"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

28 డిసెంబర్, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు)22వ భాగం.

 

భూమిపుత్ర దినపత్రిక, 28.12.2022, సంచిక:4 సంపుటి: 285సౌజన్యంతో 

ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు)22వ భాగం.



హైస్కూలు, హాస్టలూ – అంబేద్కర్ జయంతీ!


నేను సైకిల్ మీద నుండి పడిన తర్వాత నన్ను స్కూల్ కి ఎలా పంపాలని అమ్మా, నాన్న ఎంతో ఆలోచనలో పడ్డారు.

బస్సు మీద పంపాలంటే అంత ఆర్థిక స్థోమత లేదు. 

అలాగని బడికెళ్ళడం ఆపేయ్యలేం. 

దీని కోసం ఇంట్లో వాళ్ళంతా తర్జనభర్జనలయ్యారు.

నేను చదువుకునే స్కూలు కాట్రేనికోనలో ఉంది.

అక్కడే మా అమ్మమ్మ గారి ఇల్లు కూడా  వెంకాయమ్మ చెరువు గట్టున  ఉంది. అది మా స్కూలుకి ఒక కిలోమీటరు దూరంలోనే ఉంటుంది.

కొన్నాళ్ల పాటు ఆ ఇంట్లో ఉండి స్కూల్ కి పంపాలనుకున్నారు.

ఆ తర్వాత ఎలా వెళ్లాలనేది ఆలోచిద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు.

సరే నని నేనూ  ఒప్పుకున్నాను.

చదువంటే నాకు మహా ప్రాణం. 

కనపడ్డ ప్రతి కాగితాన్నీ చదివేవాణ్ణి.  

చేతిలో సుద్దముక్కో, కనికముక్కో ఉంటే ప్రతి గోడ మీద ఏదొకటి రాస్తుండేవాణ్ణి.

బొమ్మలు వేస్తుండే వాణ్ణి. 

ఇసుకలో కూడా సరదాగా రాయడం, నీళ్ళ కెరటాలు వచ్చి చెరిపేయడం దాన్నొక సరదాగా భావిస్తుండేవాణ్ణి.

నా రాతలు నీటిమీదరాతలో…

నీటితోనో, కన్నీటితోనో  కొట్టుకుపోకూడదనుకొనేవాణ్ణి.

కన్నీళ్ళు తుడిచే రాతలు కావాలనుకునేవాణ్ణి!


 నిజానికి అమ్మమ్మగారింటిలో ఉండి చదువుకుంటే, దూరం వెళ్లి రావలసిన పనిలేదు. 

పొద్దున్నే పశువుల దగ్గర పని చేయాల్సిన పనీ ఉండదు.

అందువల్ల చదువుకోడానికి నాకు చాలా సమయం దొరుకుతుంది.

స్కూల్లో రకరకాల పోటీలు పెడుతుండేవారు. వాటంన్నింటిలోనూ పాల్గోవచ్చు. 

సాయంత్రం వరకూ  రకరకాలైన ఆటలు కూడా ఆడుకోవచ్చు….

రకరకాల ఊహలు చుట్టుముట్టాయి.

నన్ను వాళ్ళు 

చదువుకోనివ్వకుండా అడ్డుకోవాలనుకున్నారు. 

నన్ను మా ఊరిలోని హైస్కూల్ లో చదువుకో నివ్వడదనుకున్నారు.

అక్కడ చదువుకోనివ్వకపోతే 

దూరం వెళ్ళి చదువుకోలేడనుకున్నారు…

నాలో నాకే నవ్వొచ్చింది.

నేను చదువుకునే స్కూలే చాలా పెద్దది. శ్రీవరహాభొట్ల నారాయణమూర్తి గారని ఒక బ్రాహ్మణ పండితుడు ఆ స్థలాన్ని దానం చేశారు. ఆ స్కూలు మీద ‘‘శ్రీవరహాభొట్ల నారాయణమూర్తి మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, కాట్రేనికోన’’ అని ఆయన పేరే రాసి ఉంటుంది. 

మా స్కూల్ చాలా పెద్దది మాత్రమే కాదు, దానికి పెద్ద గ్రౌండ్ కూడా ఉండేది. ఆ చుట్టు పక్కల ఎటుచూసినా జామతోటలు, మామిడి తోటలు ఉండేవి. 

ఆ స్కూల్ అడ్రస్ చెప్పమంటే రామస్వామితోట అనే చెప్తారు. ఆ తోటలోనే ఎదురుగా ఒక పెద్ద కాలనీ ఏర్పడింది. 

అవన్నీ గవర్నమెంటు కట్టించి ఇచ్చిన ఇళ్ళతో ఏర్పడ్డకాలనీ... 

దానికి ఎదురుగానే మా హైస్కూల్.

ఇంగ్లీష్ అక్షరం యు ఆకారంలో నిర్మించిన బిల్డింగ్. 

దాన్ని చూస్తే ఎంతో నాకెంతో ఆనందం వేసేది. ఇంత పెద్ద స్కూల్లో చదువుతున్నానని గర్వంగా అనిపించేది.

నన్ను నీటిలోకి తోసేశామనుకున్నారు

నాకు ముత్యాలు దొరుకుతాయని వాళ్ళకు తెలీదు.

నన్ను పాతాళంలోకి త్రొక్కేద్దామనుకున్నారు…

నేనొక మహావృక్షాన్నై మొలుచుకొస్తానని వాళ్ళకు తెలీదు

నన్ను ఆకాశంలోకి విసిరేద్దామనుకున్నారు

ఆ శూన్యం నుండే

నేనందరి దాహాన్నీ తీర్చే 

నీటి చుక్కనై కురుస్తాననీ 

వాళ్ళకు తెలీదు.

ఆ స్కూల్ కట్టించిన నారాయణ మూర్తి గారి మనవడో,  ముని మనవడో  అని నాకు చెప్పిన గుర్తు.

అతని పేరు కూడా నారాయణమూర్తి అనే పెట్టారట. 

అతను కూడా ఆ స్కూల్లోనే చదువుకునేవాడు. 

అతనూ, నేనూ ఒకే క్లాస్, ఒకే సెక్షన్. 

నాతో పాటు స్నేహితులుగా ఉండే వాళ్లలో అతను కూడా ఒకడు. 

బాగా చదివేవాడు. 

నా క్లోజ్ ఫ్రెండ్స్ లో రాజుల అబ్బాయి వర్మ అని ఒకతను, 

వైశ్య కులానికి చెందిన ఒక అతను,  

తర్వాత మా కులానికే చెందిన ఉండ్రు శాంతరాజ్ అని ఇంకొకతనుతో పాటు, ఆ ఊరికే చెందిన కప్పల త్రిమూర్తులు, విశ్వనాథం, అయినాపురం నుండి బాబీస్టెవార్డ్,  భాస్కరరావు కూడా మా క్లోజ్ ఫ్రెండ్స్ లిస్టులోని వాళ్ళే. 

రాజకీయ కుటుంబానికి చెందిన శ్రీ మోకా శ్రీ విష్ణు వర  ప్రసాదరావు గారి తమ్ముడు కొడుకు అప్పాజి కూడా మా తోటే చదువుకునేవాడు. అప్పటికే శ్రీమోకా శ్రీ విష్ణు వరప్రసాదరావు గారికి రాజకీయంగా మంచి పేరుంది. 

అప్పుడు ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడు గానో,  మంత్రిగానో  ఉన్నారు. 

వాళ్ళమ్మాయి భాగ్యశ్రీ  మా క్లాస్మేట్ గా తర్వాత చేరిందని గుర్తు.

అప్పాజి, భాగ్యశ్రీ, నేనూ ఆ స్కూల్ క్యాంపస్ లో ఉండే వేపచెట్టు దగ్గరే కూర్చొని ఎన్నో ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళం. 

ఆ ఎదురుగానే పెద్ద ఆట స్థలం… దాన్లోనే చాలామంది ఆటలాడుతూ ఉంటే మేము మాత్రం వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ కూర్చునేవాళ్ళం.  

అప్పాజి వాళ్ళమ్మగారు టీచర్ గా పనిచేసేవారు. 

వాళ్ళ నాన్న గారు సర్పంచ్ గా ఉండేవారు. నేను అప్పుడప్పుడూ వాళ్ళింటికి వెళ్ళేవాడిని. అప్పాజి వాళ్ళు తోటలో పండే జామకాయలల్లో ఒక ప్రత్యేక మైన ఫలాలు గులాబి జామికాయలు… 

వెరైటీగా ఉండేవి. 

అవి మెత్తగా ఉంటాయి. 

కొంచెం గట్టిగా పట్టుకొంటే రసం నీళ్ళలావచ్చేస్తుంది. 

వాటిని సరదాగా నొక్కుతుండేవాళ్ళం.

వాటిని మెత్తగా ఉండటం వల్ల పిసికేవాళ్ళం కూడా…

అందుకే మనుషులు కూడా మరీ మెత్తగా ఉండకూడుదు. 

నలిపేస్తారు.

వాటిని తింటుంటే కొంచెం దూదిలా అనిపిస్తుంది.

 ఆ ఫలంలో కొద్దిగా నీళ్ళు, 

కొంచెం ఏపిల్ పండు రుచీ ఉండడం వల్లేనేమో  వాటిని ఇంగ్లీషులో వాటర్ ఏపిల్స్ అంటారు. అవి పింక్, లైట్ గ్రీన్ కలర్స్ లో ఉంటాయి. చూడ్డానికి జీడి మామిడి పండులా ఉంటాయి. కానీ, జీడి మామిడి కొంచెం వగరుగా ఉంటుంది. ఎక్కువ వ తింటే దగ్గు వస్తుంది. దీనికి జీడిజాయ వ్రేలాడుతూ ఉంటుంది. దాన్ని విడిగా తీసేసి తినాలి.

గులాబీ జామకాయ మాత్రం గుత్తులు గుత్తులుగా విడిగానే కాస్తుంది. 

పెద్ద తియ్యగా ఏమీ ఉండదు. కానీ ఒక రకమైన మెత్తని గుజ్జుతో వెరైటీగా ఉంటుంది.

వీటితో పాటు మామిడి కాయలు కోసుకుని తినేవాళ్ళం. 

తోతాపురి, బంగినపల్లి కాయలు దోరగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటాయి.


''కోనసీమలో అన్నం వండుతారు'' అనేకంటే 'అక్కడ ఆహారం పండుద్ది' అనడం బాగుంటుందేమో. ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారు చెప్పినట్టు ,జామ ,చీమచింత ,నీటి జామ… ఇవేమిటి ఇంకా అనేక పళ్ళు, ఫలహారాలు… నిజంగా నాకు మరోజన్మంటూ ఉంటే 'నన్ను కోనసీమలో పుట్టించ'మని ఆ భగవంతుణ్ణి కోరుకుంటాను. రచయిత తోటి విద్యార్దులతో అందులోనూ విద్యార్థినులతో మెలిగిన విధానం ఓ మోరల్ మెసేజ్. మనందరిలాగే రచయితకు కూడా హాష్టల్ జీవితం ఉంది.అక్కడ ఉండే భోజనం, కూరలగురించి చక్కగా వివరించారు. పైగా ఆయనకు విద్యార్ది దశ నుండే నాయకత్వ లక్షణాలు ఉన్నాయనడానికి ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారు మెస్ సెక్రెటరీగా ఉండడం,  ఆయన హయాంలోనే ఆ ఊరిలో ఉండే పెద్దలను ఆహ్వానించి, బాబాసాహెబ్ డా.బి.అంబేద్కర్  జయంతిని జరిపించిన తీరు అద్భతంగా వివరించారు. కోనసీమ అనగానే పచ్చని పంటపొలాలే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం అక్కడ పెల్లుబుకిందనే స్పృహ కలుగుతుంది. ఆ స్పూర్తే మన రచయిత ప్రొఫెసర్ అవ్వడానికి దోహదపడింది. వారం వారం పాఠక లోకానికి ఇంత చక్కటి ఆత్మకథ ను అందిస్తున్న రచయిత దార్లవెంకటేశ్వరావు గారికి భూమిపుత్ర బాధ్యులు, డా. సాకే శ్రీహరిమూర్తి గారికి అభినందనలు.

 జై భీమ్… జై భూమిపుత్ర!

  • ఎజ్రా శాస్త్రి, కవి, రచయిత ''


ఆ కాయలకు ఉప్పూ, కారం పెట్టుకొని తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. 

శీతాఫలాలు, దానిమ్మ వంటివెన్నో వాళ్ళ తోటలో ఉండేవి. 

ఆ చుట్టు ప్రక్కల  సీమ చింతకాయలు దొరికేవి…

అవి ఒకరకమైన వగరు, తీపి కలయికతో భలేగా ఉండేవి. 

పనస, బొప్పాయి, అరటి, వాటిలో ఎన్నోరకాల పండ్లు చాలా సహజంగా అక్కడ కూడా దొరికేవి. 

వీటన్నింటి కంటే పెద్ద ఉసురు కాయ తిన్నప్పుడు కంటే, తినేసి లోనికి గాలి పీల్చుంటే ఉండే ఫీలింగ్ వర్ణనాతీతం. 

పుల్లగా, తియ్యగా  ఉండే చింతకాయలు, నేరేడు పండ్లు, వాగకాయలు…

అవి దొరికే కాలంలో బాగా తినేవాళ్ళం. 

ఇంకా అక్కడ రకరకాలైన పండ్లు ఉండే తోటలే ఎటుచూసినా…

ఇవన్నీ తినేటప్పుడు, తెచ్చుకొనేటప్పుడు మా ఫ్రెండ్స్ మారిపోవారు. 

ఒక్కొక్కళ్ళకీ ఒక్కో టేస్ట్ కదా. 

ఈ పండ్లుతో పాటు నేను మరిచిపోలేని జీవితం హైస్కూల్ లో మధ్యాహ్నభోజనం. 

మధ్యాహ్నం భోజనానికి కేవలం క్లాస్మేట్సే కాదు, ఇతర క్లాసుల వాళ్ళు, ఆ పక్కపక్కనే ఉన్న ఊరి వాళ్ళు కూడా టిఫిన్ బాక్స్ తెచ్చుకునేవారు.

సాధారణంగా ఆ ఊరిలో వాళ్ళు  కొంతమంది మాత్రం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళి వచ్చే వారు.

మా ఇంటి నుండి స్కూల్ కి వచ్చేటప్పుడు అలా మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ తెచ్చుకునే వాణ్ణి. 

ఆ స్కూల్ కి దగ్గరగా చాలా తోటలు ఉండేవి. మధ్యాహ్నం మా భోజనాల్ని మేము సరదాగా ఆ మామిడి చెట్లు, జీడి మామిడి చెట్ల కొమ్మలపై కూర్చొని తినేవాళ్ళం

అలా బాక్స్ తెచ్చుకున్నప్పుడు మేమంతా మా కూరలన్నీ కొద్ది కొద్దిగా పంచుకొని సరదాగా తినేవాళ్ళం.

మా అమ్మమ్మ ఇంట్లో నుండి వేస్తే ఇవన్నీ  మిస్సయిపోతున్నట్లనిపించేది.

రెండు మూడు రోజులు మా అమ్మమ్మగారి ఇంటి దగ్గర నుంచి రావడం బాగానే అనిపించింది. 

ఆ తర్వాత నుంచి మా అమ్మ, నాన్నను,  చెల్లినీ, తమ్ముడినీ, అన్నదమ్ముల్నీ అందర్నీ వదిలేసి ఒంటరిగా ఉంటున్నట్లనిపించేది. 

మా అమ్మమ్మ గారి ఇంట్లోనే మా పిన్ని ఉంటుంది. 

కాపురానికి వాళ్ళ అత్తారింటికి వెళ్ళలేదు. 

అమ్మమ్మ, తాతయ్యకు తోడుగా ఉండిపోయారు. 

వాళ్ళకున్న ఆ కొద్ది పాటి పొలాన్ని, కొబ్బరి చెట్ల కాయల్నీ వాళ్ళే వాడుకొనే వారు. 

మా అమ్మకు రెండవ కూతురు. మొదటి కూతురు, చివరి కూతుళ్ళతో సహా పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ అత్తారిళ్ళకు వెళ్ళిపోయారు. మా అమ్మమ్మ వాళ్ళకి మగ పిల్లలు లేకపోవడంతో మా అమ్మ తర్వాత పుట్టిన మా పిన్ని మాత్రం ఆ ఇంటిలోనే ఉండిపోయింది. 

మా పిన్నికి ఒక కొడుకు, ముగ్గురు ఆడపిల్లలు ఉండేవారు. 

వాళ్ళలో మా తమ్ముడు దేవదానం, మా పెద్ద చెల్లి నందీశ్వరి … 



మేమంతా ఫ్రెండ్స్ లా ఉండే వాళ్ళం.

సింహాద్రి, బాలకృష్ణ, నారాయణమూర్తి, విఘ్నేశ్వరరావు మొదలైన వాళ్ళు కూడా వెంకాయమ్మ చెరువు నుండే వచ్చేవారు. 

మేమంతా బాగానే కలిసి మెలిసి ఆడుకొనేవాళ్ళం.

అయినా మా సొంత కుటుంబాన్ని విడిాచి  మా అమ్మమ్మగారి ఇంట్లో ఉండడం వల్ల నేనేదో కోల్పోయినట్లనిపించేది.

మనం కలిసి బ్రతికినప్పుడు తెలియదు…

కష్టసుఖాల్ని రెండు కళ్ళూ… 

సమానంగానే పంచుకుంటాయని!

కొట్టుకున్నా, తిట్టుకున్నా

కుటుంబం కంటే మించినదేమి ఉంటుంది.

మా ఇంటికెళ్ళిపోవాలనిపించింది.

ఉన్న రెండు మూడు రోజుల్లోనే నన్నేదో నిస్సత్తువ ఆవరిస్తున్నట్లనిపింది.

రేపు ఆదివారం అనగా శనివారం పొద్దున్నే ఇంట్లో చెప్పేశాను 

'సాయంత్రం మా ఇంటికి వెళ్ళి మరలా సోమవారం వస్తా' నని. 

ఆ రోజు స్కూల్ త్వరగా అయిపోతే … ఇంటికెళ్ళిపోదా'మని మనసేదో ఉరకలేస్తుంది.


స్కూల్ గంట కొట్టడమే తర్వాతి… గబగబా మా పిన్ని ఇంట్లో చెప్పేసి వెళ్ళిపోదామని ఆ ఇంటికి వచ్చేయడం క్షణాల్లో జరిగిపోయింది.

విచిత్రం…

అప్పటికే మా నాన్న నన్ను తీసుకెళ్ళడానికి సిద్దంగా ఉన్నాడు.

నాన్నను చూడగానే నాకు ఎక్కడలేని ఆనందం.

పరుగెట్టికెళ్ళి రెండు నాన్న చేతుల్లోనూ ఒరిగిపోయాను.

ఒక నులివెచ్చని స్పర్శేదో క్షణాల్లో మా ఇద్దర్నీ చుట్టుముట్టేసింది.

అప్పటికే సర్దేసి పెట్టుకున్న బ్యాగ్ తీసుకుని సైకిల్ ఎక్కేశాను. 

పిన్నీ వాళ్ళకు నవ్వుతూ మళ్ళీ వస్తుంటాని చెప్పేశాను.

వస్తుండటమేంటి…? 

సోమవారం వచ్చేయాలన్నారు.

తలూపాను.

అటో ఇటో నాకు తెలుసు.

మానాన్నకీ తెలుసు!

మా ఇద్దరికే అర్థమైన భాష..

మా ఇద్దరి కళ్ళల్లో ఒకేరకంగా మెరిసే మెరుపు…

వాళ్ళు కనిపెట్టారో లేదో

మాకిద్దరికీ మాత్రం అర్థమైంది. 

అదే మా ఇద్దరి ముఖాల్నీ ఒక క్షణం పాటు చిరునవ్వై ముద్దాడి… ఎటో మాయమైపోయింది.

నాన్న-నేనూ…దారంతా కబుర్లే.

ఎన్నాళ్ళో దూరంగా ఉన్నంత ఎడబాటు…

ఆ ఎడబాటు తగ్గించుకోవడానికి పడే తొట్రుపాటు…

దాన్ని తగ్గించుకొంటూ  దగ్గరయ్యేంతగా చెప్పుకునే కబుర్లు…

నేను చెప్పేటప్పుడు నాన్నా…

నాన్న చెప్పేటప్పుడు నేను… 

కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని మరీ వెతుక్కునే ఆనందాలు…అద్భుతాలు.

కాట్రేనికోన మెయిన్ రోడ్డు కొచ్చింది మొదలు మళ్ళీ మా ఇంటి కెళ్ళే దాకా నాన్న కొనిచ్చిన జీళ్ళు తింటూ, ‌సావరంలో గోళీ షోడాతాగుతూ నేను కోల్పోయిన ఆ మూడురోజుల్నీ ఆ కొద్దిసేపట్లోనే ముందు నిలుపుకున్నాను.

మా లేగదూడ, దానితో పోటీపడి మరీ నేను పాలు త్రాగాలని ప్రయత్నించడం దగ్గర్నుండి మా చెల్లి (పాప), తమ్ముడు కృష్ణ, అన్నయ్యలు, అమ్మా…

అందర్నీ మా ఇద్దరి కబుర్లతో కలబోసుకున్నాం.

ఇంటి కెళ్ళ గానే సొంత సామ్రాజ్యానికి వచ్చేసినట్లు… 

పారిపోయిన వసంతమంతా మళ్ళీ చిగురించేసినట్లు అనిపించింది. 

స్కూలుకి మళ్ళీ నా చేతికి కట్టిన సిమెంట్ కట్టుతోనే నడుచుకుంటూనే వెళ్ళి వస్తానన్నాను.

అలాగే మేమూ అనుకున్నామని ఇంట్లో అనుకున్నారేమో…. 

ఆ మాటకేమీ బదులు చెప్పని మౌనం…

 కాకపోతే 'కొన్నాళ్ళు బడిమానేసి, కట్టు విప్పిన తర్వాత వెళ్ళొచ్చులే' అన్నారు నెమ్మదిగా.

కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. 

కాలు విరిగిన సంగతి స్కూల్లో ఎలాగూ తెలుసు. కాబట్టి, వాళ్ళు ఏమీ అనలేదు.

చేతికి కట్టు కట్టుకొని స్కూలుకి వెళుతుంటే దాన్ని మర్చిపోవడానికేనేమో తరగతి గదిలో నన్ను మా తెలుగు మాస్టారు శ్రీకంఠం లక్ష్మణమూర్తిగారు పాఠం చెప్పేటప్పుడు ‘బూరా…రారా … పద్యం చదువు’ అనేవారు.

నాకెంతో సంతోషం. 

ఆయనలాగే నేనూ రాగం తీస్తూ చదివేవాణ్ణి…

అలాగే ప్రయత్నించేవాణ్ణి.

మూడు నెలలు ఉండాలన్న సిమెంటు కట్టు దురదకు తట్టుకోలేక నెలన్నరకే ఉండిపోయింది.

నా రాతలన్నీ రాయడానికీ ఆ కట్టు మీద ఖాళీ కూడా మిగల్లేదు.

రోజూ దురదపెడుతుందని కట్టు లోపలికి పెట్టి గోకుకోవడానికే మా ఇంట్లోని కొబ్బరి చీపురులో ఈనిపుల్లలన్నీ మాయమైపోయి అది బాగా సన్నబడి పోయింది.

కట్టు తీశారు.

కానీ, నా చేయి కిందికి రావడం లేదు. 

చాలా రోజులపాటు దాన్ని అలాగే ఉంచేయడం వల్లే నేమో నరాలు పట్టేశాయి.

నూనె, ఆముదం, నెయ్యి …

ఇలా ఏదొకటి వేసి రోజుకి మూడు పూటలా సాగదియ్యాలని డాక్టర్లు చెప్పారు. 

అంతేకాదు, ఒక ఇటుకను తాడుకి కట్టి దాన్ని చేతికట్టి వేలాడవెయ్యాలన్నారు.

అలా చేస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం.

తొలి రెండుమూడు రోజులు బాగా బాధనిపించింది. 

తర్వాత నెమ్మది నెమ్మదిగా బాధ తగ్గిపోయింది. 

కానీ చెయ్యని ఇంతకుముందు మెడ భుజానికి మడిచి పెట్టుకొనేలా, కుడిచెయ్యిని పెట్టుకున్నంత దగ్గరగా విరిగిన ఎడమచేతిని పెట్టుకోలేకపోయాను. 

డాక్టరుని అడిగితే తర్వాత తర్వాత వచ్చేస్తుందన్నారు. 

తర్వాత దాన్ని ఎంత ప్రయత్నించినా విరిగిన తన సంతకాన్ని చెరిగిపోనివ్వనంది.

ఆ తర్వాత నేను పిజి చదివేటప్పుడు కాకినాడ వెళ్ళి ఆర్థోపెడిక్ సర్జన్ నుంచి కలిస్తే, 'అలా ఉన్న కొద్దిపాటి వంకర పోగొట్టుకోవాలంటే మరలా బలవంతంగా ఆ చెయ్యని విరగ్గొట్టి కట్టుకట్టాలి. 

మళ్ళీ సరిగ్గా అతుక్కుంటే అతుక్కోవచ్చు. 

లేదంటే అంతకంటే వంకర రావచ్చు. ఒక్కోసారి అక్కడికి చెయ్యే తీసెయ్యచ్చు' అనడంతో దాని మాటే నిజమని తెలుసుకున్నాను. 

***

ఈ లోగా మా కాట్రేనికోనలో, మా విద్యార్థులకు హాస్టల్ శాంక్షన్ కావడం, బిల్డింగుని వెతకడం, మాకు సైన్స్ పాఠాలు చెప్పే సహస్రాకారం గారు కట్టిస్తున్న కొత్త పెంకుటిల్లునే అద్దెకి తీసుకోవడం జరిగిపోయాయి.

వాళ్ళమ్మాయి కలర్స్ ని నీటిలో వేసి, దానిమీద పేపర్ పెట్టి మోడరన్ ఆర్ట్ లాంటి పెయింట్ లా తీసేది. 

ఆమే మహా తెలివైంది. 

మాకంటే చిన్నమ్మాయి. కానీ, బాగా చదివేది. అనేక బహుమతులు పొందేది.

సహస్రాకారం గారు సన్నగా ఉండేవారు. ఆయనకంటే  ఆమె మరింత ఉండేది.

గట్టిగా గాలేస్తే ఎటెగిరిపోతాదో అన్నట్లు ఉండేది.

ఆయనే తెలివైనవారంటే, ఆయనకంటే తెలివైన అమ్మాయిగా ఆమె మంచి పేరు తెచ్చుకుంది.

ఆమె చిన్నపిల్లే అయినా, ఆమెను మేమంతా గౌరవంగా చూసేవాళ్ళం. 

మాలో బాగా కలిసిపోయి ఆ ప్రయోగాలన్నీ చేసి చూపించేది. 

మా గురువు గారి అమ్మాయి అనే గౌరవం, భయంతో పాటు ఆమె తెలివిని బట్టి మేము ఆ అమ్మాయిని గౌరవిస్తూ అంటీ ముట్టనట్లే ఉండేవాళ్ళం. 

ఆమె మాత్రం నిష్కల్మషంగా మాతో ఆత్మీయంగా మెసిలేది. 

ఆ అమ్మాయిని చూసి అలా నేనూ పేరు తెచ్చుకోవాలనిపించేది.

ఆమె ప్రేరణతోనే స్కూల్లో జరిగే అనేక పోటీల్లో నేనూ పాల్గొనేవాణ్ణి.

సాంఘిక శాస్త్రం చెప్పే వెంకటరెడ్డి మాస్టారు నన్ను బోర్డు మీద రాయమనేవారు.

ఇంకెవరు బోర్డు దగ్గరికొచ్చి రాయడానికి సాహసించేవారు కాదు.

పితాని సత్యనారాయణ మూర్తిగారు ఒక్కసారి చెప్పారంటే మరిచిపోలేనంతగా సైన్స్ పాఠాలు చెప్పేవారు. 

అంతేకాదు, ఆయన  మాకు పోటీలు పెట్టి, దానిలో నెగ్గిన వారికి నిఘంటువులు, పుస్తకాలు బహుమతిగా ఇచ్చేవారు.

అలా నాకు ఇంగ్లీషు, తెలుగు నిఘంటువులు ఆయనే ఇచ్చారు. 

ఆయన విద్యార్థులందర్నీ తన పిల్లలే అన్నంతగా ప్రేమించేవారు. 

ఆయన పాఠాల్ని మాత్రం మేము మిస్సయ్యేవాళ్ళమే కాదు. 

మాకు హిందీ మాష్టారు మాత్రం క్లాసులోకే రేడియో తెచ్చుకుని వినేవారు. 

రేడియోలో వచ్చే అనేక కార్యక్రమాల గురించి కూడా చెప్పేవారు. 

ఆయనకు శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టం. మేము శాస్త్రీయ సంగీతం వస్తుంది అంటే ఆ అరగంట పాటు రేడియో కట్టేయాలనిపించేది. 

హిందీ, సంస్కృతం పాఠాల్ని రేడియోలో వింటూ ఉండమని ఆయన చెప్పేవారు. ఆయన వల్లనే హిందీ నేర్చుకోవడం తప్ప నాకు రేడియో వినడం మాత్రం బాగా అలవాటయింది. 

నేను రేడియో వింటూ పాఠం చదువుకుంటుంటే ఇంట్లో వాళ్ళు నేను రేడియోలో పాటలే వింటున్నాను అనుకొనే వారు.

మా పెద్ధన్నయ్య అయితే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరితోనో మాట్లాడుతుంటే డిస్టర్బ్ అవుతుందంటూ నా రేడియోని ఒకసారి నేలకేసి కొట్టేశాడు.

నన్ను నేలకేసి కొట్టినా సహించేవాణ్ణేమో… 

నాకెన్నో పాఠాలు చెప్తున్న రేడియోని నేలకేసి కొట్టినందుకు పెద్దన్నయ్య మీద తొలిసారిగా నాకు అసహ్యం వేసింది.

ఆ తర్వాత కూడా పెద్దన్నయ్య రేడియోని నేలకేసి  పోగొట్టేసేవాడు. 

వాడు కొట్టే కొద్దీ దానిమీద నాకు ఇష్టం రెట్టింపు అయ్యేది.

పాటలు, లలిత సంగీతం, వ్యవసాయ వార్తలు, నేను రాసే  ఉత్తరాలు రేడియోలో మా ఊరి పేరు, మా నాన్న పేరు చదువుతుంటే… అది విన్నప్పుడు పొందే ఆనందానికి విలువ కట్టలేం.

ఊరులో వాళ్ళు కూడా 'అబ్బాయి నిన్న రేడియోలో నీ పేరు చదివారు. పంటలకు పట్టే చీడ పురుగులు నాశనానికి నీ వల్ల వాళ్ళు మంచి సలహాలు చెప్పా'రని , తన పేరెవరు పంపించి రైతు సమస్యల్ని అడిగారని నాన్న నన్ను ఆశ్చర్యానందాలతో అడిగేవాడు. నేనే రాశానని చెప్పి, మరలా ఏదొక రైతు సమస్యల్ని అడుగుతూ మా నాన్న పేరు రాసేవాణ్ణి. 

ప్రతి వారం ఆ కార్యక్రమం వచ్చేటప్పుడు ఇంట్లో రేడియో వినిపించే వాణ్ణి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంవారు మా ఊరి పేరు , నాన్న పేరు చదివి వినిపిస్తుంటే కుటుంబం అంతా ఆనందపడే వారు. 

నిజానికి రేడియో కొనడం ఆ రోజుల్లో చాలా ఖరీదు.

అయినా నా కోసం నాన్న ఫిలిప్స్ రేడియో కొనుక్కొచ్చాడు. 

సిలోన్ లో పాటలు వినే వాణ్ణి.

ఆదివారం నాటకం, మరోరోజు సినిమా ధారావాహిక…ఇలా చాలా కార్యక్రమాలు వినేవాణ్ణి. 

కొన్నాళ్ళపాటు రేడియో వినడం ఒక వ్యసనంగా మారిపోయింది.

ఆ చిరాకు లో నుండే నా రేడియో ని పెద్దన్నయ్య నేలకేసి కొట్టేసి ఉంటాడు.

నాకు రేడియో విన్న ప్రతిసారీ…

ఇంత చిన్న రేడియోలో అంత పెద్దపెద్ద మనుషులు ఎలా పడతారో అనిపించేది.

వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళెలా ఉంటారో చూడాలనిపించేది.


ఏడో తరగతి ఎలాగోలా అయిపోయి, ఎనిమిదో తరగతి సగంలో ఉండగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మాకు హాస్టల్ వచ్చిందని చెప్పాను కదా. అది శ్రీ మోకా శ్రీవిష్ణు వరప్రసాదరావు గారి చొరవతో  వచ్చింది. 

దూరం నుండి వచ్చే వాళ్ళందరికీ ముందు హాస్టల్ సీటుకి అర్హులన్నారు. 

అలా నాకు రోజూ ప్రయాణం చేసే భారం తప్పింది. 

మా ఇంట్లో భోజనంతో పోల్చుకుంటే హాస్టల్ భోజనం వందరెట్లు బాగుండేది. కాకపోతే ఇంట్లో అయితే రోజూ ఒకపూట గానీ, రోజు విడిచి రోజు గానీ చేపలో, కోడి మాంసమో, వేట మాంసమో ఉండేది.

హాస్టల్ లో ఇంచుమించు రోజూ బంగాళా దుంప, దానితో పాటు వంకాయ కూర ఉండేది. 

వారానికి ఒకసారి కోడిగ్రుడ్డు, రెండు, మూడు వారానికోసారి చికెన్ పెట్టేవారు. 

అయినాపురం నుండి వచ్చే బాబీ స్టెవార్డ్ కూడా హాస్టల్ లో చేరాడు. వాళ్ళమ్మ గారు రకరకాల పచ్చళ్ళు పెట్టి పంపేవారు. తొమ్మిది, పదవతరగతుల్లోకి వచ్చేసరికి కందికుప్ప నుండి ఉమామహేశ్వరరావు అనే స్నేహితుడు కూడా ఉండేవాడు. నాకంటే పెద్దోడులా అనిపించేవాడు. కానీ, బాగా చదువుతానని నాతో బాగా ఉండేవాడు. నేను, ఇంకొంతమంది కలిసి శనివారం నాడో, ఆదివారం నాడో పొద్దున్నే కందికుప్ప వాళ్ళింటికి వెళ్ళిపోయి, అక్కడ నుండి సముద్రం తీరం దగ్గరలో సరదాగా చేపలు పెట్టుకొనే వాళ్ళం. 

వాటిని తెచ్చుకొని వాళ్ళింటి దగ్గర వండుకొని తినేసి మళ్ళీ ఎంత రాత్రి అయినా సరే హాస్టల్ కి వచ్చేసేవాళ్ళం. 

మేము స్నానాలు చెయ్యడానికి రెండు కాలువలు ఉండేవి. ఒకటేమో గోదావరి నీళ్ళు వచ్చే పంటకాలువ. 

ఇంకొకటేమో పంటపొలాల నుండి వదిలేసిన నీరు పోయే ఉప్పు కాలువ అంటారు. దీనిలో సముద్రం ఆటుపోట్లప్పుడు సముద్రం నుండి ఉప్పు నీళ్ళు రివర్స్ లో రావడం వల్లనేమో దాన్ని ఉప్పు కాలువ అని పిలిచే వారు. 

మేము హాస్టల్ లో ఉన్నప్పుడు ఉదయం పూట పంటకాలువలోనూ, సాయంత్రం పూట ఉప్పు కాలువ లోను స్నానం చేసేవాళ్ళం. ఆ సమయంలో అయితే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. సరదాగా ఈతకొట్టొచ్చు. 

పంట కాలువలో స్నానం చేసేటప్పుడు అండర్ వేర్ గానీ, తువ్వాలు గానీ కట్టుకొనేవాళ్ళం. మేము స్నాను చేసే చోటు జనం నిత్యం అటూ, ఇటూ నడిచి వెళ్తుంటారు. 

ఉప్పుకాలువలో మేము స్నానం చేసే చోటుకి జనం ఎక్కువగా రారు. 

అందువల్ల బట్టల్లేకుండా కాలువలో దూకేసేవాళ్ళం. 

ఒకసారి హాస్టల్ మెస్ సెక్రటరీగా ఉండటం వల్ల స్టోర్ తాళం నా మొలతాడుకి కట్టుకొని వచ్చేసి స్నానం చేస్తున్నాను. 

నాతోపాటు మా ఫ్రెండ్స్ కూడా అలాగే చేస్తున్నారు. 

మేము ఒక్కొక్కరూ కాలువ గట్టు పైకొచ్చి

లోపలికి దూకుతూ ఆడుకుంటున్నాం. 

సడెన్ గా మా హాస్టల్ లో వంటపని చేసే రత్నం అక్క  మాదగ్గరకు వచ్చేసి వెనక్కి నిలబడింది.

మేమంతా గబగబా కాలువలో దూకేశాం.

తాళం చెవికోసం వచ్చామని చెప్పింది. 

మేము ఆమెను అక్కా అనే పిలిచేవాళ్ళం.

ఆమెకు ఒకరో ఇద్దరో పిల్లలు ఉన్నారు.

ఆమె ముప్ఫయి నుండి ముప్పయి ఐదు సంవత్సరాల వయసులో ఉంటుంది.

మాకు ఆమెకు అక్కా తమ్ముళ్ళ వయసు.

అయినా ఏదో సిగ్గు.

తాళం ఇవ్వడమెలాగని పరిపరి విధాలుగా ఆలోచించాం.

తాళం తీసి గట్టు మీదకు విసిరేస్తే సరిపోతుంది కదా అనుకున్నాం.ఒకవేళ గట్టుమీద పడకుండా నీళ్ళలోనే పడిపోతే…

అమ్మో…

ఆమెను కొంచెం నీటిలోకి రమ్మంటే  ఆమె బట్టలు తడిసి పోతాయి. 

మా బట్టల్లో అండర్ వేర్ గానీ, నిక్కరు గానీ ఏదొకటి విసిరేయమంటే సరి. 

తడిసిపోయినా నీటిలోనే వేసేసుకొని బయటకొచ్చి జాగ్రత్తగా ఇచ్చెయ్యవచ్చు.

కానీ తడిబట్టలతో మళ్ళీ హాస్టల్ కి వెళ్ళాలంటే ఎలా?

 ఆరోజు మాలో ఎవ్వరూ రుమాలు తెచ్చుకోలేదు.

అందువల్ల మేమొక ప్లాన్ వేశాం. 

‘‘అక్కా … నువ్వు కొంచెం దూరంగా వెళ్ళి వెనక్కి నిలబడు.మేను తాళం చెవిని మా బట్టల దగ్గర పెట్టేసి, చెప్తాం’’ అన్నాం.

మా బట్టలు తడవకుండానే  మా సమస్య తీరిపోయింది.

ఆమెకు అందాల్సిన తాళం చెవి ఆమెకు అందింది.

హాస్టల్ జీవితంలో అనేక మరిచిపోలేని పనుల్లో డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతిని జరపడం ఒకటి. ఏప్రిల్ 14 వ తేదీన అంబేద్కర్ జయంతిని జరిపాం.

దానికి శ్రీమోకాశ్రీవిష్ణు వరప్రసాద్ గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిథులు కూడా పాల్గొన్నారు.

ఆ జయంతి కార్యక్రమం జరిగిన నెలలో నేను మెస్ సెక్రటరీగా ఉన్నాను.

కాబట్టి, హాస్టల్ లో జరిగే ఆ కార్యక్రమంలో ఆ పెద్దలందరితో పాటు వేదికపై కూర్చొనే అవకాశం నాకు దక్కింది. నేనే వక్తల్ని వేదిక మీదకు పిలిచాను. 

అంతవరకు మాకు సరిగ్గా తెలియని అంబేద్కర్ జీవితం గురించి తెలుసుకోవడానికి మాకు అదొక అవకాశంగా మారింది.

ఆ జయంతి జరుపుకున్న తర్వాత నాకు అనేకమంది ఆ ఊరువాళ్ళతో పాటు, ప్రక్కనున్న గ్రామాల వాళ్ళు పరిచయమయ్యారు.

అప్పటికే లా చదివి ప్రాక్టీసు చేస్తున్నవాళ్ళు…

పంచాయితీ మెంబర్లు…

 చైర్మెన్లు, ప్రజానాయకులు... 

ఇలా చాలామంది పరిచయమయ్యారు.

గతమెప్పుడూ అందంగానే అనిపిస్తుంది.

కుప్పల్లా కష్టాలున్నా 

దాన్ని కప్పేసిన ఆనందం

సీతాకోకచిలుకలా ఎగిరొస్తూ

రంగు రంగుల బాల్యాన్నే 

కళ్ళముందు నిలుపుతుంది.

దట్టమైన చీకటి కమ్మేసినా

జీవితమంతా అజ్ఙానం మంచులా కప్పేసినా

జ్ఞానమనే సూర్యడి ముందు నిలబడ్డం 

అనుకున్నంత సులువేమీ కాదు. 


(సశేషం)

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

తెలుగు శాఖ అధ్యక్షులు, 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

హైదరాబాద్

ఫోన్: 9182685231





కామెంట్‌లు లేవు: