"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

30 అక్టోబర్, 2024

బి.యస్.రాములు జీవితరేఖలు గ్రంథానికి ముందుమాట

 

బి.ఎస్.జీవితం-ఒక ఉద్యమ ప్రవాహం 


మిత్రుడు డా.మొయిలి శ్రీరాములు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయంలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. అతడు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేశాడు. అయినా గాని తెలుగు ప్రాంతాలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే పయనించాడు. తెలుగు ప్రాంతాల సాహిత్య తీరుతెన్నులను నిత్యం అవగాహన చేసుకునేవాడు. వాటిని తన మిత్రులతో చర్చించేవాడు. మిత్రుడు శ్రీరాములు నాతో చర్చించడానికి కారణం - అతడు కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ) లోనే చదువుకున్నాడు. అప్పుడు అతడు నాకు జూనియర్. తన ఎం.ఫిల్  పరిశోధనాంశం బోయి జంగయ్యగారి ‘జాతర’ నవల.   ఆ సందర్భంలోనే ఇంచుమించు ప్రతిరోజు మేము చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడే దళిత సాహిత్యం పట్ల అతడికి బాగా అవగాహన పెరిగింది.  అలా నాతో కూడా చర్చిస్తూ ఉండేవాడు. అతడు రాసిన కత్తి పద్మారావు గారి జీవిత చరిత్ర నేను చదివాను. శ్రీరాములు భాషా శైలి ఎంతో చదివించింది. అ పుస్తకం చదివిన తర్వాత ఎవరైనా  డాక్టర్ మొయిలి శ్రీరాములు ప్రతీఒక్కరూ చదవాలనుకుంటారు. 

ఈమధ్య ప్రముఖ రచయిత, తత్వవేత్త బిఎస్. రాములుగారి జీవితాన్ని పరిచయం చేస్తూ ఒక పుస్తకాన్ని రాశాడు. నిజానికి అది చిన్న పుస్తకమే కానీ, బిఎస్.రాములుగారి జీవిత ప్రస్థానం, ఆయనపై వివిధ ఉద్యమాల ప్రభావం,  ఆయన రచనలు,  ఆ రచనల్లోని వస్తువు,  ఆయన చేసిన సామాజిక సేవ వంటివన్నీ ఎంతో బాగా వివరించాడు రచయిత. ఈ పుస్తకాన్ని చదువుతూ ఉంటే సుమారు ఒక 50 సంవత్సరాల తెలుగు సమాజం మనకు కనిపిస్తుంది. ఆ సమాజంలో బహుజన వర్గాల జీవనం ఎలా ఉండేదో తెలుస్తుంది. అటువంటి సమాజం  నుండి ప్రధాన జీవన స్రవంతికి రావడానికి పడుతున్న జీవన సంఘర్షణను మనం అర్థం చేసుకోవచ్చు.  ఒక బీడీ కార్మిక కుటుంబం నుండి వచ్చిన శ్రీరాములు గారు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర  బి.సి.కమీషన్ చైర్మన్ గా ఎదిగిన క్రమం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఆయన భావజాలం విచిత్రంగా ఆర్ఎస్ఎస్ తో ప్రారంభమైంది. ఆ తర్వాత  ప్రగతిశీల సంఘాలతోను, విప్లవ సంఘాలతోను మమేకమయ్యారు. ఉద్యమాన్ని పై నుండి చూడడం వేరు. దాన్ని అనుభవంతో చూడడం వేరు. కొన్నిసార్లు కొన్ని ఉద్యమాలలో కనిపించని పార్శ్వాలు కూడా మనకు ఎదురు కావచ్చు. దీన్ని అన్ని వేళలా సాధారణీకరించటం కుదరకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మన జీవితానుభవాలనుండి చెప్తున్న విషయాలను మనం కచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల వల్లనే విప్లవ సంస్థల నుండి బయటకు వచ్చి అంబేద్కర్ భావజాలం ప్రభావిత ఉద్యమాలలో పనిచేశారు. ఇలాంటి పరిస్థితులు కేవలం ఒక బి.ఎస్.రాములుగారికి మాత్రమే ఎదురైనవని కాదు, అనేక మందికి ఎదురైన పరిస్థితులుగా కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం అధికారంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఇవన్నీ బి. ఎస్. రాములుగారి జీవిత ప్రస్థానాన్నీ, ఉద్యమ ప్రభావాన్నీ తెలియజేసే అంశాలు. వీటన్నింటినీ ఒక కాలానుక్రమ పద్ధతిలో రచయిత డాక్టర్ మొయిలి శ్రీరాములు జాగ్రత్తగా పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇది ఒక వ్యక్తి జీవిత చరిత్రకే సంబంధించిన విషయాలే అయినప్పటికీ, ఆనాటి సామాజిక, ఆర్థిక రాజకీయ, చారిత్రక పరిణామాలు అన్నీ స్ఫురించేలా రాయడం ఈ రచనలో కనిపించే ఒక విశేషం. 

కళింగాంధ్ర ప్రాంతం నుండి వచ్చిన డా.మొయిలి శ్రీరాములు మధ్యాంధ్ర ప్రాంతంలోని కత్తి పద్మారావుగారి జీవితం గురించి రాయడం మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రాంతానికి చెందిన బి.ఎస్.రాములు గారి జీవితాన్ని కూడా గ్రంథాలుగా రాశాడు. ఇక, తన ప్రాంతానికి చెందిన వ్యక్తిపైగానీ, ఆ ప్రాంతానికి చెందిన విషయాలను గాని తీసుకొని ఒక బృహత్తరమైన గ్రంథం రాయాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఆ దిశగా ఆలోచన చేస్తున్నాడేమో కూడా తెలియదు. భారతదేశంలో తాను ఎక్కడున్నా తన తెలుగు ప్రాంతంతో అనురాగం పూరితమైన విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న మిత్రుడు డాక్టర్ మొయిలి శ్రీరాములుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 

శుభాకాంక్షలతో …

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 

(సెంట్రల్ యూనివర్సిటీ), హైదరాబాద్. 

ఫోన్: 9989628049



 








కామెంట్‌లు లేవు: