పరిశోధనలో ఊహాప్రతిపాదన శాస్త్రీయంగా ఉండాలి.
పరిశోధనలో ఊహా ప్రతిపాదన గుండెకాయలాంటిదనీ, అది విశ్వసనీయతతో రూపొందించుకోవడం ద్వారానే శాస్త్రీయమైన పరిశోధనలు సాధ్యమవుతాయని హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
పి.ఆర్.ఆర్. & వి.ఎస్.ప్రభుత్వ కళాశాల తెలుగు పరిశోధన కేంద్రం, డి.కె.ప్రభుత్వ మహిళా కళాశాల నెల్లూరు వారు సంయుక్తంగా అంతర్జాలం ద్వారా నిర్వహిస్తున్న 'పరిశోధనావిధానం' రెండు రోజుల (9-10, డిసెంబర్ 2023 ) కార్యశాల లో భాగంగా ఆదివారం నాడు 'పరిశోధనలో ఊహాప్రతిపాదన-ప్రాధాన్యత' అనే అంశంపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రసంగించారు. పరిశోధన ప్రణాళికలో ఊహాప్రతిపాదన సూటిగా, స్పష్టంగా, వివరణాత్మకంగా ఉండాలనీ, గతంంలో జరిగి పోయిన వాటినే తాను మరలా పరిశోధన చేస్తూ పునరుత్పత్తి చేయడం, దాన్ని దాచేసి ఊహాప్రతిపాదన చేసినట్లు చేయకూడదని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. శూన్య, భవిష్యదంశ, అనుభావిక, సాధారణ, ప్రత్యామ్నాయ, తార్కిక, గణాంక, ప్రకటనాత్మక, ప్రశ్నాత్మక ఊహాప్రతిపాదనలనే వివిధ రకాలుగా విభజించుకోవాలని సోదాహరణంగా వివరించారు.
వ్యక్తిగత అనుభవంతోను, మేధోగతమైన ఆలోచన, పరిశీలన, శాస్త్రీయ సిద్ధాంతాల అధ్యయనం, గతంలో జరిగిన పరిశోధన అధ్యయనం వల్ల శాస్ర్తీయమాన ఊహాప్రతిపాదన చేయాలని వివరించారు. సిద్ధాంత వ్యాస రూపకల్పన -ఆకరాలు అనే అంశంపై శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ మాట్లాడారు. సుమారు వందమందికి పైగా పరిశోధకులు పాల్గొన్న ఈ కార్యశాలను డా.కె.కరుణశ్రీ, డా.జి.పద్మప్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిశోధకులు ప్రశ్నలకు వివరణలతో తెలుగు పరిశోధన పద్ధతులపై లోతైన చర్చ జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి