సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై ఎమ్మెల్సీ, ప్రముఖ కవి శ్రీ గోరటి వెంకన్నగారు, వైస్ ప్రిన్సిపాల్ డా.విప్లవ్ దత్ శుక్లా, పత్రసమర్పకులు ఉన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని, కవులు, రచయితలు తమ జీవితానుభవాలనుండి రచనలు చేస్తారని, దానిలో పర్యావరణ స్పృహ కూడా ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ సిటీ కళాశాల హైదరాబాద్ వారు రెండు రోజులుగా (9,10 మార్చి 2023) నిర్వహిస్తున్న 'తెలుగు సాహిత్యం పర్యావరణ స్పృహ' అనే అంతర్జాతీయ సదస్సులో రెండవ రోజు శుక్రవారం నాడు ఒక సమావేశానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి ఆధునిక తెలుగు కవిత్వంలో జల సంరక్షణ అనే అంశంపై పత్ర సమర్పణ కూడా చేశారు. తెలుగు సాహిత్యంలో ఒక వినూత్నమైన సమకాలీన సమాజానికి అవసరమైన పర్యావరణ స్పృహపై సదస్సు నిర్వహించడం అభినందనీయమని ఆచార్యదారుల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పర్యావరణ సమస్య అనేది నేడు ఒక అంతర్జాతీయ సమస్య అనీ అది ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో ఒక దేశానికో మాత్రమే పరిమితం కాదనీ పర్యావరణాన్ని పరిరక్షించుకోవలససిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని అన్నారు. పర్యావరణ స్పృహతో తెలుగులో ఎంతోమంది సాహిత్యాన్ని రాశారని, దీన్ని అందరూ తెలుసుకోవడానికి ఈ సదస్సు దోసదపడుతుందని తెలిపారు. మనం నీటిని పొదుపుగా వాడుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టుల ద్వారా ప్రతి నీటి చుక్కను వినియోగించుకొనేలా చేస్తుందని ప్రభుత్వ కృషిని ప్రశంసించారు. జల సంరక్షణ గురించి ఆచార్య ఎన్.గోపి 'జలగీతం' కావ్యాన్ని రాశారనీ, అలాగే తెలంగాణ ప్రాంతంలో నీటిని కరువు ప్రాంతాల్లో కూడా అందేలా చేసిన ప్రభుత్వ కృషిని తెలంగాణ జలకవితోత్సవం పేరుతో ఒక బృహత్ కవితా సంకలనం తీసుకొచ్చారని, దానిలో పాటలు, వచన కవిత్వం, ఛందోబద్ధమైన పద్యాలు ఎన్నో ఉన్నాయని, వాటిలో కవితలను ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సోదాహరణంగా వివరించారు.
ఈ సదస్సులో ప్రముఖ వాగ్గేయకారుడు, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కార్పోరేట్ కనుసన్నల నుండీ పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.విప్లవ్ దత్ శుక్లా, సదస్సు సంచాలకులు డా.కోయ కోటేశ్వరరావు డా.ఎన్. నీరజ ఈ కార్యక్రమాన్ని సమన్వయించారు. ఈ సమావేశంలో రెంటాల జయదేవ్, డా. నారాయణ శర్మ, డా.ఎన్ మృదుల, కె.పి.అశోక్ కుమార్, డాక్టర్ నందిగామ నిర్మల, డా. మామిడాల రమేష్, డా. భవాని రాకేష్, డా. వి.శంకర్, డా.బూర్ల చంద్రశేఖర్ తదితరులు పత్ర సమర్పణ చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి