"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

03 మార్చి, 2026

బ్లడ్ మూన్ 3.3.2026


కం.

కమనీయ చంద్ర బింబము

నమితంబై ఎర్రనయ్యె నభమున చూడన్

సమయమున రాహు పట్టున

రమ్యముగా రక్తకాంతి రాజిలె నచటన్!

(ఆకాశంలో చూడముచ్చటగా వెలిగే ఆ చంద్రబింబం, గ్రహణ సమయంలో రాహువు పట్టు వల్ల ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది. ఆ సమయంలో తెల్లని వెన్నెలకు బదులుగా, రమ్యమైన రక్తకాంతి (Blood Moon) అంతటా వ్యాపించి వింతైన శోభతో ప్రకాశించింది.)

తే.గీ.

నింగి వీధిలో వింతైన నెత్తు రంగు

చంద్ర బింబము మెరిసెను శాంతి వీడి

మారు రూపము దాల్చిన మంచు రేడు

కనుల కింపైన రక్తపు కాంతి నింపె!

(ఆకాశమనే వీధిలో చంద్రబింబం తన సహజమైన తెలుపు రంగును, శాంతిని వీడి వింతైన ఎరుపు  రంగులో మెరిసింది. ఎప్పుడూ చల్లని వెన్నెలను పంచే ఆ చంద్రుడు  గ్రహణ సమయంలో తన రూపాన్ని మార్చుకుని, కనులకు వింతైన అనుభూతిని కలిగించే రక్తకాంతితో నింగిని నింపేశాడు.)

ఆ.వె.

ఎర్ర బడెను చందమామ ఈ నాడెందుకో

నింగి లోన వెలుగు నిండె చూడ

గ్రహణ వేళ యందు గలుగును ఈ వింత

రక్త చంద్రు డనగ రాజిలు నిల!

(ఆకాశంలో ఎప్పుడూ తెల్లగా ప్రకాశించే చందమామ ఈ రోజు ఎందుకో తెలియని విధంగా ఎర్రబడిపోయింది. ఆకాశమంతా ఆ వింతైన కాంతి నిండి ఉండగా, ఇది గ్రహణ సమయంలో సంభవించే ఒక అద్భుతమైన ఖగోళ మార్పు అని, దీనినే లోకమంతా 'రక్త చంద్రుడు' (బ్లడ్ మూన్) అని పిలుచుకుంటున్నారని భావం.)

ఆ.వె.

ఎర్ర బడెను చంద్రు డీనాడు నింగిలో

భయము తోడ గుడులు భద్ర పరచి

రంగు లాడు పండు గంతయు ఆగెను

గ్రహణ దోష మనుచు గణుతి చేసి!

(ఈ రోజు ఆకాశంలో చంద్రుడు ఎర్రగా మారిన అరుదైన దృశ్యాన్ని చూసి, లోకులు భయంతో దైవ నిలయాలైన గుడుల తలుపులు మూసి భద్రపరిచారు. గ్రహణ సమయంలో వచ్చే కాంతి వల్ల దోషం కలుగుతుందని భావించి, అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాల్సిన రంగుల పండుగ హోళీని కూడా ఆపివేశారని భావం.)

ఆ.వె

వింత గొల్పు నట్టి విజ్ఞాన మరయగ

భయము విడువ వలయు భరత నరుడు

అరుదు గాని వింత అంశము లవనిలో

మేలు జరుగు నెపుడు మేధ తోడ!

(ఆశ్చర్యం కలిగించే ఖగోళ విజ్ఞానాన్ని పరిశీలించి అర్థం చేసుకుంటే, ఈ భూమిపై మానవుడు అనవసరమైన భయాలను వీడాలని తెలుస్తుంది. అరుదుగా సంభవించే ఇటువంటి ప్రకృతి వింతలు కేవలం ఖగోళ అంశాలే తప్ప అపనమ్మకాలు కావు. వీటిని మేధస్సుతో, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించినప్పుడే లోకానికి నిజమైన మేలు జరుగుతుందని భావం.)

ఆ.వె.

తోక చుక్క చూడ దోషము లేదులే

భయము వీడి నడువ భద్ర మగును

పనులు చేయు వారు బాగుగ నుండగా

మేధ లేని నడక మేటి చెడుగు!

(ఆకాశంలో తోకచుక్కలు కనిపించడం వల్ల ఎలాంటి కీడు జరగదు, అది కేవలం ఒక ఖగోళ వింత మాత్రమే. కాబట్టి, మనిషి అనవసరమైన భయాలను వీడి తన పనులు తాను చేసుకోవడమే అసలైన క్షేమం. గతంలో గ్రహణాలు లేదా తోకచుక్కలు వచ్చినప్పుడు కూడా భయపడకుండా తమ పనులు చేసుకున్న వారు ఆరోగ్యంగా, క్షేమంగానే  ఉన్నారు కదా! విజ్ఞానం, మేధస్సు లేకుండా కేవలం అపోహలతో అడుగులు వేయడమే సమాజానికి అసలైన గొప్ప కీడు  అని భావం.)

తే.గీ.

భాను గ్రహణము కీడన బ్రమయ వలదు

కీడు గలుగు ననెడి కీర్తన లబద్ధ

మునగ పనులు చేసిన ముదము కలిగె

బుద్ధి లేని ప్రచారమే బొంకు సుమ్ము!

(సూర్యగ్రహణం సంభవించినప్పుడు దానివల్ల ఏదో కీడు జరుగుతుందని భయపడటం కేవలం భ్రమ మాత్రమే. గ్రహణాల వల్ల అనర్థాలు జరుగుతాయని చేసే ప్రచారాలన్నీ అబద్ధాలే. ఆ సమయంలో కూడా భయపడకుండా తమ పనులు తాము చేసుకున్న వారికి ఎంతో సంతోషం కలిగింది తప్ప ఏ కీడూ జరగలేదు. కాబట్టి, శాస్త్రీయ విజ్ఞానం  లేని ఇలాంటి తప్పుడు ప్రచారాలే సమాజానికి అసలైన అబద్ధాలు  అని భావం.)

తే.గీ.

భీతి వీడి నిశ్చల భీమ బుద్ధి

సత్య మెరిగి సాగుము శక్తి తోడ

జ్ఞాన దీపము వెలిగించి జాణ వగుచు

చూడు మొకసారి నిజమును చూపు తోడ!

(భయాన్ని వదిలిపెట్టి, స్థిరమైన మరియు గొప్పదైన  బుద్ధితో వాస్తవాలను తెలుసుకుంటూ ఉత్సాహంగా ముందుకు సాగాలి. విజ్ఞానమనే దీపాన్ని వెలిగించి, వివేకవంతుడవై ఒక్కసారి వాస్తవాలను నీ శాస్త్రీయ దృష్టితో చూడమని భావం.)

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 3.3.2026




కామెంట్‌లు లేవు: