"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

06 మార్చి, 2025

కార్యాచరణకు తొలి బీజం లిటరరీ కాంగ్రెస్ - 2024









  కార్యాచరణకు తొలి బీజం

 తెలుగు లిటరరీ కాంగ్రెస్ -2024

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు, తెలుగు శాఖ, మానవీయ శాస్త్రాల విభాగం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్-500 046


తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయంవారు, ఆ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 15,16,17 ఫిబ్రవరి, 2024 తేదీల్లో TELUGU LITERARY CONGRESS (TLC) 2024 మహాసభలను ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. ఆ సమావేశాలకు నాటి తెలుగు శాఖ అధ్యక్షులు, ఆర్ట్స్ కళాశాల నేటి ప్రిన్సిపాల్ ఆచార్య చింతకింది కాశీం కన్వీనర్ గాను, నాటి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, నేటి తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ కో కన్వీనర్ గాను వ్యవహరించారు. ఈ మహాసభలు నిర్వహించడానికి తమకున్న సంకల్పాన్ని, లక్ష్యాలను, ఆశయాలను స్పష్టంగా తమ కరపత్రంలో వివరించారు.

‘’గొప్ప సృజన శక్తితో, పరిశోధన పటిమతో, వ్యాఖ్యాన బలంతో తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ యవనిక మీద నిలబెడుతోన్న తెలుగు సాహితీవేత్తలు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ ఒకే వేదిక మీద నుంచి మాట్లాడించాలనే సంకల్పంతో మూడు రోజుల తెలుగు సాహిత్య మహాసభకు రూపకల్పన జరిగింది. ఈ మహాసభలో దేశం నలుమూలల నుంచి లబ్ధప్రతిష్టులైన 150మంది సాహితీవేత్తలు పాల్గొంటారు.’’

‘’వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం విభిన్నమైన ప్రక్రియలతో, వైవిధ్యమైన తాత్వికతతో ఎంతో సంపద్వంతంగా ఉంది. దీన్నంతటినీ మదింపు చేసుకోడానికి నిపుణులైన సాహితీవేత్తల్ని ఆహ్వానించటం ఈ మహాసభ కీలకోద్దేశం. ‘’

‘’చరిత్రకు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, సైన్స్ కు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లు ఉన్నాయి. అటువంటి విశాల ప్రాతిపదికను, దార్శనిక భావనను తెలుగు సాహిత్య ప్రపంచంలో నెలకొల్పాలనే ప్రధాన లక్ష్యంతో తెలుగు సాహిత్య మహాసభ * Telugu Literary Congress (TLC) జరుగుతోంది. ‘’

‘’దీనిద్వారా మేధా మధనం, సృజన రంగాల మూల్యాంకనం చేసి తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశాన్నివ్వడం దీని ముఖ్య లక్ష్యం.’’ 

‘’ఈ మహాసభలో పాల్గొనే సాహితీవేత్తలు, సాహిత్య విద్యార్థులు, అధ్యాపకులు, సాహిత్య పిపాసకులు తెలుగు భాష సాహిత్యాల పట్ల, సంస్కృతి పట్ల గాఢానుభూతిని, ఎరుకను పొందుతారు.’’

తెలుగు సాహిత్యంలో అభ్యుదయ, విప్లవ రచయితల మహాసభలు జరిగినప్పుడు తమ లక్ష్యాలను స్పష్టంగా ప్రకటించారు. అంతటి చారిత్రక ప్రాధాన్యాన్ని ఈ సమావేశాలు కూడా అనుసరించాయి. ఆ విధంగా తెలుగు సాహిత్య చరిత్రలో ఇవి శాశ్వతంగా నిలిచిపోయే మహాసభలని ఆ లక్ష్యాలు తెలియజేస్తున్నాయి. 

ఈ లిటరరీ ఈ కాంగ్రెస్ మహాసభలు జరపాలనే ఆలోచన బహుశా ఆచార్య కాశీంగారి మెదడులోనే రూపుదిద్దుకుందని అనుకుంటున్నాను. ఆయన ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా, ప్రణాళికాబద్ధంగా, శ్రద్ధాసక్తులతో, పటిష్టమైన ప్రణాళికతో నిర్వహిస్తారు. గతంలో ఆయన తెలుగు అధ్యాపకులు కోసం నిర్వహించిన రిఫ్రెషర్ కోర్సు చూసాను. ఉభయ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఆ కోర్సులో పాల్గొన్నారు. నన్ను కూడా ఒక రిసోర్స్ పర్సన్ గా దానిలో భాగస్వామ్యం చేయడం వలన వారి అధ్యాపకుల ఫీడ్ బ్యాక్ ని గమనించగలిగాను. అలాగే, తెలుగు భాషా సాహిత్యాలలో పరిశోధన చేస్తున్న కొంతమంది పరిశోధకులు నిర్లక్ష్యం చేస్తున్న పరిశోధన విధానం గురించి ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. అందువల్ల ఆయన తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా పరిశోధన విధానంలో అనుభవం ఉన్న ప్రొఫెసర్స్ చేత ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. అవి కూడా ఎంతో విజయవంతమై మంచి ఫలితాలను ఇచ్చాయి. వాటిలో కూడా ప్రత్యక్షంగా పాల్గొని గమనించి చెబుతున్న మాట ఇది. అటువంటి మంచి ఆలోచనలు విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాట చేయాలనే దృష్టిగల, సామాజిక నిర్మాణంలో ప్రగతిశీల భావాలు కలిగిన ఆచార్య సి. కాశీం ఈ తెలుగు లిటరరీ మహా సభలు నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించారని తెలుస్తుంది. ఈ మహాసభలలో పాల్గొనే ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడారు. కొంతమందితో ఎలాంటి అంశాలు చర్చినీయాంశాలు చేయాలో లోతుగా చర్చించారు కూడా! ప్రొఫెసర్ కాశీం, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ థింకర్స్ చెప్పే POSDCORB ( Planning, Organizing, Directing, Coordinating, Reporting and Budgeting) గురించి స్వీయ అనుభవం ఉంది. దీనిలో పాల్గొనడానికి అవకాశం కలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మూడు రోజులపాటు జరిగిన ఈ లిటరరీ కాంగ్రెస్ లో ఆయా రంగాలకు చెందిన వాళ్లంతా భాగస్వాములయ్యేవిధంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 

17 ఫిబ్రవరి, 2024రోజు మధ్యాహ్నం 2:00 నుంచి 4:00వరకు "తెలుగు శాఖాధ్యక్షుల చర్చాగోష్ఠి"ని ఏర్పాటుచేశారు. ఈ గోష్ఠిలో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న తెలుగు శాఖాధ్యక్షులందరినీ ఒకే వేదికమీదకి పిలిపించి, "తెలుగు భాషా సాహిత్యాల గమనం, గమ్యం"అనే అంశంపై కీలకంగా చర్చించారు. ఈ కార్యక్రమంలోనే నేను పాల్గొన్నాను. ఈ సమావేశానికి నాటి తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సిహెచ్ కాశీం అధ్యక్షత వహించారు. పూర్వ డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్య గుండెడప్పు కనకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు శాఖ అధ్యక్షులు, డీన్స్, మరి కొంత మంది ప్రొఫెసర్ కళాశాల ప్రిన్సిపల్స్, కొంతమంది ఆచార్యులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా సాహిత్యల సమస్యలు వాటి పరిష్కార మార్గాలు, దానికోసం చేపట్టవలసిన కార్యాచరణను ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా వాటిని అమలు చేయడానికి ఒకకార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. ఈ సాహిత్య మహాసభ చర్చించినవీ, ఆలోచించవలసిన వాటిలో కింద పేర్కొన్న అంశాలు ముఖ్యమైనవి.

సమకాలీన సమాజానికి అనుగుణంగా తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనం కొనసాగుతుందా? దీనికి గల కొన్ని కారణాలు అన్వేషించే ప్రయత్నం చేశారు.

నేటికీ పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలలో కుల మతాలకు అతీతంగా పాఠ్యాంశాల ఎంపిక జరగకపోవడం తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనంలో ఒక లోపంగా చాలామంది భావించారు. 

ఇతర శాస్త్రాలవలే తెలుగు చదువుకున్న వాళ్ళు కూడా జ్ఞానాన్ని ఆర్జిస్తున్నామనే స్పృహ కలిగించడంలో సిలబస్ రూపకల్పంలో స్వేచ్ఛ ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది. 

సమకాలీన సామాజిక, ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా తెలుగు భాషతో పాటు, ఆంగ్ల భాషలో కూడా శక్తివంతంగా కమ్యూనికేట్ చేయగలిగిన సామర్థ్యాన్ని అలసి అలవర్చుకునే ప్రణాళికలు రూపొందించుకోవలసిన అవసరం ఉంది.

తెలుగు చదువుకునే వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయనేది వాస్తవం. ఆర్థిక సరళీకృత విధానాలు, ప్రపంచీకరణ తెచ్చిన పరిస్థితులు దీనికి మూల కారణం. దీనిపై ప్రభుత్వం, బుద్ధిజీవులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. 

చైనా, జపాన్, కొరియా మరికొన్ని దేశాలలోను, మన పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో లోను మాతృభాషలో ఆలోచించడం, అధ్యయనం చేయడం, దాన్ని నిత్యం జీవనంలో భాగంగా ఉపయోగించుకోవడంలో అనుసరిస్తున్న వ్యూహాలను తెలుగు భాష మాతృభాషగా ఉన్న వాళ్ళు అధ్యయనం చేయాలి. 

శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులను తెలుగు వాళ్ళు కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాలను అన్వేషించాలి. 

ప్రభుత్వం విడుదల చేసి ఉత్తర్వులు (జి.వో.లు), కోర్టు తీర్పులు మాతృభాషలో వచ్చేందుకు కృషి చేయాలి. ఒకవేళ ఒకటి రెండు ఇటువంటి ప్రయత్నాలు జరిగినా, కృత్రిమమైనటువంటి అనువాదాలను లేదా భాషను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ప్రజలలో కలిసిపోయిన అన్య దేశ భాషా పదాలను వాడుకోవడం ద్వారా మణిప్రవాళశైలి ద్వారానైనా తొలి దశలో తెలుగుని మరింత ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేయొచ్చు. 

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ, సంస్థల్లోను తెలుగు భాషలో కచ్చితంగా నామసూచికలు ఉపయోగించేందుకు చర్యలు తీసుకోవడానికి ఒత్తిడి తీసుకురావడం అవసరం. 

కృత్రిమ మేధ ( ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) తెలుగు భాష సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఆ యా డేటా బేస్ లలో తెలుగు భాషలో ఉన్న సాహిత్యాన్ని వాడుకోవడానికి అనుమతించే అవకాశాలు కూడా ఆలోచించాలి. 

సాహిత్య చరిత్రల పునర్నిర్మాణం జరగాలి. అన్ని ప్రాంతాలకు అన్ని ప్రక్రియలకు సాహిత్య చరిత్రలో సముచిత ప్రాధాన్యాన్ని కలిగించాలి.

తెలుగు భాషలో భాషా వైవిధ్యం ఎంతగానో కనిపిస్తుంది. దీన్ని భాషాశాస్త్రవేత్తలు శిష్ఠభాషలు, శిష్ఠేతర భాషలనీ, మాండలికాలనీ రకరకాల పేర్లతో అధ్యయనం చేశారు. మా భాష మాండలికం కాదనీ, ప్రత్యేకమైన భాష అనీ వాదిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. అలా సహజమైన భాషలో ఎంతో సృజనాత్మక సాహిత్యం వెలువడుతుంది. వీటిని అన్ని ప్రాంతాల వాళ్ళు అర్థం చేసుకోవడానికి వీలుగా పదప్రయోగ సూచికలు, పదకోశాలు, నిఘంటువులు తయారు కావాలి. వీటిపై విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగు అకాడమీ వంటి సంస్థలు దృష్టి కేంద్రీకరించాలి. 

జానపద సాహిత్యంలో తెలుగు వారి జీవన విధానానికి సంబంధించిన అనేక అంశాలను గుర్తించి తెలుగు భాషను, సాహిత్యాన్ని సు సంపన్నం చేసుకోవడానికి సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఇప్పటికే జానపద విజ్ఞానంలోని అనేక విషయాలను కార్పోరేట్ కంపెనీలు సమర్థవంతంగా వినియోగించుకుంటూ వ్యాపారాలు చేస్తున్నాయి. వంశపారంపర్యంగా వస్తున్న అనుభవపూర్వక విజ్ఞానాన్ని, దానిలోని శాస్త్రీయతను గుర్తించే ప్రయత్నం చేయాలి.

జానపదుల కళలు, గేయాలను పరిరక్షించుకునే క్రమంలో తెలుగు భాష ద్వారా చేయదగిన కృషిని పత్రికలు టీవీలు ప్రసార ప్రచార మాధ్యమాల ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకొస్తూనే, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జానపద విజ్ఞానం లోని అనేక అంశాలను సినిమాలు, కార్పొరేటర్ రంగం శక్తివంతంగా ఉపయోగించుకుంటుంది. కానీ దాని మౌలికతను వక్రీకరిస్తూ ప్రయోగంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడాన్ని గమనించాలి. 

తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి చరిత్రలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు సంస్థలలో భాగం చేయగలగాలి. దేశ సమైక్యతలో అంతర్భాగమే భాషా సమైక్యత. అందువల్ల దేశ సమైక్యతకు ప్రాంతీయ భాషల అధ్యయనం అన్ని విశ్వవిద్యాలయాలలోనూ కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి లిటరరీ కాంగ్రెస్ ప్రయత్నం చేయాలి. 

లిటరరీ కాంగ్రెస్ మహాసభలు ఏడాదికి ఒకసారి లేదా రెండుసార్లు నిర్వహించుకోవాలి. ఏ రాష్ట్రాల్లో ప్రధానంగానూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లోను, దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ ఈ సభలు నిర్వహించుకుంటే బాగుంటుంది. 

జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ, జిల్లా స్థాయిలలో కార్యవర్గ ఎంపిక చేసుకుంటేనే ఈ లిటరరీ కాంగ్రెస్ మహాసభలు శక్తివంతంగా నిర్వహించుకోవచ్చు. 

లిటరరీ కాంగ్రెస్ ని ప్రభుత్వం గుర్తించేలా చేసి, ఆర్థిక సహకారం అందేలా ప్రయత్నించడం ద్వారా ఈ మహాసభలు చేసే తీర్మానాలను ప్రభుత్వం అమలు చేయడానికి తగిన కృషి చేయవచ్చు.


      ఇలా అనేక చర్చోపచర్చలు చేసిన చారిత్రాత్మకమైన ఈ లిటరరీ కాంగ్రెస్ మహాసభలు జరగడానికి డాక్టర్ ఎస్. చంద్రయ్య, డాక్టర్ ఇమ్మడి మహేందర్ తదితరుల సహకారం సమన్వయం ఎంతగానో కనిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే బహుశా నాకు తెలిసినంతవరకు భాషా, సాహిత్య కాంగ్రెస్ సమావేశాలు పేరుతో జరిగిన మొట్టమొదటి సమావేశాలు ఇవే. ఈ సమావేశాల్లో పాల్గొనడం నిజంగా ఒక చారిత్రక సందర్భం అని అనిపించింది. స్వామి సెల్లు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు శాఖ అధ్యక్షులు, అధ్యాపకులు, ఉభయ రాష్ట్రాల్లోనూ తెలుగు బోధించే కళాశాల అధ్యాపకులు, తెలుగు పండితులు, భాషాభిమానులు, ప్రముఖ రచయితలు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం తీసుకున్న విజేతలు, పత్రికా సంపాదకులు, ప్రముఖ సాహితీవేత్తలు, విమర్శకులు ఇలా అనేకమంది పాల్గొని ఒక పండగ వాతావరణాన్ని తలపింప చేశారు. 

    ఈ సమావేశాలు జరిగి అప్పుడే ఒక ఏడాది అయిపోయిందా అనిపిస్తుంది. ఇది ఎంతో వ్యయ ప్రయాసలకు సంబంధించిన మహాసభ. అయినప్పటికీ దానిలో పాల్గొన్న వాళ్లందరికీ భోజనాలు రిసోర్స్ పర్సన్స్ కి మరలా హానరోరియం, దారి ఖర్చులు ఎలా ఇచ్చారో అర్థం కాని విషయం. ఈ లిటరరీ కాంగ్రెస్ సమావేశాలు సందర్భంగా ముద్రించిన కరపత్రాలు, పోస్టర్లు, ఆ సందర్భంగా అనేకమంది విడుదల చేసిన వీడియో ప్రమోలు, తెలుగు భాష పట్లా, సాహిత్యం పట్లా తెలుగు వారికి ఉన్న అభిమానాన్ని తెలియజేశాయి. లిటరరీ కాంగ్రెస్ నిర్వహించవలసిన ఆవశ్యకతను తెలియజేస్తూ ఆచార్య కాశీంతోపాటు అనేకమంది పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. ముఖ్యంగా ఆ సందర్భంలో ఆచార్య సిహెచ్. కాశీం ఇచ్చిన ఒక వీడియో ఇంటర్వ్యూ చరిత్రాత్మకమైనది. 

ఈ సమావేశాలను నాటి పత్రికలు, టీవీలు కూడా సాధ్యమైనంతవరకూ మంచి ప్రాధాన్యాన్ని ఇచ్చాయి. అది వారికి ఉన్న భాషాభిమానాన్ని ఆ చైతన్యాన్ని తెలియజేస్తున్నాయి. ఇటువంటి సమావేశాలు ఉభయ రాష్ట్రాల్లో తరచుగా జరగాలి. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ప్రచురితం కావాలి. ఆ సమావేశాలకు ప్రభుత్వం, సాంస్కృతిక శాఖలు, సంబంధిత ఇతర శాఖలు స్వచ్ఛంద సంస్థలు తమ ఆర్థిక సహకారాన్ని కూడా అందించాలి. ఒక జాతి చరిత్ర వారి సాహిత్యం, సంస్కృతులను కాపాడుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. తెలుగు మాతృభాషగా మరింత పటిష్టం కావాలంటే ఇటువంటి సమావేశాలు విస్తృతంగా జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు ప్రతి తెలుగు వాళ్ళు రుణపడి ఉండడమే కాదు; కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. 


( ఈ వ్యాసం నడుస్తున్న తెలంగాణ మాసపత్రిక, ఫిబ్రవరి -2025 లో ప్రచురితం. సంపాదక వర్గానికి ధన్యవాదాలు)




కామెంట్‌లు లేవు: