మా గురువుగారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు ఇటీవల వెలువరించిన మానస సరోవరంలో స్వర్ణ హంస_* దీర్ఘకావ్యం *_కేమోమిల్లా_* కథల సంపుటి అనే రెండు పుస్తకాలను ఈరోజు (27.7.2023) మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.జె.రావు గారికి అందిస్తున్న దృశ్యం....*ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు*, తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
.......
ఈ రెండు పుస్తకాలలో ఒక పుస్తకం కెమోమిల్లా కథల సంపుటికి నేను అభిప్రాయం రాయడం నా జీవితంలో మరిచిపోలేని ఒక గొప్ప అనుభూతి.
ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారు అనగానే ఆయన గొప్ప విమర్శకుడిగా, వీణావాదనలో గొప్ప సంగీత విద్వాంసుడిగా చాలామందికి తెలుసు. కానీ ఆయన కథలు రాశారనీ, ఆ కథలు ఎంతో పటిష్టమైన శిల్ప నిర్మాణంతోను, వస్తు వైవిధ్యంతో ఉన్నాయని బహుశా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అనుకుంటాను. ఆ కథలు చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత గొప్ప కథా రచయిత, తర్వాత కాలంలో మరలా కథలు ఎందుకు రాయలేదనిపించింది. ఈ కథలు మీరూ చదవండి. ఖచ్చితంగా ఆ కథల్లో ఉన్న గొప్పతనం ఏంటో మీకూ తెలుస్తుంది.
నేను ఆ పుస్తకానికి రాసిన అభిప్రాయం ఇక్కడ విడిగా ప్రత్యేకంగా తర్వాత పోస్ట్ చేస్తాను.
....
రెండవ పుస్తకం 'మానస సరోవరంలో స్వర్ణ హంస' అనే దీర్ఘ కావ్యం.... కవిత్వం చదివేవాళ్ళు, కవిత్వం రాసేవాళ్లు, కవిత్వాన్ని బోధించేవాళ్లు తప్పనిసరిగా చదవవలసిన ఒక పుస్తకం. ఈ కావ్యానికి 'ప్రవేశ ద్వారం' పేరుతో ఆచార్య కె. యాదగిరిగారు రాసిన ముందుమాట ఈ కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి నిజంగానే ఒక ప్రవేశద్వారం. '' ఇది ఒక అద్భుతమైన విలక్షణమైన సృజన. కవిత్వ ప్రక్రియ (ప్రాసెసర్ పోయెట్రీ)లో మూలభూతమైన శాస్త్రాంశాలను కవిత్వీకరించిన ఆధునిక కావ్యం... శబ్దం పుట్టుక నుండి అది కవిత్వంగా ఆవిర్భవించేంతవరకు ఉండే వివిధ దశలను కవితాత్మకంగా వెల్లడించింది. శూన్యంలో నుండి మొదలైన శబ్దం కవి హృదయమనే ప్రయోగశాలలో రసాయన ప్రక్రియ జరిగి కవిత్వంగా ఎలా అవతరిస్తుందో ఎలా రూపాంతరం చెందుతుందో ఈ కావ్యం ద్వారా తెలుసుకోవచ్చ''ని ఆచార్య కె.యాదగిరిగారు ఈ కావ్య స్వభావాన్ని పరిచయం చేశారు.
ఈ కావ్యంలో కవి ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు చెప్పిన ఒక చిన్న ఖండికను పరిచయం చేస్తాను.
''తినకుండానే మామిడి పండు రుచిని
తెలిపేది ఎట్లా? తినినంత తృప్తి కలిగించేది ఎట్లా?
తెలుప గలుగుతారా అసలు?!
చెట్టు కొమ్మ నుంచి కిందకు పడిపోయిన పండే కావచ్చు
కాని అదే భూమ్యాకర్షణ సిద్ధాంతానికి
ఆ తరువాత పలాయన వేగ సిద్ధాంతానికి మూలమై అంతరిక్ష గ్రహ యానాలకు మనుష్యులను
పంపేటందుకు వీలు కలిగించినట్లు
అనిర్వర్ణ్యం అనుకొన్న విషయమే
కవి గుండెల్లో మగ్గి మగ్గి అక్కడ
చచ్చిన శబ్దాలకు సైతం ప్రాణం పోసి
కొత్త కొత్త రుచులతో
శిశిరానంతర వసంతంలో లాగా
మోడుల్లోంచి చిగుళ్ళు వేసికొన్నట్లు
పునర్జన్మ పొందుతున్నవి
అదే - ఇదే అభివ్యక్తి, కవిత్వాభివ్యక్తి
బొమికలలాంటి నిర్జీవ శబ్దాలకు
ప్రాణం పోసి మరలా జన్మనిచ్చే
మహత్కకళ కవికి మాత్రమే తెలిసిన విద్య
కానీ, తనకు తెలుసునన్న విషయం తెలియని
అమాయక చక్రవర్తి కవి!!!'' (పుటః 21)
కవి లోకంలో చూసిన ఒక దృశ్యం తన హృదయంలో కవిత్వం గా మారి పోయిటిక్ ప్రోసెసింగ్ ఎలా జరుగుతుందో ఈ ఖండికల్లో ఎంతో స్పష్టంగా వర్ణించారు కవి ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారు.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి