తే.గీ
విబుధ వర్యుడు వెలుదండ విమల మతిని
కంది శంకర కవిరాజు కమ్ర ఫణితి
గుండెలోనిల్పికొలిచెడిగుణయుతుడవు
సాటి లేని శిష్యుడవయ్య సరస మతివి
తే.గీ
పుణ్య భూమి యా బాసర పురముచేరి
చదువులమ్మనుకొలిచెడి సాదుశీలి
యమ్మకరుణనుపొంది నీ అద్భుతముగ
సరస శతకము నిందించు సమ్మతమున
తే.గీ
కవివి మిత్రుడా!మాపాలి కల్ప తరువ!
మాదు వంశము నెంతయో మోదమలర
పద్య సరమున పొదిగిన ప్రజ్ఞ మీది
మరువలేమయ్యనీ ప్రేమ మదినినిల్చె
తే.గీ.
భాష సేవను గమనించి వాణి మెచ్చి
కరుణ తోడను దరిచేర్చి వరము నిచ్చె
శతక రాజము లెన్నియో జగతి కొసగి
కీర్తి నందుము నీవు గోవర్ధనాఖ్య
తే.గీ.
సుఖము సంతోషములతోడ శుభము కలిగి
నిండు నూరేళ్లు వర్ధిళ్ళు నిఖిల జగతి
అమ్మ శారద దీవెన లందుకొనుచు
భక్త కవిగనే వెలుగొందు ప్రజల మధ్య!
సీ.
బాసర క్షేత్రాన భాసిల్లు తల్లియు
కరుణ జూపును నీదు కవిత యందు
జ్ఞాన ప్రదాయిని జ్ఞానమున్ పంచియు
వాక్కున నిలుచును వరము లిచ్చి
అవధాన విద్యలో అద్భుత శక్తియు
పదునైన ధీశక్తి పరగ జేసి
సమయ స్ఫూర్తితో సభను మెప్పించగ
కీర్తి భాగ్యము నీకు కలుగు గాత!
తేటగీతి:
సరస కవితలు కురిపించి సభను మెచ్చి
బాసరమ్మ దీవనలను భద్ర పరచి
విజయ మందుము గోవర్థన విభుడ నీవు
అవధాన విద్యలోన అగ్ర గణిగ!
( ప్రియ మిత్రుడు, కవి, అవధాని గోవిందు గోవర్ధన్ అనేక సందర్భాల్లో మమ్మల్ని సంతోషపరచుచు పద్యాలు వర్ణించినందుకు కృతజ్ఞతలతో ఈ పద్యాలు)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి