అమ్మా!భారతీ!
జ్ఞాన మార్గము జూపుమమ్మా!
ఆ.వె.
మావి చిగురుదొడిగె! మలయాద్రి పవనాల
కోయిలమ్మ పాడె కుహుకుహుమని!
చదువులమ్మవీవు జగతివిద్యనొసగ!
బ్రతుకు బాటనిలుపు!భారతీమ!
తే.గీ.
తెల్ల పద్మము నందున తెలివితోడ
వీణ మీటుచు కొలువైన వేదమాత!
జ్ఞాన భిక్షను కోరెడి జనులకెల్ల
దీవెనలనంద జేయుము దివ్యముగను!
ఆ.వె.
ధనము దోచబడును!విద్య దోచగలేరు!
తరగిపోని ధనమె తనదువిద్య!
విద్యనొసగుతల్లివి!వసుధ జనులకెల్ల!
శారదాంబ!నిన్ను సన్నుతింతు!
తే.గీ.
మంచి బుద్ధిని మాకిచ్చి మమ్ముగాచు!
ధారణాశక్తి నందించి దారిజూపు!
విద్యలందున బోధనావెలుగు నీవె!
విశ్వ ప్రగతికి విద్యలె వేదికగును!
తే.గీ.
పసిడి వర్ణపు కాంతుల పట్టమహిషి!
వీణనొకచేత ధరియించు విరులబోణి!
పుస్తకము నొకచేతియందు పొందు పరచి
వాక్కులమ్మగ!విద్యల వాణినీవె!
వసంత పంచమి శుభాకాంక్షలతో …
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగు శాఖ, యూని
వర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
23-01-2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి