పహెల్గామ్, హాస్యవల్లరి, సప్తతి - మూడు పుస్తకాల ఆవిష్కరణ
విభిన్న సంస్కృతుల మేళవింపుతో కలిసిమెలిసి జీవిస్తున్న భారతీయ జాతీయ సమైక్యతను, మతసామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నంగా పెహల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన దాడిని పరిగణించాలని హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు (16.5.2025) హైదరాబాద్ రవీంద్ర భారతి, మినీ కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ సాహిత్య అకాడమీ, భవాని సాహిత్య వేదిక సంయుక్తంగా నిర్వహించిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మూడు పుస్తకాలను ఆవిష్కరించి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు.
పహల్గాం లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల సంఘటనకు ప్రతిస్పందించి సుమారు 136 మంది రాసిన కవితల సంకలనం ‘ప్రహల్గాం’ అనీ, దీన్ని డా.వైరాగ్యం ప్రభాకర్ త్వరగా తీసుకొచ్చి భారతీయుల ఆకాంక్షలను ప్రపంచానికి తెలియజేశారని, భారతీయులు కలిసిమెలిసి ఉండే బహుళ సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలనే ఉగ్రవాదుల చర్యను కవులు ముక్తకంఠంతో ఖండించారని ఆయన చెప్పారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడాలనే లక్ష్యంతో కవులంతా కవిత్వం రాసారని ఆయన ప్రశంసించారు. డాక్టర్ గద్వాల సోమన్న రచించిన సప్తతి గేయ సంపుటిని, వైరాగ్యం ప్రభాకర్ గారి సంపాదకత్వంలో వచ్చిన హాస్యవల్లరి కవిత సంకలనాన్ని కూడా ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ రెండు రాష్ట్రాల్లోని కవులు తమ దేశభక్తిని తెలియజేసేలా కవిత్వం రాశారని, దాన్ని పుస్తకంగా తీసుకురావడంలో ఎంతోమంది సహకరించారని పేర్కొన్నారు. శాంతి, సహనం, సమైక్యతల త్రివేణి సంగమంగా కవులు తమ భావాలను పెహల్గామ్ కవితా సంకలనంలో వ్యక్తీకరించారని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసర్ డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు గ్రంథ సమీక్షలో పేర్కొన్నారు.
చౌడూరి నరసింహారావు హాస్యవల్లరి పుస్తకాన్ని సమీక్షిస్తూ సమకాలీన సమాజానికి కావాల్సిన మంచి హాస్యాన్ని అందించిన పుస్తకంగా వివరించారు. డా. గద్వాల సోమన్న తన సప్తతి 70వ సంపుటి ‘సప్తతి’లో బాలలను ఉత్తమ పౌరులుగా తయారు చేయాలని ఆకాంక్షతో రచించిన గేయాలను ప్రచురించానని దానిలోని కొన్ని గేయాలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి డా. నామోజు బాలాచారి, డా. కాచం సత్యనారాయణ, గజివెల్లి సత్యనారాయణ స్వామి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాం కవితా సంకలనంలో కవితలు రాసిన కవులను, ఆర్థిక సహకారం అందించిన వారని సత్కరించారు. సభా ప్రారంభానికి ముందు చిరంజీవి వంగరి అపూర్వ, పొర్ల అవంతికల నృత్య ప్రదర్శన ఆహుతులను అందరినీ మెప్పించింది. దేశభక్తిని చాటే కవిత్వాన్నిఅత్యంత వేగంగా, అందంగా పుస్తకంగా తీసుకొచ్చిన డా.వైరాగ్యం ప్రభాకర్ గారిని అందరూ అభినందించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి