"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

01 డిసెంబర్, 2024

ఆచార్య రెడ్డి శ్యామల గార్కి పదవీవిరమణ శుభాకాంక్షలు

ఆచార్య రెడ్డి శ్యామల గార్కి పదవీవిరమణ శుభాకాంక్షలు 

మేడమ్ ఆచార్య రెడ్డి శ్యామలగారు తన పదవీవిరమణ సందర్భంగా 30.11.2024వతేదీన ‘పదవిలో చివరి సంతకం’ అని అనే క్యాప్షన్ తో ఒక వాట్సాప్ స్టేటస్ చూశాను.  

 మేడమ్ గారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకురాలుగా, రీడర్ గా, ప్రొఫెసర్ గా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా రిజిస్టర్ గా వివిధ బాధ్యతలను నిర్వహించారు. మేడమ్ ఆచార్య రమణారావు గారి కుమార్తె. అయినా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హిందీ శాఖలో హెడ్ గా, డీన్ గా పనిచేశారు. అప్పుడు నేను యూనివర్సిటీలో విద్యార్థిని. అప్పటినుండి మేడం గారిని చూస్తూ ఉండేవాడిని. నేను ఒకవైపు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటూనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సాయంకాలం కోర్సుగా పీజీ డిప్లమో ఇన్ లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజ్ టీచింగ్ కూడా చదువుకున్నాను. అప్పుడు మాకు ఆచార్య ఉషాదేవి గారు, ఆచార్య పగడాల చంద్రశేఖర్ గారు, ఆచార్య రెడ్డి శ్యామల గారు పాఠాలు చెప్పేవారు. ఆ విధంగా రెడ్డి శ్యామల మేడంగారు నాకు గురువులు కూడా!

కాలక్రమంలో నేను మా యూనివర్సిటీలోని అధ్యాపకుడిగా చేరాను. ఆ క్రమంలో మేడమ్ గారికి వివిధ సదస్సులలోనూ, వివిధ సమావేశాలలోనూ కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ లోనూ దగ్గరగా చూడగలిగే అవకాశం కలిగింది. మేడం గారు ఏనాడూ తీవ్రమైన స్వరాన్ని వినిపించిన సందర్భాన్ని చూడలేదు. సాధారణంగా కొన్ని సమావేశాల్లో కొన్నిసార్లు కొంతమంది నిర్ణయాలతో విభేదించవలసి వస్తుంది. అలాంటప్పుడు ఎంతో శాంతియుతంగా సహృదయ వాతావరణాన్ని ప్రదర్శించాలి. అది నేను ఆచార్య రెడ్డి శ్యామల మేడం గారి నుండి నేర్చుకున్నాను. అంతేకాదు, సమావేశంలో ఎవరైనా ఏదైనా ఒక అభిప్రాయాన్ని చెప్తే, దాన్ని విని, దానిలోని మంచి చెడులను శాస్త్రీయంగా వివరించే లక్షణం కూడా మేడమ్ గారిలో గమనించాను. వారిని ఏదైనా సదస్సుకు పిలిస్తే , ఆమె పరిశోధన పత్రాన్ని రాసుకుని రావడం ఒకటైతే, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఆ సమావేశానికి తప్పనిసరిగా రావడం మరో విశేషం. తనకంటే జూనియర్స్ ఒకవేళ ఆ సమావేశానికి చైర్మన్ గా ఉన్నప్పటికీ, మేడం గారు దాన్ని ఏనాడూ అభ్యంతర పెట్టిన సందర్భాన్ని కూడా నేను చూడలేదు. తన విధిని తాను ఎంతో క్రమశిక్షణతో నిర్వహించేవారు. ఇంటర్వ్యూలు నిర్వహించేటప్పుడు కూడా ఇబ్బంది పెట్టే ప్రశ్నలను వేసేవారు కాదు. మేడమ్ కాన్ఫిడెన్షియల్ వర్క్స్ చేసేటప్పుడు ఎంతో అంకిత భావంతో పనిచేయడాన్ని నేను గమనించాను. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా ఉన్నప్పుడు కూడా ప్రశ్నాపత్రాలను సకాలంలో పూర్తి చేయించుకోవడంలోనూ, సిద్ధాంత గ్రంథాలకు కూడా నివేదికలు రప్పించుకోవడంలోనూ ఎంతో సౌమ్యంగా సంప్రదించేవారు. వాటికి ఇవ్వవలసిన రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఒక ఫాలోయింగ్ కొనసాగించి, అవి అందాయో లేదో అనేది తెలుసుకుంటూ ఉండేవారు. విచిత్రం ఏమిటంటే మేడమ్ గారు పరిశోధనల మౌఖిక పరీక్షకి వచ్చినప్పుడు గానీ, సమావేశంలో మాట్లాడినప్పుడు గానీ, సిద్ధాంత గ్రంథాలకు నివేదికలు రాసినప్పుడు గానీ రెమ్యునరేషన్ తనకు రాలేదని ఏరోజూ అడగలేదు. ఇవన్నీ నేను దగ్గరనుండి చూశాను. కనుకనే మేడం గారు స్టేటస్ చూసిన తర్వాత వారికి ఒక మెసేజ్ పెట్టాను. ‘’శుభోదయం మేడమ్. మీ సంతకాలు ఎంతోమందికి జీవితాలనిచ్చాయి. అది తెలిసింది కొంతమందికే... తెలియని వాళ్ళు మరెంతో మంది ఉన్నారు. నమస్కారం మేడం’’ 

ఆ మధ్య (24 సెప్టెంబర్ 2024) శాఖాధ్యక్షులు డా.ఎన్.మృదులగారి ఆహ్వానం మేరకు బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, తెలుగుశాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్ గా మేడమ్ గారితో పాటు ఆచార్య చింతకింది కాశీమ్, నేను, డాక్టర్ కోయికోటేశ్వరరావు తదితరులం పాల్గొన్నాం. మధ్యాహ్నం భోజనం కోసం మేడమ్ గారే ఒక హోటల్ పేరు చెప్పారు. అది Begumpet లోని Ohris Jiva Imperia ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. నాన్ వెజ్ తినే వాళ్ళకి సాధారణంగా వెజిటేరియన్ హోటల్ అంటే పెద్దగా ఆసక్తీ, ఇష్టం ఉండవు. సాధారణంగా ఓ ప్లేట్ బిర్యానీ లేదా చికెన్ తో బటర్ నాన్ తింటే ఫుల్ హ్యాపీ! అయినా ఎప్పుడూ నాన్ వెజ్ తింటూనే ఉంటాం. వెజిటేరియన్ హోటల్ లో కూడా అప్పుడప్పుడు తినడం మంచిదనిపించింది. నన్ను ఎవరైనా విందుకు పిలిస్తే, ఆ ఆహార పదార్థాల్లోని రుచిని మురిపిస్తూ తినడం నాకు అలవాటు. ఆరోజు మేడంగారు ఒక్కొక్క దాని గురించి వివరిస్తుంటే అమ్మలా అనిపించారు. బిల్లు చెల్లించేటప్పుడు మేడమ్ మమ్మల్ని ఎవరినీ ఇవ్వనివ్వలేదు. మేడం గారికి ఇలా పెట్టడమే కాదు, ఎంతో మంది జీవితాలకు వెలుగునివ్వడం కూడా తెలుసు. అందుకే వారి సంతకం ఎంతో విలువైంది అనిపించింది. 

వారు పదవీ విరమణ అనంతరం మరింత కూడా స్వేచ్ఛగా ఎన్నో పనులు చేస్తారు. వారికి మంచి ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

1.12.2024 


కామెంట్‌లు లేవు: