"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

28 ఏప్రిల్, 2025

ఇంటర్ లో తెలుగును కొనసాగించాలి (25.4.2025) ఈ డిమాండ్ చేయడానికి కారణాలు?


తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగు స్థానంలో సంస్కృతాన్ని పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. నేపథ్యంలో మా తెలుగు శాఖ అధ్యాపకులు కొంతమంది కలిసి వెళ్లి సంబంధిత అధికారులకు వినతిపత్రం ఇచ్చి వారితో మాట్లాడాం.  ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ   శ్రీకృష్ణ ఆదిత్య, రీజనల్ జాయింట్ డైరెక్టర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీమతి జయప్రదా బాయి గార్లను కలిసి సమస్యను వివరించాం. వాళ్లు ఇచ్చినటువంటి ఒక పాత సర్క్యులర్ ఆధారంగా పత్రికలు వక్రీకరించారని చెప్పారు. అయితే ఆ విషయాన్ని తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ ఇవ్వండని కోరాము. మేము వారి దగ్గరికి వెళ్లడం వలన మాకు ఆ సమస్య ఎలా వచ్చిందో అర్థం అయింది. వాళ్లకు కూడా ఈ సమస్య పట్ల తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు మాతృభాష అభిమానులు ఎలా ఆలోచిస్తున్నారో కూడా తెలిసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా  తీసుకోకపోతే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక అభిప్రాయాలు మరింత పెరిగే అవకాశం ఉందని మేము సూచించాం. సంబంధిత అధికారులతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యాపకులు జరిపిన చర్చ ఫలితంగా వారు ఒక పత్రిక ప్రకటనను జారీ చేశారు. వారి ప్రకటనను పత్రికలు సరిగ్గా వేయలేదు. కొన్ని పత్రికలు మాత్రమే ప్రచురించాయి.

మా సమస్య గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పత్రికలు బాగా స్పందించాయి. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ విశేషాలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.  

విశాలాంధ్ర దినపత్రిక 26.4.2025 సౌజన్యంతో 

విశాఖ సమాచారం దినపత్రిక 26.4.2025 సౌజన్యంతో 


తెలుగు దినపత్రిక 26.4.2025 సౌజన్యంతో 

తొలి అడుగు  దినపత్రిక 26.4.2025 సౌజన్యంతో 

తరుణం దినపత్రిక 26.4.2025 సౌజన్యంతో 
మన తెలంగాణ దినపత్రిక 26.4.2025 సౌజన్యంతో 
ఇంటర్మీడియట్ బోర్డు వారు విడుదల చేసిన పత్రికా ప్రకటన


ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి శ్రీకృష్ణ ఆదిత్య గార్కి విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తున్న తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎం 

 గోనా నాయక్. ఆచార్య త్రివేణి వంగరి, డాక్టర్ భూక్య తిరుపతి ఈ చిత్రంలో ఉన్నారు.

ఇంటర్ లో తెలుగును కొనసాగించాలి

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృతాన్ని పెట్టాలని భావిస్తున్న్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యాపక బృందం శుక్రవారంనాడు తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్, డైరెక్టర్ & సెక్రటరీ, శ్రీకృష్ణ ఆదిత్య, రీజనల్ జాయింట్ డైరెక్టర్ & కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.జయప్రదాబాయిగార్లకు ఒక వినతి పత్రాన్ని ఇచ్చినట్లు హెచ్సీయూ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాదిమంది ప్రజల మాతృభాషగా ఉన్న తెలుగును నిత్య వ్యవహారంలో ఒక భాగమని, ఇతర సబ్జెక్టుల వలె విజ్ఞానాన్ని అందించే ఒక సబ్జెక్టు అని అటువంటి తెలుగుని నిర్లక్ష్యపరిచే చర్యలు సరైనవి కాదని సంబంధిత అధికారులకు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నాడు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములుతో పాటు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య త్రివేణి వంగరి, డా.భూక్య తిరుపతి ఇతర అధ్యాపకులు వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించినట్లు ఆయన తెలిపారు. 


ఇంటర్మీడియట్ బోర్డ్  కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, రీజనల్ జాయింట్ డైరెక్టర్, వరంగల్లు శ్రీమతి జయప్రద బాయి గార్కి విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తున్న తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎం.  గోనా నాయక్, ఆచార్య త్రివేణి వంగరి, డాక్టర్ భూక్య తిరుపతి ఈ చిత్రంలో ఉన్నారు.

మన తెలంగాణ దినపత్రిక 26. 4 .20 25 సౌజన్యంతో



దిశ దినపత్రిక 26. 4 .20 25 సౌజన్యంతో


ఆంధ్రజ్యోతి దినపత్రిక 26. 4 .20 25 సౌజన్యంతో
 ఈనాడు దినపత్రిక  26. 4 .20 25 సౌజన్యంతో
ఆంధ్రజ్యోతిమన దినపత్రిక 26. 4 .20 25 సౌజన్యంతో

నవతెలంగాణ దినపత్రిక 26. 4 .20 25 సౌజన్యంతో
తెలుగు చెన్నై న్యూస్ టైమ్స్ దినపత్రిక 26. 4 .20 25 సౌజన్యంతో


వెలుగు  దినపత్రిక 26. 4 .20 25 సౌజన్యంతో


జనప్రతిధ్వని దినపత్రిక 26. 4 .20 25 సౌజన్యంతో
....
మేము ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు సమర్పించిన విజ్ఞాపన పత్రం 


ఇంటర్మీడియట్ స్థాయిలో
ద్వితీయ భాషగా తెలుగు నిర్బంధంగా కొనసాగించాలి.

గౌరవనీయ డైరెక్టర్,
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
తెలంగాణ రాష్ట్రం
హైదరాబాద్ .

ఇంటర్మీడియట్ స్థాయిలో 
తెలుగును తప్పకుండా కొనసాగించడం గూర్చిన విన్నపం..

      భారతదేశంలో ప్రశస్తమైన భాషగా గౌరవాన్ని పొంది, విస్తృతమైన సాహిత్యాన్ని కలిగి, అన్ని భాషల కంటే సముచిత వ్యవహారాన్ని , వ్యక్తీకరణ సామర్థ్యాన్ని కలిగి ఉన్న భాష తెలుగు దేశ వ్యాప్తంగా ఆయా భాషా వ్యవహర్తలందరూ తమ తమ మాతృభాషలను పరిరక్షించుకోవడం కోసం ప్రభుత్వాలే ప్రయత్నిస్తున్న ప్రత్యేక సందర్భం.ఇటీవల ఇంటర్మీడియట్ స్థాయిలో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రింది అంశాలు మీ దృష్టికి తీసుకురాదలిచాం.
తెలుగు రాష్ట్రాలలో అన్ని తరగతులలో తెలుగు ఒక పాఠ్యాంశంగా ఉండాలి. ఇంతవరకు అదే పద్ధతి కొనసాగింది. కానీ ఇటీవల సంస్కృతాన్ని ఇంటర్మీడియట్ స్థాయిలో ద్వితీయ భాషగా ప్రవేశ పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సంస్కృత భాష పట్ల మాకు వ్యతిరేకత లేదు గాని, మాతృభాష తెలుగు స్థానంలో ఈ భాషను ప్రవేశపెట్టాలని సంకల్పించడమే అత్యంత బాధాకరం. కేవలం మార్కుల కోసం తెలుగు భాషను బలి పెట్టాలని భావించడం అత్యంత గర్హనీయం. సంస్కృతంలో శబ్దాలు, ధాతువులు, సంధులు, సమాసాలు వంటివి నేర్పుతారు. వాటితో సమానంగా ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యాంశాల్ని పరిగణనలోకి తీసుకొని మార్కులు రావడం లేదని భావించడం సరైన విధానం కాదు. సంస్కృతాన్ని ఒక ఐచ్ఛికాంశంగా తీసుకోవాలి అంటే అంతకుముందు వారికి ఆ భాషతో పరిచయం ఉండాలి. కానీ ఆ పరిచయం లేకపోయినా సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకోవడానికి అవకాశాన్ని కలిగించడం సరైనటువంటి విధానం కాదు.  
సంస్కృతం కేవలం ఆ రెండు సంవత్సరాలు మార్కుల కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. జీవితంలో సంస్కృతాన్ని ఎక్కడా ఉపయోగించిన లేదా ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు.
తెలుగు విషయంలో ఇతర సబ్జెక్టులు ఎలాంటి విజ్ఞానాన్ని అందిస్తున్నాయో అంతటి విజ్ఞానాన్ని తెలుగు భాషా, సాహిత్యాల ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్నారు. పదవ తరగతి వరకు తెలుగు చదివిన వారికి మాత్రమే ఇంటర్మీడియట్లో ద్వితీయ భాషగా తెలుగు చదువుకోడానికి అవకాశం ఉంది ఇటువంటి నిబంధనల నేపథ్యంలో ఎవరైనా సరే ఇంటర్మీడియట్లో సంస్కృతంతో పరిచయం లేకపోయినా ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకోవచ్చు అనే ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం సరైనది కాదు. 
నిత్యం వ్యవహారంలో ఉపయోగపడే తెలుగు భాషను ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులు చదువుకోవడానికి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం అవకాశం కల్పించాలి. ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగు లేకపోతే క్రమంగా డిగ్రీ స్థాయిలోనూ లేకుండా పోయే ప్రమాదం ఉంది.

      ఈ పరిస్థితిలో ఎంఏ లోను చదువుకోడానికి అవకాశం ఉండదు.భాషావ్యవహార నైపుణ్యం, దక్షత క్రమంగా అంతరించిపోతాయి.అనేక మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయి. చదువుకున్న తర్వాత విద్యార్థులు ఉద్యోగాలు చేసేటప్పుడు ప్రజలతో సంభాషించడానికి సంస్కృతం కంటే తెలుగు భాష ఎంతో ఉపయోగంలోఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు కంటే ఇతర భాషలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం అనేది తెలుగుకి జరిగే అన్యాయంగా గుర్తించాలి.
        ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగు లేకుండా పోవడం వల్ల క్రమంగా సమాజానికి, తెలుగు భాషకు తీవ్రమైన అన్యాయం చేసిన వారం అవుతాం.ఒకవైపు దేశవ్యాప్తంగా మాతృభాషలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నూతన జాతీయ విద్యా విధానం, (National Education Policy) 2020 తెలియజేస్తుంది. ప్రపంచ దేశాలలో మాతృభాషలలో అధ్యయనాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించి తెలుగు భాషను ఇంటర్మీడియట్ స్థాయిలో నిర్బంధంగా ఉండేటట్లు చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా కోట్లాదిమంది ప్రజలు వ్యవహరించే తెలుగు భాషకు, వేల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్న తెలుగు సాహిత్యానికి గొప్ప గౌరవాన్ని, సముచిత స్థానాన్ని కల్పించి భాషకు గొప్ప మేలును చేసిన గౌరవాన్ని పొందాల్సిందిగా ఇంటర్మీడియట్ బోర్డు కు విజ్ఞప్తి చేస్తున్నాం.

ఇట్లు 
తెలుగు అధ్యాపక బృందం 
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 
హైదరాబాద్. 
25.4.2025
.......
ఈ విషయాల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోగానే ప్రముఖ సాహితీవేత్తలు ఎంతోమంది స్పందించారు. 
ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ఆచార్య పులికొండ సుబ్బాచారి, ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి, ఆచార్య ఎన్ ఈశ్వర్ రెడ్డి, ఆచార్య వంకిరెడ్డి రెడ్డప్ప రెడ్డి, డా. ఐనాల సైదులు, డా.శీలం భద్రయ్య, పి. కృపాకర్ మాదిగ, రత్నాకర్ పెనుమాక, దువ్వ రత్నాకర్, డా.ఆచార్య ఫణీంద్ర, డా.ఎస్ ఆర్ ఎస్ కొల్లూరి, డా.సుబ్బరాజు, డా.ఈశ్వర్ గజవెల్లి,   ఎజ్రా శాస్త్రి, డా.కళ్యాణ్ కుమార్ తన్నీరు... ఇలా ఎంతోమంది ఈ కృషిని ప్రశంసించారు. మరి కొంతమంది మరికొన్ని మార్పుల కోసం కూడా ప్రయత్నించాలని సూచించారు.  




......
తెలుగు ప్రత్యామ్నాయంగా సంస్కృతాన్ని ప్రవేశపెడుతున్నారంటూ తమ ఆందోళనను , తమ ఆలోచనలను వ్యక్తం చేస్తూ కొంత మంది వ్యాసాలు రాశారు కొన్ని పత్రికలు వార్తలు రాశాయి. నా దృష్టికి వచ్చిన కొన్నింటికి ఇక్కడ అందిస్తున్నాను. 





కామెంట్‌లు లేవు: