కోట్లాది గొంతుల్లో కొలువైన
గొంతుక ‘దాశరథి’
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని యావత్ ప్రపంచానికీ చాటిచెప్పిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి ఉత్సవాల ప్రారంభమవుతున్న సందర్భంగా డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు ఒకరోజు అంతర్జాల వేదికగా ది.21.7.2024 వతేదీన ఒక కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కవి సమ్మేళనంలో ఎంతోమంది కవులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ రోజు కవి సమ్మేళనాన్ని ఏదో నామమాత్రంగా నిర్వహించి వదిలేయకుండా, ఆ కవితలను ఒక పుస్తకంగా తీసుకొస్తున్నారు. డా.ప్రభాకర్ గారు యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించగలిన కార్యక్రమాల కంటే గొప్పవాటిని నిర్వహిస్తుంటారు. ఆయన భారతంపై నిర్వహించిన సదస్సు అటువంటి వాటిలో ఒకటి. దాన్ని పుస్తకం రూపంలో కూడా తీసుకొచ్చారు. మన భారతీయ సాహిత్యాన్ని ఏదొక రూపంలో చదివించడం, దాన్ని చర్చించడం ఒక గొప్ప వ్యూహం. దీని వల్ల మన జాతి పట్ల, మన దేశం పట్లా అభిమానం పెరుగుతుంది. మన మూలాలను మర్చిపోకుండా మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించి కొన్ని తరాలు మరలా తయారవుతాయి. ఇది ఎంతో బృహత్తరమైన పని. అలాంటిదే ఈ కవిసమ్మేళన కూడా. ఈ కవిసమ్మేళనంలో కవితలను వినడం ఒక అనుభూతి అయితే, వాటిని మరలా పుస్తకంలో చదవడం మరొక అనుభూతి. ఈ కవి సమ్మేళనానికి, దానిలో చదివిన కవితలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది: ‘దాశరథి తెలుగు వాళ్ళ అందరి కవి’ అని నినదించటం. అది నిరూపిస్తూ ఉభయ రాష్ట్రాల్లోని కవులు, సాహితీవేత్తలు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. రెండవది: కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు దాశరథి వ్యక్తిత్వం, సాహిత్య తత్వం, ఉద్యమ మమేకత్వం ప్రతిఫలించేటట్లుగా ఎంతో వైవిధ్యంతో కవిత్వాన్ని రాశారు. మూడవది: దాశరథి రాసినట్లుగానే ఛందోబద్ధమైన పద్యంలోనూ, వచనకవిత్వంలోనూ, పాటల రూపంలోనూ మూడు కవితా రూపాలలోనూ కవిత్వాన్ని వర్ణించారు. నాల్గవది: ప్రతి కవితా దాశరథి ఆశయ స్ఫూర్తిని మనకందించేటట్లు ఉండడం మరొక విశేషం. ఆయన రచనలను కవులు తమ కవితలలో సందర్భోచితంగా, ఔచిత్యమంతంగా అమరిపోయేటట్లుగా వర్ణించారు. ఐదవది: దాశరథి పుట్టి పెరిగింది తెలంగాణ ప్రాంతం.కనుక ఆ భాషలో కవిత్వం రాయడం వల్ల ఆత్మీయతను, ఆ స్థానీయతను హృద్యంగా మనకు అందిస్తుంది.
‘’గా నిజాం రాజ్యం గట్లనే ఉన్నది
గా రాజులు గట్లనే ఉన్నరు
ఔ తాతా
నీ తెలంగాణ కోటి రతనాల వీణ అంటివి ఏడున్నాయే తాత గా రతనాలు
ఇంటి దొంగలే ఎత్తుకపోవట్టిరి’’
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మార్పులేమీ కనిపించలేదనలేం. కానీ, అవినీతి తగ్గిపోతుందనుకున్నారు. పాలకులు మారినా, దేశం ప్రజాస్వామ్యం వైపు పయనించినా ఆ దోపిడీ స్వభావం మరొక రూపంలో మళ్ళీ మొదలైంది. అలాగే, తెలంగాణలో కూడా తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత పరిస్థితిని కూడా కవయిత్రి శనగల మానసాదేవి మన కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఈ కవితలు మూడు లక్షణాలు గుర్తించదగిన ఉన్నాయి. తెలంగాణ భాషలో రాయడం. దాశరథితో సంభాషిస్తున్నట్లుగా కవితను చెప్పడం. ఈ రెండు సాహిత్య విలువలకు సంబంధించినవైతే, సామాజిక విలువలకు సంబంధించింది మూడోది. అదే ఆనాటికి ఈనాటికి రాజుల (పాలకుల) స్వభావంలోను, స్వరూపంలోను వచ్చిన మార్పులు గమనించమంటూనే పీడన స్వభావం మారలేదనీ, అందువల్ల దాశరథి స్ఫూర్తి నేటికీ అవసరమని ప్రబోధించారు.
‘‘భరతమాత దాస్యశృంఖలాలను
తెంచుకున్న వేకువఝాము!
తెలుగు ప్రజల తీయని మాగాణము
ఇనుప పిడికిట బందీ అయిన రాహుకాలము!’’ అని దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, దేశవ్యాప్తంగా సంస్థానాల పాలన అంతం కానిస్థితినీ, తెలంగాణాలోకూడా నిజాం సంస్థానంలో ఉన్న కాలాన్ని కవి కరిపె రాజ్ కుమార్ అదొక రాహుకాలంగా అభివర్ణించడంతో చక్కని కవిత్వమయ్యింది. డా.వైరాగ్యం ప్రభాకర్ గారు భారత దేశంలో ఒకవైపు స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతుంటే, మరొకవైపు నిజామ్ నవాబు నియంతృత్వం కొనసాగుతున్న సమయంలో ఒక మహోద్యమానికి రథసారథిగా వ్యవహరించని కవిగా దాశరథిని అభివర్ణించడం ఎంతో ఔచిత్యమంతంగా ఉంది. అంతేకాదు, నాటి తెలంగాణ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ…
‘‘ప్రజల కన్నీళ్లను అగ్ని ధారగా
కురిపించిన మహాకవి
దగాకోరు బడా చోరు రజాకారు పోషకుడవని
ధైర్యంగా నినదించిన గొంతు
యువతుల నయనాలలో
నాగ సర్పాలు బుసకొడుతున్నాయని
నాటి యువతులు హృదయాగ్నులను
కలంతో వెలిగక్కిన కరవాలమది
గోల్కొండ ఖిలా కింద నీ ఘోరి కడతామని
ధ్వజమెత్తిన ప్రజాగళం ఆయనది.
రచనలతో ఉత్తేజాన్ని రగిలించిన శరమది’’ అని చెప్పి ఆ సమయంలో దాశరథి పాత్ర ఎంత అవసరమో చక్కగా వర్ణించారు. ఇలా ప్రతీ కవితను వివరించాలన్నంత మంచి కవితలు ఉన్నాయి. కానీ, ఇది ముందుమాటగా కాకుండా, అప్పుడది సమీక్ష అయిపోతుంది. అందువల్ల అందరూ మంచి కవిత్వం రాశారు. ఈ కవిత్వం చదువుతుంటే దాశరథి వ్యక్తిత్వం, సాహిత్యం, ఆయన ఆశయం అన్నీ ప్రతిఫలిస్తున్నాయి. సాధారణంగా ఒక కవిపై మరొక కవి కవిత్వం వర్ణించడం అంటే చాలా కష్టం. అలాంటి కవిత్వం రాసేటప్పుడు ఆ కవి రచించిన రచనలను, ఆ రచనలలోని భావాలను, భావజాలాన్ని, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను వర్ణిస్తుంటారు. ఈ కవి సమ్మేళనంలో చదివిన కవితలలో కూడా అదే పద్ధతిలో కవిత్వం వెలువడింది.
దాశరథిపై వర్ణించిన పద్య కవిత్వం కూడా చాలా బాగుంది. బండకాడి అంజయ్య గౌడ్ గారు …‘తెలుగు భాష నల్దిశలలో వెలుగు నటుల / జేసె దాశరథి నిజము స్థిర యశస్వి’గాను, తాటికొండ శివకుమార్ గారు ‘ధైర్య సాహసమ్ములుగల శౌర్యధనుడ’నీ, ‘చెవులకింపైన పాటల కవులు’గాను వర్ణించారు. ఉన్నం జ్యోతివాసుగారి పద్యాలు చక్కని భావుకతతో కూడిన మృదుమధురపరిమళాలు.
కలల సంతలోన కనుగుడ్లు వేలము
పాడినా నిజాము పాలనమున
కనులు తడిపినట్టి కన్నీటి బురదలో
పుట్టితి వొక ఎఱ్ఱ పుష్పమువయి
కంటి ఎరుపు తోడ కాగడాల్ వెల్గించి
ఇరుల గుంపునెల్ల తరిమినావు
చెమట బొట్టులన్ని చమురుగా నొనరించి
శ్రామికోదయా లొసగినావు.
కలలో కూడా నిజాం రాజు యొక్క క్రూరత్వాన్ని అద్భుతంగా వర్ణించాడు కవి. ప్రతి పద్యం భావుకతతో అద్భుతంగా వచ్చింది. మారుగొండ సాయిలుగారు ‘దాశరథికిలసాటిగాధరణిలేర’ని వర్ణించారు. రమ్యంగా అనేకరచనలు చేసిన గొప్ప కవిగా కర్నేన జనార్దనరావుగారు తెలిపారు. డా.టేకుమళ్ళ వెంకటప్పయ్యగారు ‘దాశరథీ!రచనా పయోనిధీ’ అని కంచర్ల గోపన్నగారి ‘దాశరథీ కరుణాపయోనిథీ’ అనేమకుటానికి అనుకరణాత్మక శీర్షికతోనే భారతీయ ఆలంకారిక సిద్ధాంతంలోని చక్కని వక్రతను పాటించారు. ఇరువురు కవులు వేర్వేరు అంటూనే ‘దాశరథి’ అనే వాళ్ళు ఒకరే అనుకునే పాఠకుల ఆలోచనా విధానాన్ని చెప్తూనే ఇద్దరూ వేర్వేరు అని కూడా ఈ శీర్షికలో పెట్టడం విశేషం. దాశరథి చిన్ననాటి నుండీ ఛందోబద్దమైన కవిత్వం రాసిన గొప్పకవిగా శ్రీనాథుని పద్యాల్లాంటి పద్యంలో వర్ణించిన తర్వాత తెలంగాణాను ఎలా ఆత్మీకరించుకున్నాడో చెప్తూ…
‘‘ఎవరు కాకతి? రుద్రమ్మ యెవ్వరనియె!
ఎవరు రాయలు? సింగన యెవ్వరనుచు
అన్ని తానంచును బలికి, యన్ని నేనె!
అలుగు పులుగులు నేనంచు వెలుగు జూపె!’’ అనడంలో దాశరథికి తెలంగాణాతో ఉన్న మమేకత్వం వెల్లడవుతుంది. అలాగే, ఆలుకుంట లింగయ్య, జనార్థానాచారి గుగ్గిళ్ళ, బోరభారతీదేవి, చంద్రమౌళి, గుర్రం మల్లేశం, మాడుగుల నారాయణమూర్తి, దేవరాజు రేవతి, వేదాంతం సురేశ్ బాబు, కుసునూరు భద్రయ్యగా ర్లుకూడా మంచి పద్యాలు రాశారు. ప్రతిపద్యం భావుకతతో పాటు, దాశరథి ఉద్యమస్ఫూర్తిని ప్రతిఫలించేలా ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. ప్రతి పద్యం తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోతాయి.
పాటల రూపంలో కూడా దాశరథిపై కవిత్వం రాయడం రూపపరమైన ఒకప్రత్యేకతను తెలియజేస్తుంది. మండ వీరాస్వామి గౌడ్ రచించిన పాటలో దాశరథి వ్యక్తిత్వం నిలువెత్తున దర్శనమవుతుంది.మ్యాదరి సునీల్ పాటలో దాశరథి ఉద్యమస్ఫూర్తి ప్రతిబింబిస్తుంది. డా.జనార్థన్ కుడికాల గారి పాటలో దాశరథి సాహిత్యామృతాన్ని, వారి హృదయాన్ని మనముందుంచారు. నూనె రాజేశం గారు దాశరథిని అనేక కోణాల్లో దర్శింపజేశారు. పాటలు చదువుకోవడం కంటే వాటిని వింటే ఎంతో ఉద్వగ్నత కలుగుతుంది. వచనకవిత్వం చదువుకునేటప్పుడు, చదివి వినిపించేటప్పుడు ఎంతో ఆసక్తికలుగుతుంది. కొన్ని వచనకవితలు గేయాలుగా కొనసాగాయి. కాబట్టి రాగాలతో ఆలపించే అవకాశం ఉంది. ఇక, పద్యాలు మాత్రం చదివేటప్పుడు, చదివితే వినేటప్పుడు ఆ లయ, ఛందస్సు మనల్ని నిజమైన సాహితీప్రియునిగా మారుస్తూ రసలోకాల్లో వివరింపజేస్తాయి.
దాశరథి శతజయంతోత్సవాల ప్రారంభంలోనే ఒక గొప్ప కవిసమ్మేళనాన్ని నిర్వహించి, మరలా వెంటనే ఆ కవితలను ఇలా పుస్తక రూపంలో తీసుకొస్తున్న డా. వైరాగ్యం ప్రభాకర్ గారు ఎంతో అభినందనీయులు. ఇలాంటి కృషే దాశరథిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళేలా చేస్తుంది.దాశరథి రచించిన మొత్తం సాహిత్యాన్ని చదివించేలా చేస్తుంది. దాశరథి ఆశించిన సమాజాన్ని నిర్మించేలా చేస్తుంది. కవిత్వం రాసిన కవులందరినీ అభినందిస్తున్నాను.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు.
తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు,
స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
15 ఆగస్టు 2024
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి