భూమిపుత్ర దినపత్రిక, 21.12.2022 సంపుటి:4, సంచిక 258 సౌజన్యంతో
''తుఫాన్''
పాలేరు తనానికి వెళ్ళినప్పుడు, ఆ కామందులు పాచిపోయిన అన్నం పెడితే తినడమో, తినలేక దాన్ని పారబోయడమో చేసినంత సులువు కాదు దాన్నెదుర్కోవడం. ఆ విషయం నాకు తెలుసు.
కానీ, అలాంటి అన్నం పెట్టిన దానికంటే, ఆ సందర్భంలో వాళ్ళన్న మాటలు నా మనసుని బాధ పెట్టాయి.
ఆ మాటలు మనిషిని నిలబెట్టి నరికేసినట్లనిపించాయి.
అమ్ములు గారి ఇంటి నుండి సరాసరి ఇంటికొచ్చేశాను.
వస్తూవుంటే దారిలో నాకు మనుషులు కంటే గతంలో అలా ఎదిరించిన వాళ్ళని ఏమేమి చేసేవారో కళ్ళ ముందు మెదులుతున్నట్లనిపించింది.
మా ఊరిలో సాధారణంగా రాజులు, కాపులు పెద్దమనుషులుగా ఉండి తీర్పులిస్తుంటారు.
మెండా సత్తియ్యకాపుగారని ఒకాయన ఉండేవారు. వాళ్ళకి గుర్రం బండి ఉండేది. అర్జెంటైతే మా ఊరి వాళ్ళందరికీ అదే దిక్కయ్యేది.
ఎవరికైనా దాన్ని బాడుగకు కట్టేవారు.
మా ఊరి మధ్యలో వాళ్ళకు ఒక హోటలు, ఒక కిళ్ళీ బడ్డీ ఉండేది.
అవన్నీ మనుషుల్ని రకరకాలుగా అంచెనా వేయడానికి ఉపయోగపడేవి.
అవి ఒక విధంగా అప్రకటిత రచ్చబండలుగా కూడా మారేవి.
ఎవరిని ఏమి చేయాలో అక్కడ కూర్చున్న వాళ్ళు ముందుగానే నిర్ణయించుకోవడానికి కొంతమంది వాటిని రహస్య కేంద్రాలుగా కూడా ఉపయోగించుకునేవారు.
దసరా నవరాత్రులు చేసినా, వినాయక చవితి పండుగ చేసినా, శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణాలు చేసినా మెండావారే ముందుండి నడిపించే వారు.
అందర్నీ కలుపుకొని పోతూనే తమ నాయకత్వాన్ని నిలుపుకొనేవారు.
వాళ్ళు ఏదంటే అదే జరిగేది.
చింతలమెరక వైపు అయితే రాజులు చెప్పినట్లు వినాల్సిందే.
ఇటు కాపులు గానీ, అటు రాజులు గానీ మా నాన్నను ఎంతగానో గౌరవించేవారు.
వాళ్ళంతా మా నాన్నను ఇంట్లో మనిషిలాగే మాట్లాడతారు.
వాళ్ళనే కాదు, ఊరిలో వాళ్ళందరికీ తలలో నాలుకలా ఉంటాడని మానాన్న గురించి అనేకమంది అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పే మాటలు నాకు తెలుసు.
కొబ్బరికాయలు తియ్యాలన్నా,
తాటాకు కొట్టాలన్నా…
ఇంకా రకరకాల పనుల్లో సహకరించడం వల్ల నాన్నంటే ఊరందరికీ గౌరవం. అందుకే నేమో నాన్నని 'అబ్బాయి' అని పిలిచేవారు.
అసలు పేరు 'లంకయ్య'
ఆ పేరు చెప్తే ఊర్లో ఎవరికీ తెలియకపోవచ్చేమో గానీ అబ్బాయి అంటే తెలియని వాళ్ళుండరు.
అంతేకాదు, నాన్నగానీ, మా ఇంట్లో వాళ్ళు గానీ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకవడం వల్ల కూడా మమ్మల్ని అందర్నీ గౌరవించేవారు. ప్రేమగా ఉండేవారు.
దీనికి తోడు క్రమేపీ అంతమంది పిల్లలున్నా చదివిస్తున్నాడనీ మరీ గౌరవంగా చూసేవారు.
ఈ మంచితనమే నిజానికి మాకు దక్కిన గొప్ప ఆస్తిపాస్తులని మేము చెప్పుకోవడానికి మాకెంతో గర్వంగా కూడా ఉంటుంది.
అయినా, ఎక్కడో మనసులో ఒక భయం.
రేపు మమ్మల్ని ఏమంటారో?
లేకపోతే…
ఈ రాత్రికే వాళ్ళెవరినో తగువుకి పిలిచి, ఏదోఒక వంకపెట్టి కొట్టి…
మరెవ్వరూ తిరగబడకుండా చేస్తారేమో…
ఇలా అనుకొంటూ నాకు తెలియకుండానే నేనెంత వేగంగా నడిచానో గానీ మా ఇంటికొచ్చేశాను.
ఆ సమయంలో మాఇంట్లో ఎవరూ లేరు.
ఆ రోజు పాలేరుతనానికి వెళ్ళనన్న చిన్నన్నయ్య పొలం పనికి వెళ్ళిపోయాడు.
పెద్దన్నయ్య, తమ్ముడు, చెల్లి కూడా కనిపించలేదు.
అమ్మా, నాన్న పనికి వెళ్లి సాయంత్రానికో, రాత్రికో వస్తారు.
వచ్చిన తర్వాత నేను చేసిన పనిని ఎలా చెప్పాలి?
చెప్తే వాళ్ళు నమ్ముతారా?
పని ఎగ్గొట్టడానికి కావాలనే అలా చేశానని అంటారేమో.
పాచి అన్నం పెట్టిన దానికంటే, వాళ్ళింట్లో ఏదో దొంగతనం చేసి వెళ్లిపోయాడని వాళ్ళు మా ఇంట్లో చెప్తారేమో...
పాలేరుతనానికి వెళ్ళిన వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు చేయడాన్ని ఎన్ని చూడలేదు.
పాలేరు తనమనగానే కంచికచెర్ల కోటేశు గుర్తొస్తాడు.
ఒక అగ్నిజ్వాల గుర్తొస్తుంది.
రచయిత ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారు తన స్వీయ అనుభవమైన పాలేరుతనం గురించీ,
పాలేర్లకి పెట్టే అన్నం గురించీ ప్రశ్నిస్తే,
ఒక వేళ ఆధిపత్య కులాలపై పాలేర్లు తిరిగబడితే
ఏంజరుగుతుందో,
ఏమేమి నిందలేస్తారో
ఆ దృశ్యాన్ని కళ్ళముందుంచేలా రచయత చక్కగా వివరించిన తీరు సూపర్భ్.
రచయిత తండ్రి దార్ల అబ్బాయి గారు రాజులకు, కాపులకు, ఆ గ్రామంలో అందరికీ తలలో నాలుకలా ఉండడం, ,పెద్దకుటుంబమైనా,
ఉన్నదానితో సంతృప్తి చెందుతూనే,
తన బిడ్డల్ని చదివించుకోడం వలన కూడా ఊర్లో రైతులు,
ఇతరులంతా అబ్బాయిగారిని ప్రేమించిన తీరుని రచయిత చెప్పిన విధానానికి అభినందనలు.
ఆత్మకథ రాస్తున్న రచయిత దార్లవెంకటేశ్వరావు గారి జీవితానుభవాలు చదువుతుంటే
వాళ్ళమ్మకి ఇంటిపని వంటపనిలో సహకరించి సహాయం చేస్తున్న సన్నివేశాలన్నీ
నాకు మహాకవి గుఱ్ఱం జాషువాగార్ని గుర్తుచేస్తున్నట్లనిపించాయి.
ఆయన ‘అమ్మకూచి’, అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవారని వారి ఆత్మకథనాల కథల్లో వివిధ సందర్భాల్లో రాసుకున్నారు.
రచయిత చివరిగా తనకో కలరావడం, దాని నెరేషన్ చాలా బాగుంది.
ఆ కథను పాఠకుల కళ్ళకు కట్టినట్టు వర్ణించిన తీరు అద్భుతం.
పగలు జరిగిన సంఘటనలు బలంగా మనస్సులోనుండి మెదడుకు చేరి కలగా గందరగోళం చేసేస్తుంటాయని ఓ సైంటిఫిక్ రీజన్ ని మనస్తత్వశాస్త్రవేత్తలు చెప్తుంటారు.
దాన్ని తన ఆత్మకథలో సృజనీకరించడం ద్వారా ప్రతి కల వెనుక గల కారణాల్ని విశ్లేషించుకోవాల్సిన ఒక కోణాన్ని అందించారు.
ఇంత గొప్ప ఆత్మకథను ధారావాహికగా పాఠకలోకానికి అందిస్తున్న ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారికి. భూమిపుత్ర పత్రిక బాధ్యులు డా: శ్రీహరిమూర్తి గారికి శుభాభినందనలు, ఇవాల్టి భూమిపుత్ర సాహిత్య పేజీలోని కవితలు ,అందులో డప్పోల్ల రమేష్ కవిత ఎక్సలెంట్... జయహో భూమిపుత్ర.
– దుగ్గినపల్లి ఎజ్రాశా స్త్రి, కవి, రచయిత
21.12.2022
ఆ పాలేరు యుక్తవయసులో ఉంటే, వాళ్ళింటిలో అమ్మాయిల్నో, ఆడవాళ్లనో ఏదో అన్నారనో, ఏదో చేశారనో కూడా చెప్తుంటారు.
నిజానిజాల మాట దేవుడెరుగు.
వాళ్ళేది చెప్తే దాన్నే నమ్మేస్తారు.
పదిమందిలో నిలబెట్టి అవమానిస్తారు.
ఇంకా మరికొంతమంది ముందుకొచ్చి చెయ్యి చేసుకుంటారు కూడా.
నాకు ఆకలివేస్తున్నా, దాని కంటే నా ఆలోచనలన్నీ రకరకాలుగా సాగిపోతున్నాయి.
ఒకవైపు భయం…
మరొకవైపు ఏమైతే అదవుతుంది. చూసుకుందాములే అనే ఒక మొండి ధీమా… గదిలో పెట్టి కొడుతుంటే పిల్లి కూడా తిరగబడకపోతే ఏంజేస్తుందన్నట్లు,
నేనూ ఏదొకటి చేద్దాంలే అని నాలో నేనే అనుకుంటే…
నన్ను నేనే సమర్ధించుకోవడం.
ఇవన్నీ అనుకుంటూనే, ఇంట్లో పనులన్నీ చేసేశాను.
రాత్రికి అమ్మ అలసిపోయి వస్తుంది. చలిపెడితే కుంపటిలో వేయడానికి ఏదైనా కావాలి.
గేదెలదో, ఆవులదో కొంత పేడ తెచ్చి, దాన్ని ఎండలో చిన్నచిన్నగా చేస్తే, అది ఎండిపోయి కుంపటిలోకి సరిపోతుంది.
ఆ కుంపటిని నులక మంచం కింద వెలిగించుకొని పెడితే రాత్రి చాలాసేపు వరకు అది నెమ్మదిగా కాలుతూ ఉంటే, అమ్మ హాయిగా నిద్రపోతుందనుకొంటూ ఆ పనిచేశాను.
ఇంట్లో వంటపాత్రలు తోమేసి, పొయ్యిమీద అన్నం పెట్టేశాను.
ఇవన్నీ ఎలా చేయాలో అమ్మ వంట వండుతుంటే, ఆ పొయ్యి చుట్టూ కూర్చున్నప్పుడు చూసేవాణ్ణి.
అలా చూసి చూసి నేను కూడా అన్నం, కూర వండడం నేర్చుకున్నాను.
నేను ఎలా చేసినా మా అమ్మ ‘బలేచేశావు’ అంటూ మెచ్చుకునేది.
అమ్మ పొలం పని నుండి వచ్చినా, మళ్ళీ ఇంటి దగ్గర పనుండేది.
మా బట్టలు ఉతకడం, ఇంట్లోకి కావలసిన సరుకులు తేవడం, మర్నాడు చేయవలసిన వంటలకు కావలసిన కూరగాయల్ని తరగడం, తిన్న తర్వాత వంటపాత్రల్ని కడగడం, మా పేటలో మావాళ్ళు చేసుకునే అనేక పనుల్లో పాల్గొనడం .. ఇలా అనేక పనుల్లో నిమగ్నమయ్యేది.
ఇవన్నీ నా కళ్ళతో చూసేవాణ్ణి. కాబట్టి అమ్మకు సాయం చేయాలనిపించేది.
అమ్మ వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. కనుక, వాకిలి, ఇల్లూ తుడవడం, ఇంట్లోకి నీళ్ళు మొయ్యడం, అమ్మ ఉతికి ఎండేసి వెళ్ళిన బట్టల్ని తీసుకొచ్చి మడతపెట్టి, ఇంట్లో పెట్టడం…ఇలా చాలా వాటిలో సహాయం చేసేవాణ్ణి.
ఒక్కోసారి వాకిలికి కళ్ళాపి చల్లి, ముగ్గులు కూడా పెడుతుంటే మా పక్కింటిలో ఆడపిల్లలు ‘‘నువ్వు మాకంటే బాగా చేస్తున్నావు. ఇంతకు ముందుజన్మలో ఆడపిల్లవై ఉంటావేమో’’ అంటూ ఆటపట్టించేవారు.
ఇన్ని పనుల్లో నిమగ్నమైపోయినా, నేను అమ్ములుగారిపై తిరగబడిన దృశ్యమే నన్ను ఆందోళనకు గురిచేస్తుంది.
ఆ దృశ్యమే కళ్ళముందు కనిపిస్తుంది.
ఆ మాటలే నన్ను శూలాలతో గుచ్చుతున్నట్లనిపిస్తున్నాయి.
ఇంతలో తమ్ముడు, చెల్లి, పెద్దన్నయ్య వాళ్ళు ఇంటికి వచ్చారు.
‘‘అప్పుడే వచ్చేసేవేంటి? పాలేరుతనానికి వెళ్ళావు కదా.. అప్పుడే ఎలా వచ్చేశావ్’’ అన్నట్లు ఆశ్చర్యంగా నా వైపు చూశారొక్కక్కరు.
దాన్ని పెద్దగా పట్టించుకోనట్లే, నా పనుల్ని నేను చేసుకుంటూనే వాళ్ళతో రోజూ ఎలా ఉండేవాణ్ణో అలాగే ఉన్నాను. నిజానికి ఉండడానికి ప్రయత్నించాను.
కానీ, వాళ్ళకి అనుమానం తీరలేదనుకుంటాను.
‘‘ఏంటి ఇంత తొందరగా వచ్చేశావు?‘‘ అని పెద్దన్నయ్య అడిగాడు.
అక్కడ జరిగిందంతా చెప్పాను. పూసగుచ్చినట్లు చెప్పాను.
''వాళ్ళంతమాటన్నారా, నాన్న వచ్చినతర్వాత వెళ్ళి అడుగుదాం లే… మరేం పర్వాలేదు. నేను కూడా అమ్మానాన్నలతో మాట్లాడతానులే. నువ్వేమీ భయపడకు’’ అనడంతో గొప్ప ధైర్యాన్నేదో నాలో నింపినట్లయ్యింది.
‘‘మరి, నువ్వొచ్చేయక ఆ నిట్రాళ్ళకున్న పశువుల తాళ్ళెందుకు విప్పావు’’ అన్నాడు నవ్వుతూ.
‘‘కేవలం నేను అమ్ములుగార్ని నా కంచంతో కొట్టి పారిపోయి వస్తే నేనేదో పట్టుకొనిపోయాడని అంటుంది. వెంటనే ఆమె దృష్టి అంతా నామీదే ఉండి నన్ను కొట్టవచ్చు. అదే వాళ్ళ పశువుల్ని కూడా వదిలేస్తే ఆమె దృష్టి ఆ పశువులమీదకి వెళ్ళి, నన్ను కొట్టాలనే ఆలోచనకు వెంటనే రాకపోచ్చు.
ఎవరైనా పారిపోతున్న నన్ను చూసినా, నేను అలా వెళ్ళిపోతున్న ఆ దూడల్ని పట్టుకోవడానికి వెళ్తున్నాడనుకోవచ్చు.
అలా చేయకపోతే ఆమే పెద్ద పెద్ద కేకలేసి ఏదైనా అనొచ్చు. ఆ కేకలకు ఆ చుట్టుప్రక్కలున్నవాళ్ళకు పారిపోతున్న నేను మాత్రమే కనిపించవచ్చు. అప్పుడు ఆమె ఏమిచెప్పినా వాళ్లంతా నమ్మెయ్యవచ్చు.
అలా చెయ్యడం వల్ల పారిపోతున్న పశువుల్ని కట్టెయ్యడానికే వెళ్తున్నాడుని అనుకోవచ్చు.
ఒకవేళ అమ్ములుగారు గట్టిగా కేకలు వేసినా, చూసేవాళ్ళకు పశువుల కూడా వెళ్తున్నాడనో, ఒట్టిచేతులతోనే వెళ్తున్నాడనో అనుకోవడానికి అవకాశం ఉంది….'' చెప్పుకుపోతున్నాను.
ఇదంతా వింటున్న మా తమ్ముడు, చెల్లి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు.
మా పెద్దన్నయ్య కూడా ‘సర్లే…వాళ్ళనుకుంటే ఏమైనా చెప్పొచ్చు. పోనీలే…
ఇంటికొచ్చిన తర్వాతైనా నువ్వేమైనా తిన్నావా? లేదా? ’’ అని అడిగాడు.
ఒక్కసారిగా తినలేదని చెప్పి ఏడ్వాలనిపించింది. కానీ, ఏడ్వలేదు. ‘‘తినాలనిపించలేదు. తినలేదు. అంతే’’ అన్నాను.
నిజానికి ఇంట్లో అన్నం లేదు. తినడానికేమీ లేదు. ఆ విషయం చెప్తే వాళ్ళింకా బాధపడతారు.
రాత్రి అయ్యేసరికి అమ్మ, నాన్న, చిన్నన్నయ్య వచ్చారు.
ఒకరు గడ్డిమోపు నెత్తిమీద పెట్టుకొని తెచ్చారు.
ఇంకొకళ్ళు ఆ రోజు కూలి ధాన్యం మోసుకొంటూ వచ్చారు.
గబగబా అమ్మ దగ్గరకు వెళ్ళి చెయ్యిపట్టుకొని, మెుఖాన్ని పరిశీలిస్తూ ఆ రోజు పాలేరుతనానికి వెళ్తే జరిగిందంతా చెప్పేశాను.
ఇంకా వాళ్ళు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి కూడా రాలేదు.
నాన్న కొంచెం దూరంలో నిలబడి ఆలకిస్తున్నాడు.
ఇంకొంచెం నాకు దగ్గరలో చిన్నన్నయ్య నిలబడి కాళ్ళు కడుకుంటూ ‘‘అయితే పెద్ద చరిత్రే సృష్టించావన్నమాట’’ అంటూ నావైపు చూశాడు.
నేనేమీ మాట్లాడలేదు.
అమ్మ అన్నీ విన్నది. ''ముందు ఏదైనా తిన్నావా? లేదా? అని అడిగి, తిన్న తర్వాత అన్నీ తీరిగ్గా చెప్పుకుందాం పదా’’ అంటూ చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చేసింది.
పొయ్యి దగ్గరకు వెళ్ళి కుండలో వండిన అన్నాన్ని కంచంలో పెట్టి, వండిన వంకాయ కూరని కొంచెం వేసి, ముందు తినమని చెప్పింది.
‘‘తింటానులే.. జరిగిందేమిటంటే..’’ అంటూ ఇంకా చెప్పబోయాను.
‘‘తింటూ చెప్తువుగానిలే…తిను'' అంటూ అన్నం కలిపి నోట్లో ఓ ముద్దపెట్టింది.
అమ్మ ముఖాన్నే చూస్తూ ఆ ముద్ద తినేశాను.
మళ్ళీ మరోముద్ద పెట్టింది… అలా నేను చెప్తూనే ఉన్నాను.
నాకు అమ్మ నోట్లో ముద్దలు పెడుతూనే ఉంది.
''నాకు కడుపు నిండిపోయింది. ఇక నాకు వద్దు’’ అంటూ చెయ్యి, నోరు కడుక్కోవడానికి వెళ్ళిపోయాను.
అమ్మా, నాన్న ఏదో మాట్లాడుకున్నారు.
నన్ను తిడతారో, కొడతారో అని భయం భయంగానే ఇంకా ఏదో సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు చెప్పబోయాను.
‘‘సరేలే…ఇంకెప్పుడూ పాలేరుతనానికి వెళ్ళొద్దులే… వాళ్ళొచ్చి ఏదైనా అడిగితే నేను చూసుకుంటాను లే. నువ్వు పడుకో ముందు’’ అన్నాడు నాన్న.
నాకెక్కడలేని ఆనందం.
నాకెక్కడలేని ధైర్యం. నిద్రపట్టేసింది. కానీ, నాకు కల వచ్చింది.
ఒక పెద్ద తుఫాన్…
వేగంగా వీస్తున్న గాలులు…
పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి…
మేమంతా వాటి నుంచి తప్పించుకోవాలని పరుగు పెడుతున్నాం.
అంతలోనే పెద్ద వరద…
ముంచుకొచ్చేస్తున్న నీరు…
చేలన్నీ మునిగిపోయాయి…
మా రోడ్లన్నీ మునిగి పోయాయి…
దారులన్నీ తెగిపోయాయి…
ఎటు చూసినా చీకటి…
నీళ్ళు మా ఇంటి ముంగిటకొచ్చేశాయి.
ఇంకా ఇంటిలోకి వచ్చేస్తున్నాయి…
గాలికి ఇంటి మీద తాటాకులన్నీ ఎగిరిపోతున్నాయి…
మా దారులన్నీ మూసుకుపోయాయి…
ఇళ్ళెప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి…
నిద్రలో పరుగు పెట్టలేక పోతున్నాను.
అక్కడక్కడే పరుగుపెడుతున్నట్లు…
నన్నెవరో గట్టిగా పట్టేసుకుంటున్నట్లు …
ఊపిరాడ్డం లెదు.
నా మాటెవరికీ వినిపించడం లేదు.
గట్టిగా అరుస్తున్నాను.
ఎవరూ రావట్లేదు.
నా మాట వాళ్ళకి వినిపించడంలేదేమో.
అటూ, ఇటూ గింజలు కుంటున్నాను.
నా మాట అందరికీ వినిపించాలని అరిచే ప్రయత్నం చేస్తున్నాను.
మెలుకువ వచ్చేసింది.
భయంగా చుట్టూ చూస్తున్నాను. ఎవరినో వెతుకుతున్నాయి నా కళ్ళు.
ఏమయ్యిందంటూ గబగబా నాదగ్గరకొస్తు నన్ను అమ్మ అడిగింది.
''అదీ…అదీ… నీళ్ళు…ఇళ్ళన్నీ నీళ్ళు…
ఏవా నీళ్ళన్నీ? …''
అప్రయత్నంగానే ఆ మాటలు వచ్చేశాయి నా గొంతులో నుండి.
దిక్కులు చూస్తూ…
ఇంటి పైకి చూశాను.
ఏమ్మయ్యిందంటూ నన్ను పట్టుకొని మళ్ళీ అడిగింది.
నేను సమాధానం చెప్పే లోగానే …' ఏదో పాడుకలై ఉంటుంది…పడుకో…' అంది.
నాన్నే డని అడిగాను.
బయటకు వెళ్ళాడని చెప్పింది.
మళ్ళీ భయం భయంగానే కళ్ళు మూసే ప్రయత్నం చేశాను…
ఎలాగోలా చాలా సేపటికి నిద్ర పట్టేసింది.
పొద్దున్నే లేచాను.
తుఫాన్ వెలిసిపోయినంత సంతోషం.
వరదతగ్గిపోయినంత సంబరం.
ఆ రాత్రి ఏమి జరిగిందో నాకు తెలియదు.
కానీ మళ్ళీ నన్నుగానీ, మా చిన్నన్నయ్యను గానీ పాలేరుతనానికి రమ్మని పిలవలేదు. వెళ్ళమని ఇంట్లోనూ చెప్పలేదు.
ఆ సాయంత్రం గానీ…
ఆ రాత్రిగానీ…
ఆ మర్నాడు గానీ…,
ఆపై మర్నాడు గానీ… వాళ్ళెవరూ మా ఇంటికొచ్చి జరిగిందేమిటో చెప్పలేదు.
ఆ గొడవకు సంబంధించి మమ్మల్ని ఎవరూ ఆ పిలవలేదు.
మమ్మల్ని ఎవరూ ఏమీ అనలేదు.
ఊరంతా కొత్త పండుగ
చేసుకుంటున్నట్లనిపించింది.
సూర్యుడు క్రొత్తగా ఉదయిస్తున్నట్లనిపించింది.
ఎటు చూసినా
ప్రశాంతమైన సంగీతమేదో
వినిపిస్తున్నట్లనిపించింది.
(సశేషం)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
హైదరాబాద్
ఫోన్: 9182685231
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి