భారతీయ, పాశ్చాత్య ప్రభావ సమ్మిళతమే
తెలుగు సాహిత్య విమర్శ
తెలుగు సాహిత్యం, విమర్శలపై పాశ్చాత్య ప్రభావం ఉన్నప్పటికీ సమాంతరంగా భారతీయ ఆలంకారిక సంప్రదాయం కూడా మిళితమై ఉందని హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రతీవారం విశిష్ట విమర్శ, విమర్శ గ్రంథాలపై అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా జరుగుతున్న ప్రసంగ ధారావాహికలో భాగంగా ఆదివారం నాడు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారి అధ్యక్షతన ఆచార్య హెచ్.ఎస్.బ్రహ్మానందగారి తెలుగు సాహిత్య విమర్శ: పాశ్చాత్య ప్రభావం అనే గ్రంథంపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రసంగించారు. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన బ్రహ్మానంద గారి పుస్తకం తెలుగులో సాహిత్య విమర్శ ఆరంభ, వికాసాల్లో ఆంగ్ల సాహిత్య ప్రభావంతో పాటు భారతీయభాషల్లో సంస్కృతం, అలంకార శాస్త్రాల ప్రభావం కూడా ఉందని వస్తునిష్టతో విశ్లేషించిన ఉత్తమ గ్రంథం అని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సోదాహరణంగా వివరించారు. పరిశోధన, చరిత్రలను కూడా బ్రహ్మానంద సాహిత్య విమర్శలో అంతర్భాగంగానే పరిగణించారనీ ఆయన చెప్పారు. సిపి బ్రౌన్ చేసిన కృషి తెలుగు పరిశోధనకు ఎంతో విలువైందనీ, రాబర్ట్ కాల్డ్వెల్ తెలుగు సంస్కృత జన్యం కాదనీ ప్రతిపాదించిన ద్రావిడ భాషాజన్య సిద్ధాంతం వంటివి నేటికీ చర్చనీయాంశాలుగానే ఉన్న విషయాన్ని బ్రహ్మానంద తన గ్రంథంలో పేర్కొన్నారని ఆచార్య దార్ల వివరించారు. సాహిత్య చరిత్ర, పరిశోధనలను కూడా సాహిత్య విమర్శలో అంతర్భాగంగానే పరిగణించి, తెలుగు సాహిత్య విమర్శలో పాశ్చాత్య ప్రభావాన్ని వస్తునిష్టతో వివరించారని ఆచార్య దార్ల వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్యం, విమర్శలపై కేవలం ఆంగ్ల ప్రభావం అంటే సరిపోదనీ, ఇంగ్లీష్ పై కేవలం ఫ్రెంచి, రష్యా, ఇతర దేశాల సాహిత్యప్రభావం ఉందనీ, అందువల్ల పాశ్చాత్య ప్రభావం అనడమే సరైనదని ఆచార్య బ్రహ్మానంద ఆ పారిభాషను ప్రయోగించారని ఆచార్య దార్ల వివరించారు. సభాధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్య విమర్శలో ఈ గ్రంథం విశిష్టమైనదనీ, ఇప్పటి వరకు ఆచార్య హెచ్.ఎస్.బ్రహ్మానంద, ఆయన రచనలపై అరసం ఆధ్వర్యంలో మొదటిసారి సమావేశం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలోఆచార్య హెచ్.ఎస్. బ్రహ్మానంద గారి కుటుంబ సభ్యులు ఆచార్య ఆనందవర్థన్, అరసం కార్యదర్శి ఆనంద్, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యలు డా.భక్తవత్సల రెడ్డి, ఆచార్య అయినవోలు ఉషాదేవి, రచయిత డా.వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి, హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, డా.పి.విజయ్ కుమార్, డా.జరుపుల రమేష్, టి.రమణయ్య, గోవింద్, అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, పరిశోకులు, విద్యార్థినీ విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి