లిట్మస్ టెస్ట్
నాకిప్పుడెలాంటి మోహమాటాలూలేవు
నాకిప్పుడెలాంటి మోహాలూ లేవు
నాకిప్పుడెలాంటి భ్రాంతులూ లేవు
నన్ను నీ దగ్గర దాచినంతకాలం
నేను నీకు కనపడితే నువ్వేమనుకుంటావో
నా రంగూ
నా రుచీ
నా వాసనా …
నీకెలా అనిపిస్తాయో!
నేనొక పేకమేడలా కూలిపోతానేమో
నేనొక గరికపూచలా మిగిలిపోతానేమో
ఇంతకాలమూ నిలువెల్లా ఒకటే భయం
ఎన్నో యేళ్ళుగా
మొయ్యలేక మొయ్యలేక మోసిన
ఆ బరువంతా తీరిపోయింది
ఎన్నో యేళ్ళుగా
దగ్గర దగ్గరగా ఉండీదూరం దూరంగా నిలబడ్డ
ఆ దూరమేదో చెరిగిపోయింది
నాకిప్పుడెటు చూసినా
వర్షం కురిసిన తర్వాత కనిపించే ప్రశాంతత
నాకిప్పుడెవరిని చూసినా
పసిపిల్లాడి ముఖంపై కనిపించే చిరునవ్వు
నాకిప్పుడేమి చూసినా
మర్మం తెలిసిన భాషలు వినిపించే సంగీతం
నాకిప్పుడు ఆ శూలం గుచ్చుకుంటుంటే
నవ్వుల్ని చిందించడానికి బదులు
వేడిరక్తమే చిమ్ముకొస్తుంది
నన్ను నేనుగా వెలిగించుకున్నంతనే
నాలో మేటలు మేటలైన
తర తరాల కన్నీటి కెరటాలన్నీ
సత్యావిష్కరణలో మృత్యుంజయులై నిలిచాయి
రండి నాలోకి తొంగి తొంగి చూడండి
లిట్మస్ కాగితాల్ని పట్టుకొని మరీ
బహిరంగంగాగానే రండి
ఇప్పుడెవరేమేఘాన్ని తాకినా పర్లేదు
శోకసంద్రాలకు బదులు
హృదయాన్ని పుష్పంలా చేసి
మెత్తని ఆలింగనాల్నివ్వగలను
ఇప్పుడే రహస్య ద్వారాల్ని వెతికినా పర్లేదు
కళ్ళని కాగడాలు చేసి
మీ అనుమానాలన్నింటికీ వెలుగునవ్వగలను
నాకిప్పుడెలాంటి మోహమాటాలూలేవు
నాకిప్పుడెలాంటి మోహాలూ లేవు
నాకిప్పుడెలాంటి భ్రాంతులూ లేవు
దార్ల వెంకటేశ్వరరావు,
ఫోన్: 9182685231
14.12.2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి