స్వచ్ఛమైన అమాయకత్వం... ఆత్మగౌరవంరెండు చక్రాలై నడిచిన ఆత్మకథ!
ఆత్మకథలను రాయడం సమాజంలోని కొంతమందికి మాత్రమే పరిమితమనే భావనను పూర్వపక్షం చేస్తూ, ఆత్మగౌరవ కేతనమెగురవేయడానికి, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన విజయ శిఖరాలను చేరడానికి సాగించిన ప్రయాణాన్ని అక్షరబద్ధం చేయడానికి పూనుకోవడమంటేనే సాహసంగా భావించాలి.. అలాంటి సాహసోపేతమైన బృహత్ కార్యాన్ని చేయబూని ఆ ఆత్మకథను వారానికో భాగంగా మన భూమిపుత్ర దినపత్రిక బుధవారం సాహిత్యం పేజీని సుసంపన్నం చేసినందుకు వారికి ధన్యవాదములు.
దాదాపు ఇరువయి అయిదు వారాలుగా మన భూమిపుత్ర దినపత్రికలో క్రమం తప్పకుండా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారి ఆత్మకథ ప్రచురించిన సంగతి పాఠకలోకానికి అందరికీ తెలిసిందే. ఆ ఆత్మకథను పుస్తకంగా తీసుకొస్తున్నాననీ, దానికి ముందుమాట రాయాలని ఆచార్య దార్లవారు నన్నడిగినపుడు కాస్త తటపటాయించాను. సుదీర్ఘంగా ఆలోచించిన తరువాత ఆచార్యుల వారి ఆత్మకథకు ఒక పత్రికా సంపాదకుడిగా, అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా నా ముందుమాట ఉండటం నాకెంతో గర్వకారణమని భావించి నాలుగు మాటలు రాయడానికి చిన్న ప్రయత్నం చేశాను.
గుండెల నిండా అవమానపు ముల్లులెన్ని గుచ్చుకుంటున్నా, ఆ ముళ్ళనే పూలదారులుగా మార్చుకుని గమ్యాన్ని చేరుకున్న యోధుడిగా ఈ ఆత్మకథ ప్రస్తావనతోనే మనకు అర్థమయిపోతుంది. బాల్యదశలోనే వివక్షపు కోరలలో బందీ అయినా బాబాసాహెబ్ ఇచ్చిన భరోసాతో తన మనోఫలకంపై స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పయనం సాగించాలర తేటతెల్లమవుతుంది. నాటిరోజులలో చదువుకునే పరిస్థితి పక్కన పెడితే, పూటకింత తిండి దొరకడమే గగనమనీ,ఆ తిండి కోసమే అహోరాత్రులు శ్రమించాల్సి వచ్చేదని చెప్పడం చూస్తే గడచిన రోజులు ఎంతటి దీనావస్థలో ఉండేవే అర్థమవుతుంది.
దళితులను చూసి దెయ్యాలే భయపడేవని చెప్పిన ఘటనలో ప్రాణమున్న మనుషులు అంటరాని తనంతో కొట్టుమిట్టాడుతుంటే ప్రాణంలేని ఆత్మలు దెయ్యాలైన తరువాత దళితుల ధైర్యసాహసాలు చూసి జడుసుకనేవని చెప్పిన తీరు నాటి వాస్తవ స్థితికి అద్దం పడుతోంది.
తానొచ్చిన తోవ మరువకుండా తన గ్రామంపై మమకారాన్ని ప్రకటిస్తూనే తను సాధించిన విజయాల పట్ల సంతోషాన్ని వెలిబుచ్చుతూనే తన చెరువు గట్టును అంబేద్కర్ ఆశయాలు ప్రతిఫలించిన పూదోటగా పరిగణించడం రచయితలోని స్వచ్ఛమైన, కల్మషం లేని మనసు కనిపిస్తోంది.
తాముసాగు చేసుకుంటున్న భూములు వదిలి వెళ్ళవలసి వచ్చిన తరుణంలో వారు పడిన ఆవేదనను చూస్తే పాఠకులకు కళ్ళు చెమర్చక మానదు. దళితుల కుటుంబాలలో ఇంటిపెద్ద ఎంతో ఆత్మాభిమానంతో కుటుంబాన్ని పోషించడానికి ఎన్ని అగచాట్లు పడ్డా నైతిక వర్తనను ఏనడూ విడువరని రచయిత నాన్నగారి జీవనయానాన్ని చూసినపుడు తెలుస్తుంది.
ఆ కుటుంబంలోని ఆప్యాయతలు, అనురాగాలు చూసినపుడు ఎంతటి పేదపరిస్థితులలో ఉన్నా లేనివాటికోసం అర్రులు చాచకుండా ఉన్నదానితోనే తృప్తి చెందే లక్షణాలను తల్లిదండ్రుల తమ పిల్లలకు అలవాటు పడేలా చేయడం చూసినపుడు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
ఆరుగాలం కష్టపడి అలసి సొలసి ఆ క్షణాన నోట్లో పెట్టుకునే ముద్ద ఎంతటి రుచి కలిగిస్తుందో చెప్పడం చూస్తే రచయితకు శ్రమజీవుల పట్ల గల గౌరవాన్ని తెలుపుతుంది. జీవికకే కనాకష్టమవుతున్న సందర్భంలో పిల్లల పుట్టినరోజులను, ఆ తేదీలను రికార్డు చేయడం కష్టజీవులకు ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. అలాంటపుడు పాఠశాల ఉపాధ్యాయులు రాసిన పేర్లే, వేసిన తేదీలే దళితులు తమ పుట్టిన రోజులుగా కావడం గమనిస్తే ఉపాధ్యాయుల నిర్ణయాలు జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో అర్థమవుతుంది.
పొలం పనులు చేస్తూ జనాలు పాడుకునే జానపదాలకు ఎంతటి శక్తి ఉందో, ఆ జనపదాలు ఎలా ఊరటనిస్తాయో, ప్రకృతితో ఎలా మమేకమవుతారో ఆయా సంఘటనలన్నింటినీ కళ్ళకు కట్టినట్లు వర్ణించిన తీరులో అత్యద్భుతమైన శైలి కనపడుతోంది. నైతికతకు నిలువెత్తు రూపమూ, ఆత్మగౌరవానికి ప్రతీకా అయినటువంటి ఆరుంధతీ మాత వ్యక్తిత్వాన్ని విపులంగా ఈ ఆత్మకథ ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది.
అభ్యుదయం గురించి ఎంత మాట్లాడినా, కొంతమంది సమాజం కోసం పైపై ముసుగులెన్ని వేసుకున్నా తరాలు మారినా, రచయిత తాలూకు బాల్యంలో అంటరానితనం ఎన్ని మానని గాయాలను చేసిందో ఆ పసిమనసు ఎంతగా విలవిలలాడిందో చూసినపుడు రాకెట్లతో ఇతరగ్రహాలకు ప్రయాణించినా మనిషి మనసుతో మానవత్వంతో ఆలోచించలేకపోతున్నాడని బాధ కలుగుతుంది.
తనపట్ల అమానవీయంగా ప్రవర్తించి బాధ పెట్టినా తాను పరిణతిని ప్రదర్శించి గ్రామంలో అలజడులు చెలరేగకుండా చేయడంలో తన గొప్ప వ్యక్తిత్వం కనపడుతుంది. పాఠశాలలో తమ పిల్లవాన్ని ఇబ్బందిపెట్టినా సంయమనంతో హుందాగా రచయిత తండ్రి వ్యవహార శైలిని పరిశీలించినపుడు సంపదలో పేదవారైనప్పటికీ గుణంలో ఏమాత్రం తక్కువ కాదని ఎదిరించి నిలబడిన ధోరణి రచయిత యొక్క తండ్రి ధీరోధాత్తత ను వెల్లడిస్తుంది.
ఈ తొలిభాగంలో తన బాల్య స్మృతులను నెమరేసుకుంటూ రచయిత ఒక్కో సంఘటన వివరిస్తున్నప్పుడల్లా మనం కూడా మన బాల్యపు జ్ఞాపకాల దొంతరలలో తచ్చాడకుండా ఉండలేం. ఆ వయసులో చిన్నిచిన్న వాటికే అనందపడుతూ, పొంగిపోతూ హాయిగా గడిపే బాల్యంలోని కల్మషరహిత మనసును మనందరికీ గిలిగింతలు పెడుతుంది. తన చెల్లెలు విషయంలో అన్నగా స్పందించిన తీరు, పరిణతి, అంతలోనే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆవేశం, రచయిత ఎక్కడా ఏ విషయాన్నీ దాచిపెట్టడానికి ప్రయత్నించకపోవడం చూసినపుడు రచయిత నిజాయతీ మనకు స్ఫూర్తి కలిగిస్తుంది.
సమాజంలోని వివిధ వర్గాలవారినుంచి ప్రేరణ పొందిన రచయిత వారి పట్ల కృతజ్ఞతలు చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. తనను ఇబ్బంది పెట్టాలని, ఎదగకుండా చేయాలని కొంతమంది కుట్రలు పన్నినపుడు తాను రాసుకున్న మాటలు ఎంతటి ధైర్యాన్నిస్తాయో!!
‘‘నన్ను నీటిలోకి తోసేశామనుకున్నారు
నాకు ముత్యాలు దొరుకుతాయని వాళ్ళకు తెలియదు,
నన్ను పాతాళంలోకి తొక్కేద్దామనుకున్నారు
నేనొక మహావృక్షాన్నై మొలుచుకొస్తానని వాళ్ళకు తెలియదు
నన్ను ఆకాశంలోకి విసిరేద్దామనుకున్నారు
ఆ శూన్యం నుండే నేనందరి దాహాన్ని తీర్చే నీటిచుక్కనై కురుస్తానని వాళ్ళకు తెలియదు"
ఈ వాక్యాలు నిండైన ఆత్మ విశ్వాసం, లక్ష్య సాధనకై తనకున్న పట్టుదల, అచంచలమైన కృషిని తెలియచేస్తాయి. ఒక మహామనిషి రూపుదిద్దుకోవడానికి, గొప్ప గొప్ప సంఘటనలు జరగడానికి ప్రకృతి ఎలా ఎంతగా సహకరిస్తుందో రచయిత జీవితమే చక్కని తార్కాణం. పచ్చదనంతో నిత్యం కళకళలాడే కోనసీమలో కూడా దళితుల పట్ల ఎంతటి చిన్న చూపు చూస్తారో రచయిత చక్కగా వివరించారు.
రేడియోలో నాటకాలు, ధారావాహికలు, పాటలు వింటున్న సందర్భాలలో అంతపెద్ద మనుషులు ఇందులో ఎలా పడతారన్న సందేహం వెలిబుచ్చడం చూస్తుంటే రచయిత బాల్యం ఎంతటి అమాయకత్వంతో నిండిఉందో తెలుస్తుంది. ఆనాటి సమాజం, అప్పుడు అందుబాటులో ఉండే ప్రసార, ప్రచార సాధనాలు, బాల్యంలోని స్వచ్ఛమైన అమాయకత్వం... అన్నీ ఎంతో సహజంగా వర్ణించారు.
అదే రచయిత అంబేద్కర్ ను ఆవాహన చేసుకున్న సందర్భంలో ఆయన చెప్పుకున్న మాటలు అక్షరాలపై తనకున్న వ్యామోహాన్ని వెల్లడిస్తాయి. ప్రకృతిలోని ప్రతీభాగం మనిషిలోని మానవతను తట్టిలేపుతుంది. ప్రేమను ఆప్యాయతలను పంచుతుంది. ఎంతటి కర్కశహృదయం కలవాడైనా ప్రకృతిలోని రమణీయతను చూసి పరవశించక మానడు. అలాంటి సందర్భాలలో సున్నిత మనస్కులు మరింత పారవశ్యంలో మనసులోతుల్లోంచి ఆ అందాలను ఆస్వాదిస్తారు. రచయిత కూడా ప్రకృతికి ప్రణమిల్లతూ ఆనందంలో తేలియాడుతూ ఆ భావనలన్నింటినీ మనకు అందచేస్తాడు.
‘‘కుప్పల్లా కష్టాలు
దానిని కప్పేసిన ఆనందం
సీతాకోక చిలుకలా ఎగిరొస్తూ
రంగురంగుల బాల్యాన్ని కళ్ళముందుంచుతుంది
దట్టమైన చీకటి కమ్మేసినా
జీవితమంతా అజ్ఞానం మంచులా కమ్మేసినా
జ్ఞానమనే సూర్యుడి ముందు నిలబడటం అనుకున్నంత సులువేమీ కాదు.
మన చుట్టూ ఉన్న గాలీ, నీరూ, నిప్పూ, చెట్టూ, పుట్టను దేవుడిగా ఆరాధించే సమాజం కులవివక్షతో ఆధిపత్యపు రక్కసి కోరలు విప్పుకుని నిమ్నకులాలను వేధించినపుడు, ఆ అవమానాలు తట్టుకోలేక ప్రత్యామ్నాయం చూసుకున్నపుడు ద్వేషంతో రగిలిపోయే వర్గాల గురించి సుతిమెత్తగా చురకలంటించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచిన విధానం రచయిత మేథోసంపత్తికి నిదర్శనంగా భావించవచ్చు.
రచయుత కుటుంబం ఎంతటి జీవ కారుణ్యం కలిగిఉందో తాము ఒక పూట పస్తులుండయినా తమతో ఉండే మూగజీవులకు ఇంత తిండి పెట్టడమనేది భూతదయను సూచిస్తుంది. కూలీ కష్టాలు, పదవతరగతి తప్పి దినపత్రిక చదవడానికి మూటలు మోయవలసి వచ్చినపుడు ఆ పనిని సంతోషంగా స్వీకరించడం చూసినపుడు శ్రమను ఎంత అనందంగా ఆస్వాదిస్తారో అర్థమవుతుంది. తల్లితండ్రుల ప్రభావం పిల్లలపై ఎంతబలంగా ఉంటుందో ఆచార్య దార్ల వారి జీవితాన్ని చూసినపుడు ఇట్టే అర్థమవుతుంది.
ఈ ఆత్మకథ మొదటి భాగం పూర్తయ్యే సరికి బాల్యం, బాల్యంలో జరిగిన అనేక సంఘటనల సమాహారం... రచయిత గొప్ప మనసును, భూత దయన , అక్షరాల పట్ల తనకున్న వ్యామోహాన్ని, పెద్దల పట్ల గౌరవాన్ని, శ్రమ జీవుల పట్ల సౌహార్ద్రతను, సౌభ్రాతృత్వాన్ని, ప్రకృతిపై ప్రేమను, పరిపూర్ణమైన మనిషిగా తయారవ్వడానికి దారితీసిన పరిస్థితులు ఈ భాగం ద్వారా తెలుసుకోవడం నాకూ, భూమిపుత్ర పాఠకులకూ, ఎంతో మంది ఆచార్యులకూ, సాహితీ ప్రియులకూ మహదానందాన్ని కలిగించింది. ఆ అదృష్టాన్ని ఆ అవకాశాన్ని కలిగించినందుకు మరొక్కమారు వారికి ధన్యవాదములు.
మీ
సాకే శ్రీహరి మూర్తి.,
సంపాదకులు,భూమిపుత్ర దినపత్రిక
అధ్యక్షులు,అనంతపురం జిల్లా రచయితల సంఘం
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి