దేశభక్తిని ప్రతిధ్వనించే
భారతీయుల
ఆకాంక్షల ప్రతిఫలనం
22 ఏప్రిల్ 2025 వ తేదీన మన భారత భూభాగంలో, మన భారతదేశపాలనలో ఉన్న, జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు ముస్లిమేతర పర్యాటకులపై దాడి చేసి 26 మంది పర్యాటకులను దారుణంగా చంపేశారు. ఈ ఉగ్రవాదులను పాకీస్తాన్ దేశం పెంచి పోషిస్తుంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన ఒకరు ఒక ఇంటర్వ్యూలో ఆ ఉగ్రవాదులను తమ దేశమే తయారుచేసిందని కూడా ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు, ప్రపంచవ్యాప్తంగా మానవతావాదులు మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాలవారూ ఈ దుశ్చర్యను ఖండించారు. ఈ దాడి ఒక పథకం ప్రకారం భారతీయులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా కాశ్మీర్ ని అస్తవ్యస్తం చేసి, దాన్ని స్వాధీనం చేసుకొని, దాని ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి, మరింత అల్లకల్లోలాన్ని సృష్టించాలనేది వారి వ్యూహంగా కనిపిస్తుంది. ఈ పహల్గమ్ దాడికి స్పందించి ఎంతోమంది కవులు పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో కవిత్వం రాస్తున్నారు. ప్రముఖ సాహితీవేత్త డా.వైరాగ్యం ప్రభాకర్ గారు పహల్గామ్ దాడి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది క
వుల కవితలను సేకరించి పుస్తకంగా తీసుకొస్తున్నారు. దేశ ప్రజలకు, సైనికులకు అండగా మేము ఉన్నామనే ఒక సందేశాన్ని కవితా సంకలనం ద్వారా పంపిస్తున్నారు. దేశంలోని హిందువులు, ముస్లిములు, ఇతర మతాలకు చెందిన వారు కూడా ముక్తకంఠంతో ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, ఒకప్పటి కాశ్మీర్ ప్రస్తుతం ఎలా ఉందో, దాన్ని భవిష్యత్తులో కూడా ఎలా కాపాడుకోవాలో కవులు తమ కవితల ద్వారా తమ స్పందనలను తెలియజేస్తున్నారు.
కాశ్మీర్: సాహిత్య, సాంస్కృతిక సంపద:
కాశ్మీర్ అనేది కేవలం
అందమైన లోయలతో మాత్రమే కాదు, ఇది భారత సాహిత్య,
ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో ఒక మహోన్నత కేంద్రం.
‘’శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం,
సోన్మార్గ్
అందానికే అందంలా స్వర్ణ వర్ణ
కాంతి
ధార అవనిపైన విరబూసిన అందమైన
వెన్నెల స్విట్జర్లాండ్ మినీగా పేరొందినదీ నేల’’ (వెల్ముల జయపాల్ రెడ్డి)అనడం
ద్వారా కాశ్మీర్ , తదితర ప్రాంతాలలో కేవలం సౌందర్యం మాత్రమే కాదు, దాని వెనుక ఒక ఐతిహాసిక
(historical), సాంస్కృతిక నేపథ్యం ఉందంటున్నారు. కాశ్మీర్ ప్రాచీనంగా ‘శారదాపీఠం’,
‘శారదా దేశం’ అని పిలువబడేది. శారదాదేవి ఆలయం ఇక్కడే ఉండటం వల్ల ఇది విద్యా కేంద్రంగా
పేరు పొందింది. అనేకమంది సంస్కృత పండితులు, తత్వవేత్తలను ప్రపంచానికి అందించింది. ఆదిశంకరాచార్యులు
వారు ఇక్కడ శారదా పీఠాన్ని సందర్శించారు. స్విట్జర్లాండ్ లో ఉండే మంచు పర్వతాలు, తోటలు,
సరస్సులు వంటివి ఎన్నో ఇక్కడ ఉన్నాయి. 20వ శతాబ్దంలో భారతీయ చలనచిత్రాలు కాశ్మీర్
లో చిత్రీకరించడంతో దీనికి ‘‘మినీస్విట్జర్లాండ్’’ అనే పేరొచ్చింది. ఇది కేవలం ఉపమానమే కాక, ప్రాంతానికి ఉన్న అంతర్జాతీయ స్థాయి
గుర్తింపును సూచించే మాట. కాశ్మీర్‌కు ఉన్న అపూర్వ సౌందర్యాన్ని శక్తివంతంగా వ్యక్తీకరిస్తూ
స్వర్ణ వర్ణ కాంతి అన్నారు. సూర్యోదయ సమయంలో ఆ మంచు పర్వతాలపై పడే వెలుగు, బంగారు రంగులో
మెరుస్తూ మనసును మైమరిపింపజేసే దృశ్యాన్ని మనముందుంచారు.
‘’అక్కడ
వేద పండితుల వేదఘోష
సజీవంగా
వినబడుతుంది.
ఆది
శంకరులు తిరుగాడిన వేదభూమి
శారదామాత
జ్ఞానవీచికలు కాశ్మీరాన్ని
పండితుల
స్వర్గధామమై నిలిపింది
శాంతి
ధామం అనాటి కాశ్మీరం
నేడది
వుగ్రవాదుల అడ్డాగా మారింది.’’ (వారణాసి
భానుమూర్తి రావు). నిజమే కదా… కాశ్మీర్ కేవలం
అందాల నందన వనమే కాదు; ప్రపంచానికి విజ్ఞానాన్ని పంచిన ప్రాంతం. అలంకార శాస్త్రంలో
ప్రపంచానికి తల మాణికమై నిలిచే ఎంతోమంది ఆలంకారిక శాస్త్ర పండితులు ఈ ప్రాంతం నుండే
వచ్చారు. కావ్యాన్నీ, దాని శబ్దార్థాలలోతులను అర్థం చేసుకోవడానికీ ఉపయోగపడే గొప్ప సిద్ధాంతం
ధ్వని సిద్ధాంతం. ఇది ‘ధ్వన్యా లోకం’ అనే లక్షణ గ్రంథాన్ని ఆనంద వర్ధనాచార్యులు వారు
అందించారు. ఆయన కాశ్మీర్ రాజు అవంతి వర్మ ఆ
స్థానపండితుడు. ఈ గ్రంథానికి ‘లోచనమ్’ పేరుతో
వ్యాఖ్య రాసిన వారు, భరతుని నాట్య శాస్త్రానికి ‘అభినవభారతి’ పేరుతో భాష్యం రాసిన వారు,
సహృదయ తత్వాన్ని ప్రపంచానికి చాటిన వారు అభినవగుప్తుల వారు. ఆయన కూడా ఈ ప్రాంతం నుండి
వచ్చిన వారే. వక్రోక్తి సిద్థాంత కర్త కుంతకుడు, ఔచిత్య సిద్థాంత కర్త క్షేమేంద్రుడు,
ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహా పండితులు ఈ ప్రాంతం నుండే వచ్చారు.కాశ్మీర్ చరిత్ర,
ఆ రాజుల చరిత్రకు దర్పణం పట్టే రాజతరంగిణిని రచించిన కల్హణుడు కూడా కాశ్మీర్ నుంచి
వచ్చినవాడే. కావ్యాన్ని అర్థం చేసుకొనే జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. అందుకే అది భారతదేశానికి
పవిత్రమైన, మహిమాన్విత భూమిగా భావిస్తారు. భరతమాతకు శిరస్సుగా అభివర్ణిస్తారు. అక్కడ
ఇప్పుడు ఉగ్రవాదమూకలు చేరాయనే బాధను కవులు వ్యక్తం చేస్తున్నారు.
‘’మృగాలతో
ఆడిన భరతుని రాజ్యమిదిరా!
త్యాగాలకు
స్ఫూర్తినిచ్చిన పుణ్యభూమిరా ! సత్యాహింసల ధర్మనిరతిగల ధరణీరా!
వీరమాత
తిలకం దిద్దిన భారత భూమిరా! అలెగ్జాండర్ను మార్చిన అవనిరా!
భిన్నత్వంలో
ఏకత్వం గల
మానవత్వమున్న
మహీరా !
దేశమాతను
కాపాడే ధీరులం భారతీయులం మేమేరా!’’ (గుందవరం
కొండల్ రావు) అని భారతదేశానికి ఉన్న చారిత్రక వారసత్వాన్ని, ఆ వీరత్వాన్ని గుర్తుచేస్తారు
కవి.
భారతదేశం విభిన్నజాతుల ప్రదర్శనశాలగా చరత్రకారులు
భావిస్తారు. అందరూ కలిసిమెలిసి, ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకొనే గొప్పగుణం భారతీయలది
అంటూ…
‘’భిన్న
సంస్కృతుల సమాహారం
నా
జన్మభూమి వివిధ వర్ణాల పూదండ
నా
భరతఖండం
యే
వినాశ కాలమో, మరే విపరీతబుద్ధో
పహల్గామ్
పర్యాటకులపై పాశవిక దాడి
పిట్టల్లా
కాల్చి పొట్టన పెట్టుకున్న ఉగ్రమూక
కుంకుమ
పువ్వులు పూయాల్సిన ప్రాంతాన
నెత్తుటి
ఏర్లు చిమ్ముతున్నాయి.’’ (నాంపల్లి
సుజాత అన్నవరం)
‘‘భిన్న సంస్కృతుల సమాహారం’’ ‘‘వివిధ వర్ణాల పూదండ’’ వంటి పదబంధాలు
భారతదేశం యొక్క బహుళ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చిత్రిస్తున్నాయి.
"కుంకుమ పువ్వులు పూయాల్సిన ప్రాంతాన / నెత్తుటి ఏర్లు చిమ్ముతున్నాయి’’: ఈ పంక్తులు
కవితలో సాహిత్య సౌందర్యాన్ని శిఖరప్రాయంగా చూపిస్తుంది. కాశ్మీర్ లోయ యొక్క సౌందర్యాన్ని,
శాంతిని, సంప్రదాయాన్ని సూచించే ‘కుంకుమ పువ్వులు’ను, హింస, మరణం, విధ్వంసాన్ని సూచించే
‘నెత్తుటి ఏర్లు’తో వ్యతిరేకించడం ద్వారా కవయిత్రి దాడి యొక్క దారుణాన్నీ,, కాశ్మీర్
యొక్క దుర్గతినీ శక్తివంతంగా చిత్రిస్తారు. ఈ వ్యతిరేక చిత్రణ కాశ్మీర్ యొక్క గత వైభవం,
వర్తమాన దుఃఖం మధ్య సంఘర్షణను హృదయస్పర్శిగా వ్యక్తీకరిస్తుంది.
ఉగ్రవాదం:మానవత్వంపై దాడి:
పహల్గామ్
దాడి కేవలం ఒక భౌగోళిక సంఘటన కాదు, ఇది భారతీయ సంస్కృతి, మానవత్వం, శాంతి ఆదర్శాలపై
దాడి. కవులు ఈ దాడిని ఖండిస్తూ, దాని దారుణతను, భావోద్వేగ ప్రభావాన్ని తమ కవితలలో స్పష్టంగా
చిత్రించారు. కాశ్మీర్ యొక్క పవిత్రత
నిండిన ఆ హిమగిరులను రక్తంతో మరకలు చేయడం ద్వారా దాడి యొక్క భీకర స్వభావాన్ని,, సౌందర్యం
మీద జరిపిన హింస, విధ్వంసాలను దృశ్యాత్మకంగా
చిత్రిస్తూ…
‘’రుధిరంతో
తడిపారు
కాశ్మీరపు
హిమగిరులను...
మిన్నంటిన
భారతీయుల ఆర్తనాదాలతో పంచభూతాలు ప్రకంపించాయి.’’ (ఎస్.స్రవంతి) అని వర్ణించారు. పంచభూతాల ప్రకంపనం అనడం ద్వారా ఆ దాడి
యొక్క సామూహిక, విశ్వవ్యాప్త ప్రభావాన్ని సూచిస్తూ, మానవత్వంపై జరిగిన అన్యాయాన్ని
హృదయవిదారకంగా వ్యక్తీకరిస్తుంది. పంచ భూతాల ( పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం) ఘన స్థితిని సూచిస్తుంది. హిందూ తత్వశాస్త్రంలో
ప్రకృతిని రూపొందించే ఐదు ప్రాథమిక మూలకాలుగా భావిస్తారు. ఇవి సృష్టి యొక్క మూలాధారాలుగా
పరిగణించబడతాయి. సమస్త విశ్వం ఈ ఐదు భూతాల
సమ్మేళనంతో రూపొందినదని నమ్ముతారు. ఉగ్రవాదుల దాడి వల్ల భారతీయుల ఆర్తనాదాలు (విషాదం,
ఆవేదన) విశ్వవ్యాప్తంగా, సమస్త సృష్టిని (పంచభూతాలను)
కంపించేంత శక్తివంతమైనవిగా చిత్రీకరించడం వల్ల, ప్రపంచ దేశాలన్నీ ఎలా స్పందించారో చిత్రించినట్లయ్యింది. అటువంటి ప్రకృతిలో భాగమే అక్కడ హిమాలయాలు… అక్కడి
లోయలు… అక్కడ ప్రజలు.. వారి స్థితి ఎలా ఉందో చెప్తూ..
‘’ఎరుపెక్కిన
హిమాలయాలు..
మూగబోయిన
కాశ్మీరీ లోయలు..
నివ్వెరబోయిన
పర్యాటకులు..
భరతమాత
సిగలో తూటాలు..’’ (అక్కిమీ సింహ) అన్నారు. ఆ భూమిని సాధారణంగా భరతమాతకు శిరస్సుగా భావిస్తారు.
పరిమళాలు వెదజల్లే కాశ్మీర్లో తూటాలు పేల్చిన దుండగుల దుశ్చర్యలను సిగలో తూటాలుగా అభివర్ణించి
వారి వికృత చేష్టలను మనముందుంచారు.
‘’మంచుగడ్డలు
నెత్తుటి ముద్దలై
పసుపుతాళ్లను
తెంచుకుంటూ..
కర్కశత్వపు
గుండె తొడుగుకున్న
పరాన్నజీవులు
ఉగ్ర తూటాలై
శాంతి
కపోతాల
మరణ
శాసనాన్ని ముద్రించాయెందుకో..!’’ (డాక్టర్
మోటూరి నారాయణరావు) అని ప్రతి భారతీయుడు బాధపడిన
దుఃఖ సన్నివేశాన్ని, ఆ దృశ్యాన్ని కవిత్వమయం చేశారు. కవిత్వం కానీ పదం లేదు ఈ కవితలో. ఈ దాడిలో పర్యాటకులలో అనేక మంది నూతన వధూవరులు ఉన్నారు.
భార్యల ముందే వారి భర్తలను నేరుగా కాల్చి చంపారు. హృదయవిదారకమైన ఆ దృశ్యాలు సామాజిక
మాధ్యమాలలో ఎంతో మందిని కదిలించాయి. దీన్ని కవిత్వీకకరిస్తూ…
‘’కాశ్మీరలోయలో
కన్నీరు వరదలై
మిన్నంటే
నవవధువు ఆర్తనాదం
కట్టెదుట
ముష్కరదాడికి
పతులను
కోల్పోయి సతులు
భయాందోళనతో
భోరున విలపించిన భీకరక్షణాలు’’ (ముడుంబై
శేషఫణి) గా అభివర్ణించారు.
ఇలాంటి దాడులు ఎలాంటి వాళ్ళు చేశారు చెప్తూ...
‘’మతి
తప్పిన
గతి
తప్పిన
మతోన్మాదం
చేసిన విషాదమిది’’ ( ఆకుల రఘురామయ్య)
అని మతం పేరుతో చేసిన ఉన్మాదాన్ని కవిత్వీకరించారు.
సాధారణంగా
మతం ప్రేమను పెంచాలి. మానవత్వాన్ని పెంపొందించాలి. కానీ మతం పేరుతో...
‘’చంపడం,చావడం
పగలగొట్టడం,
నేనే
గొప్ప అనుకోవడం నీచం... నీచత్వమే...మతం అనడం మూర్ఖం’’ (షాజీదా భేగం) అవుతుందని తన ఆగ్రహాన్ని కవిత్వంగా
వర్ణించారు.
ఒకప్పుడు
ఎటు చూసినా సుందర దృశ్యాలతో అలరారే దాంతో ఎలా
ఉందో వర్ణిస్తూ…..
‘’ఏం
చూసేట్లు లేదు! ఏం వర్ణించేట్లు లేదు!
కాశ్మీర్
చెట్ల నిండా తూటాల పండ్లు
పచ్చని ప్రకృతి లోయల్లో రక్త జల ప్రవాహలే
ఒక
దృశ్యం చూసి మరో దృశ్యం కనాలంటే
అణువణువునా
ముష్కరుల గాలాలు వేసి వున్నాయి.’’
(తమ్మా రాజా) అని ప్రతి భారతీయుడు బాధపడుతున్న వేదన కవిత్వమయ్యింది. ఉగ్రవాదులు ఇలా
ఎందుకు చేస్తున్నారు? మేధావులు పలు రకాలుగా ఊహిస్తున్నారు.
జమ్మూ & కాశ్మీర్‌లో సాధారణస్థితి తిరిగి రావడాన్ని దెబ్బతీయడం, భారతదేశంలో మతసామరస్యాన్ని
రెచ్చగొట్టడం, 2024లో కాశ్మీర్ లోయను సందర్శించిన 23 మిలియన్ల పర్యాటకులుగా నమోదైన
ఆర్థిక వ్యవస్థ మరియు పర్యాటక వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేయాలనుకోవడం, పాకిస్తాన్
నుండి సీమాంతర ఉగ్రవాదం కొనసాగడానికి అవకాశాలను సృష్టించడం వాళ్ళ లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
ఈ ప్రాంతంలో ఈ ఉగ్ర మూకల దాడి అనేకసార్లు చేశారు. ఆ దాడుల్లో ఎంతోమంది చిన్నపిల్లలు,
మహిళలు చనిపోయారు. దీన్ని కవిత్వం చేస్తూ…
‘’పసి
మొగ్గలు, పడచు స్త్రీలు.
పండు
ముదుసలులు
ఒరిగి
పొయిన వారి వంశ వృక్షాలను జూసి
వలవలా
ఏడుస్తుంటే ...!
కట్టలు
ద్రించు కొని ప్రవహించే కన్నీరు
సింధూ
నదిలో కలుస్తదనుకోలేదు.
మతం
పేర మారణ హోమం సృష్టిస్తుంటే
సుందర
కాశ్మీరం విరిగి పోయి
దిక్కులు
పిక్కటిల్లేలా విలపిస్తోంది!
రక్త
తర్పణానికి రాలి పోయిన
కుంకుమ
పూలతో అంజలి ఘటిస్తోంది!’’ (చిట్యాల
ఉపేందర్) అని దుఃఖ దృశ్యాన్ని మనముందు నిలుపుతున్నారు.
‘’ముష్కరుల
చేతలకు
నుదుటి
కుంకుమ నివ్వెరపోయింది
కాళ్ల
పారాణి కన్నీరు పెట్టింది.
…
ఏ శిక్షతో
చెరపాలి ఈ చేదు జ్ఞాపకాన్ని
తడియారని
ఆ కంటి చెమ్మను
ఏ దౌత్యం
సమాధాన పరుస్తుంది!?
ఏ మతం
రప్పిస్తుంది.
తీసిన
ఆ ప్రాణాలను?’’ (కవిత పాటిబండ్ల)
అని ఆ దాడులలో మరణించిన వారి బంధువులు, మానవతావాదులు నిలదీస్తున్నారని కవిత్వమయ్యారు.
‘’కొద్ది
నిమిషాల్లోనే
ఇరవై
ఆరు నిండు ప్రాణాలను
నిలబెట్టి
బలి తీసుకున్నాయి ముష్కర మూకలు
ఆ దారుణం
చూడలేక
మంచు
కొండలు నీరైనాయి.
ఆ ఘాతుకం
గాంచలేక
ఎర్రని
యాపిళ్ళు నల్లగైనాయి.
ఎందుకింత
దారుణ మారణ హోమం.!
ఏమైపోయింది
మనిషిలోని దయాగుణం.?
ఎక్కడ
దాక్కుంది మానవతా దైవత్వం.!?
మతోన్మాద
ఉగ్రవాదమా !
నీవింత నీచమా.!!’’ ( బొమ్మరాత యల్లయ్య)
మంచు కరిగిపోయి నీరవ్వడం సహజం. కానీ దీన్ని ప్రకృతి కన్నీళ్లు పెట్టుకుంటుందని
ఊహించడం కవి భావుకతకు నిదర్శనం. దీనితో పాటు కొంతమంది మతాన్ని దానిలోని మూల సూత్రాలను
విస్మరించి, వక్రీకరించి ప్రబోధిస్తుంటారు.
ఆ వక్రీకరణతో గొప్పదని తీవ్రవాద భావజాలం ఉగ్రవాదం కంటే భయంకరమైంది. అలాంటి దాన్ని
మతోన్మాద ఉగ్రవాదంగా అభివర్ణిస్తున్నాడు కవి.
ఘోరమైన ఆ దృశ్యాన్ని కుంకుమపూల దుఃఖ సముద్రంగా అభివర్ణించడం ఎంతో సమయస్పూర్తితో. ఔచిత్యభరితమైన వర్ణనగా చెప్పుకోవచ్చు.
‘’సుందర
కాశ్మీరం నెత్తురోడుతుంది.
మతోన్మాద
ఉగ్రవాదం ఇనుప హృదయం
ప్రకృతంత
స్వచ్ఛమైన పర్యాటక ప్రేమికుల్ని చిదిమేసిన వైనం
కంట
తడి పెట్టించే భయానక దృశ్యం
కుంకుమ
పూల దుఃఖ సముద్రం’’(పప్పుల రాజిరెడ్డి).
కాశ్మీర్ లోయ యొక్క సహజ సౌందర్యాన్ని మతోన్మాద ఉగ్రవాదం యొక్క హింసతో గాఢంగా
విరుద్ధపరుస్తూ, దాని విషాదకర రక్తపాతాన్ని హృదయవిదారకంగా చిత్రించాడు కవి. “సుందర
కాశ్మీరం నెత్తురోడుతుంది” అనడం ద్వారా లోయ యొక్క స్వచ్ఛమైన సౌందర్యాన్ని హింసతో కలుషితం
చేయడాన్ని సూచిస్తుంది, అయితే “కుంకుమ పూల దుఃఖ సముద్రం” అనేది ఒక గొప్ప ఇమేజరీ. సాధారణంగా
కాశ్మీర్ నుండి వచ్చే కుంకుమ పూలు పుట్టబోయే
పిల్లలు అందంగా, తెల్లగా పుట్టాలని గర్భిణీ స్త్రీలకు పాలలో కలిపి ఇస్తారు. ఇప్పుడు
అవి రక్తంతో మునిగిన పుష్పాలుగా మారి దుంఃఖ సముద్రాన్ని తలపింపజేస్తున్నాయని ఉత్ప్రేక్షిస్తారు కవి.
“ఇనుప హృదయం”, “భయానక దృశ్యం” వంటి
వర్ణనలు ఉగ్రవాదం యొక్క క్రూరత్వాన్ని, పర్యాటకులు, అక్కడ ఉండే స్థానికుల బాధను శక్తివంతంగా ఆవిష్కరిస్తుంది. ఈ కవిత సౌందర్యాన్ని
, దానిలో చేరిపోయిన విషాదం యొక్క సమ్మేళనంతో, కాశ్మీర్ యొక్క సంఘర్షణను సునిశితంగా
వ్యక్తీకరిస్తారు కవి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే భారతీయులు యుద్ధం చేయవచ్చు కదా
అనిపించవచ్చు. కానీ భారతీయులు శాంతిని కోరుకుంటారు. ఒక ఆధ్యాత్మిక దృక్పథం కలిగిన దేశం.
ఎంతోమంది ఋషులు నడయాడారు. కనుక ఆ సంస్కారం ఇంకా కొనసాగుతున్న నేల. దీన్నిలా వర్ణిస్తారు
కవయిత్రి.
‘’మా
మౌనం నీకు చేతకానితనంగా అనిపిస్తుందేమో అది సద్గురువుల ఆశీస్సులతో వచ్చిన సభ్యత నిండిన
సంస్కారం’’ ( నెల్లూరు ఇందిర)
‘’మతమంటే కాదురా
మారణ హోమం
మతమంటే
కావాలి మానవ హితం
మనమంతా
నేర్వాలి పరమత సహనం
కాశ్మీరం
కావాలి భూతల స్వర్గం’’ (కనపర్తి
లక్ష్మయ్య)
పాట.
‘’హింసాత్మక
మతవాదం
మానవ
ఉనికికి
ఏనాటికైనా
పెనుముప్పే’’ (ఎం.రాజశేఖర్)
‘’మానవత్వమే
నిజమైన తత్వం మనిషి తత్వం మానవుడిని మతంతో చూడొద్దు
మానవత్వంతో
చూద్దాం’’ ( అబ్దుల్ హకీమ్)
ఈ మూడు కవితా ఖండికలు కాశ్మీర్ సంఘర్షణ యొక్క నేపథ్యంలో మతోన్మాద హింసను
విమర్శిస్తూ, మానవత్వం, సహనం,శాంతిని ప్రతిపాదిస్తాయి. కనపర్తి లక్ష్మయ్య యొక్క పాట
సామాజిక చైతన్యాన్ని లయబద్ధంగా అందిస్తుంది, రాజశేఖర్ గారి ఖండిక హింస యొక్క విధ్వంసకరతను
సంక్షిప్తంగా హెచ్చరిస్తుంది, హకీమ్ గారి కవిత మానవత్వాన్ని సర్వోత్కృష్టంగా ఉద్ఘాటిస్తుంది.
సౌందర్యపరంగా, ఈ కవితలు సరళమైన భాష, శక్తివంతమైన చిత్రణ, భారతీయుల భావోద్వేగాల్ని ఎంతో
లోతుగా పహెల్గామ్ విషాదాన్ని, మరొకవైపు శాంతి
కోసం పడే ఆకాంక్షను సమర్థవంతంగా వ్యక్తం చేస్తాయి. ఈ కవితా ఖండికలన్నీ మత దుర్వినియోగాన్ని
ఖండిస్తూనే, మానవత్వం ఆధారంగా కాశ్మీర్‌ను భూతల స్వర్గంగా పునర్నిర్మించాలనే ఉదాత్త
ఆశయాన్ని వ్యక్తంచేస్తాయి. ఈ కవితా సంకలనంలో ఇంచుమించు అందరూ మతానికి సంబంధించిన మరొక
విధ్వంసక కోణాన్ని చిత్రించి, దాన్ని ఖండించారు. ఈ దృష్టి కోణంతో ఛందోబద్ధమైన పద్యాలను
కూడా వర్ణించిన కవులున్నారు.
‘’ఏ
గ్రంథం చెప్పిందోయ్..
ఇతరులను
చంపమని?
ఏ దేవుడు
చెప్పాడోయ్
ప్రాణాలను
తీయమని?
ఏ చదువున
దాగుందోయ్
హింసతోడ
రక్తపాతం?
ఏ బడిలో
చదివావోయ్
దారుణాల
క్రూరత్వం?’’ (వరలక్ష్మి యనమండ్ర)
మీ ప్రశ్నిస్తూ నిజమైన మతం నిజమైన దేవుని యొక్క ఆకాంక్షలు క్రూరత్వంతో నిండి ఉండవంటారు
కవులు.
‘’అందాల
కాశ్మీరు నవలోకమునకెళ్ళ కాల్చియుచంపిరి కసిగవారు
దొంగదెబ్బలుతీసి
దొరకకవెళ్ళియు
రెచ్చిపోయిరివారి
పిచ్చిమతము’’ (గాండ్ల నర్సింహులు)
‘’మతము
పేరుతోడ మనుషులవేర్దేసి
జాతి
భేదమించి జతలుకట్టి
కాల్చి
చంపివేయు కర్కశులందర్కి
శిక్షవేయవలెను!
కక్షధీర!!’’ ( మల్లముల కనకయ్య)
●
1993 – ముంబయి బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 257
మంది మృతి చెందారు. పాక్ ఐఎస్ఐ మద్దతుతో దావూద్ ఇబ్రాహీం, టైగర్ మేమన్ ఈ దాడికి పాల్పడ్డారు.
●
1999 – కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ మిలిటరీ
ముజాహిదీన్ల వేషంలో కశ్మీర్‌లోకి చొరబడ్డారు. ఆ దాడిని తిప్పికొట్టి భారత్ విజయం సాధించింది.
●
2001 – డిసెంబర్ 13న భారత పార్లమెంట్‌పై ఉగ్రవాదులదాడి
జరిగింది. లష్కరే తోయ్బా, జైషే మహ్మద్ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. 9 మంది భద్రతా
సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
●
2005 – ఢిల్లీ నగరంలో పలు బాంబు పేలుళ్లు జరిగాయి. అనేక
మంది పౌరులు మరణించారు. దాడుల వెనుక పాకిస్తాన్ మూలాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
●
2008 – నవంబర్ 26న ముంబయి 26/11 ఉగ్రదాడి జరిగింది.
166 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చారు. వీరికి
పాక్ లోని లష్కరే తోయ్బా శిక్షణ ఇచ్చింది.
●
2016 – జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదులదాడి
జరిగింది. జైషే మహ్మద్ సంస్థ ఈ దాడి చేయించింది.
●
2016 – సెప్టెంబర్‌లో ఉరీలో భారత సైనిక క్యాంపుపై దాడి
జరిగింది. 19 మంది జవాన్లు మరణించారు. భారత్ ఆ వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది.
●
2019 – ఫిబ్రవరి 14న పుల్వామాలో CRPF బస్సుపై ఆత్మాహుతి
బాంబు దాడి జరిగింది. 40 మంది జవాన్లు మృతి చెందారు. దాడి వెనుక జైషే మహ్మద్ ఉంది.
● 2019 – ఫిబ్రవరి 26న భారత్ బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడి (ఎయిర్
స్ట్రైక్) జరిపింది. ఇది పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా జరిగింది
ఇలాంటి
పరిస్థితుల్లో భారతీయులు చేతులు కట్టుకుని కూర్చోకూడదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న
ఆ పాకిస్థాన్ దేశానికి తగిన బుద్ధి చెప్పాలని, దాని ద్వారా మాత్రమే నిజమైన శాంతి కలుగుతుందంటూ
కవులు తమ కవితలను రచించారు. కేవలం పహెల్గామ్ సంఘటన మాత్రమే కాకుండా అంతకు ముందు జరిగిన
సంఘటనలు కూడా గుర్తు చేస్తూ, సహనం మంచిది కాదంటూ, ఆ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలంటారు
కవులు. కార్గిల్ లో మ్రోగించిన విజయఢంకా మరోసారి
మ్రోగించకతప్పదంటారు.
‘’స్వతంత్ర
భారతి జననం మొదలుగా
కశ్మీరం
నేటికీ చిందుతున్నదిరుధిరం
రక్తం
మరిగిన తోడేళ్ళు విచ్చలవిడిగా చంపుతున్నది జనుల వడివడిగా’’ (జనశ్రీ డాక్టర్ జనార్ధన్ కుడికాల) పాట.
ఆవేదన నుండి సంకల్పం వరకు:
ఈ సంకలనంలోని
కవితలు కేవలం ఆవేదన వ్యక్తీకరణతో ఆగిపోలేదు. అవి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనే
సంకల్పాన్ని, శాంతిని, మానవత్వాన్ని పునరుద్ధరించాలనే ఆకాంక్షను ప్రతిబింబిస్తాయి.
‘’పుల్వామాతో
ఎగిసిన నెత్తుటి ముద్దలు
భూతల
స్వర్గాన్ని బుగ్గి పాలు చేశాయి
హద్దు
దాటి రెచ్చగొట్టిన వారిని
హద్దులో
పెట్టండి కార్గిల్ సాక్షిగా’’ ( మాడిశెట్టి
సుజాత)
‘’వక్రమార్గమందువంకరచేష్టల
తట్టి
లేపి నావు తాటతీయు
జుట్టుపట్టి
యీడ్చి జాడిచ్చి గొట్టియు మట్టిగప్పగలము మట్టుబెట్టి’’(ఆకుల మల్లికార్జున్)
‘’ఈ
నరమేధానికి ముగింపు పలకాలని,
ప్రపంచ
దేశాలు ఏకం కావాలని,
ప్రపంచశాంతిని
నెలకొల్పాలని,
భావితరాలకు
భద్రతనివ్వాలని,
వినమ్రంగ
వేడుకుంటుంది 'పహెల్గాం'!’’(చెలుపూరి
పూర్ణచంద్ర శర్మ)
‘’ఆక్రమిత
కాశ్మీరాన్ని ఆజాదీగా పునర్జీవింపజేయాల్సిందే!
మన
భద్రతా దళాలు ఈ ఘాతుకానికి
ధీటైన
జవాబు చెప్పాల్సిందే
విశ్వమహమ్మారి
ఈ ఉగ్రవాదాన్ని
కూకటివేళ్ళతో
నిర్మూలించాల్సిందే!’’(సంకేపల్లి
నాగేంద్రశర్మ)
‘’భారత
వీర జవానుల
ఆగ్రహావేశాలకు గురయ్యారో
భస్మీపటలం
కాక తప్పదు..!
ఆదిపరాశక్తి
ప్రతిరూపమైన
మా
భరతమాతతో పెట్టుకున్నారో
మీ
బతుకులు ఛిద్రం కాక తప్పదు’’ ( చౌడూరి
నరసింహారావు)
‘’ఊకదంపుడు
మాటలు కాదు ఇప్పుడు కావాల్సింది.
రక్తపు
మరక మానకముందే
మరో
సంఘటన జరగక ముందే
యుద్ధం
చేసి గెలవాల్సిందే
మరొకడు
మన జోలికి రాకుండా
గుణపాఠం చెప్పాల్సిందే.’’. (కోమటిరెడ్డి
బుచ్చిరెడ్డి )
ఈసారి
చేసే యుద్ధం దేశ ప్రజల ఆకాంక్షగా, దేశ ప్రజలందరూ కలిసికట్టుగా చేసే ఒక హెచ్చరికగా భావిస్తామంటున్నారు.
‘’బోర్డర్
ఇక
విభజన రేఖ కాదు
నూట
ఏబై కోట్ల
ఈ దేశపు
ప్రజల హెచ్చరిక అవ్వాలి !!’’ (తిప్పాన
హరిరెడ్డి)
భారతదేశం
తగిన విధంగా పాకిస్తాన్ ఉగ్రవాద మూకలకు బుద్ధి చెప్పడం ద్వారా మాత్రమే మళ్లీ మన కాశ్మీర్
భరతమాత శిఖలు ఒక పువ్వులా పరిమళిస్తుందనే ఆకాంక్షలు
వ్యక్తం చేస్తారు.
‘’కాశ్మీరం
ఎప్పటికీ తల్లి భారతి సిగ వువ్వే..
ఇది
అనంతానందపు తొలి వెలుగుల నవ్వే’’ (పిల్లా
వెంకటరమణమూర్తి)
భారతీయ సమైక్యత, శాంతి కాంక్ష :
ఈ సంకలనంలోని
కవితలు భారతీయ సమైక్యతను, బహుళ సాంస్కృతిక ఔన్నత్యాన్ని ఉద్ఘాటిస్తాయి. యుద్ధానంతరమే
నిజమైన శాంతి వస్తుందని ఎంతోమంది మేధావులు కూడా భావించారు. అప్పుడు మనం నేర్పవలసినవి
ఏమిటో కూడా కవులు సూచిస్తున్నారు. అవన్నీ తరతరాలుగా భారతీయులు అనుసరిస్తున్న మార్గాలు.
‘’ప్రతి
పాఠశాలలో శాంతి పాఠం బోధించాలి,
ప్రతి ప్రార్ధనలో ప్రేమే మొదటి రాగం కావాలి
దేవుడు
ప్రతి హృదయంలో కొలువై ఉండాలి
ఆ హృదయాల్లో
మతాలకన్నా
మానవతే
ఎక్కువగా ఉండాలి.
మనిషిని
చంపే మతం
దేవునికి
దూరంగా ఉంటుంది
ప్రేమించే హృదయం
దేవాలయానికి
సమానం.’’ (నూతి పద్మ)
‘’మెదల్ల
నిండా చీకట్లు నిండిన చోట
మానవత్వమే
ప్రేమ జ్యోతులు వెలిగించాలి
విశ్వ
మానవ సౌభ్రాతృత్వం
ఈ భూగోళం
మీద ప్రాణ వాయువై
పచ్చగా
విస్తరించాలి.’’ (తోకల రాజేశం)
ఈ భావన భారతీయుల శాంతి జీవనానికి, సాంస్కృతిక సమైక్యతకు
నిదర్శనం. ఇటువంటి భావాలే ఈ కవితా సంకల్పం నిండా ఉన్నాయి. మొత్తం మీద ఈ కవితా సంకల్లోని
కవితలన్నీ పహల్గామ్ లోయలో జరిగిన హృదయ విదారక ఉగ్రవాద దాడిని ఖండించాయి. అది భారతదేశ చరిత్రలో మరో దుర్దినంగా నిలిచిపోయిందని
నినదించాయి. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఈ దుర్మార్గపు చర్య, మానవత్వంపై దాడి మాత్రమే
కాదనీ, దేశ సమైక్యతను కదిలించే కుట్ర కూడా అని గుర్తించాయి. ఈ సందర్భంగా పెల్లుబికిన
ధర్మాగ్రహమే తమ కవితల ద్వారా ఆవేదన, ఆగ్రహం, శాంతి కాంక్షగా ఈ సంకలనంలో స్పష్టంగా కనిపిస్తాయి.
కులాలు, మతాలు, ప్రాంతీయ విద్వేషాల పేరుతో విద్వేషాన్ని కనిపెట్టిన కవులు
‘’భారత
సమైక్యతను ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరు. మానవత్వం నిలుస్తుంది, శాంతి వెల్లివిరుస్తుంది’
అని నినదిస్తున్నారు.
అయితే,
మనసహనం చేతకానితనంగా ఉండకూడదు. ఇలాంటి ఉగ్రవాదులను
‘’ప్రపంచ
దేశాలన్నీ ఏకమై జల్లెడపట్టాలి అస్త్రశస్త్రాలతో అష్టదిగ్బంధం చేయాలి.
ఉగ్రవాదం
అంతమయ్యే వరకూ
అది
నిరంతరం కొనసాగాలి.’’ అనే బలమైన
ఆకాంక్షల్ని కూడా వ్యక్తీకరిస్తున్నారు కవులు.ఈ కవితలు కేవలం ఆవేదనల వ్యక్తీకరణ మాత్రమే
కాదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే సంకల్పం, మానవత్వాన్ని, శాంతిని పునరుద్ధరించాలనే
ఆకాంక్ష కూడా. ఈ సంకలనం పాఠకులను ఆలోచింపజేస్తూ, ఐక్యత, శాంతి కోసం కృషి చేయమని ప్రేరేపిస్తుంది.
దీనిలో వర్ణనల సౌందర్యాన్ని, అభివ్యక్తి వైవిధ్యాన్ని కాదు,ఆవేదన కెరటాలు చూడాలి. ఈ
కవితల్లో ఆవేదనలతో రగిలి పోతున్న గుండెల్లో ప్రవహిస్తున్న లావాలను చూడాలి. మానవత్వం
కోసం తపిస్తున్న మనుషుల ప్రేమని చూడాలి. కలిసిమెలిసి ఉండాలనే బహుళ సాంస్కృతిక ఔన్నత్యాన్ని
చూడాలి. ఈ కవితల్లో భారతీయులుగా కలిసిమెలిసి ఉన్నామని ధ్వనిస్తున్న సందేశాన్ని వినాలి.
‘ఆపరేషన్ సిందూర్’ భారతీయుల ఆకాంక్షల ప్రతిఫలనం:
భారతీయులందరి
ఆకాంక్షల ప్రతిఫలనంగానే అన్నట్లు‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరుతో మన భారత సైన్యం పాకిస్థాన్,
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై 2025 మే 7న దాడులు చేసి ఉగ్రవాదులను మట్టుపెట్టారు. దీనికి ఆర్మీలోని మహిళలే నాయకత్వం వహించడం ఒక ప్రత్యేకతగా
చెప్పుకోవచ్చు. పహల్గామ్ లో 26 మంది పౌరులు, ప్రధానంగా హిందూ పర్యాటకులు, తమ మతాన్ని
అడిగి దగ్గరి నుంచి మరీ కాల్చి చంపేశారు. ఈ దాడిలో చాలా మంది నవ దంపతులు ఉన్నారు. వారిలో
కావాలనే వారి భార్యలను వదలేసి భర్తలు వారి కళ్ళముందే చంపేశారు. అందువల్ల భారత ప్రభుత్వం
"ఆపరేషన్ సిందూరం" అనే పేరుతో యుద్ధం చేసింది. సిందూరం అనేది ఒక బలమైన సాంస్కృతిక
సంప్రదాయాన్ని, భారతీయుల భావోద్వేగాన్ని తెలియజేస్తుంది. సిందూరం లేదా కుంకుమ, హిందూ
సంప్రదాయంలో వివాహిత మహిళలు ధరించే ఒక రకమైన
ఎరుపు రంగు పొడి. ఇది వారి భర్త జీవించి ఉన్నాడని
సూచిస్తుంది. చనిపోయిన తమ భర్తల మరణానికి ప్రతీకారంగా వీరతిలకంతో చేసిన యుద్ధంగా భావించింది.
ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క సంకల్పాన్ని, బాధితులకు న్యాయం చేయాలనే
నిబద్ధతను కూడా సూచిస్తుంది. దీన్నే ఈ సంకలనంలోని కవులు కూడా కోరుకున్నారు. ఈ ఆపరేషన్
సిందూర్’ ద్వారా దీన్ని భారతీయవీరుల గుర్తుగా కూడా పరిగణిస్తున్నామనే సంకేతాన్ని ప్రభుత్వం
అధికారికంగా పంపిస్తుంది. ఇది ఈ ఆపరేషన్ సిందూర్
వీరుల స్ఫూర్తిని, దేశం యొక్క దృఢ నిశ్చయాన్ని ప్రతిబింబిస్తుంది.ఈ సంకలనంలో కవుల ఆకాంక్షలకు
ప్రతిఫలనంగా భారత ప్రభుత్వం సైనికులు సరియైన దిశలో పయనిస్తున్నారు. ఈ సంకలనంలోని కవితల
ద్వారా భారతీయల ఆత్మను, ఆకాంక్షలను మన తెలుగు కవులు శక్తివంతంగా ప్రతిఫలిస్తున్నారు.
అయితే, అన్ని కవితల్లోనూ కవిత్వమే ఉందని చెప్పలేను. కానీ, దేశభక్తి అక్షరాల్లా ఆవేశమై, వీర రస స్ఫూర్తితో కవిత్వమై పొంగిందని మాత్రం తప్పకుండా
చెప్పగలను. ఇందులో నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినా కానీ, నేను
కొంతమంది కవితలను మాత్రమే ఉటంకించాను. అంటే
మిగతా వాళ్ళ కవితలలో కవిత్వం లేదని కాదు. అందరినీ ఈ ముందుమాటలో మనం పేర్కొనలేం. కానీ
అందరి ఆలోచననూ, వారి భావుకతను శ్లాఘించకుండా ఉండలేం. ఇంత వేగంగా దేశభక్తిని ప్రేరేపించే
భారతీయ ఆత్మలను ప్రతిబింబించే ఒక కవితా సంకలనాన్ని తీసుకురావడమనేది సామాన్యమైన విషయం
కాదు.
డా. వైరాగ్యం ప్రభాకర్ గారి సాహిత్య సేవ:
ఈ సంకలనాన్ని
తీసుకురావడంలో ప్రముఖ కవి, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా దేశభక్తిని ప్రేరేపించే సాంస్కృతిక
యోధుడు డా. వైరాగ్యం ప్రభాకర్ గారి కృషి అమోఘం. ఈ సంకలనం ద్వారా దేశభక్తిని, భారతీయ
ఆత్మను ప్రతిబింబించే కవితలను ఒకచోట చేర్చారు. ఈ సంకలనం కేవలం కవితల సంపుటి మాత్రమే
కాదు; ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే ఒక సామూహిక స్వరం; శాంతి కోసం ఆకాంక్షించే హృదయ
స్పందన. ఒకవైపు ఆ సంఘటన జరుగుతుండగానే ఆ కవితలను పుస్తకంగా తీసుకాని రావాలనుకోవడం డాక్టర్
వైరాగ్యం ప్రభాకర్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఆయన గతంలో కూడా దాశరథి కృష్ణమాచార్య
గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా మొట్టమొదటి కవితా సంకలనాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా
ఆయనదే. ఈ దేశంలో జీవిస్తూ ఈ దేశంలో గాలి నీరు ప్రకృతి వనరులను అనుభవిస్తూ ఈ దేశం మీద
ప్రేమను పెంపొందించుకోవలసిన అవసరాన్ని దేశభక్తిని నిలువెల్లా నింపుతున్న ఈ సంస్థకు, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారికి, కవులకు నా హృదయ
పూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
-
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్,
హైదరాబాద్.
8.5.2025
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి