నేను ఒక పుస్తకం కోసం రాసిన ‘‘తెలుగు డయాస్పోరాసాహిత్యం: వస్తు, కథన రీతులు’’ అనే అధ్యాయాన్ని కస్తూరి విజయం వారి ‘సాహితీముద్రలు’ పుస్తకంలో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ఏప్రిల్, 2023 లో తీసుకొచ్చారు.
వెంకటేశ్వరరావు, దార్ల. ‘‘తెలుగు డయాస్పోరాసాహిత్యం: వస్తు, కథన రీతులు’’ ‘కస్తూరి విజయం సాహితీముద్రలు (వ్యాస సంకలనం), (సంకలనం : సుధీర్ రెడ్డి పామిరెడ్డి, కస్తూరి విజయం ప్రచురణలు, ISBN: 978-81-962667-0-7, పుట: 51-79.
నా వ్యాసాన్ని సంపాదకులు ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించారు.
''హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెససర్ అయిన దార్ల వేంకటేశ్వర రావు గారు "తెలుగు దయాస్పోరా సాహిత్యం-వస్తు కథన రీతులు" మీద వ్రాసిన వ్యాసంలో వివిధ దేశాలలో 1960 నుండి స్థిరపడిన తెలుగు వారు మాతృ భాషపై మమకారంతో వ్రాసిన వివిధ సాహిత్య ప్రక్రియలను డయాస్పోరా సాహిత్యంగా పరిగణిస్తూ వారి మూలాలతో ముడిపడి ఉన్న వైవిధ్యభరితమైన సాంస్కృతిక భావజాలాల వ్యక్తీకరణకు ఒక వేదిక అయిన తెలుగు సాహిత్యం యొక్క కథన రీతులను, వస్తువును దార్ల గారు అద్భుతంగా విశ్లేషించారు. గ్లోబలైజేషన్ లో ప్రపంచంలో భారతీయులు తమ అస్తిత్వం కోసం వెతుకులాడటం. వంటివన్నీ డయాస్పోరా సాహిత్యంలో కొత్త వస్తువులవుతున్నాయని అంటారు. ఒకప్పుడు. కులం, మతం, వర్గం, జెందర్ వంటి విషయాలు తమ జీవితంలో రకరకాల వైవిధ్యాల్ని.. వైరుధ్యాల్ని సృష్టిస్తే, ఇప్పుడు వాటి స్థానంలో మనిషి తన కోసం తపన పెరిగిందని, ఈ అధ్యాయంలో తెలుగు డయాస్పోరా కథలు, నవలలు, కవిత్వం మొదలైన ప్రక్రియల్లో కనిపించే వస్తువైవిధ్యం, దాన్ని కథనీకరించిన పద్దతుల్ని తెలుసుకోగలుగుతారు అని, డయాస్పోరా తెలుగు సాహిత్య నిర్మాణాంశాల్ని, కథనరీతుల్లో పాత కొత్త కలయికను సంతరించుకున్న ఈ కథనరీతుల్లో నవ్యత కనబరుస్తూ, భాషాపరంగా తెలుగు డయాస్పోరాసాహిత్యం ఎంతో వైవిధ్యం గోచరిస్తుందని. అన్యభాషా పదజాలాన్ని విస్తృతంగా ప్రయోగిస్తున్నారని అంటారు. దయాస్పోరా సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు Cultural Globalization డయాస్పోరా అనే పదం గ్రీకు నుండి పుట్టిందని క్రీస్తు పూర్వం 586 లో యూదు జాతీయులు దేశ భ్రష్టులయి ఈజిప్ట్ నుండి చెల్లాచెదురైన సందర్భంలో చిన్న d తోరాసిన డయాస్పోరా పదం ఇప్పుడు వివిధ దేశాలలో స్థిరపడిన స్వదేశీయులు అప్రయత్నంగా వాడిన పదమే అని వేలూరి వేంకటేశ్వర రావు గారు అంటారు. వాటి లక్షణాలను ఈ విధంగా వివరిస్తారు 1. మాతృదేశ జ్ఞాపకాలు,2, పెంపుడు దేశంలో మనని పూర్తి భాగ స్వాములుగా ఎప్పటికీ ఒప్పుకోరు అన్న నమ్మిక (కారణాలు ఏవైతేనే!)3, ఎప్పుడో ఒకప్పుడు మనం వెనక్కి తిరిగి మన మాతృదేశానికి వెళ్తాం అన్న నమ్మకం. ఇది ఎంత పిచ్చి నమ్మకమైనా సరే, 4. మాతృదేశానికి ఏదో మంచి చేద్దామన్న కోరిక, గట్టి పట్టుదల, (అందరికీ కాదులెండి.), 5. మాతృదేశ సాహితీ సంస్కృతుల్లో వచ్చే మార్పులలో, "విప్లవాలలో" భాగస్వాములు కావాలనే కుతూహలం, 6. సామూహిక స్పృహ, ధృఢమైన ఏకత్వ నిరూపణగా భావిస్తారు. ఈ నేపథ్యంలో వచ్చిన అంతర్జాల పత్రికలు, రచయితలు, కవులను గూర్చి ఈ డయాస్పోరా సాహిత్యం సవివరంగా వివరిస్తుంది. వివిధ దేశాలలో స్థిరపడిన భారతీయుల అస్తిత్వ ప్రకటనగా డయాస్పోరా సాహిత్యం ఒక వేదికగా నిలబడిదని అంటారు. ముఖ్యంగా ఆఫ్రికన్, లాటిన్/ స్పానిష్ డయస్పోరా సాహిత్యంతో పోల్చినప్పుడు మొత్తమ్మీద భారతీయ రచయిత(త్రు)ల సంగతి ఎలా ఉన్నా మన తెలుగు రచనలను మాత్రం సరితూచ లేకపోతున్నామనీ, ఎక్కువశాతం కుటుంబ విలువలు, మనోభావాలు, అంశాల మీదే ఆధారపడి ఉండటం వలన అది దశాబ్దాల తరబడి ఈ రచనాంశాల్లో పెద్దగా మార్పు లేకపోవడం ఒక కారణం అయి ఉండొచ్చుననిపిస్తుందని అంటారు. ఈ పరిణామాలన్నీ డయాస్పోరా సాహిత్య వికాసాన్ని, సమకాలీన భాష సాహిత్య రంగాల్లో వస్తున్న మార్పుల్ని తెలియజేస్తుందని, డయాస్పోరా సాహిత్యం వ్యక్తి స్వేచ్ఛకూ, భాషాసాహిత్యాలు, ముఖ్యంగా మాతృభాషల మనుగడకు ఎంతో దోహదం చేస్తుందనే విశ్వాసాన్ని కలిగిస్తుందని, ఈ కోణంతో ప్రవాసాంధ్రుల సాహిత్యాన్ని భారతీయ, పాశ్చాత్య అలంకారిక, శిల్ప పద్ధతుల్లో కాకుండా, సామాజిక సాంస్కృతిక కోణంలో అధ్యయనం చేయగలిగినప్పుడే ఈ సాహిత్యవిలువల్ని సరిగ్గా అంచనా వేయగలుగుతామని అంటారు దార్ల గారు.''
-సంపాదకీయం, మాధవి మిరప, కస్తూరి విజయం సాహితి ముద్రలు, ఏప్రిల్ 2023.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి