‘చంద్రికా సాగరం’ మధ్యతరగతి ముచ్చట్లు పేరుతో వెలువడుతున్న ఈ కథల రచయిత విద్యాసాగర్ గారు నాకు ఇంతకుముందు తెలియదు. ఆయనతో నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం లేదు. మా యూనివర్సిటీలో చదువుకొని, ఒక డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ విజయ్ కుమార్ ద్వారా నా గురించి తెలుసుకొని ముందుమాట రాయమని ఆయన నన్ను అభ్యర్థించారు. నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను రాయడం కష్టమని చెప్పాను. అయినా, ఆ కథలను సాఫ్ట్ కాపీ నా మొబైల్ కి పంపించమని చెప్పాను. నాకు ఖాళీ దొరికినప్పుడు ఒకటి రెండు కథలు చదివాను. మా అబ్బాయిని నేను చదివించడానికి పడే కష్టాలు వంటివేవో ఆయన కథల్లో కనిపించాయి. ఈ కథా రచయిత ఏదో ఉబుసుపోక రాస్తున్న కథలు కావనిపించింది. తన చుట్టూ ఉన్న సమాజం గురించీ,తాను ప్రత్యక్షంగా చూసిన జీవితాలు గురించీ, తనను నిలదీసి ప్రశ్నించే సమస్యల గురించీ, అటువంటి సమాజంలో తానూ ఒకడై పడుతున్న సంఘర్షణ గురించీ తానేదో అక్షర రూపమవుతున్నారనిపించింది.మానవ సంబంధాల్లో వస్తున్న వివిధ పరిణామాలను తన కథల్లో వ్యక్తీకరిస్తున్నట్లనిపించింది. సాగర్ కథా రచయితగా వెలువరిస్తున్న తొలి కథలు ఇవే అంటే పాఠకులకు కొంత ఆశ్చర్యం కలుగకమానదు. కొత్తగా కలం పట్టిన ఈ రచయిత ఏ ప్రభావాలకూ, ఏ ప్రయోగాలకూ గురికాకపోవడంవల్లనేనేమో జీవితాన్ని ఇంత ఆర్ద్రతతో మన ముందుంచారనిపిస్తుంది. ఆ ఆర్ద్రత ‘చంద్రికాసాగరం’ కథలో మరింతగా కనిపిస్తుంది. మన ఆలంకారికులు ‘అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాప్రతిః’ అని కవిని అపరబ్రహ్మలా చెప్తారు. కవికి భావుకత ముఖ్యం. తన భావనా ప్రపంచంలో కొత్తది సృష్టించడమే కాదు, సజీవ పాత్రల్ని నిర్జీవాలుగాను, మరణించిన వారిని సజీవులుగాను చేయగల సమర్థులు కవులే. వర్ణనీయసామర్థ్యం గలవారిని కవులంటారు. ఇలాంటి వర్ణనలు, భావనా ప్రపంచాన్ని కథా రచయితలు కూడా అద్భుతంగా సృష్టించగలగడం వల్ల ‘రచయిత’ను కూడా ‘కవి’అనొచ్చు. ఆ విధంగా చూసినప్పుడు ఈ కథారచయిత విద్యాసాగర్ ‘చంద్రికాసాగరం’ కథనంతా వాస్తవిక చిత్రణ చేసి, వాస్తవంగా ఒక ప్రమాదంలో బ్రెయిన్ హేమరేజ్ వల్ల చనిపోయిన ‘చంద్రిక’ ను కథలో సజీవం చేసుకున్నారు. దీన్ని ఇంతకంటే ఎక్కువగా వ్యాఖ్యానించడం సమంజసం కాదేమేననిపిస్తుంది.
‘తాతయ్యని చూడాలని’ కథలో నాని పాత్రతో మొదలైన ఈ కథల సంపుటి మరలా నాని పాత్ర గల కథతోనే ముగుస్తుంది. ‘చంద్రికాసాగరం’ రచయిత తనపిల్లల పెంపకం గురించి ఎన్ని కోణాల్లో చూసినా, మరెన్నో కొత్త కోణాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ కథలో సెల్ ఫోన్, టీ.వీ వంటి వాటికి అలవాటు పడిపోతున్న/అలవాటు పడిన పిల్లల్ని చదివించడం, క్రమశిక్షణలో పెట్టడం ఎంత కష్టమో ఎంతో వాస్తవిక దృష్టితో కథనీకరించారు రచయిత.
పిల్లల మీద ప్రేమ ఉన్నా, ఆ ప్రేమను బయట పడకుండా దాచుకోవాలి. దాన్ని అవసరమైనప్పుడు ప్రదర్శించడం కూడా ముఖ్యమే. నిజానికి పిల్లల్ని పెంచడం అనేది ఒక మానసిక శాస్త్రవేత్త చేసే పని కంటే గొప్పది. తల్లీ తండ్రి ఉద్యోగస్తులైనప్పుడు వాళ్ల పిల్లలపైనా, వాళ్లు చేసే పనులపైనా, వాళ్ళ చదువులపైనా దృష్టి పెట్టడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఒక జంట తన కొడుకుని తాతయ్య దగ్గరికి పంపించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించారో ఈ కథ చదివితే తెలుస్తుంది. ఇలాంటి కథ రాయడం చాలా కష్టం. పిల్లల మనస్తత్వం తెలియాలి. వాళ్లని ఎలా తీర్చిదిద్దాలో ఆలోచించాలి. అది సరైందో, కాదో మరలా నిర్థారణ చేసుకోవాలి. పిల్లల పెంపకం చాలా కఠోరమైన శ్రమతో కూడింది. ఎంతో వ్యూహాత్మకమైంది. ఒక్కోసారి ఆ వ్యూహం సరైనదో కాదో తెలియని పరిస్థితుల్లోకి కూడా నెట్టబడుతుంటాం. రచయిత ఎలాంటి వ్యూహాన్ని మనకు అందించాడో ఈ కథ చదవండి, తెలుస్తుంది.
సుఖదుఃఖాలు మేళవించుకున్న, సరసశృంగారాలు, మధ్య తరగతి కుటుంబాల బంధాలు పెనవేసుకున్న కథే ‘విశ్వామిత్ర’ కుటుంబంలో చిన్నచిన్న సమస్యలే చిలికి, చిలికి పెద్ద గాలివానలా తయారై కుటుంబాలే విడిపోయే పరిస్థితులకు కూడా దారి తీయవచ్చు. అలాంటప్పుడే మనకు అనుకోకుండా ఎదురైన కొన్ని సంఘటనలు మరలా కుటుంబంలో వాళ్ల మధ్య ఉన్న నిజమైన ఆత్మీయానుబంధాలను బయటకు తీసే పరిస్థితికీ కారణం కావచ్చు. ఈ కథలోని శైలి అద్భుతం.
కరోనా సమయంలో ఎదుర్కొన్న సమస్యలు, ఆ సమస్యలకు కొంతమంది ఆలోచించే పరిష్కారాలెంత దయనీయంగా ఉంటాయో తెలియాలంటే ‘మధ్య రైలు గేటు’ కథ చదివి తీరాల్సిందే! నిజానికి తాను ఆరోగ్య భీమా చేసుకొని ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోతే తన కుటుంబానికి కొంత డబ్బులువస్తాయని, దాంతోనైనా కొన్నాళ్ళు వాళ్ళు హాయిగా బ్రతుకుతాయని ఆలోచనతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ కథా రచయిత అలాంటి ఒక వ్యక్తి గురించే ఈ కథ రాసినప్పటికీ, తర్వాత పరిణామాల గురించి ఊహించుకోవాల్సిందేనని అన్నట్లు దాని గురించి చెప్పలేదు. అయితే, ప్రయివేట్ టీచర్స్, లెక్చరర్స్, ఇతర ఉద్యోగులు కరోనా కాలంలో ఎదుర్కొన్న సమస్యలు ఎంతటి దుర్భరమైన జీవితాన్ని గడపవలసి వచ్చిందో అనుభవించిన వారికే తెలుస్తుంది. ఈ కథ చదువుతుంటే ఈ సమస్యలన్నీ గుర్తొస్తుంటాయి.
ఈ మధ్య కాలంలో టీవీలో ఆరోగ్య భీమాకు సంబంధించిన ఒక ప్రకటన చాలా విపరీతంగా ఇస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే తమ ఆరోగ్య సమస్యలన్నింటికీ వాళ్లే పరిష్కారాలు సూచిస్తారన్నట్లు, ఒకటో, రెండో కోట్లకు ఆరోగ్య భీమా చేస్తే, ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయినా, ఆ కుటుంబమంతా ఆ భీమా సొమ్ముతో బ్రతికేయవచ్చన్నట్లు ఒక వెర్రి భ్రమను కలిగించే ప్రకటనలు వస్తున్నాయి. కానీ, వాస్తవాలు ఎలా ఉంటాయో అనుభవంలో మాత్రమే తెలుస్తుంది.
‘గురుదేవోభవ’ కథ కూడా కరోనా సమయంలో ప్రయివేట్ టీచర్లు పడిన బాధలను వర్ణించేదే.
‘అంకురార్పణ’ కథలో మానసిక వైద్యురాలైన కూతురు తన తల్లి పట్ల కొనసాగించే అసహజ శృంగార చేష్టల గురించి తండ్రి ప్రవర్తనను నిలదీయడం కొంత అసహజంగా అనిపిస్తుంది.
‘స్వ ‘’గతం’’ కథ ఒక వాస్తవికతకు, ఒక దృక్పథాన్ని జోడించింది. తొలి తరానికి చెందిన, చదువుకుని, ఉద్యోగం చేసి, ఒక అధికారిగా సమాజంలో గుర్తింపు పొందిన చిట్టిబాబు, చివరికి తన కుటుంబానికి ఎలా దూరమయ్యాడు? ఎందుకు దూరమయ్యాడు? దూరమైన చిట్టిబాబు తీసుకున్న నిర్ణయం సరైందేనా? మొదలైన ప్రశ్నలు పాఠకుడిని వెంటాడేలా చేస్తాయి. ఈ కథ మాత్రం చాలా గొప్ప కథ. కథా కథనంలో కూడా రచయిత ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
ఈ కథల పుస్తకంలో వస్తువు, దాన్ని కథగా చేసి శిల్ప పరంగా మరొక ఆణిముత్యం లాంటి కథ ‘ఇట్లు సీనయ్య ……’ . పూర్తిగా లేక కథనంలో ప్రతి వాక్యాన్ని అనుభవించి పలవరించినట్లుగా వర్ణించిన కథ. గ్రామీణ ప్రాంతాలలో పసివయసులో తెలియని కులం పట్టణాలు, నగరాలలో… చదువుకున్న ఇళ్లలో… కాంక్రీట్ గూడుకట్టుకున్నట్లుగా కులం బలంగా తయారవుతోంది. ఇప్పుడు కులాలను బట్టే విద్యాసంస్థలు. ఇప్పుడు కులాలను బట్టే గేటెడ్ కమ్యూనిటీలు. ఇప్పుడు కులాలను బట్టే అపార్ట్మెంట్లు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలు కులాలకు నిలయాలని భావించే వాళ్ళం. నేడు ఆ కుల సంస్కృతి పట్టణాలు, నగరాల్లో మరింత బలంగా తయారవుతోంది. బాల్యాన్ని, తర్వాత యౌవనాన్నీ, ఉద్యోగ జీవితాన్ని…ఇలా ఒక నాలుగు తరాల భారతీయ సమాజంలో కులం పొందిన వివిధ పరిణామాలను ఈ కథ ద్వారా అద్భుతంగా వివరించారు. కులం గురించి తెలియాలంటే ఆ కులం వలన మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా కష్టనష్టాలకు గురైన వారిని అనడిగితేనే తెలుస్తుంది. కులాల వారీగా జైళ్ళలో వివిధ పనులను కేటాయించడం సరైనది కాదని ఈ మధ్యకాలంలో న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే భారతీయ సమాజంలో కులం విస్తరిస్తున్న పరిస్థితులెలా ఉన్నాయో ఆ స్థితిని తెలియజేస్తుంది. ‘వెంటిలేటర్ సాక్షిగా…’ డ్రగ్స్ నుండి బయటపడి ఆదర్శ జీవనాన్ని గడిపిన ఒక వ్యక్తి కథ. కొంత సినిమాటిక్ గా అనిపిస్తుంది. కానీ, అమ్మ, కుటుంబం, ఆ ప్రేమను కోల్పోకుండా, దాన్ని కాపాడుకోవడంలోనే జీవిత మాధుర్యాన్ని అనుభవించడం ఎలాగో ఈ కథ నేర్పుతుంది.
విద్యాసాగర్ గారిలో సామాజిక బాధ్యతతో కూడిన ఆలోచనలెన్నో ఈ కథల్లో ఉన్నాయి. తన పిల్లలను, భార్యను, కుటుంబ వ్యవస్థను, తన చుట్టూ ఉన్న ప్రజల్ని, ఈ సమాజాన్ని ఎంతో ప్రేమించకపోతే ఈ కథలు రాయలేరు. ఈ కథల్లో కాల్పనికతకంటే వాస్తవిక జీవిత సంఘర్షణలే కథా వస్తువులయ్యాయి. తాను చెప్పాలనుకున్న సందేశాన్ని చక్కని అభివ్యక్తితో శిల్పవైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ చెప్పడం ఈ కథల్లో ఒక ప్రత్యేకత. కొన్ని కథలు ఎంతో లోతైన జీవితాన్ని, ఎంతో లోతైన సంఘర్షణను అందిస్తాయి. మూడు కథల్లో ఇన్సూరెన్స్ ప్రస్తావన చేశారు. దాన్ని ఒకే కోణంలో చూపించారు. మరో కోణాన్ని కూడా చూపించాల్సిన బాధ్యత రచయిత మీద ఉంటుంది. లేకపోతే మానసిక పరిపక్వత లేని పాఠకులు ఒక భ్రమకు లోనయ్యే అవకాశం కూడా ఉంది. దృక్పథం పరంగా ఇంకా పరిణతి సాధించాల్సిన ఒకటి రెండు కథలను మరింత మెరుగుపరుచుకోవాలనిపిస్తుంది. సమాజంలో ప్రజల ఆలోచనలు ‘అలాగే’ ఉండొచ్చు. కానీ, సామాజిక వాస్తవికతను దర్శింపజేసేటప్పుడు సత్యావిష్కరణ చేయాల్సిన బాధ్యత రచయిత మీద ఉంటుంది.
ఈ కథలు చదువుతున్న పాఠకులు మనకు తెలిసిన జీవితాలే మరలా కథలుగా చదువుకుంటున్నామనుకుంటారు. వీటిలో కొన్ని కథలు చదివిన తర్వాత చాలా చిన్న చిన్న విషయాలుగా కనిపించే కొన్ని అంశాలపై ఎంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉందో కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒక ఐదు దశాబ్దాలుగా భారతీయ సమాజంలో వస్తున్న మార్పుల్ని విద్యాసాగర్ గారి ‘కథాసాగరం’ కథలు ప్రతిఫలిస్తున్నాయి. మరిన్ని మంచి కథలు రాయాలని రచయిత విద్యాసాగర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
(సెంట్రల్ యూనివర్సిటీ), గచ్చిబౌలి, హైదరాబాద్ -500046.
email: darlahcu@gmail.com
తేది: 16.10.2024
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి