కథలుగా మురిపిస్తున్న జీవిత సత్యాలు
డా.దార్ల వెంకటేశ్వరరావు
ప్రొఫెసర్ & హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు
స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్. ఫోన్: 9182685231
ఆయన పాఠం చెప్తుంటే మా కళ్ళు కనురెప్పవెయ్యడం మర్చిపోయేవి. ఆయన పాఠం చెప్తుంటే మా చెవులు మరేదీ వినడానికి ఒప్పుకొనేవికాదు. పాఠం చెప్తే ఆయనలా ఉండాలనిపించేది. ఆయన పాఠం చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా మాచెవుల్లో ఆయన మాటలే వినిపిస్తున్నట్లనిపించేది. ఆయన ప్రొజెక్టర్ పై కవిత్వం విశ్లేషించి వెళ్ళిపోయిన తర్వాత కూడా మాకు ఆ దృశ్యమే కనిపిస్తున్నట్లనిపించేది. ఆయన పేరు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన తెలుగు శాఖలో ప్రొఫెసర్ గా సుదీర్ఘ కాలంపాటు పనిచేశారు. తర్వాత అధ్యక్షులుగా కూడా పని చేశారు. ఆయన తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నప్పుడే నా పిహెచ్డి మౌఖిక పరీక్ష జరిగింది. ఆయన దగ్గర నేను ఎం.ఏ., తెలుగు పాఠాలను వినే అదృష్టం కలిగింది. సంప్రదాయ కవిత్వంలోని సౌందర్యాన్నెంత లోతుగా వివరిస్తూ భారతీయ ఆలంకారికుల పట్ల గౌరవాన్ని కలిగించేవారో, ఆధునిక వచన కవిత్వాన్ని విశ్లేషిస్తుంటే పాశ్చాత్య కవిత్వ నిర్మాణ పద్ధతుల పట్లా అంతే ఆసక్తిని పెంచేవారు. అందరికీ ఆయన ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారే కావచ్చు. కానీ, ఆయన దగ్గర చదువుకున్న మాకందరికీ ఎం.వీ.గారే. ఆయన కావ్యాల్నీ, కవిత్వాన్నీ, కథల్నీ, నవలల్నీ... ఏ ప్రక్రియ గురించి చెప్పినా ఆ ప్రక్రియ పట్ల మాకు గౌరవం కలిగేది. సృజన సాహిత్యంలోని అనేక పార్శ్వాల్ని మాకు పాఠ్య భాగంలో భాగంగా వివరిస్తుంటే, ఆయన కూడా ఆ ప్రక్రియలను రాస్తే ఎలా ఉండేదో అనిపించేది. ఆయన ప్రభావం నేటికీ నా టీచింగ్ లో కనిపిస్తుంది. ఆయనలా పాఠం చెప్పలేకపోయినా, దాన్ని అనుకరించడానికైనా ప్రయత్నించాలనిపిస్తుంది.
అటువంటి మా ఎం.వీ.గారు కథలు రాశాననీ, వాటిలో ఆరు కథలు దొరికాయనీ, వాటిని పుస్తకంగా తీసుకొస్తున్నానని, ఒక అభిప్రాయం రాసి పంపించమని చెప్పారు. మా గురువుగారి రచనలపై నా అభిప్రాయమనేది నా జీవితంలో ఊహకైనా రాని ఆలోచన. వెంటనే ‘‘ఇది నాకు కలిగిన అదృష్ణం సర్. మీరు కథలు రాశారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సర్. మీరు కవిత్వం రాశారని తెలుసు. కథలను అంత బాగా విశ్లేషిస్తుంటే, మా గురువుగారు కథలు రాసుంటే ఇంకెంత బాగుండేదనిపించేది. ఈ కథలు చదివితే మీ సృజనసాహిత్యంలోని మరొక పార్శ్వం నాలాగే మా తరం, తర్వాత తరం వాళ్ళకి ఎంతోమందికి కొత్తగా తెలుస్తుంది. నాకెంతో సంతోషంగా ఉంద’’న్నాను. ఈ కథలన్నీ 1960 ప్రాంతాల్లో రాసినవి. వీటితో పాటు మరో నాలుగు కథలు కూడా రాశారు. అవి దొరకడంలేదని తెలిసింది. కథలు రాశారంటేనే ఆశ్చర్యపడ్డ నాకు, ఆయన నవలలు కూడా రాశారని తెలిసి మరింత ఆశ్చర్యపోయాను.ఏ నాడూ ఆయన తన కథలు, నవలలు లేదా తన రచనల గురించి క్లాసులో చెప్పేవారు కాదు. అందువల్ల ఆయన ఒక విమర్శకుడుగా, ఒక పరిశోధకుడుగా, ఒక సంగీత విద్వాంసుడుగా, అన్నింటికీ మించి ఒక గొప్ప ప్రేమమూర్తిగానే మేము భావించేవాళ్ళం. అయినా, ఆయనతో నేటికీ మాట్లాడాలంటే ఏదో తెలియని భయం. ఆయన నుండొక విమర్శ పుస్తకం వచ్చిందంటే మాకు ( నాకు ప్రత్యేకించి) ఒక పండుగ. అందులోని విశ్లేషణ, విషయగాఢత, నూతన విషయాల పరిచయం వంటివన్నీ ఆ పుస్తకాల్ని దాచుకొని పదేపదే చదువుకోవడానికి, పాఠం చెప్పడానికి నిత్యం ఉపయోగించుకోవడం నాకు అలవాటు.
అటువంటి మా సార్ కథలు రాశారని తెలిస్తే ఎలా ఉంటుంది? ఒక విమర్శకుడిగా ఎరిగిన వారు నాకు తెలియని ఒక కథకుడిగా పరిచయమవుతుంటే సహజంగానే నాలోని ఆ విద్యార్థీ, ఒక పాఠకుడూ, ఒక విమర్శకుడూ సందర్భాన్ని బట్టి బయటకొస్తుంటాడు.ప్రతి పదాన్నీ, ప్రతి వాక్యాన్నీ, ప్రతి పాత్రనీ, ప్రతి వర్ణనలోని సందర్భోచిత ఔచిత్యాన్నీ, ఆ నెరేషన్నీ, దానికి ఉపయోగించుకున్న భాషనీ…ఇలా భిన్న పార్శ్వాల్లో చూడాలనిపిస్తుంది. సార్ రాసిన కథలు ఆరు దొరికాయి. వాటిని ఈ పుస్తకంలో ప్రచురిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో మనుషుల రూపంలో ఉండే మృగాలకంటే, మమతానురాగాల్ని ప్రదర్శించే మృగాలేనయం అనిపించే వాస్తవాల్ని మనకు కళ్ళ ముందు కదిలాడేలా వర్ణించిన కథ ఏనిమల్ సైకాలజీ (1969). జీవితం ఒక సర్కస్ లాంటిది. దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోకపోతే పతనం ఎన్ని రూపాల్లో ఉంటుందో ఊహించలేం. కథ అంతా ఏకబిగిని చదివించే ఉత్సకతతో పాటు చివరికేమవుతందనేది ఊహకు వస్తున్నట్లనిపిస్తూనే, పాఠకుని ఊహే నిజమవుతుందా? రచయిత ఏదైనా మలుపు తిప్పుతారా? అనుకుంటుండగానే కథ ముగుస్తుంది. మహాక్రూర జంతువుల మనస్తత్వాల్ని గుర్తించవారికి మనుషులు స్వభావాలు తెలియకుండా ఉంటాయా? సమాజంలో పెద్దమనుషుల్లా గౌరవమర్యాదలు పొందే వారిలో పైకి కనిపించని దుర్మార్గ స్వభావాన్ని గుర్తించడమే కాకుండా సర్కస్ నిర్వాహకురాలు శాంతి టిట్ ఫర్ టాట్ అన్నట్లే ప్రవర్తించింది.
తరంగాలూ, అంతరంగాలూ (1969) కథలో స్త్రీ-పురుషుల మధ్య, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధాలు ఏయే అంశాలతో ముడిపడి ఉంటాయో పాఠకుల్లో శాశ్వతంగా ముద్రవేసే పోలికలతో నెరేట్ చేశారు. ఇండియాలో డాక్టర్ గా పనిచేస్తున్న హరిప్రియకు ఒక ఉత్తరంలో తన భర్త అమెరికాలో ఉంటూ, అక్కడి స్వేచ్చను వివరిస్తాడు. హరిప్రియతో పాటు పని చేస్తున్న వరప్రసాద్, ఆమెపై మోహంతో చెరువులోని నీటికి స్వేచ్చ ఉంటేనే సౌందర్యవంతంగా ఉంటుందని, తన కోర్కెను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. భర్త యెడబాటు, తన ఒంటరితనం, తన వయసు …ఇవన్నీ ఆమెను కొంత తడబాటుకి గురిచేస్తాయి. ఒకసారి హరిప్రియ, వరప్రసాద్ ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్ళి, అది అయిపోయిన తర్వాత వరప్రసాద్ తన ఇంటికి బలవంతంమీద కాఫీ త్రాగి వెళ్దువుగాని లోనికి రమన్మని తీసుకెళ్తాడు. ఇద్దరూ కాఫీ త్రాగే సమయంలో వాళ్ల చూపులు ఒకర్నొకర్ని గాఢంగా చూసుకొంటారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఆమెను దగ్గరకు తీసుకున్న వరప్రసాద్ ని దూరంగా నెట్టేస్తుంది. ఇంటికొచ్చేసి, మరలా తనలో తాను అలా చేసినందుకు బాధపడుతుంది. సౌందర్యానుభూతి కేవలం శరీరానికే సంబంధించిందా? లేదా మనసుకే సంబంధించిందా? స్త్రీ-పురుషుల ప్రేమాస్వాదనలో నైతికవిలువల ప్రభావం వంటివన్నీ ఈ కథలో చర్చనీయాంశాలవుతాయి. కథలో జరుగుతున్న వర్తమానంలోనే భవిష్యత్తును దర్శింపజేయటం ఈ కథలోని శిల్పం.
కెమొమిల్లా (1970) పేరుతో ఒక కథ రాశారు. పేరే విచిత్రంగా ఉంది. కథ చివరిలో రచయిత దాని గుట్టు కొంత విప్పారు. నాలాయనీదేవి ధనవంతురాలు. ఆమె భర్త చనిపోయాడు. అతన్ని ఆమే చంపేసిందని అందరూ చెప్పుకుంటుంటారు. కానీ, నిజానికి భార్యాభర్తలిద్దరూ గొడవపడినప్పుడు, భర్త నీళ్ళ ఫౌంటెన్ లో పడి చనిపోతాడు. ఆ విషయాన్ని డాక్టర్ శశిభూషణ్ ఆమెతో జరిపిన సంభాషణల ద్వారా తెలుసుకోగలుగుతాడు. ఆ విషయాన్ని సమాజానికి తెలియజేయడమెలాగో తెలియని నాలాయనీదేవి మానసికవ్యథకు గురవుతుంది. ఆమెకు తనచుట్టున్నవాళ్ళంతా తనకు శత్రువుల్లా అనిపిస్తారు.డాక్టర్ శశిభూషణ్ ని కూడా మొదట ఆ దృష్టితోటే చూస్తుంది. తెలివైన డాక్టర్ ఆమె మానసిక స్థితిని గుర్తిస్తూనే ఆమె ఒంటరితనంతో బాధపడుతుంది. ఆమె తన భర్తను చంపలేదనే విషయాన్ని తన చుట్టూ ఉన్నవాళ్ళు గుర్తించడం లేకపోవడంతో neuropsychiatric సమస్యతో బాధపడుతుందని భావిస్తాడు. దాన్ని ఆమెను తన భర్త దెయ్యమై రాత్రి నిద్రలేకుండా వేధిస్తున్నాడని భ్రమపడుతుంది. అది తగ్గడానికి డాక్టర్ శశిభూషణ్ ఆమె కెమొమిల్లా మెడిసిన్ తీసుకొనేలా చేయగలుగుతాడు. వైద్యాన్ని ప్రేమతోను, స్నేహంతోను చేయాలి. అది ఆ డాక్టర్ కి తెలుసు. ఎంత ధనవంతురాలైనా నాలాయనీదేవి ఒంటరితనంతో బాధపడింది.తనవారెవరూ లేనంత ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో నాలాయనీదేవి పాత్ర సజీవ ఉదాహరణ. డాక్టర్ కి కూడా తన రక్తసంబంధీకులెవరూ లేరు. కానీ, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా తన బంధువులుగానే ప్రేమగా వైద్యం చేశాడు. ఆ ప్రేమ, ఆ మంచితనం, ఆ అర్థం చేసుకొనే మనస్తత్త్వమే తనకు వరమైంది. నాలాయనీదేవి తన భార్యగా మారింది. తనకొక కుటుంబం ఏర్పడింది. ఈ కథ వాస్తవికమైన జీవితాల్ని గమనించి రాసినట్లనిపిస్తుంది. ఇక, కెమొమిల్లా సంగతి చూద్దాం. ఇది ఒక హోమియో మందుపేరు. అది ఒక పువ్వునుండి తయారు చేస్తారు. దీని శాస్త్రీయ నామం Matricaria chamomilla L. సంక్షిప్తంగా ChamoMilla అనిపిలుస్తారు. దీన్ని తెలుగులో సీమ చామంతి అనొచ్చు. సాధారణంగా దీన్ని neuropsychiatric సమస్యలకు ఉపయోగిస్తారని హోమియో వైద్యశాస్త్రం వివరిస్తుంది.
డామిట్ కథ అడ్డం తిరిగింది (1968)
ఒక పాడుబడిన మేడ ఉంది. దాని చుట్టూ నాలుగు వృత్తులకు చెందిన వాళ్ళు నివసిస్తున్నారు. ముగ్గురికి పెళ్ళైనా, వాళ్ళకు భార్యలు లేరు. వాళ్ళు చనిపోయారు. నాల్గవవాడు ఒక విద్యార్థి. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. ఆ మేడనెవరో బాగు చేయించి, రంగులు వేయించారు. మేడలోకి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. చూడ్డానికి విధవలా ఉంది. ఆమె పొందాలనొకరు. భార్యగా చేసుకోవాలని మరొకరు. ఆమెను పెండ్లాడి ఆమెతోపాటు ఆ మేడను కూడా స్వంతం చేసుకోవాలని ఇంకొకరు రకరకాలుగా ఆలోచిస్తూ, ఆమెను ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటారు. దాన్ని గమనించిన ఆమె ఒకరికి తెలియకుండా మరొకరితో రకరకాల పనుల కోసం మాట్లాడుతుంది. ఆమెతో మాట్లాడిన వాళ్ళంతా తమని ఆమె కోరుకుంటోందనే భావం వచ్చేటట్లే చెప్తుంటారు.నాల్గవవాడు విద్యార్థితో కూడా మాట్లాడుతుంది. ఆమె ఏమి మాట్లాడిందో, ఆమె ఆ యువకుడితో మాట్లాడిన సాయంత్రానికే ఒక కారు రావడం, దానిలో నుండి హుందాగా ఒకరు దిగి మేడలోకి వెళ్ళడం కథ. ఒక పాడుబడిన ఇల్లు, దానిలో ఒక విధవ పాత్రను, ఆ ఇంటి చుట్టూ నలుగురు ఆమెపై మనసుపారేసుకోవడం…ఇవన్నీ గురజాడ వారి కన్యాశుల్కం నాటకంలో గిరీశం గారి విడో మ్యారేజ్ రిఫార్స్ కోసం పడుతున్న పాట్లులా స్పురిస్తాయి. సమాజంలో భర్త చనిపోయిన స్త్రీ ఒంటరిగా ఉందని తెలిస్తే, ఆమెను వెంటాడే గిరీశాలెంతమంది ఉంటారో రచయిత ఈ కథలో చూపించారు. ఈ కథాకథనం ఆ నలుగుర్నీ, వాళ్ళ ఆలోచనల్నీ, వాళ్ళ అంతరంగాల్నీ నేటి టీవీ సీరియల్స్ లో ఒక్కోపాత్రా ఒకదాని తర్వాత మరొకటి తన డైలాగ్ కోసం ఎదురు చూస్తూ చెప్తున్నట్లు భిన్నమైన శిల్పంతో కథనీకరించారు. వాళ్ళ మనస్తత్వాలు తెలియాలన్నా, సమాజంలో అలాంటి గిరీశాల్ని గుర్తించాలన్నా, చివరికి ఆ మేడలోకి కారులో వచ్చిందెవరో తెలియాలన్నా ఈకథ చదివి తీరాల్సిందే. ఆమె చుట్టూ తిరిగిన వాళ్ళలో భిన్నమైన వృత్తుల వార్ని పాత్రలుగా ఎన్నుకోవడంలోనే కథారచయిత కెంతో సామాజిక వాస్తవికతను ప్రదర్శించే వ్యూహం కనిపిస్తుంది. తాము చేసే పనితో సంబంధం లేకుండా, వయసుని కూడా పట్టించుకోకుండా వాళ్ళెలా ప్రవర్తిస్తుంటారో ఈ కథాకథనం ద్వారా చూపించగలిగారు.
మళ్ళీ చిగిర్చిన వసంతం (1968) కథ చదువుతుంటే ఒక సినిమా చూస్తున్నట్లే ఉంది. వస్తువు అవయవదానం, దాని వల్ల వచ్చే పరిణామాల్లో కొన్నింటిని వివరించడం. ప్రపంచంలో తొలిసారిగా గుండె మార్పిడి 1967లో జరిగినట్లు చరిత్ర చెబుతుంది. ఇప్పటికీ గుండెమార్పిడి ఆపరేషన్ కి సంబంధించి ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఒకరి గుండె మరొకరికి అమర్చడమనేది వైద్యశాస్త్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇటువంటి వస్తువుతో ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు కూడా వచ్చాయి. కానీ, 1968లోనే ఒక జీవన్మృతుడి గండెను తీసి మరొకరికి అమర్చినట్లు కథ రాయడమంటే సామాన్యమైన విషయం కాదు. ఆ మెడికల్ టెర్మినాలజీతో పాటు, ఆ గుండె మార్పిడి అనంతరం వచ్చే న్యాయపరమైన వివాదాలను కూడా వివరించాలంటే ఆ సృజనాత్మక రచయిత ఒక విధంగా చిన్న పరిశోధనే చేయాలి. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. అయినా గాని ఈ కథను రాయగలిగారంటే రచయిత ముదిగొండ వీరభద్రయ్య గారు ఎంత ప్రతిభామూర్తో స్పష్టమవుతోంది. ఈ కథలో తన భర్త కారు ఏక్సిడెంట్ లో జీవన్మృతుడవుతాడు. అంటే కొన్ని అవయవాలు కొంత సేపు పనిచేస్తాయి. కానీ, ఆ వ్యక్తి చనిపోయినట్లే పరిగణిస్తారు. ఇక్కడ జీవన్మృతుడంటే ఎవరో కొంత వివరణ అవసరం. పుట్టిన వానికి మరణం తప్పదు. మానవుడిగా జన్మంచిన ప్రతి వాడికీ మరణం తప్పదు. కానీ, నిత్యం తాను చనిపోతానేమో అనే మృత్యు భయంతో నిత్యం వణికిపోయేవాణ్ణి జీనన్మృతుడని అంటారనీ, మృత్యు భీతిని జయించిన వాణ్ణి జీవన్ముక్తుడు అనీ మన ఆధ్యాత్మిక వేత్తలు వివరిస్తుంటారు. 'మృత్యువు ‘చితి’ వంటిది. అది ఒక్కసారే దహిస్తుంది. మృత్యుభయం ‘చింత’ వంటిది. అది నిత్యం దహిస్తూనే ఉంటుంది. చివరకు మరణం తప్పదనే పరమ సత్యాన్ని జీర్ణించుకుంటూనే- దానికి సంబంధించిన చింతను, భయాన్ని మనిషి జయించాలి. అలా మృత్యుభయాన్ని జయించినవాణ్ని ‘మృత్యుంజయుడు’గా చెబుతారు. మృత్యువును జయించడమంటే, మృత్యుభయాన్ని జయించడమే. దాన్ని ‘ముక్తస్థితి’గా భావిస్తారు.ముక్తస్థితి- భారతీయతకు జీవనాడి. అది గొప్ప సంస్కార విశేషం' గా చెబుతారు. ఈ కథలో సుశీలకు పెండ్లయిన మూడు నెలలకే భర్త భాస్కరం కార్ యాక్సిడెంట్ జరగడం, గుండె మాత్రం జీవంతోనే ఉన్నా, దేహం మాత్రం చనిపోయింది. ఆ గుండెను హృద్రోగంతో బాధపడుతున్న రమాపతికి మార్చారు. కోర్టులో భాస్కరం బ్రతికుండగానే ఆతని గుండెను డాక్టర్ సంజీవరావు తీసేశాడని ప్రతివాది తరపు న్యాయవాది వాదించాడు. ఆ కోర్టు వాదనలు ఎంతో లాజికల్ గా రచయిత ప్రదర్శించారు. నిజానికి కొన్ని అవయవాలు పని చేస్తున్నా, అవి మెదడుతో కనెక్టివిటీని కోల్పోతాయి. ఆ పరిస్థితుల్లో మరలా ఆ మనిషిని సాధారణ స్థాయికి తీసుకొనిరాలేనప్పుడు దాన్ని లీగల్ డెత్ గా చెప్తారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివాటిని మరణాలుగా నిర్వచించడంలో డాక్టర్ల మధ్యనే నేటికీ ఏకాభిప్రాయం లేదు. దీన్ని రచయిత ఆ రోజుల్లోనే ఇలా సంభాషణాత్మకంగా వివరించారు.
''ఆ మర్నాడు డాక్టర్ సంజీవరావుని క్రాస్ ఎక్సామిన్ చేయడం తిరిగిమొదలయింది.
“భాస్కరం గుండెని తీసికోవడానికి అతని అనుమతిని మీరుతీసికొన్నారా?”
"లేదు.”
"ఎందుకు?" గర్జించి అడిగాడు ప్రాసిక్యూటర్.
"చచ్చినవాణ్ని ఎలా అనుమతి కోసం మాట్లాడించను" -
"అప్పటికే భాస్కరం చచ్చిపోయాడా?" జడ్జి గారడిగారు.
"మైలార్డ్! మృత్యువు కింకా నిర్వచనం పూర్తికాలేదు. మొన్ననే సిడ్నీలో ఇంటర్నేషనల్ ఫిజిషియన్స్ అంతా సమావేశమయి మృత్యువుని నిర్వచించడానికి ప్రయత్నం చేశారు." అన్నాడు డాక్టర్.
"పోతే మీరు చేసికొన్న నిర్వచనాన్ని బట్టి భాస్కరం మీ దగ్గరకు చచ్చిపోయాకే వచ్చాడంటారు?" ప్రాసిక్యూటర్ ఎంతో తెలివిగా అడిగాడు!
"అవును!" అన్నాడు డాక్టర్.''
ఈ సంభాషణ రాయాలంటే బ్రెయిన్ డెత్ గురించిన సమాచారాన్ని ఎంతో సేకరించాలి. దాన్ని మరలా సులభంగా కథలో భాగం చేయగలగాలి. ఆ నైపుణ్యం ఇక్కడ చక్కగా కనిపిస్తుంది.
ఈ సంభాషణలో ఒక కోస్తా రచయిత అయితే కొన్ని పదాల్ని మార్పు చేసి ప్రయోగించేవారనిపిస్తుంది.
''చచ్చిన'' పదానికి బదులు 'చనిపోయిన' అని ప్రయోగించేవారేమో.
అవయవమార్పిడి, అవయవదానం గురించి ఈ రచయితే గనక నేడు మళ్ళీ ఒక కథ రాస్తే, జరిగే మంచినీ, దాని పేరుతో చేసే కార్పోరేట్ మాయాజాలాన్ని, ఆ బీభత్సాన్నీ కళ్ళకు కట్టినట్లు వర్ణించేవారేమో.
కథలో ముగింపు మాత్రం చర్చనీయం. ఒకరి గుండెను మరెవరికో పెడితే, దాని వల్లనే ఆ గుండె గలవాని అలవాట్లన్నీ గుండె పెట్టిన వారికి వచ్చేస్తాయా అనేదొక ప్రధానమైన చర్చనీయాంశం.
సుశీలకు వివాహమైన మూడునెలలకే భర్త చనిపోతే,ఆమె మిగతా జీవితమంతా భర్తను మాత్రమే తలచుకొంటూ, ఆ వైధవ్యంతోనే రసహీనంగా బ్రతికవలసిందేనా!
దీనికి రచయిత సూచించిన లేదా ఇచ్చిన సమాధానమే బహుశా, తన భర్త భాస్కరం అలవాట్లే రమాపతిలోనూ ప్రతిఫలించాయని గమనించడం, చివరికి ఆమె ఇంటికే రమాపతి కాస్తా 'భాస్కరం'గానే వెళ్ళడం!
ఆ వెళ్ళడం కేవలం ఆమెను ఆ ఇంట్లో దింపి మరలా తన ఇంటికి వెళ్ళి పోవడానికేనా?
ముగింపుని పాఠకులే ఆలోచించుకునేలా ఒక సన్నని తెరని కట్టినట్లు కట్టి ఆపేశారు.
ఇది కథను ముగించడంలో పాటించే గొప్ప శిల్పం.
రచయిత ఆశించే దాంపత్య జీవనం, కుటుంబ వ్యవస్థ, మానసిక ప్రశాంతతలకు ఈ కథతో పాటు కెమొమిల్లా కథలోని ముగింపులు నిదర్శనాలుగా నిలుస్తాయనుకుంటున్నాను.
మూడు చక్రాల సైకిల్ (1970)
స్వచ్చమైన ప్రేమకు, నిజాయితీకి ఎప్పేడూ విలువ పెరుగుతుందే తప్ప, తరగదు. నిజమైన ప్రేమ క్షమా గుణాన్నే కలిగి ఉంటుంది. అన్నీ ఉన్నా, ద్వేషం, పగ, ప్రతీకారంతో రగిలిపోయే వాళ్ళ దగ్గర ఉండడం కష్టం. తనెంతో ప్రేమించిన భార్య సుశీల చనిపోతే, ఆ దు:ఖం నుండి సుధాకరం బయటపడ్డానికి, మరదలు సుజాత ఎంతో ప్రయత్నించింది. ఇద్దరి మధ్యా జీవితం గురించి కొన్ని తాత్త్విక సంభాషణలు జరుగుతాయి. అంతవరకు తన భార్యలేని లోకంలో కంటే, ఆమె తనతో జీవించిన క్షణాలతోనే సుధాకరం గడుపుతుండేవాడు. ఈ తాత్విక సంభాషణల తర్వాత తన మరదలు కన్నీరు పెట్టేసరికి, తన వల్ల మరొకరు బాధ పడ్డం తట్టుకోలేని సుధాకరం లౌకికప్రపంచంలోకి వస్తాడు. తన అక్క మరణం తర్వాత భావని మరలా మామూలు మనిషిని చెయ్యాలనుకుంది. బి.ఏ.పూర్తి చేసిన ఆమె తన బావ దగ్గరే ఉంటూ ఎం.ఏ చదువుకోవాలనే నెపంతో వచ్చింది. తాను అనుకున్నట్లే తన భావను మరలా లౌకికప్రపంచంలోకి తీసుకొని రాగలిగింది.ఎం.ఏ.కూడా పూర్తి చేసి లెక్చరర్ అయ్యింది. అంతే కాదు, అక్కలేని లోటుని తీరుస్తూ భార్యగా మారింది. కానీ, ఇద్దరిలోనూ ఒకరికొకరికి తెలియదనుకొనే ఒక రహస్యం మాత్రం అలాగే దాగి ఉంది.
తన బావకి పిల్లలు పుట్టారని సుజాతకు తెలుసు. అయినా దాన్ని తెలియనట్లే ఉంది. ఒకరోజు రహస్యాలు తెలియకుండా జీవించడంలో నిజమై స్వచ్చత ఉండదనుకొందేమో… ఆమె ఒక రహస్యం గురించి ప్రస్తావించే సరికి, సుధాకరంలో తాను దాచాననుకున్న రహస్యం బయటపడిపోతుందేమోనని ఆందోళ పడుతూనే, సుజాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వణికిపోతాడు. ఈ లోగా సుధాకరానికి ఓలేఖ వస్తుంది.దానితో పాటు జతచేసిన మరొక లేఖ కూడా ఉంటుంది. అది చదివిన తర్వాత ఆమెకు డిగ్రీలో క్లాసుమేటుగా ఉండి, ఆమెను ప్రేమించి, ఆ ప్రేమ దక్కకపోవడంతో అది ద్వేషంగా మారి ఉత్తరాలుగా, హింసగా మారిందని తెలుసుకున్నాడు.
సుధాకరం, సుజాతల జీవితాల్లోని రహస్యాలు ఇద్దరికీ తెలిసిపోయాయి. తమ ఇద్దరినీ నడిపించే రెండు చక్రాల్లాంటి పిల్లలు లేకపోయినా, వాళ్ళు సంతోషంగా జీవించగలరు.
ఎన్నో జీవన తాత్త్వికలోతులున్న కథలో సుజాత తన భావను లౌకిక ప్రపంచంలోకి తీసుకొని రావడానికి మాట్లాడిన మాటలు, నిజంగా ఆమె వయసుకి తగినవేనా అనిపిస్తుంది.అయితే కుటుంబాన్ని, ఈ లౌకిక ప్రపంచాన్నీ బాగా అవగాహన చేసుకోగలిగినప్పుడు ఆ అవగాహన సహజమే. సహజంగానే స్త్రీ పురుషులు ఇరువురిలోను పురుషుని వయసుకంటే స్త్రీ వయసు చిన్నదైనా, కొంతమందిలోని పరిపక్వత చూస్తే ఆశ్చర్యమేస్తుంది.చివరిలో ఒక సంభాషణ కన్నీళ్ళు పెట్టించింది. దాంపత్యంలోని పవిత్రతను, నిష్కళంకాన్నీ మనకు కన్నీళ్ళలోని స్వచ్చతలా బయటకు తన్నకొచ్చేలాచేసింది.
''అవును సుజా! జీవితంలో సుఖాన్ని పొందుదామని మీ అక్కని కష్టపెట్ట కూడదని శాశ్వతంగా నేనే నివారించుకొన్నాను, ఈ జన్మకి మన ప్రతిబింబాలు అద్దంలో తప్ప మరెక్కడా కన్పించవు సుజాతా!'
'బావా! ఇంత పసిమనస్సు వున్న నువ్వే నా కొడుకువి! ఇంత క్షమాహృదయమున్న నీవే నా తల్లివీ దండ్రివీ! ఇంతటి అనురాగ హృదయమున్న నువ్వే నాభర్తవి!''
ఈమాటలు చెప్పాలంటే వాళ్ళమధ్య ఎంతటి నిష్కల్మషత్వం ఉండాలి. మాకు పిల్లలు పుట్టనంత వరకు నేను, నా భార్య ఒకరికొకరం పిల్లనుకున్నాం. అలా చెప్తే ఎవరైనా నవ్వొచ్చు. కానీ, ఈ కథ చదివాక మాలాగే ఆలోచించేవాళ్ళుంటారనిపించింది.
ఇవి కథలుగా కనిపిస్తున్న జీవన సత్యాలు. మా సార్ లోని అతి సుకుమారమైన హృదయాన్ని తెలిపే కథలు. మా సార్ దాంపత్యానికిచ్చే జీవనవ్యాఖ్యానాలు. మనకే తెలియని మన జీవన సంఘర్షణలు మనకు తెలియాలంటే ఈ కథలు చదవాలి. జీవితంలో అసహనానికి, అశాంతికి, ఒంటరితనానికి కారణాలు తెలియాలంటే ఈ కథలు చాలావరకు ఉపయోగపడతాయి. కథని ఎలా రాయాలో, ఎంత బిగువుగా రాయాలో తెలియాలంటే ఈ కథలు కొన్ని నమూనాలుగా ఉపయోగపడతాయి. కథకు శీర్షిక పెట్టడం, ప్రారంభించడం, ముగించటం, ఆ శీర్షిక కథకు ఎలా సరిపోతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న వాళ్ళు కూడా ఈ కథల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని నిర్మాణ రహస్యాలు మనకి తెలుస్తాయి. ఈ కథలకు పెట్టి పేర్లు, సందర్భాన్ని బట్టి చేసిన వర్ణనలు, కథ ఎత్తుగడ, కథ నడిపించిన తీరుతెన్నులని వివరిస్తూ ప్రత్యేకించి ఒక పరిశోధన పత్రాన్నే రాసే అవకాశం ఉంది. మూడు చక్రాల సైకిల్ పేరుతో రాసిన కథ భార్యాభర్త ఒక చక్రంగాను, వాళ్ళను, వాళ్ళ వంశాన్నీ ముందుకు తీసుకొని వెళ్ళే పిల్లలను మిగతా రెండు చక్రాలుగాను పోల్చినది ఒక మంచి కథకు పెట్టిన టైటిల్. కథలో మూడు చక్రాలు విడిపోయి, ఒక చక్రం మాత్రమే పెట్టడానికి వీలవుతందని చెప్తడంలోని భావి కథాసూచనకు చక్కని ప్రతీక. ఇలా ప్రతి కథకు పెట్టిన టైటిల్స్ ఎంతో ఆలోచనాత్మకంగా ఉన్నాయి.
సృజనాత్మక రచయిత కథ, నవల రాసేటప్పుడు వాటి విలువ దానిలోని వస్తువునీ, దాని పూర్వాపరాల్ని సూక్ష్మంగా పరిశీలించి, ఒక అవగాహనకు రావాలి. ఆ పారిభాషిక పదాలను కథకు అనుకూలంగా సులభంగా చెప్పాలి. పారిభాషిక పదాన్ని చెప్తున్నట్లు కాకుండా సంభాషణలోనో, వర్ణనలోనో అంతర్భాగం చేయగలగాలి. అటువంటి పరిశీలన, సృజనశీలత ఈ రచయిత కథల్లో కనిపిస్తున్నాయి. ఒక డాక్టర్ కి సంబంధించిన కథ చెప్తున్నప్పుడు ఆ వైద్యశాస్త్రానికి సంబంధించిన పరిభాషను వాడ్డంలో సన్నివేశానికి అనుగుణంగా సహజంగా అమరిపోయేటట్లు చిత్రించారు. ప్రతికథానిర్మాణం ఎంతో పటిష్ఠంగా ఉంది. ఒక సంభాషణను గానీ, సన్నివేశాన్నిగానీ, ఒక పాత్రను గానీ, ఒక వర్ణనను గానీ చిన్నమార్పు చేయడానికి వీల్లేనంత పటిష్ఠంగా కొనసాగాయి.ముఖ్యంగా సందర్భోచిత వర్ణనలు కథలకు ప్రాణాన్నిస్తున్నాయి. ఈ కథలు ప్రచురించిన పత్రికల్లో ఎలా అచ్చయ్యయో అలాగే యథాతధంగా ప్రచురిస్తున్నారు. నేటి భాషకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చెయ్యలేదు. కొన్ని సరళ గ్రాంథికాన్ని కొసాగించిన కొన్ని క్రియా పదాలురచయిత శైలిని ప్రత్యేకంగా గుర్తించేలా చేస్తాయి. ఆయన మాకు పాఠం చెప్తున్నప్పుడు కూడా ఆయన అలాగే మాట్లాడ్డాన్ని గుర్తుకు తెచ్చి ఒక ఆత్మీయ స్పర్శినిస్తాయి. ఆయనతో సంభాషించిన వారికీ ఆయన భాషలోని స్వంతదనంలోని మాధుర్యాన్ని అందిస్తుంది. ఈ కథలు చదివడం ద్వారా ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారు కథలు, నవలలు రాయడాన్ని అలాగే కొనసాగించి ఉంటే, తెలుగు కల్పనా సాహిత్యంలో గట్టి ముద్రే వేసుండేవారనిపిస్తుంది. అయినా, లభించిన ఈ కథల ద్వారా కూడా కథ రాయడంలోని బిగువవూ, ప్రారంభం, ముగింపులతో పాటు కథకవసరమయ్యే వర్ణనల్నీ, చదివించే ఉత్సుతనీ, కథ పూర్తయ్యాక కూడా వెంటాడే దృశ్యాల్నీ, వినిపించే సంభాషణల్నీ పాఠకులు మర్చిపోలేరు. వీటన్నింటితో పాటు కథ రాయడం వెనుక సృజనాత్మక రచయిత ఆ వస్తువుకి సంబంధించిన వివిధ విషయాలను సహజంగా కథలో అమరిపోవడానికీ ఆ నేటివిటీ కోసం కథ వెనుక కనబడని కథ చాలా ఉంటుందని తెలుస్తుంది.
మా గురువుగారి కథలపై ఒక అభిప్రాయం రాయడానికి అవకాశం కలిగించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
--0--
(మూసీ మాసపత్రిక, ఆగస్టు -2023 సౌజన్యంతో)
….




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి