తెలుగు వారికున్న ఉపాధి అవకాశాలు!
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేసిన ప్రసంగం.
13.7.2024 తెలుగు న్యూస్ టైమ్స్ దినపత్రిక సౌజన్యంతో
( 2024 జూలై 11 - 12 తేదీలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), బిచ్కుంద, కామారెడ్డి జిల్లా, తెలంగాణలో "Building an Entrepreneurial Ecosystem: Aligning the NEP 2020 with the Challenges and Opportunities of the 21st Century" అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో 12.7.2024 వతేదీన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేసిన ప్రసంగం. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ, జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతారావు, కళాశాల విద్యా సంయుక్త సంచాలకులు ప్రొఫెసర్ డి.ఎస్.ఆర్ రాజేందర్ సింగ్, ఐఎస్ఎన్ఆర్-ఎస్ఆర్సి డైరెక్టర్ శ్రీ సుధాకర్ రెడ్డి, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తాడేపల్లి పతంజలి,తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగుశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎం.మంజుశ్రీ, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి.శ్రీనివాస్, అకాడమీ కోఆర్డినేటర్ ఎం.చంద్రశేఖర్, కన్వీనర్డా. టి. హన్మంత్లు, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు).
అందరికీ నమస్కారం. ముందుగా ఈ సదస్సులో పాల్గొనడానికి నన్ను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించిన కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ మేడం గారికి, కళాశాల అధ్యాపకులకు, నాతో పాటు పాల్గొంటున్న సహృదయ సాహితీవేత్త డాక్టర్ తాడేపల్లి పతంజలి గారికి నా నమస్కారాలు, విద్యార్థినీ విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈరోజు నేను మాతృభాషలో అధ్యయనం చేసిన వారికి, తెలుగు భాషా సాహిత్యాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయో, నాకు తెలిసిన కొన్ని అంశాలను మీముందుంచే ప్రయత్నం చేస్తాను. తెలుగు భాషా, సాహిత్యాల అధ్యయనం ద్వారా నేటి ఆధునిక సాంకేతిక, డిజిటల్ ,కార్పొరేట్ యుగంలో లభిస్తున్న విభిన్న ఉపాధి అవకాశాలను మరింత విస్తృతంగా ,సమగ్రంగా పరిశీలిస్తే క్రింది రంగాలలో అద్భుతమైన ఉపాధి మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ,లాంగ్వేజ్ టెక్నాలజీ రంగం
నేడు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు కృత్రిమ మేధస్సు (AI) ,లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) అభివృద్ధిలో భాగంగా తెలుగు భాషా రూపాలు, వ్యాకరణం, మాండలికాలు , నుడికారాలను కంపెనీలకు అర్థమయ్యేలా చేయడానికి భాషా నిపుణులను ఆకర్షణీయమైన వేతనాలతో నియమించుకుంటున్నాయి. అందువల్ల బైలింగ్వల్ AI ట్రైనర్లు & డేటా అనోటేటర్లు అవసరమవుతారు.తెలుగు భాషలో వాయిస్ రికగ్నిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ,టెక్స్ట్-టూ-స్పీచ్ సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేయడంలో భాషా శాస్త్రవేత్తలకు ,తెలుగు సాహిత్య నిపు్రులకు పెద్దపీట వేస్తున్నారు.న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) నేర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
2. డిజిటల్ మీడియా, కంటెంట్ క్రియేషన్ & జర్నలిజం
ఇంటర్నెట్ ,సోషల్ మీడియా విప్లవం కారణంగా వెలవడుతున్న డిజిటల్ న్యూస్ పోర్టల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఓటీటీ (OTT) వేదికలు ,ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లకోసం ఆకర్షణీయమైన శీర్షికలు, కథనాలు, స్క్రిప్ట్‌లు రాసేవారికి నిరంతరం డిమాండ్ ఉంది. కాబట్టి డిజిటల్ కంటెంట్ రైటర్లు & స్క్రిప్ట్ రైటర్లు అవసరమవుతారు.ప్రముఖ తెలుగు దినపత్రికలు, వార/మాస పత్రికలు, ,ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానెళ్లలో రిపోర్టర్లుగా, సబ్ ఎడిటర్లుగా, న్యూస్ రీడర్లుగా, ,ఎడిటోరియల్ బోర్డు సభ్యులుగా స్థిరపడవచ్చు.పాత్రికేయ వృత్తి (Journalism & Editing) లో అనే అవకాశాలు ఉన్నాయి.ఈ అంశం నేటి సోషల్ మీడియా , డిజిటల్ యుగంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది. రాజకీయ నాయకులే కాకుండా వివిధ రంగాల వారు తమ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చిన్న చిన్న రీల్స్, షార్ట్స్, , ఆకర్షణీయమైన వీడియోలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు భాషపై మంచి పట్టు సాధించి, చక్కని థంబ్‌నెయిల్స్ (Thumbnails) రూపొందిస్తూ వీడియోలు చేయడం ద్వారా ఉపాధి పొందగలుగుతారు. అవి ఎలాగో చెప్తాను.
1.డిజిటల్ యుగంలో తెలుగు భాషా ఉపాధి-రీల్స్, థంబ్‌నెయిల్స్ , కంటెంట్ క్రియేషన్:
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా (YouTube, Instagram, Facebook, X/Twitter) కేవలం వినోద వేదికలు మాత్రమే కాకుండా, శక్తివంతమైన ఉపాధి , ప్రచార మాధ్యమాలుగా రూపాంతరం చెందాయి. తెలుగు భాషా సాహిత్యాలపై పట్టు ఉన్నవారు ఈ డిజిటల్ అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకోవచ్చో చూద్దాం.
ఆకర్షణీయమైన శీర్షికలు , థంబ్‌నెయిల్స్ రూపకల్పన (Thumbnails & Catchy Headlines)సోషల్ మీడియాలో ఏ వీడియో లేదా రీల్ అయినా ముందుగా ప్రేక్షకులను ఆకర్షించేది దాని థంబ్‌నెయిల్ (Thumbnail) , శీర్షికే.తెలుగు భాషపై మంచి పట్టు, నుడికారాలు, జాతీయాలు , సామెతలపై అవగాహన ఉన్నవారు; అలాగే పదాలను ఆకట్టుకునేలా అమర్చగల నేర్పు ఉన్నవారు "థంబ్‌నెయిల్ క్రియేటర్లు"గా , "కాపీ రైటర్లు"గా రాణించవచ్చు.రాజకీయ నాయకులు, యూట్యూబర్లు, , వ్యాపార సంస్థలు తమ వీడియోలకు ఎక్కువ మంది వ్యూస్ (Views) వచ్చేలా ఆకర్షణీయమైన తెలుగు క్యాప్షన్స్, పంచ్‌లైన్స్ రాయించుకోవడానికి మంచి రెమ్యూనిరేషన్ ఇస్తున్నాయి.రాజకీయ , సామాజిక కంటెంట్ రూపకల్పన (Political & Social Content Strategy నేడు రాజకీయ నాయకులు తమ ప్రచారం కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
తెలుగు భాషలో స్పష్టత, ధారాళమైన ఉచ్ఛారణ, , సమకాలీన రాజకీయాలపై అవగాహన ఉన్నవారు స్క్రిప్ట్ రైటర్లుగా, సోషల్ మీడియా మేనేజర్లుగా, డిజిటల్ కన్సల్టెంట్లుగా ఉపాధి పొందవచ్చు.తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావాన్ని చూపేలా చిన్న చిన్న రీల్స్ (Shorts/Reels) కోసం స్క్రిప్ట్‌లు సిద్ధం చేయడం నేటి ట్రెండింగ్ ఉపాధి మార్గం. ఎవరిపైనా ఆధారపడకుండా మీ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజీని ప్రారంభించి, తెలుగు సాహిత్యం, వర్తమాన అంశాలు, చరిత్ర లేదా రాజకీయ విశ్లేషణలపై వీడియోలు చేయవచ్చు.మీ వీడియోల కంటెంట్ బాగుండి, చక్కని థంబ్‌నెయిల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే సోషల్ మీడియా మానిటైజేషన్ (Monetization) ద్వారా , స్పాన్సర్‌షిప్‌ల ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
2.కార్పొరేట్ , పొలిటికల్ క్యాంపెయినింగ్ ఏజెన్సీలు
పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ప్రచారం కోసం ప్రత్యేక ఏజెన్సీలను ఆశ్రయిస్తాయి. ఆ ఏజెన్సీలలో తెలుగు కంటెంట్ రైటర్లకు, రీల్స్ ఎడిటర్లకు, , సోషల్ మీడియా అనలిస్టులకు డిమాండ్ ఎక్కువుగా ఉంటుంది.
కేవలం సంప్రదాయ చదువులకే పరిమితం కాకుండా, తెలుగు భాషా నైపుణ్యాలను ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో (రీల్స్, థంబ్‌నెయిల్స్, ఎడిటింగ్) జోడించగలిగితే యువతకు,భాషా విద్యార్థులకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు & అనువాద రంగాలు (Translation & Public Sector)
కేంద్ర ప్రభుత్వ సంస్థలు (ఆకాశవాణి, దూరదర్శన్, రైల్వేస్, బ్యాంకులు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్), రాష్ట్ర ప్రభుత్వ సచివాలయాలు, కోర్టులు ,పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (PSUs) లో ఇంగ్లీష్ నుండి తెలుగులోకి (,తెలుగు నుండి ఇంగ్లీష్‌లోకి) పత్రాలను అనువదించే ప్రత్యేక ఉద్యోగాలు ఉంటాయి.
పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ప్రచురించే ప్రెస్‌లు ,పబ్లిషింగ్ హౌస్‌లలో వ్యాకరణ శుద్ధితో, ముద్రణా లోపాలు లేకుండా గ్రంథాలను తీర్చిదిద్దడానికి ప్రూఫ్ రీడర్లుగా ,ఎడిటర్లుగా ఉపాధి లభిస్తుంది.
4. విద్యా, బోధన ,పరిశోధన రంగాలు (Academic & Research Careers)
ఎస్.జి.టి., స్కూల్ అసిస్టెంట్ (తెలుగు), జూనియర్ (JL) ,డిగ్రీ కాలేజీ లెక్చరర్లుగా (DL) ప్రభుత్వ, ప్రైవెట్ రంగాలలో స్థిరపడటానికి తెలుగు ఎం.ఏ., బి.ఎడ్. కోర్సులు చక్కటి ఆధారాన్నిస్తాయి.
ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్డి డిగ్రీలు సాధించి, నెట్ (NET) లేదా సెట్ (SET) అర్హత పొందడం ద్వారా విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, పరిశోధనా పండితులుగా (Research Scholars) దేశ విదేశాలలో రాణించవచ్చు.
5.సృజనాత్మక ,వినోద రంగం (Creative Arts & Entertainment)
సాహిత్యంపై పట్టు, సృజనాత్మక దృష్టి ఉన్నవారు చలనచిత్ర రంగానికి పాటల రచయితలుగా (Lyricists), మాటల రచయితలుగా (Dialogues Writers), స్క్రీన్ ప్లే రైటర్లుగా ,డబ్బింగ్ ఆర్టిస్టులుగా విశేషమైన ఖ్యాతిని, ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు.
కథలు, నవలలు, కవితలు, దీర్ఘకావ్యాలు రాయడంలో అభిరుచి ఉన్నవారు సొంతంగా పుస్తకాలను ప్రచురించుకుంటూ, సాహిత్య సంస్థలతో మమేకవుతూ రచయితలుగా గుర్తింపు పొందవచ్చు.
ఈ రెండు రోజుల జాతీయ సదస్సులో నేను పత్ర సమర్పణ చేయడానికి, ఇంత దూరం ప్రయాణించి ఇక్కడికి రావడానికి ప్రధానంగా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. నా శ్రీమతి డా. ఎం.మంజుశ్రీ గతంలో తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డిలో పనిచేశారు. అప్పుడు ప్రిన్సిపాల్ గా డాక్టర్ చంద్ర ముఖర్జీ గారు ఉండేవారు. మా మిస్సెస్ కోసం నేను వెళ్లప్పుడల్లా వారిని కలిసే వాడిని. వారు అప్పటి నుంచీ నేటి వరకు మా కుటుంబంపై వారు చూపిన ఆదరాభిమానాలు మరువలేనివి.
ఈ సదస్సుకి కూడా నన్ను ఆచార్య ప్రొఫెసర్ చంద్రముఖర్జీ గారు నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించమన్నారు. వారు చూపిన గౌరవం వెలకట్టలేనిది. లింగంపల్లి నుండి కామారెడ్డి వరకు అంత దూరం నుంచి వచ్చినప్పటికీ, వారి ఆదరాభిమానాల ముందు ఆ దూరం పెద్దదనిపించలేదు. నేను కూడా విద్యార్థులకు తెలుగు భాష పట్ల అభిమానం పెంపొందించాలని భావించాను. దీంట్లో ఎన్ని రకాలుగా మనం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవచ్చనేది విద్యార్థులకు తెలపాలనేది కూడా నా ఉద్దేశం. మా కుటుంబంపై వారు చూపుతున్న ఈ ప్రత్యేకమైన ప్రేమానురాగాలకు, ఈ సదస్సులో నాకు భాగం కల్పించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి