"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

15 మార్చి, 2026

డా. ఎన్. గోపి "చెప్పులు" కవిత-సామాజిక అస్తిత్వ చిత్రణ

ఆచార్య ఎన్. గోపి ఆధునిక తెలుగు సాహిత్యంలో మానవీయతను, సామాజిక స్పృహను మమేకం చేసిన విశిష్ట కవి. ఆయన కవితాదృక్పథం మట్టి మనుషుల జీవన పోరాటాన్ని, పల్లె నేపథ్యాన్ని, లోతైన తాత్విక చింతనను ప్రతిబింబిస్తుంది. సంప్రదాయ మూలాలను గౌరవిస్తూనే, 'నానీలు' వంటి ఆధునిక ప్రక్రియల ద్వారా సామాజిక వైరుధ్యాలను ఎండగట్టి, రేపటిపై ఆశను చిగురింపజేయడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా ‘జలగీతం’ లో పర్యావరణ స్పృహను, ‘వృద్ధోపనిషత్’లో వయసు మళ్ళిన వారి అంతరంగ వేదనను, ‘చిత్రదీపాలు’ లో జీవిత సత్యాల పట్ల నిశితమైన పరిశీలనను ఆయన అత్యంత ఆర్ద్రంగా ఆవిష్కరించారు. క్లుప్తత, సరళత కలగలిసిన ఆయన రచనలు ప్రకృతి పట్ల బాధ్యతను, మనుషుల మధ్య ఉండాల్సిన అనుబంధాలను నిరంతరం ప్రబోధిస్తూ సామాన్యుడి కష్టసుఖాలకు అద్దం పడతాయి.డా. ఎన్. గోపి గారి "చెప్పులు" కవిత భారతీయ సామాజిక వ్యవస్థలో దళితుల కులవృత్తి, సామాజిక అస్తిత్వం,  శ్రామిక చరిత్రకు సంబంధించిన తాత్త్వికాంశాలను చర్చకు పెడుతుంది. అలాగే, ఇటీవల ఆయన రచించిన చెప్పులు కవిత ఆయనకు గొప్పపేరుతెచ్చింది.

 నినాదం దినపత్రిక, 15.3.2026 సౌజన్యంతో 

"చెప్పులు" కవిత భారతీయ సామాజిక వ్యవస్థలో దళితుల కులవృత్తి, సామాజిక అస్తిత్వం,  శ్రామిక చరిత్రకు సంబంధించిన తాత్త్వికాంశాలను చర్చకు పెడుతుంది. 

‘’కొత్త చెప్పులు కొన్నప్పుడల్లా

పాత చెప్పులు పారెయ్యను

స్టాండ్ లో జాగ్రత్తగా పెడతాను

అవి కేవలం పాదరక్షలు కాదు

నా అనుభవాలకు సాక్షులు.’’ ఈ కవిత  అనుభూతి సాంద్రతతో  ప్రారంభమవుతూ   మానవ సంబంధాలను ప్రతిఫలించేలా ఎత్తుకున్నారు. 

పాత చెప్పులను పారేయకుండా "స్టాండ్ లో జాగ్రత్తగా పెడతాను" అనే వాక్యంతో పాత చెప్పులను కేవలం వస్తువులుగా కాక, జీవిత పయనంలో సహచరులుగా చూడటంగా స్పష్టమవుతుంది. ఇది భావపూరిత కృతజ్ఞతకు సంకేతంగా చెప్పుకోవచ్చు.  ఒకప్పుడు చెప్పులు కుట్టడం అనేది కేవలం ఆర్థికపరమైన విలువ మాత్రమే కాదు. ఆ వ్యక్తుల పట్ల ఉండే మమతానురాగాలను తెలియజేసేది. అందుకే కొంతమందికి కిర్రిచెప్పులను కవితలో చెప్పులు కేవలం పాదరక్షలు మాత్రమే కాక, దళితుల కులవృత్తి అయిన చెప్పు కుట్టడం, శ్రామిక జీవనంతో ముడిపడి ఉంది. ఒక సామాజిక సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తుంది. ఒకప్పుడు అది వంశపారంపర్య నిర్భంధ కులవృత్తి (Caste-based Occupation). సమాజంలో డబ్బున్నవాళ్లు తమ పశువులను ఇచ్చి చెప్పులు చేయించుకునేవారు. ఆ విధంగా చెప్పులు చేసినందుకు ఆ కులవృత్తి వారికి జీవనం కొనసాగినా, ఆర్థికపరమైన తోడ్పాటు పెద్దగా లభించేది కాదు.ఆ విధంగా భారతీయ సామాజిక వ్యవస్థలో దళితులు సంప్రదాయంగా చెప్పులు కుట్టడం వంటి పనులకు కేటాయించబడ్డారు. ఇది ఆర్థిక పరమైన సమాజపు శ్రేణీకరణ (Social Stratification) ని సూచిస్తుంది. ఆ సామాజిక శ్రేణికి చెందిన వారు కాకపోయినా, వారి పట్ల సహానుభూతి కలిగిన కవి ఆ చరిత్రను కవిత్వీకరిస్తూ..

‘’కొత్త చెప్పుల్ని చూస్తే

నా దళిత మిత్రుని తండ్రి గుర్తుకొస్తాడు

పవిత్రమైన శ్రామిక చరిత్రంతా

వాటిలో నిక్షిప్తమై వుంది.’’ అన్నారు. "నా దళిత మిత్రుని తండ్రి గుర్తుకొస్తాడు" అనడం ద్వారా కవి వ్యక్తిగత అనుభవాన్ని సామాజిక అవగాహనగా విస్తరింపజేస్తారు.అంతే కాదు, కొన్నింటితో మన సామాజిక అస్తిత్వం  ఎలా ముడిపడి ఉంటుందో కూడా వ్యక్తమవుతోంది. 

చెప్పులు లేకుండా తిరిగిన రోజులుగానీ, నిత్యం కొత్తవాటిని ధరించడం ఒకరకమైన సామాజిక స్థితి నిదర్శనంకావచ్చు.

‘’ఆయా దశల్లో

స్థోమతను బట్టి వాటి ఖరీదు.

చెప్పులు లేకుండా

తిరిగిన రోజులను మర్చి పోలేదు

….

మా అక్క కొనిచ్చిన చెప్పులు

ఇప్పటికీ మమతల మందారాలు’’


ఎప్పటికప్పుడు కొత్త చెప్పుల కొనుక్కోవడం  ఆ వ్యక్తి ఆర్థిక స్థోమత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.కానీ, దాన్ని దాచుకోవడంలో ఆ శ్రమ, ఆ చరిత్ర, ఆ మానవ సంబంధాలు సజీవంగా నిలుపుకోవడాన్ని సూచిస్తుంది. చెప్పులను తన ప్రయాణ సౌందర్యం సాధనాలుగా అభివర్ణించడంలో కూడా గొప్ప తాత్వికత ఉంది.

అక్క ఇచ్చిన చెప్పులు మమతల గుర్తుగా మారడమనేది కేవలం ఒక్క అక్కకే పరిమితం కాదు. ఆ చెప్పులు తన దగ్గరకు వచ్చే క్రమంలో మన స్నేహాలు, బంధాలు, వాటిని నిలుపుకోవడమో, మధ్యలోనే త్రుంచుకోవడమే కూడా తెలుపుతుంది. అందుకే కవి ఆ చెప్పుల్లో అంత సాన్నిహిత్యాన్ని దర్శించి గలిగారు. 

‘’రాళ్ల నుంచీ ముండ్ల నుంచీ

పాదాలను కాపాడిన ఆపన్న హస్తాలు

ముఖ్యంగా ఎండల్లో

నన్ను అరచేతుల మీద మోసిన దీవెనలు’’ అని చెప్పుల కుట్టే కృషి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లిన స్థితిని ప్రశంసిస్తుంది. అయినా అది చరిత్రలో గుర్తింపుపొందని అమూల్య శ్రామిక సాంస్కృతిక వారసత్వం గా మిగిలిపోయింది. దానికి కారణం ఆ పని ఆర్థిక వ్యవస్థతో ముడిపెట్టడం. అది క్రమేపీ ఆర్థిక ఆధిపత్యం తో కొంతమంది దళితులను ఎదగనీయకుండా చేసింది. అందువల్ల  చెప్పులు కుట్టడం అనేది చరిత్రపుటల్లో ప్రతిష్ఠాహీనతగా మాత్రమే గుర్తింపుకునోచుకుంటుంది. కాలక్రమంలో అది తయారు చేసిన వాళ్లతో పాటు ఆ వస్తువు కూడా హీనత్వానికి గురయ్యింది. దాన్ని కవి వర్ణిస్తూ…ఒక హెచ్చరికను, దాని వెనుక విస్మరించిన చరిత్రను గుర్తించమంటున్నారు.

‘‘చెప్పుతో కొడ్తా అని

వాటిని న్యూన పరచొద్దు

పాదుకల్ని ప్రతీకగా పెట్టి

రాజ్యా లేలిన వాళ్ళున్నారు.’’

"చెప్పుతో కొడ్తా" అనే పదం న్యూనపరచబడిన ఆత్మగౌరవం అనే సామాజిక అవమానానికి సూచన. అలా అవమానించడాన్ని కవి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. చెప్పులు కేవలం పాదరక్షలు కాదని, దళితుల శ్రమకు ప్రతీకలని ప్రకటిస్తారు.

"పాదుకల్ని ప్రతీకగా పెట్టి రాజ్యా లేలిన వాళ్ళున్నారు" అనడం ద్వారా చెప్పులు విముక్తి రాజకీయాలను కూడా సూచిస్తాయి.మళ్ళీ రాజ్యాలేలే రోజులు రావచ్చని అవమానించేవాళ్ళని హెచ్చరిస్తున్నారు. ఒకదాని వెనుక వెంటనే ఆ భావాన్ని ప్రతిపాదించడంలో కవిత్వ నిర్మాణ వ్యూహం ఉంది. దీన్ని విరోధ చైతన్యం అంటారు. 

 చెప్పుతో కొడతా అనేది ఒక వ్యక్తికి సంబంధించిన భావన కాదు. అది సామాజిక సంస్కార సంకేతం. దాన్ని కవి తిరస్కరిస్తూ, రాజ్యాలు ఏలిన పాదుకలు అని చెబుతారు. దాన్ని పవిత్రీకరిస్తూ వాటికెంత శక్తి ఉందో తేలుసుకోమంటూ. రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాసం వెళ్ళాల్సి వచ్చినా, ఆయన చెప్పులనే సింహాసనం పై పెట్టుకొని పరిపాలించిన రాజ్య చరిత్ర చెప్పులు ఉందంటారు కవి. 

‘’అర్థమైందా మిత్రమా!

చెప్పులు నా గత కాల గ్రంథంలోని పుటలు

కాలోజ్వల అనర్ఘ సుదీర్ఘ మార్గంలో నడిచి

ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న

బాటసారులు.’’ అని కవి వర్ణించడంలో

గతం నుంచి వర్తమానం, భవిష్యత్తుని ఊహిస్తూ బహుజన మార్గం లో ఏదొకనాడు ఆ చెప్పులే దళిత చరిత్రకు కొత్త పునఃవ్యాఖ్యానాన్ని అందిస్తాయని అంటున్నారు. 

మొత్తం మీద డా. ఎన్. గోపి గారి "చెప్పులు" కవితలో చెప్పులను ఒక సామాన్య వస్తువుగా కాక, దళితుల కులవృత్తి, సామాజిక శ్రామిక చరిత్ర, ఆత్మగౌరవ పోరాటం, సామాజిక వ్యతిరేకత, సాంస్కృతిక గుర్తింపు, భవిష్యత్తులో మహాశక్తివంతులవుతారనే దార్శనికత వంటి అనే అంశాలకు ప్రతీకాత్మక విస్తరణగా కనిపిస్తుంది. ఈ కవిత భారతీయ సామాజిక వ్యవస్థలో కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించే తాత్వికతకు గొప్ప చైతన్యంగా నిలుస్తుంది.

డా.దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, తెలుగు శాఖ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ 




.




కామెంట్‌లు లేవు: