*మానవసంబంధాల ఔన్నత్యమే గురజాడ సాహిత్యం*
మానవ సంబంధాలను సూటిగా, శక్తివంతంగా చెప్పడంలో గురజాడ అప్పారావు ఎంతో విజయవంతం అయ్యారని, దాని ద్వారా మానవ సంబంధాల ఔనత్యాన్ని సాహిత్యంలో ప్రతిఫలింపజేశారని హెచ్ సి యు వైస్ ఛాన్సలర్ ఆచార్య బిజె రావు వ్యాఖ్యానించారు. తెలుగు శాఖ, హెచ్ సి యు గురజాడ ఫౌండేషన్ అమెరికా వారి సంయుక్త నిర్వహణలో రెండు రోజుల పాటు జరిగే 'మహాకవి గురజాడ అప్పారావు జీవితం, రచనలు ' జాతీయ సదస్సు ప్రారంభ సభలో గురువారం నాడు హెచ్ సియు వైస్ ఛాన్సలర్ ఆచార్య బిజె రావు ముఖ్యఅతిథిగా పాల్గొని, గురజాడ కథామంజరి పుస్తకం, దార్ల వెంకటేశ్వరరావు నెమలికన్నులు గ్రంథాల్ని ఆవిష్కరించి, గురజాడ సాహిత్యంపై విశేషంగా కృషిచేసిన కీ.శే.వేదగిరి రాంబాబు గారి సతీమణి శ్రీమతి సంధ్యారాణిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య బిజెరావు మాట్లాడుతూ గురజాడ దేశమంటే కేవలం మట్టిమాత్రమేకాదనీ, దేశమంటే మనుషులు కూడా అనే దృష్టితో మానవత్వ పతాకాన్ని ఆవిష్కరించారని అన్నారు. సులభమైన మాటల్లో సూటిగా చెప్పడం గురజాడ అప్పారావు గారు శైలి ప్రత్యేకత అని, పాఠశాలలో చదువుకున్నప్పుడే గురజాడ వారి దేశభక్తి గేయం గుండెల్లో సూటిగా దూసుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రారంభ సభకు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి, మూడుతరాల వారు ఈ సదస్సులో పాల్గొంటున్నారని, యువతకు అధికప్రాధాన్యాన్నిస్తూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురజాడ వారి జీవితంలోని అనేక అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని, ఆయన ప్రయోగించిన ప్రతి పదానికి ఎంతో నేపథ్యం ఉందని ఆచార్య ఏల్చూరి మురళీధరరావు సోదాహరణంగా వివరించారు. బొంకులదిబ్బ నామనేపథ్యాన్నీ, గురజాడ రచనల్లో పేర్కొన్న వివిధ అంశాలపై పరిశోధకుల అభిప్రాయాలన ఉదాహరిస్తూ విశ్లేషించారు.గురజాడ రచనలపై వాద వివాదాలు, విమర్శలు ఉన్నప్పటికీ, కులం, మత, ప్రాంతాలకు అతీతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని గౌరవ అతిథిగా పాల్గొన్న డీన్, స్కూల్ ఆఫ్ హ్యూమానిటిస్ ఆచార్య వి.కృష్ణ అన్నారు. విశిష్ట అతిథిగా అమెరికా నుండి పాల్గొన్న గురజాడ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రకాశిక త్రైమాసిక అంతర్జాల పత్రిక ప్రధాన సంపాదకులు మాట్లాడుతూ గురజాడ వారి జయంతులు, వర్థంతులు జరుపుకోవడమే కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆయన ఉద్బోధించారు. ఈ సదస్సు ప్రధానంగా యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్నంందుకు సంతోషంగా ఉందన్నారు. తర్వాత జరిగిన రెండు సమావేశాల్లో ఆచార్య రెడ్డి శ్యామల, డా.కోయికోటేశ్వరరావు, డా.ఎన్.రజని, డా.ఎన్.మృదుల, డా.పి.నీరజ వివిధ అంశాలపై పత్రాలు సమర్పించారు. తొలిరోజు ముగింపు సమావేశానికి ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా హెచ్ సియు ప్రొ-వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్. ఎస్. సర్రాజు మాట్లాడుతూ గురజాడ విశ్వమానవ వాది అని అన్నారు. తాను రాయవరం గ్రామానికి చెందినవాడిననీ, గురజాడ భాషలోని వ్యంగ్యాన్ని సోదాహరణంగా వివరించారు. తాను మొట్టమొదటి సారిగా గురజాడ పైనే వ్యాసాన్ని రాశానని గుర్తుచేశారు. సమాపన ప్రసంగం చేసిన సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ అధ్యక్షులు ఆచార్య కె.సునీతారాణి మాట్లాడుతూ ప్రజల భాషల్లో విద్యాబోధన ఉండడం వల్ల అనేకప్రయోజనాలు ఉన్నాయని గురజాడ భావించారని వివరించారు.ఆంగ్లంలోని షేక్స్పియర్, జార్జి బెర్నార్డ్ షాహెన్రీ క్రిప్షన్ లాంటి వారి ప్రభావం కనిపిస్తుందన్నారు. సమాజంలోని రుగ్మతలను నాటకాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళారని ఆమె చెప్పారు. ఆ దిశగా తురునాత్మక అధ్యయనాలు జరగవలసిన అనేక అంశాలను ఆమె ప్రస్తావించారు. విశిష్ట అతిథిగా ఆచార్య అయినవోలు ఉషాదేవి మాట్లాడుతూ గురజాడ భాషాప్రయోగాల్లోని ప్రత్యేకతను వివరించారు. ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబంలో వ్యవహారంలో ఉండే మాండలిక భాషగా చెప్తున్నారనీ, దాన్ని లోతుగగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఈ ముగింపు సదస్సు సమావేశానికి ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యక్షత వహిస్తూ గురజాడ పూర్ణమ్మ గేయాల్ని రాగయుక్తంగా ఆలపిస్తూ విశ్లేషించారు. కరుణరసభరితంగా ఆలపించిన ఆ గేయాలు ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా చేశాయి.ఈ సదస్సులో వివిధ సమావేశాలకు ఆహ్వానం, వందన సమర్పణ, సమావేశ కర్త లుగా ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి.విజయలక్ష్మి, డా.భూక్యతిరుపతి, డా.బాణాల భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి వ్యవహరించారు. ఈ సమావేశాల నిర్వహణలో , డా.శంకర్ అనంత, డా.సంగీతరావు, డా.రాగ్యానాయక్, మధుసూదన్ , దయాకర్, నవీన్ , టెక్నికల్ ఇంజనీర్ కుమారి మాలిని సహకరించారు. ప్రముఖ సాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి