"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

30 ఆగస్టు, 2025

నన్ను నాలోనే ఉండనివ్వు...

 నన్ను నాలోనే ఉండనివ్వు!


నన్ను నాలోనే ఉండనివ్వు...

మబ్బుల వెనుక దాగిన

చందమామలా

కొన్ని భావాలను

నాలోనే దాచుకోనివ్వు!

ఎవరికీ వినిపించని

నా మనసు మాటలను

నిశ్శబ్దపు తీరాన కూర్చొని

నేనే వింటూ ఉండనివ్వు!

ఎప్పుడో రాలిపోయిన

జ్ఞాపకాల పూలను ఏరుకుంటూ

గతపు వాకిట్లో

కొంతసేపు నిలబడనివ్వు!

వాన చినుకుల సవ్వడిలో

విరహపు పాటను వెతుక్కుంటూ

తడిసిన మట్టి పరిమళంలో

బాల్యాన్ని పలకరించనివ్వు!

నాకు ఆకాశమంటే ఇష్టం!

అందులో ఎగిరే పక్షులంటే ఇష్టం!

వాటిలా రెక్కలు లేకపోయినా

ఊహలతో అనంతాన్ని తాకనివ్వు!

నువ్వు వెలుగుల వెంట నడువు

నేను వెన్నెల దారిలో నడుస్తాను

నీకు పూల పరిమళం ఇష్టమైతే

నాకు రాలిన పూల మౌనం ఇష్టం!

నువ్వు సముద్రపు అలలతో ఆడు

నేను ఒడ్డున మిగిలిన

చిన్నచిన్న గవ్వలతో

జీవితపు కథలు రాసుకుంటాను!

ప్రతి మనిషికీ

ఒక ప్రపంచం ఉంటుంది

ఆ ప్రపంచంలో

తనకంటూ కొన్ని ఋతువులుంటాయి!

నా ఋతువులను

నీ ఇష్టాలతో మార్చకు

నా మౌనాన్ని

నీ ప్రశ్నలతో నింపకు!


నాలో ఒక నది ప్రవహిస్తోంది

దానికి గమ్యం తెలియకపోవచ్చు

అయినా సరే...

దాని ప్రవాహాన్ని ఆపకు!

నన్ను అర్థం చేసుకోవాలని

ప్రతిక్షణం ప్రయత్నించకు

కొన్ని మనసులు

అర్థమైనప్పుడు చిన్నవవుతాయి!

నన్ను నాలోనే ఉండనివ్వు...

నా కన్నీళ్లతో

కొన్ని అక్షరాలు తడవనివ్వు

నా ఏకాంతంతో

కొన్ని కవితలు పూయనివ్వు!

నేను నాకు దూరం కాకుండా

నన్ను నాలోనే ఉండనివ్వు!

— దార్ల వెంకటేశ్వరరావు

29.9.2025


కామెంట్‌లు లేవు: