"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

10 జూన్, 2023

ఆచార్య రవ్వా శ్రీహరిగారి వ్యక్తిత్వం - బోధనా రీతులు ( మూసి మాసపత్రిక, జూన్, 2023)

 ఆచార్య రవ్వా శ్రీహరిగారి వ్యక్తిత్వం - బోధనా రీతులు

                                                                                                                                                -ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

అధ్యక్షులు, తెలుగుశాఖ,

యూనివర్సిటి ఆఫ్‌ హైదరాబాద్‌,  (సెంట్రల్‌ యూనివర్సిటి),

 హైదరాబాద్‌. ఫోన్‌ : 9182685231












పురాణమిత్యేవ న సాధు సర్వమ్‌

న చాపి కావ్యమ్‌ నవమిత్యవద్యమ్‌

సంతః పరీక్ష్యాన్యతరత్‌ భజంతే

మూఢః పర ప్రత్యయనేయ బుద్ధిః’’ ఈ శ్లోకం మహాకవి కాళిదాసు రచించిన ‘మాళవికాగ్నిమిత్రమ్‌’ నాటకంలోనిది. కావ్యం ప్రాచీనమైనదైతే చాలు స్వీకరించదగిందే అని అనుకోనవసరం లేదు. ఇదేదో కొత్త కావ్యం. కాబట్టి దీన్ని తిరస్కరించాలనుకోవడమో, స్వీకరించేయాలనుకోవడమో కూడా సరైందికాదు. తెలివైన వాళ్ళెప్పుడూ దేన్నైనా సరే దానిలోని గుణ, దోషాలను  పరీక్షించి దాన్ని అభిమానిస్తారు. విచక్షణతో ఆలోచించలేని మూఢులు మాత్రమే ఇతరులు ఏది చెబితే దాన్నే ప్రమాణంగా నమ్మేస్తుంటారనే భావం గల ఈ శ్లోకం గుర్తొచ్చినప్పుడల్లా మాకు సంస్కృతం బోధించిన మా గురువుగారు ఆచార్య రవ్వాశ్రీహరిగారు గుర్తొస్తుంటారు. సంస్కృతాన్ని కూడా చాలామంది అలాగే స్వీయ బుద్ధితో కాకుండా, ఇతరుల బుద్ధితో ఆలోచిస్తూ వ్యతిరేకిస్తుంటారు. అది సరైనది కాదని ఆయన తరచుగా చెప్పేవారు.  సంస్కృతానకీ మహాకవి కాళిదాసుకీ ఎంతటి అవినాభావ సంబంధం ఉందో సంస్కృతం మాట వినగానే మాకు పాఠం చెప్పిన ఆచార్య రవ్వాశ్రీహరిగారితోనూ నాకు అంత అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది.

          సెంట్రల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌, తెలుగు శాఖలో ఆచార్య రవ్వా శ్రీహరి గారు అధ్యాపకులుగా పనిచేసేటప్పుడు ఎం.ఏ.తెలుగులో నేను కూడా ఒక విద్యార్థిగా చేరాను. ఆయన మాకు సంస్కృతాన్ని బోధించేవారు. ఆయన  ఒక అధ్యాపకుడిగా, ఒక శాఖ అధ్యక్షుడిగా  ఉండగా నేను దగ్గరుండి గమనించే అవకాశం కలిగింది. నేను అక్కడే పరిశోధన చేసి మరలా అదే శాఖలో అధ్యాపకుడిగా చేరేనాటికి ఆయన ద్రావిడ విశ్వవిద్యాలయంలో  వైస్‌ ఛాన్సలర్‌ గా పనిచేసి, మరలా తిరిగి మా యూనివర్సిటీ తెలుగు శాఖలో చేరి పదవి విరమణ చేశారు. ఆ విధంగా ఆయనతో పాటు కొద్ది నెలల పాటు కలిసి పని చేసిన అనుభవం కూడా నాకు లభించడం ఒక అదృష్టం. ఈ సమయంలో నేను గమనించిన ఆచార్య రవ్వా శ్రీహరి గారి వ్యక్తిత్వాన్నీ, బోధనా పద్ధతులను కొన్నింటిని ఈ వ్యాసంలో తెలియజేయాలని అనుకుంటున్నాను.

శ్రీహరిగారి బాహ్యస్వ రూపం:

         ఆచార్య రవ్వా శ్రీహరిగారు చామనచాయ గల దేహంతో సుమారు ఐదున్నర అడుగుల పొడుగున ఉండేవారు.. అటు బక్కపలుస అని గానీ లావు అని గానీ చెప్పలేని మధ్య రకంగా ఉంటారు. ఎప్పుడూ పెద్దగా జుత్తు పెరగనివ్వకుండా కత్తిరింపు వేయించుకొని నున్నగా తలదువ్వుకొని ఉండే కోలముఖం. నేను ఆయనను ఏనాడూ  మాసిపోయిన, పెరిగిపోయిన గడ్డంతో చూడలేదు. ఆయనది చిలుకలాంటి ముక్కు. ఎప్పుడూ తెల్లని లేదా రంగులు, గీతాలు లేని ప్లెయిన్‌ చొక్కానే ఆయన ఎప్పుడూ ధరించేవారనుకుంటాను. నేనెప్పుడు చూసినా అలాంటి దుస్తుల్లోనే కనిపించేవారు. హాఫ్‌ హేండ్స్‌ చొక్కాలే ఆయన ఎక్కువగా ఇష్టపడేవారనుకుంటాను. వాటినే ధరించేవారు. ప్యాంటు వేసుకున్నా, ఇన్‌ షర్ట్‌ చేసుకోవడం నేను చూడలేదు. చివరి దశలో ఆయన పంచె కట్టుకొని, పైన లాల్చీలాంటి తెల్లచొక్కా, తెల్లని పంచెనీ ధరించేవారు.  ప్రసన్నమైన చూపుతో చిరునవ్వుతో పలకరించేవారు. కానీ, తక్కువగా మాట్లాడేవారు. ఆయనకు 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రచురించిన ‘శ్రీహరివిజయం’ అభినందన సంచికలో  కవిదోరవేటి గారు ఆచార్య శ్రీహరిగారి గురించి కొన్ని పద్యాలు వర్ణించారు. ఒక పద్యంలోఇలా వర్ణించారు.

                ‘‘మితమగు మాటలాడుటనమేయ సహిష్ణుత జూపగల్గుటన్‌

                హితము సత్యము గోరుట, మహారుహమట్టుల మేలుసేయు సం

                స్కృతి తన జీవలక్షణము జేసుక బాసిలుచున్న శ్రీహరి

                స్థిత గుణరూపుడంచు నిక చేతులనెత్తి నమస్కరించెదన్‌’’ కవి వర్ణించినట్లు ఆయనెప్పుడూ ఎంతో మితంగా మాట్లాడ్డమే కాకుండా, సత్యాన్నే మాట్లాడేవారు. అది కొంతమందికి నచ్చేదికాదు.

                శ్రీహరిగారు మాట్లాడుతుంటే తెలంగాణ తెలుగు భాషా సౌందర్యం గుభాళించేది. ఆయన మాట్లాడుతుంటే కొన్ని పదాలు పలికేటప్పుడు  మొదట్లో నాకు ‘’ఈయనేంటిలా గ్రంథాల్లో ఉన్న భాషను చదువుతున్నట్లు మాట్లాడుతున్నార’’నిపించేది. పదాలను కలిపి మట్లాడేవారుకాదు! మాట్లాడేటప్పుడు కూడా వ్యాకరణ నియమాల్ని తు.చ. పాటిస్తూ మాట్లాడుతున్నారనిపించేది. అవన్నీ తెలియాలంటే ఆయన రాసిన ‘వాడుక తెలుగులో అపప్రయోగాలు (1995), తెలంగాణ మాండలికాలు-కావ్య ప్రయోగాలు (1988) గ్రంథాలు చూడాలి. ఆయన పాఠం చెప్పేటప్పుడు తప్పనిసరిగా చేతిలో ఒకటి రెండు పుస్తకాలతోనే తరగతి గదిలోకి వచ్చేవారు. శ్లోకాలను చదివి, వాటిని తన మాటల్లోనే వివరిస్తున్నా, ఆయన్ని చూడకుండా ఆ మాటలు వింటే మాత్రవ,ఆయన పుస్తకం చదువుతున్నారనే అనుకుంటాం. ఆయనతో మామూలుగా మాట్లాడుతున్నా, ప్రతి వాక్యంలో, ప్రతి పాదంలో, ప్రతి అక్షరంలో చక్కని ఉచ్ఛారణ ప్రతిధ్వనించేది. తెలుగు భాషకు ఉన్న మాధుర్యమంతా ఆయన మాటల్లోనే వినిపిస్తున్నట్లుండేది!

                కాళిదాసు రఘువంశంలో (6-67)  ఇందుమతీ స్వయంవర సభ సందర్భంగా రాజుల ముఖాలను వర్ణించిన ఘట్టం కాళిదాసు   ఉపమను శాశ్వతంగా ముద్రవేసేలా వర్ణించిన విధానాన్ని ఆయన చెప్పిన తీరు నేనెప్పటికీ మర్చిపోలేను. అంతటి వ్యాకరణ వేత్త కూడా కాళిదాసు కవిత్వానికి మురిసిపోయాడనిపిస్తుంది. దాన్ని అద్భుతంగా చెప్పేవారు.

‘‘సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ

యం యం వ్యతీయాయ పతింవరా సా

నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే

వివర్ణ భావం స స భూమిపాలః

ఇందుమతి స్వయంవర సభకు అనేకమంది యువరాజులు వచ్చారు. ఆమె తమనే వరిస్తుందని ఎదురు చూస్తూ మహాఠీవిగా కూర్చున్నారు. ఆమె పూలదండతీసుకొని ఒక్కొక్కరాజుదగ్గరకు వస్తుంది. ఆమె నడిచి వస్తున్న దీపశిఖలా ఎంతో సౌందర్యంతో మెరిసిపోతుంది. దానితోపాటు ఆమె తననే వరిస్తుందని వాళ్ళ ముఖాలు కూడా ఆ వెలుగుకి తోడై మరింతగా ప్రకాశిస్తున్నాయి. కానీ, ఆమె ఆ యువరాజుని కాదని, మరొక యువరాజువైపు నడిచి వెళ్ళిపోగానే, ఒక్కొక్క యువరాజు ముఖం కాంతిహీనమైపోతుంది. రాత్రి సమయంలో సంచరించు దీపపు శిఖ వలె రాజుల వరుసలో వరుని వరించాల్సిన ఇందుమతి యే యే రాజులను వదలి వెళ్ళిపోతుందో ఆ రాజుల ముఖాలు  దీపపుశిఖ వెళ్ళిపోయిన తరువాత రాజమార్గంలో భవనాలు వెలవెల బోయినట్లు కాంతివిహీనాలైనాయి’ అని ఆ శ్లోకంలోని భావాన్ని మాత్రమే చెప్పి ఊరుకొనేవారు కాదు.

                దీన్ని వ్యాఖ్యానిస్తూ ఆచార్య శ్రీహరిగారు, ఆరోజుల్లో గొప్పవాళ్ళ పెండ్లిండ్లకు రాత్రులు కొంతమంది దీపాల్ని నెత్తిమీద పెట్టుకొని దీపాల్లా నడిచేవారు. అలాగే, ఆ కాలంలో భటులు దివిటీలు తీసుకొని నడుస్తూ వెళుతుంటే, ఆ కాంతి రాజభవనాల మీద పడేది. దానితో ఆ భవనం మరింతగా మెరుస్తుంది కదా. దివిటీ వెళ్ళిపోగానే మరలా భవనాలన్నీ వెలవెలబోతాయి. రాజుల ముఖాలను భవంతులతోను, ఇందుమతిని దీపపుశిఖగాను పోల్చి చెప్పడం  కాళిదాసులో ఉన్న గొప్ప భావుకత. అది మహాకవి కాళిదాసు ఉపమ అలంకారానికి నిదర్శనం అనేవారు. అందుకనే కాళిదాసుకవికి ‘‘దీపశిఖా కాళిదాసు’’ అనేపేరు వచ్చిందని వివరించేవారు.

                ఎం.ఏ. చదివే ఆ వయసులో ఎవరైనా అమ్మాయి మా వైపు చూస్తూ నవ్వుతూ వస్తుంటే మా ముఖాలు కూడా అలాగే వెలిగిపోయేవి. కానీ, మా నుండి దాటుకొని, మమ్మల్ని కాదని వెళ్ళిపోగానే మా ముఖాలు కూడా అలాగే మాడిపోయేవి కదా అనిపించేది మా మనసుల్లో.

                మాకు కాళిదాసు రచించిన ‘మేఘసందేశం’ కూడా శ్రీహరిగారే చెప్పారు.  ఈ క్రింది శ్లోకాన్ని చెప్పేటప్పుడు ఆషాడమాసంలో వచ్చే తొలి వర్షం చినుకులు పడగానే భూమి ఎలాంటి సువాసనలు వెదజల్లుతుందో నిజంగా ఆ వాసన మేముకూడా ఆస్వాదించాలన్నట్లు వర్ణించేవారు.

‘‘తస్మిన్నద్రౌ కతిచిదబలావిప్రయుక్తః స కామీ

నీత్వా మాసాన్‌ కనకవలయభ్రంశరిక్తప్రకోష్ఠః

ఆషాఢస్య ప్రథమదివసే మేఘమాశ్లిష్టసానుం

వప్రక్రీడాపరిణతగజప్రేక్షణీయం దదర్శ ’’

                కామార్తుడైన ఆ యక్షుడు భార్యావియోగియై ఆ కొండపై కొన్ని మాసాలు గడిపాడు. బక్కచిక్కాడు. అతడి చేతి మణికట్టుపై ఇప్పుడు కంకణం లేదు. వదులై ఎక్కడో పడిపోయింది. ఇంతలో ఆషాఢం వచ్చింది. అది ఆషాఢపు తొలిరోజులు.  అతడు ఆ పర్వతసానువును ఆవరించిన ఒక మేఘాన్ని చూసాడు. కొండను పెళ్ళగించి ఎత్తివేసే ఆటలో ఉన్న ఏనుగులా ఉన్నది ఆ మేఘము’ అనేది దీని భావం.

                దీన్ని వివరించేటప్పుడు మా గురువుగారు ఆచార్య శ్రీహరిగారు ఎంతో లోకజ్ఞతను ప్రదర్శించేవారు. తన భార్యకు దూరంగా          ఉండడం వల్ల యక్షుడు ఎలా సన్నబడిపోయాడో చెప్పడానికి, తన దగ్గర ఉన్న కంకణాలు సన్నమైపోయాయనడంలోని కాళిదాసు ఊహను చూచినారా? అనేవారు. ఆ బంగారు కడియాలు సన్నం కావడమంటే తన చేతులు బాగా చిక్కిపోయాయని ధ్వన్యాత్మకంగా చెప్తున్నాడు కవి అనేవారు. ఆ ఏనుగు మధజలాన్నీ, ఆ ఆషాడం తొలిరోజుల్లో వర్షం కురిస్తే భూమిమీద వచ్చే సువాసనల్నీ  ఎంతో  బాగా అనుభవించి చెప్తున్నారనిపించేది. వర్షం వచ్చినప్పుడల్లా భూమి అలాంటి పరిమళాల్ని కూడా అందిస్తుందేమోనని వాసన చూడ్డం నా వంతయ్యింది. కానీ, అది ఆషాడ మాసం తొలిరోజుల్లో వచ్చే తొలకరి జల్లులకు మాత్రమే ఆ పరిమళం వస్తుంది. అప్పటికి ఎండాకాలంలో భూమి బాగా ఎండిపోయి, నెర్రలు తీసి ఉంటుంది. చినుకులు పడేసరికి ఆ తొలిచినుకులు మంచి వాసనలను వెదజల్లుతుంది. ఇదంతా ఆయన పాఠం చెప్పేటప్పుడు ప్రదర్శించిన ఆత్మీయమైన ముద్రవేసేటట్లు పాఠం చెప్పేవారనడానికి మాకు గుర్తున్న దృశ్య చిత్రణకు నిదర్శనం.

శ్రీహరిగారి వ్యక్తిత్వం:

        ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు వివరించేటప్పుడు భిన్న దృక్పథాలలో ఆ వ్యక్తిత్వం వెలువడే అవకాశం ఉంది. మా గురువుగారు శ్రీహరిగారు విద్యార్థులతో కలిసి మెలిసి ఉన్నా, తమ తమ పరిధులను గుర్తెరిగి ఎవరికి వారు ప్రవర్తించాలన్నట్లే ఉండేవారు. విద్యార్థులను గౌరవంగా సంబోధిస్తూ మాట్లాడేవారు. ఉదా:‘’అందరూ ఇంటర్నల్‌ పరీక్షలు రాసినారా?’’

                పాఠం చెబుతున్నప్పుడు విద్యార్థులకు ఏదైనా సందేహం వచ్చి అడిగితే మధ్యలో పాఠం పూర్తికాదంటూ, చివరిలో చెప్తానని అనేవారు. కానీ, తానే మళ్ళీ పాఠం చెప్తూనే మధ్యలో ఆ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేసేవారు. ఆయన పాఠాన్ని  చెప్పినంత సరళంగా, విద్యార్థుల సందేహాలకు సమాధానాలు వివరించడానికి మాత్రం ఇష్టపడేవారు కాదు. మరలా తరగతి గదిలో పాఠం చెబుతూ ఇంతకు ముందు ఎప్పుడన్నా ప్రశ్న అడిగిన విద్యార్థి వైపు చూస్తూ అర్థమయ్యిందా? అన్నట్లు చూసేవారు. తరగతి గదిలో కాకుండా, అదే వ్యక్తిగతంగా అడిగితే ఎంతో వివరంగా చెప్పేవారు. ఆయన మాట్లాడేటప్పుడు క్రియాపదాలు ఇలా ఉండేవి. ఉదా: వచ్చినాం, వెళ్ళినాం, ప్రారంభించినారు. చేసినారు, రాసినారు, తెచ్చినారు.

    ఆచార్య శ్రీహరిగారు సిటీ నుండి ప్రతి రోజూ యూనివర్సిటీకి వచ్చి వెళుతుండే వారు. ఏపియస్‌ ఆర్టీసీ బస్సులో గానీ, మా యూనివర్సిటీ బస్సుల్లో గాని వచ్చి వెళుతుండేవారు. ఇలా బస్సులో రావడం, వెళ్ళడం చాలా మంది చేసే పనే. కానీ, గురువుగారు ఒక బ్యాగ్‌ పట్టుకొని, దానిలో కొన్ని పుస్తకాలు, మరికొన్ని చార్ట్‌ ముక్కలు వేసుకొని, బస్సు ఎక్కగానే తన పనిలో తాను నిమగ్నమైపోయేవారు. అప్పుడప్పుడూ మేము కూడా సిటీకి వెళ్ళడానికి అదే బస్సు ఎక్కడం వల్ల  ఇవన్నీ గమనిస్తుండేవాళ్ళం. మేము ఎం.ఏ. చదివేటప్పుడు (1995-97)  చాలా తక్కువ సంఖ్యలోనే బస్సు సర్వీసులు ఉండేవి. యూనివర్సిటీ వారు కొన్ని ప్రత్యేక బస్సులు వేసి ఉదయం, సాయంత్రం అబిడ్స్‌ లో ఉన్న గోల్డెన్‌ త్రెషోల్డ్‌ (జి.టి) వరకు తిప్పేవారు. అవి దొరక్కపోతే ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్ళిరావాలి. అందువల్ల మేం కూడా వాళ్ళు ఎక్కిన బస్సులోనే ఎక్కవలసి వచ్చేది. ఆయన పుస్తకంలోని కొన్ని పదాలను తన దగ్గర ఉన్న చార్ట్స్‌ మీద రాసుకోవడం తప్ప, ఎవరినీ పట్టించుకొనేవారుకాదు. బస్సు యూనివర్సిటీ దగ్గర ఎక్కేటప్పుడు కొంచెం ఖాళీగానే ఉండేది. ఒకవేళ లేకపోయినా ఆయన బస్సు ఎక్కినప్పుడు ఆయన్ని చూడగానే ఎవరొకరు లేచి తమ సీటు ఇచ్చేవారు. అలా మా యూనివర్సిటీ విద్యార్థులు మాత్రమే కాదు, ఆయనెవరో తెలియని వాళ్ళు కూడా ఆయన రూపాన్ని చూసి లేచి నిలబడేవారు. ‘’నేను నిలబడతాను. మీరు సీటు సంపాదించినారు కదా. మీరు కూర్చొనుటే న్యాయము’’ అనేమాట పూర్తి కాకుండానే ఆ వ్యక్తి సీటు చూపిస్తూ బయటకొచ్చేయడం, ఏదో మొహమాటం పడుతూనే ఆయన సీటుపై కూర్చోవడం ఏకకాలంలో జరిగిపోయేవి. మేము మాత్రం ఇవన్నీ గమనిస్తూనే బస్సు వెనుక సీటులో కూర్చోనో, నిలబడో సరదాగా మాట్లాడుకొనేవాళ్ళం.

                శ్రీహరిగారు రేడియోలో సంస్కృతపాఠాలు చెప్పేవారు. మాక్లాసుమేట్స్‌ కొంతమంది ఆ రికార్డింగ్‌ చేసేటప్పుడు విద్యార్థులుగా వెళ్ళేవారు. ఆ పాఠం ప్రసారమయ్యేటప్పుడు ఆ రేడియోలో మా గురువుగారు పాఠాలు చెప్తున్నారని మావాళ్ళతో ఎంతో సంబరంగా చెప్పుకునేవాణ్ణి. ఆ ఆకాశవాణిలో నేటికీ ఆయన గొంతు ఆ పాఠాల్లో అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది.

                శిష్టా క్రియా కస్యచదాత్మసంస్థా

                సంక్రాంతి రన్యస్య విశేషయుక్తా

                యస్యోభయం సాధు సశిక్షకాణాం

                ధురి ప్రతిష్ఠాపయితవ్య ఏవ’’ అని మహాకవి కాళిదాసు మాళివికాగ్నిమిత్రమ్‌ నాటకంలో చెప్తారు. కొంతమందిలో పాండిత్యం పుష్కలంగా ఉంటుంది. ఇంకొంతమందిలో విషయాన్ని ఆవిష్కరించే శక్తి విశేషంగా కనిపిస్తుంది. ఎవరిలో ఈ రెండు లక్షణాలూ ఉంటాయో అతడు అధ్యాపకుల్లో అగ్రస్థానంలో నిలవదగ్గవాడవుతాడని ఈ శ్లోకానికి ఉన్న భావం. ఇది ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఉదాహరించి, వ్యాఖ్యానించిన మాట. ఈ మాటతోనే నేనూ ఏకీభవిస్తూ, మా గురువుగారు ఆచార్య రవ్వాశ్రీహరిగారు మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారు మాత్రమే కాకుండా, విషయాన్ని శక్తివంతంగా బోధించి, విద్యార్థుల్లో శాశ్వతమైన ముద్రవేయగల ఆచార్యులని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

***

(మూసి మాసపత్రిక, సంపుటి- 26:సంచిక-28, జూన్, 2023, పుటలు: 25-27,  UGC Care Listed Journal, ISSN: 2457-0796  వారి సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు: