని లోతుగా అధ్యయనం చేశారు.

ఉద్యోగ రీత్యా బయటకు వస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న 'రెట్టింపు భారాన్ని' (Double Burden) - అంటే అటు ఆఫీసు పని, ఇటు ఇంటి బాధ్యతలను - సాహిత్యం ప్రతిబింబిస్తోంది. ఆర్థికంగా ఎదిగినా సామాజికంగా ఎదురయ్యే వివక్షపై పోరాటం ఇందులో కనిపిస్తుంది. ఉద్యోగంతో పాటు ఇంటి పనిని కూడా చేయడం, దాని ఆర్థికంగా విలువ కట్టకపోవడం వంటివన్నీ చర్చనీయాంశాలయ్యాయి. ఇలా ఆర్థిక స్వావలంబన - సవాళ్లు ఒక ప్రధాన కేంద్రంగా మహిళా చైతన్యం కొనసాగింది.

నల్లపొద్దు (గోగు శ్యామల) వంటి దళిత స్త్రీల చరిత్ర మహిళా చైతన్యంలో ఒక కొత్త పార్శ్వాన్ని చూపించింది. జూపాక సుభద్ర, జాజుల గౌరి, చల్లపల్లి స్వరూపరాణి, వినోదిని, మానస, మొదలైన వాళ్ళు ఈ కోణంతో కొత్త ప్రశ్నలను తెరపైకి తీసుకువచ్చారు. కేవలం లింగ వివక్షే కాకుండా, కుల వివక్షను కూడా కలిపి ఎదుర్కొంటున్న అణగారిన వర్గాల స్త్రీల గొంతుక నేడు సాహిత్యంలో కీలకంగా మారింది. వీటినన్నింటినీ మనం చర్చలోకి తీసుకురావాలి.

ఆధునిక యుగంలో సోషల్ మీడియా వేదికగా మహిళలు తమ భావాలను నిర్భయంగా పంచుకుంటున్నారు. బ్లాగులు, ఫేస్‌బుక్ కవిత్వం ద్వారా తక్షణ స్పందనలు తెలుపుతూ సాహిత్య విస్తృతిని పెంచుతున్నారు. కొండేపూడి నిర్మల, కొండవీటి సత్యవతి వంటివారు ఈ రంగంలో లోతైన ఆలోచనలను ప్రసరింప చేశారు. పత్రికలు మీడియా రంగంలో మహిళల చైతన్యానికి సంబంధించిన కోణాలను కూడా మనం చూడాలి. 

అయితే, మనం చర్చించు కోవాల్సిన వాటిని కొన్ని ప్రశ్నల రూపంలో మీ ముందుంచుతాను.

1. 

"శతాబ్దాల తెలుగు సాహిత్యంలో స్త్రీ గురించి పురుషులు రాసిన వర్ణనలు ఎక్కువ ఉన్నాయా? లేక స్త్రీలు తమ గురించి తాము రాసుకున్న వాస్తవాలు ఎక్కువ ఉన్నాయా? మనం చదువుతున్నది స్త్రీ హృదయాన్నా లేక పురుష భావనలోని స్త్రీనా?”

2. 

"ప్రాచీన కావ్యాల్లో నాయికల సౌందర్యానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఆధునిక సాహిత్యంలో స్త్రీ పడుతున్న 'అదృశ్య శ్రమ'కు (Invisible Work) లభిస్తోందా? అలంకారాల కింద నలిగిపోయిన ఆమె శ్రమను మన సాహిత్యం ఎంతవరకు గుర్తించింది?"

3.

"స్త్రీవాద సాహిత్యం అంటే కేవలం పురుష విద్వేషం అని కొందరు భావిస్తుంటారు. కానీ, అది పురుషాధిక్యతపై పోరాటమా లేక మానవ సమానత్వం కోసం జరుగుతున్న ఆకాంక్షా? సాహిత్యం ఈ తేడాను స్పష్టంగా చూపిస్తోందా?"

4. 

"మహిళా చైతన్యం అంటే కేవలం అక్షరాస్యత కలిగిన మధ్యతరగతి మహిళల సమస్యలేనా? పొలాల్లో పని చేసే శ్రమజీవుల, కుల వివక్షను ఎదుర్కొంటున్న దళిత, బహుజన మహిళల ఆవేదన మన సాహిత్య ప్రధాన స్రవంతిలో ఎంతవరకు ప్రతిఫలిస్తోంది?"

5. 

"డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్న సాహిత్యం మహిళా చైతన్యాన్ని బలోపేతం చేస్తోందా? లేక అది కేవలం తాత్కాలిక భావోద్వేగాలకే పరిమితమవుతోందా? రేపటి తరానికి మనం అందిస్తున్న సాహిత్య వారసత్వం ఏమిటి?”

ఇవన్నీ మనం లోతుగా చర్చించుకోవాలి.


ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు తెలుగు సాహిత్యంలో మహిళా చైతన్యాన్ని ఒకే కోణంలో చూడలేము. అది కాలక్రమేణా నిశ్శబ్దం నుండి నిరసన వరకు, భక్తి నుండి భౌతిక ఉనికి వరకు పరిణామం చెందుతూ వచ్చింది. ఈ పరిణామాన్ని ఈ క్రింది దశల ద్వారా అర్థం చేసుకొనేవీలుంటుందని అనుకొంటున్నాను.

1. ప్రాచీన సాహిత్యం: పరిమితుల మధ్య ప్రతిభ

ప్రాచీన కాలంలో మహిళా చైతన్యం ప్రధానంగా భక్తి మరియు పాండిత్యం చుట్టూ తిరిగింది.

తాళ్లపాక తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రిగా 'సుభద్రా పరిణయం' రాశారు. పురుషుల ఆధిపత్యం ఉన్న ఆ కాలంలో ఒక మహిళ కావ్యాన్ని రచించడమే ఒక పెద్ద చైతన్యం.

మొల్ల కుల వ్యవస్థను, అక్షర క్రమశిక్షణను సవాలు చేస్తూ "రామాయణం" రాశారు. "నేను పండితురాలిని కాకపోయినా, రామ భక్తితో రాస్తున్నాను" అనడంలో ఒక వినమ్రమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇది అస్తిత్వానికి తొలి అడుగు.

2. ప్రబంధ/నాయక రాజుల కాలం- శృంగారం, స్వేచ్ఛ:

ఈ కాలంలో మహిళా చైతన్యం శృంగార ప్రగతిశీలత వైపు మళ్లింది.

రంగాజమ్మ, మధురవాణి అష్టభాషా కోవిదులు. రాజదర్బారుల్లో పురుషులతో సమానంగా పీఠాలు వేసుకుని కూర్చుని, వాదోపవాదాలు చేసేవారు. స్త్రీ మేధస్సుకు, కళా నైపుణ్యానికి ప్రాధాన్యత పెరిగిన దశ ఇది.

3. ఆధునిక పూర్వ దశ (సంస్కరణోద్యమం): పరోక్ష చైతన్యం

19వ శతాబ్దపు చివరలో, 20వ శతాబ్దపు ప్రారంభంలో స్త్రీల గురించి పురుషులు రాశారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి వారు స్త్రీ విద్య, వితంతు వివాహం గురించి పోరాడారు. 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' వంటి రచనలు స్త్రీల కష్టాలను సమాజం దృష్టికి తీసుకెళ్లాయి. ఇది స్త్రీలలో సామాజిక స్పృహ కలగడానికి పునాది వేసింది.

4. అభ్యుదయ, దిగంబర కవిత్వ దశ: రాజకీయ చైతన్యం

స్వాతంత్ర్యానంతరం స్త్రీలు కేవలం గృహిణులుగానే కాకుండా, పోరాట యోధులుగా మారారు. తెలంగాణ సాయుధ పోరాటం వంటి సందర్భాల్లో మహిళలు రాసిన పాటలు, కథలు వారిలో గూడుకట్టుకున్న రాజకీయ చైతన్యాన్ని బయటపెట్టాయి. చదువుకున్న మహిళలు సమాజంలోని అసమానతలను ప్రశ్నించడం మొదలుపెట్టారు.

5. స్త్రీవాద ఉద్యమ కాలం (1980 నుండి నేటి వరకు): పూర్తిస్థాయి చైతన్యం

ఇది అత్యంత కీలకమైన దశ. ఇక్కడ స్త్రీ 'వస్తువు' (Object) నుండి 'కర్త' (Subject)గా మారింది.

అస్తిత్వ వేదన: తన శరీరం, తన శ్రమ, తన నిర్ణయాలపై తనకే హక్కు ఉండాలని వాదించడం మొదలైంది.

సొంత గొంతుక: పురుషులు రాసిన స్త్రీ చిత్రణకు, స్త్రీలు రాసుకున్న స్వీయ చిత్రణకు ఉన్న తేడా స్పష్టమైంది. ఓల్గా, విమల, కొండేపూడి నిర్మల వంటి వారు స్త్రీవాదాన్ని ఒక బలమైన సిద్ధాంతంగా నిలబెట్టారు.

బహుళ చైతన్యం: నేడు మహిళా చైతన్యం కేవలం లింగ వివక్షకే పరిమితం కాలేదు. దళిత స్త్రీవాదం, ముస్లిం స్త్రీవాదం, ప్రాంతీయ చైతన్యం వంటి భిన్న కోణాల్లో తన ఉనికిని చాటుకుంటోంది.

ప్రాచీన సాహిత్యంలో మహిళా చైతన్యం 'అనుమతించబడిన స్వేచ్ఛ' (Permitted Freedom) అయితే, ఆధునిక సాహిత్యంలో అది 'అప్రకటిత తిరుగుబాటు' (Undeclared Rebellion). నిన్నటి వరకు ఇతరుల కథల్లో పాత్రలుగా ఉన్న మహిళలు, నేడు తమ కథలకు తామే రచయితలుగా మారి సమాజాన్ని నడిపిస్తున్నారు. వారిని ఈ పద్యం ద్వారా ప్రశంసిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తాను.

కం.

అక్షర రూపిణి మహిళా!

శిక్షణతో జగతి గెలుచు శిల్పివి నీవే!

దక్షతతో సాగగదే!

వీక్షణలో కాంతి నింపి వెలుగుము మహిళా!


ఈ సదస్సులో అతిథిగా పాల్గొనే అవకాశం కల్పించిన సదస్సు నిర్వాకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 


ఆధార గ్రంథ సూచిక :

త త్రిపురనేని శ్రీనివాస్. గురిచూసి పాడే పాట (తొలి స్త్రీవాద కవితా సంకలనం). హైదరాబాద్: కవిత్వం ప్రచురణలు, 1990. 

ఓల్గా, పి. సత్యవతి, తదితరులు (సంపా.). నీలి మేఘాలు (స్త్రీవాద కవితలు). హైదరాబాద్: స్వేచ్ఛ ప్రచురణలు, 1993.

జయప్రభ. మార్గాన పడ్డ పాదాలు (స్త్రీవాద విమర్శ). హైదరాబాద్: నీలి ప్రచురణలు, 1991.

కనకదుర్గ, డి. తెలుగు సాహిత్యం - మహిళా చైతన్య ప్రస్థానం. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1993. (డిజిటల్ వెర్షన్: Archive.org ద్వారా లభ్యం).

ఆంగ్ల గ్రంథాలు 

Beauvoir, Simone de. The Second Sex. Trans. H.M. Parshley. London: Vintage Books, 1949/1997.

Woolf, Virginia. A Room of One's Own. London: Hogarth Press, 1929.

Hooks, Bell. Ain't I a Woman? Black Women and Feminism. Boston: South End Press, 1981.

Friedan, Betty. The Feminine Mystique. New York: W.W. Norton & Company, 1963.

Walker, Alice. The Color Purple. New York: Harcourt Brace Jovanovich, 1982. 

Lorde, Audre. Sister Outsider: Essays and Speeches. Crossing Press, 1984.


(శ్రీ ఏ.ఎస్.ఎన్‌.ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల- పాలకొల్లు, తెలుగు విభాగం వారు 24.3.2026వ తేదీన "తెలుగు సాహిత్యం - మహిళా చైతన్యం" పేరుతో నిర్వహిస్తున్న ఒక రోజు జాతీయ సదస్సులో చేయబోయే ప్రసంగపాఠం)

 



కామెంట్‌లు లేవు: