"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

31 ఆగస్టు, 2022

తెలుగు భాష ఆధునీకరణకు ప్రసార మాధ్యమాల పాత్ర.

 

తెలుగు భాష ఆధునీకరణకు ప్రసార మాధ్యమాల పాత్ర.

 

 

– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

 తెలుగుశాఖ అధ్యక్షులు,

స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,

హైదరాబాద్ --500 046

ఫోన్: 9182685231, darlahcu@gmail.com

 

భాష నిత్య చలనశీలమైంది. భాషలో నిరంతరం అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి మార్పులు ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల వల్ల మరింత విస్తృతంగా కనిపిస్తున్నాయి.  కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ల ద్వారా తమ భావాలను అందరికీ అందుబాటులోకి ఉండేలా వెబ్సైట్లో ప్రచురించుకోవడం లేదా ఇంటర్నెట్ ద్వారా తమ భావాలను పరస్పరం పంచుకొనే అవకాశం ఉన్న వాటిని సామాజిక మాధ్యమాలు అని అంటారు. తొలుత వెబ్సైట్లు ద్వారా అందుబాటులో ఉండే ఆర్కుట్, ఫేస్ బుక్, బ్లాగ్స్,  ఈ మధ్య కాలంలో వాట్సాప్, ట్విట్టర్, లింక్ డాన్, ఇన్ స్టా గ్రామ్ మొదలైన వాటిని సామాజిక మాధ్యమాలుగా గుర్తిస్తున్నారు.

సామాజిక మాధ్యమాలలో భాష పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో కూడిన అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అభిప్రాయాన్ని గమనించండి.

''ఉన్నదున్నట్లు ప్రచురించే, ప్రసారం చేసే అవకాశాలు లేని, రాయడానికి, మాట్లాడడానికి వీల్లేని, నిఘంటువులలో చోటు చేసుకోని, అసభ్య, అమానుష, అప్రజాస్వామిక భాష రాజ్యమేలుతున్న స్థితిలో, సామాజిక మాధ్యమాలు అడ్డూ, అదుపూ లేని, నేరుగా, వీడియో, ఆడియో రికార్డింగులు ఉన్నది ఉన్నట్టుగా, వెనువెంటనే సెల్‌ఫోన్ల ద్వారా గమ్యాలకు చేరుస్తున్నాయి. '' (సంగనభట్ల కిష్టయ్య, సరిహద్దులు లేని సామాజిక మాధ్యమాలు (వ్యాసం), ఆంధ్రభూమి ఆదివారం, ఆదివారం, 20 అక్టోబరు 2019)

నిజంగా ఇంత ఇలా సామాజిక మాధ్యమాల్లో ఉంటుందా? కొన్ని చూట్ట ఉండొచ్చు. కానీ, సామాజికమాధ్యమాలన్నీ ఇలాగే ఉంటున్నాయని చెప్పలేం.  జాగ్రత్తగా పరిశీలిస్తే, సామాజిక మాధ్యమాలలో ఉపయోగించే భాష పత్రికలు, పత్రికలో ఉపయోగించే భాషనే  సామాజిక మాధ్యమాలు పరస్పరం తీసుకుంటూ వాటిని విస్తృతంగా ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. వీటితో పాటు రేడియో, టివి ఛానెల్స్, యూట్యూబ్ కొన్ని ప్రైవేటు మీడియో ఛానల్స్, పోడ్ కాస్ట్   ప్రసారాలు కూడా భాషా వినియోగంలో కొత్త కొత్త పదాల పుట్టుకకు కారణమవుతున్నాయి. ఇలా పరస్పర వినియోగంలో కేవలం పండితులే కాకుండా తమ భావాలను ఇతరులకు పంచుకోవాలనుకునే వాళ్లంతా తమకు తెలిసిన భాషనే ఉపయోగిస్తున్నారు. ఇలా ఉపయోగించడంలో తెలుగు భాష తన స్వీయ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసుకుంటున్నా, ఆధునికీకరణ వైపు పయనిస్తుందని కూడా వ్యాఖ్యానించుకోవచ్చని నా అభిప్రాయం. ప్రసార మాధ్యమాలు,  సామాజిక మాధ్యమాలలో తెలుగు భాష అనూహ్యమైన మార్పులకు గురికావడానికి గల కారణాలను భాషా శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక కోణాలనుంచి  ఊహించారు.

తెలుగు భాష పై పట్టు ఉన్న వారి కంటే శాస్త్ర సాంకేతిక రంగాలతో కూడా పరిచయం ఒఉన్నవాళ్లు మాత్రమే సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఆ విధంగా తెలుగు భాషాపదాలుగా సంస్కృతం, ఆంగ్లం, హిందీ  తదితర భాషలతో కలిపి కొన్ని సమాసాలను ప్రయోగిస్తున్నారు. మరి కొంతమందికి తెలుగు భాషా పదాలు ఏమిటి అనే స్పష్టత కూడా ఉండట్లేదు. తెలుగు భాష, సాహిత్యాల్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసినవాళ్ళే చాలామంది సంస్కృతం, తెలుగు భాషాపదాల్ని గుర్తించలేకపోతున్నారు.  అటువంటప్పుడు తమ చదువంతా సాంకేతిక విద్యపై ఆధారపడినవాళ్ళు తెలుగు భాషలో సరిగ్గా రాయడంలేదనుకోవడం కొంత హాస్యాస్పదమే అవుతుంది.

       నిత్యం పత్రికలలోనూ,  టెలివిజన్ లోనూ నిత్య వ్యవహారంలోనూ మనం అనేక భాషా పదాలను కలుపుకుని ఉపయోగిస్తూ ఉన్నాం. వాటిని సామాజిక మాధ్యమాల్లో కూడా ఉపయోగిస్తున్నారు.

       తెలుగులోని కొన్ని అక్షరాలు క్రమేపీ రకరకాల కారణాల వల్ల మాయమైపోతున్నాయి. అవి కొన్ని తరాల వాళ్ళకి  తెలియడం లేదు. ఒక టీవీలో వార్తలు చదివే వారు ఇలా చదివారు.

 ఋష్యమూక పర్వతం… బుష్యమూకపర్వతం

       సామాజిక మాధ్యమాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరుగుతుందని  ఆశించడం కొంత అత్యాసేనేమో అని కూడా అనిపిస్తుంది. కేవలం తెలుగు పదాలను మాత్రమే వాడాలనుకొనేవారికి ఇది నిరాశనే కలిగిస్తుంది.

       తెలుగు భాషలో కలిసిపోయిన పదాల్లాగే మరికొన్ని పదాలు చేరుతున్నాయనుకొనేవారికి సామాజిక మాధ్యమాలలో కనిపించే ట్వీట్‌, రీ ట్వీట్‌, లైక్‌, షేర్‌, సెల్పీ, ఫ్రెండ్‌, అన్‌ఫ్రెండ్‌...ఇలాంటి పదాలు తెలుగు భాషను ఆధునీకరణ వైపు నడిపిస్తున్నాయనుకుంటారు.

       సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంతవరకు ఉందనేది తెలియాలంటే నేడు ఇంచుమించు అన్ని మీడియా సంస్థలు సామాజిక మాధ్యమాలల్లో ఎకౌంటుని ప్రారంభించి, తమ మీడియా లింకులను కలుపుతూ తమ పత్రికలు, టీవీలలో కూడా వాటిని ప్రదర్శించుకుంటున్నారు. దాని ద్వారా తమ మీడియా వైపు పాఠకుడు/ ప్రేక్షకుడిని తీసుకేళ్ళాలనుకుంటున్నాయి. దీని కోసం హేష్ ట్యాగ్ ఇస్తూ, తమ మీడియా హైపర్ లింక్స్ కలుపుతున్నాయి. హెష్‌టాగ్‌ # ఈ హెష్‌టాగ్‌ ఇంటర్నెట్‌లో ట్రెడింగ్‌ను తెలియజేస్తుంది. ఈ గుర్తునుట్విట్టర్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

       సామాజిక మాధ్యమాల వల్ల తెలుగు భాషలో ప్రవేశించిన కొన్ని పదాలు. సెల్ఫీ, లైక్ చేయడం, మెసేజ్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రయిబ్ చేయడం, చాటింగ్, వాయిస్ మెసేజ్, గ్రూప్, కాన్ఫరెన్స్, స్మార్ట్ ఫోన్, ఎమోజీ, వెబినార్, డేటా, మెమొరీ, సైన్ ఇన్, సైనౌట్, లాగౌట్, స్పామ్, పాస్ వార్డ్,  నెటిజన్, విజువల్, సైట్, బైట్..ఇలా అనేక పదాలు సామాజిక మాధ్యమాలలో నిత్యం వ్యవహారంలో కనిపిస్తున్నాయి.

సామాజిక మాధ్యమాలలో తెలుగు ఆధునీకరణ  ప్రక్రియ మూడు మార్గాల్లో జరుగుతుందని మనం గమనించవచ్చు. 1. అన్యభాషా పదజాలాన్ని విస్తృతంగా ఉపయోగించడం. ప్రపంచీకరణ ఫలితంగా వచ్చిన మార్పుల వల్ల చదువుకున్నా, చదువుకోకపోయినా కొన్ని భాషా పదాలు సామాన్యులకు కూడా అర్థం అవుతున్నాయి. అందువల్ల ఆ భాష పదాలు అవి అన్య భాషా పదాలైనప్పటికీ తమ భాషా పదాలుగా వాడుకుంటున్నారు. ఉదా: పానీపూరి. దీనికి తెలుగు పదం ఏమిటి?  కంప్యూటర్…దీనికి తెలుగు చే‌సే ప్రయత్నంలో 'సంగణన యంత్రం' అన్నారు. దీన్ని ఎంతమంది స్వీకరిస్తున్నారు? అయినా భాషాశాస్త్రవేత్తలు అనువాదాలు చెయ్యకుండా వదిలేయకూడదు. తర్వాత తర్వాత ఆ పదం వాడుకలోకి రావడం, ఆ పదం అలవాటు పడడం వల్ల ఆ పదం వాడికి లోకి వస్తుంది ఉదాహరణకు అంతర్జాలం ఇంటర్నెట్ అనే పదాన్ని అంతర్జాలం అని అనువాదం చేశారు. ఆ పదం క్రమేపీ వాడుకులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఫాంట్ అని ఆంగ్ల పదానికి ఖతి అనే సంస్కృత పదాన్ని తెలుగు పదంగా వాడుకోవడం మొదలైంది.

2. కొన్ని పదాలను  అనువాదం చేసి ప్రయోగించుకుంటున్నారు. కొన్ని పదాలు అనువాదాల కంటే కూడా ఆ పదాలను యధాతథంగా వాడుకోవడమే బాగుందని భావిస్తున్నారు.ఉదా: Real Estate  తెలుగులో స్థిరాస్తి అని వివాదం చేసుకుని మాట్లాడుకున్న రియల్ ఎస్టేట్ అనే పదంలో ఉన్నంత భావం ఇక్కడ రావట్లేదు. రియల్ ఎస్టేట్ అనగానే అదొక వ్యాపార లో భాగమని అర్థమవుతుంది.కానీ,  స్థిరాస్తి అనేదానిలో ఆ భావం రావట్లేదు. మిషన్ కాకతీయ …దీన్ని ఒక పత్రిక (ఆంధ్రప్రభ) వారు 'యంత్ర కాకతీయ ' అని అనువదించారు. ఎయిర్ హాస్టెస్ ….గగన సఖి (పుట: 234). Contractor తెలుగులో గుత్తేదారు అని పత్రికలు రాస్తున్నాయి కానీ జన వ్యవహారంలో కాంట్రాక్టర్ అనే పదమే బాగా వ్యవహారంలోకి వచ్చేసింది.

3. కొన్ని మిశ్రమ సమాసాలు సామాజిక మాధ్యమాల్లో వ్యవహారంలో ఉన్నాయి. ఓటర్ల జాబితా, బడ్జెట్ ప్రసంగం…సామాజిక మాధ్యమాల్లోని ఫేస్బుక్ అనే పదాన్ని ముఖ పుస్తకం అని కొంతమంది వాడుతున్నారు. ట్వీట్ ని కూత అనీ Cell Phone, Mobile Phone అనే పదాల్ని చరవాణి, కీరవాణి వంటి పదాలతో అనువదించారు. కానీ అవి వాడుకలోకి రాలేకపోతున్నాయి.సాధారణంగా పత్రికల్లో వచ్చే భాషే సామాజిక మాధ్యమాల్లోనూ వస్తున్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లోని కొన్ని భాషా పదాలు అనువాదానికి లొంగకుండా యధాతథంగా వాటిని వాడుకోవడం మంచిదనే అభిప్రాయంతో కొన్ని భాషా పదాలు తెలుగు వ్యవహారంలో ఇమిడిపోతున్నాయి.అలాంటి పదాలను, ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక పదాలను యధాతథంగా వాడుకోవడమే బాగుందని భావిస్తూ ఒక బ్లాగరు ఇలా రాశారు. '' తెలుగులోగానీ, ఏ భాషలోగానీ Localization అంటే Application లో ఉన్న ప్రతి ఇంగ్లీషుపదాన్నీ dictionary లోంచి squeeze చేసి వచ్చినదాన్ని వాడడమని ఎందుకనుకుంటారో? నిక్షిప్తం రీతి, స్థాపకవ్యవస్థ, పూర్వవీక్షణ, పునరుక్తి, విధి ఫలకం, స్వయంపాఠం, అనుకూలీకృతం" - ఇవన్నీ ఏడో తరగతి తెలుగు పరీక్షలో సంధులో సమాసాలో కాదు. Microsoft Word Telugu LIP లో Menu Items.

       ఏమిటీ పదాలు? ఎందుకొచ్చిన గోల? "Save" అనేందుకు నిక్షిప్తం అనాలా? "Layout" అనేందుకు స్థాపకవ్యవస్థ అనాలా?

       అవే పదాలు తెలుగులో రాయొచ్చు కదా? గిడుగువారి ఆదర్శాలకి నీళ్లొదులుతూ గ్రాంథికభాషని తెలుగు software లోనూ, కొన్ని తెలుగు వెబ్ సైట్లలోనూ మళ్లీ తలెత్తుకునేలా చేయడం చూస్తే బాధగా ఉంది. తెలుగును రక్షిస్తున్నామనుకుంటూ (అమాయకంగానో, భా౤షాభిమానంతోనో) ఇలా రాయడమే నిజంగా తెలుగుని ఖూనీ చేయడం.

       ఇంగ్లీషు పదాలు వాడినంత మాత్రాన భాష బలహీనపడిపోదు. సంస్కృతం onslaught ని తెలుగు సమర్థవంతంగా ఎదిరించలేదూ?

       ఆ process లో ఇంకా అందంగా తయారైంది. సూర్యుడికి అచ్చతెలుగు పదమైన 'పొద్దు'ని ఎంతమంది ఆ అర్థంలో వాడుతున్నారు? ''   (మన తెలుగు.బ్లాగ్ స్పాట్.కామ్)

టింగ్లీష్ :

చాలామంది నేటికీ తెలుగు లో టైప్ చేయకుండా ఇంగ్లీషులోనే టైప్ చేస్తూ లిపి పరంగా ఇంగ్లీష్ భాష పరంగా  తెలుగు ను వాడుతున్నారు. దీన్ని తింగ్లీష్ అని కొంతమంది పిలుస్తున్నారు. తెలుగులోనే రాయడానికి అనేక సాధనాలు, సులభమైనటువంటి కీబోర్డ్ లు ఉన్నప్పటికీ చాలామంది తెలుగు భాషలో రాయడం చాలా కష్టంగా భావిస్తున్నారు. కేవలం చేత్తో టైప్ చేయనవసరం లేకుండానే మాట్లాడుతూ ఉంటే తెలుగులో టైప్ అయిపోయే విధానంగా కూడా మన తెలుగు భాషాలిపిని అభివృద్ధి పరిచారు.  తెలుగు లిపిని అభివృద్ధి పరిచారు. ఇవన్నీ కష్టమనుకుంటే, కొంచెం చేతిరాత బాగా ఉంటే దాన్ని కాగితం మీద రాసి, ఒక యాప్ ద్వారా దాన్ని ఫోటో తీసుకుంటే అది ఆటోమేటిగ్గా తెలుగు లిపి లోకి టైపు గా మారిపోయి తెరపై కనిపిస్తుంది. చిన్నచిన్న అక్షర దోషాలు వచ్చినా దానిని ఎడిటింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని మరలా కష్టపడి పుస్తక ప్రచురణ కోసం మరలా టైప్ చేసుకోవాల్సిన పని లేకుండా యూని కోడ్ నుండి డైనమిక్ ఫాంట్ కీ, డైనమిక్ ఫాంట్ నుండి యూనికోడ్ ఫాంట్ కీ, పిడిఎఫ్, ఇమేజ్ ఫార్మేట్స్ నుండి కూడా ఒక చిన్న యాప్ సహాయంతో మరలా ఎడిటబుల్ ఫాంట్ లోకి మార్చుకొనే విధంగా కొన్ని యాప్స్ తయారు చేశారు.  యూనికోడ్ ఫాంట్ వచ్చిన తర్వాత పుస్తక ప్రచురణలోను, దాన్ని చదివి వినిపించే ఫోర్డ్ కాస్ట్ అని చదివి వినిపించే రీడింగ్ బుక్ వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడింది.

ఇవన్నీ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగును లిపి పరంగానూ, భాషా పరంగానూ  ఆధునికరించడంలో సాధించిన పరిణామాలు. ఒకప్పుడు ఇండెక్స్ తయారు చేయాలంటే కొన్ని రోజులు, నెలలు పెట్టేది. యూనికోడ్ వచ్చిన తర్వాత తెలుగు భాషలో కూడా ఇండెక్స్ తయారు చేయడం…అంటే పద సూచికలు తయారు చేయడం చాలా సులభంగా మారిపోయింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాటిని తయారు చేసే అవకాశం కలిగింది.

ప్రస్తుతం యంత్రానువాదం అంతా పరిపూర్ణమైన భావాన్ని ఇవ్వలేకపోయినా మనకి ఏ భాషలో ఉన్న విషయాన్నైనా మన భాషలో ఆ మూల భావాన్ని గ్రహించడం చాలా సులభం అయిపోయింది. అలాగే మనం తెలుగులో రాసినటువంటి విషయాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు తమ భాషలో అనువదించుకొని అంటే యంత్రం ద్వారా అనువదించుకొని దీనిలో ఉన్న మూలభావాన్ని తెలుసుకోవడం చాలా సులభమైంది. అందువల్ల ఇతర భాషలో ముఖ్యంగా ఇంగ్లీషులోనే రాయాలని లేకపోతే మనం జ్ఞానం ఇతరులకు తెలియకుండా పోతుందేమోననే ఒక భయం క్రమేపీ పోతుంది. మనం మనకు తెలిసిన తెలుగు భాషలోనే రాసినా ఇతర భాషలలో దాన్ని గుర్తించగలిగే సాధనాలు అందుబాటులో ఉన్నాయనే నమ్మకం సామాజిక మాధ్యమాలు కలిగించగలిగాయి.

సామాజిక మాధ్యమాలలో ఉపయోగించే భాష సరిగ్గా లేదనే వాళ్ళు ఒక విషయాన్ని గుర్తించాలి. మైక్రోసాఫ్ట్ , గూగుల్ వంటి కంపెనీలు కొత్త పదాలను  నిఘంటువులో ఎప్పటికప్పుడు ఆ పదాలను పొందుపరచమని అడుగుతూ ఉంటారు. మనం సామాజిక మాధ్యమాలలో కొత్త భాషాపదాలను  రాసేటప్పుడు నిఘంటువులలో వాటిని పొందుపరిస్తే అంటే ఆ పదాలను చేరిస్తే ఆ భాషాపదజాలం అభివృద్ధి చెందుతుంది.

గూగుల్ తయారుచేసే అనువాదానికి సంబంధించి ఆ అనువాదం సరిగ్గా లేకపోతే గనక దాన్ని మెరుగుపరచమని అడుగుతుంది. అటువంటి భాషాభివృద్ధి కార్యక్రమంలో ఈ భాషా శాస్త్రవేత్తలు స్వచ్చందంగా ఆ తప్పులను సరిదిద్ది కొత్త పదాలను, వాక్య నిర్మాణాలను అందించవచ్చు. వాటిని మరలా ఆ రంగంలో నిష్ణాతులైన వారికి చూపించి దాన్నెంతవరకూ స్వీకరించాలో అంతవరకూ స్వీకరిస్తారు. అవసరమైతే‌ ఆ కంపెనీ వాళ్ళు ఇటువంటి సలహాలు, సూచనలు చేసేవారిని సంప్రదిస్తారు.  ఆ తర్వాత  చేసే అనువాదాలకు ఆ పదాలలోని అనువాదం మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది.

సామాజిక మాధ్యమాలలో తెలుగు భాష అభివృద్ధి చెందాలంటే కింది సూచనలను పాటిస్తే బాగుంటుంది.

       నిత్య వ్యవహారంలో కలిసిపోయిన అన్య భాషా పదాలను వాడుకుంటూనే వాటికి తెలుగు అనువాదాలను అలవాటు చేయాలి.

       అన్య భాషా పదజాలాన్ని వ్యతిరేకిస్తున్న భావం ప్రాచుర్యంలోకి తీసుకురాకుండా మన భాషా సంపదను పెంచుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరించగలగాలి.

       కొంతమంది సామాజిక మాధ్యమాల్లో కూడా గ్రాంథిక భాషను ప్రయోగిస్తూ వితండ వాదనలు చేస్తున్నారు. వాటిని తగ్గించి వ్యవహారిక భాషను ప్రయోగించాలి.

       సామాజిక మాధ్యమాల్లో తెలుగు భాషా శాస్త్రవేత్తలు కొంచెం దృష్టిని కేంద్రీకరించి తెలుగులో,  తెలుగు లిపిలో తమ భావాలను రాయాలి. దీనికి అందుబాటులో ఉన్న అనేకమైన కీబోర్డులను సాఫ్ట్వేర్లను ఉపయోగించుకోవాలి.

       తెలుగు భాష పేరుతో సంస్కృత భాషా పదజాలాన్ని రుద్ధే ప్రయత్నం చేయకూడదు.

       తెలుగు భాషలో రాస్తే, తెలుగు భాషను వినియోగిస్తే వచ్చే ఆర్థిక ప్రయోజనాలు ఏమిటో వివరించగలగాలి.

       తెలుగు లిపిలో తెలుగు భాషలో రాసుకోవడం వలన మన సంస్కృతీ వైభవాన్ని  ఎలా కాపాడుకోవచ్చో సోదాహరణంగా వివరించేలా వ్యాసాలు రాయగలగాలి.

       మనకు కావలసిన పారిభాషికు పదాలు, వాటి వివరణలు, నిర్వచనాలు వంటివి తెలుగులో అన్వేషిస్తే అవి లభ్యమయ్యేలా  వెబ్ సైట్లలో పొందుపరచగలగాలి.

       వివిధ వెబ్సైట్లలో తెలుగు సాహిత్యం ప్రచురించే వాటిలో  వ్యాఖ్యలను సాధ్యమైనంత వరకు తెలుగులోనే రాస్తూ ఉండాలి.

       అప్పుడప్పుడు కొన్ని పదాలకు తెలుగు అనువాదాలను అన్వేషిస్తూ, ఒకవేళ ఆ అనువాదం సరైనది కాదనిపిస్తే సరైన అనువాదాన్ని సూచించాలి.

       మనకు ఉచితంగా అనేక బ్లాగులు అందుబాటులో ఉన్నాయి. మన రచనలను వాటిలో రాస్తూ లేదా పాత రచనలను వాటిలో పోస్ట్ చేస్తూ ఉండాలి. అలాగే, సామాజిక మాధ్యమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో సాధ్యమైనంత వరకు తెలుగులోనే మన అభిప్రాయాలను మన రచనలను ప్రచురిస్తూ ఉండాలి.

       మన తెలుగు పదాలు  సంక్లిష్టత నుండి సరళత్వం వైపు పయనించేటట్లు ఉండాలి.

       ఈ కామర్స్ వెబ్సైట్లలో కూడా తెలుగులోనే మనం మనకు కావలసిన వాటిని అన్వేషిస్తూ ఉండాలి. ఫీడ్ బ్యాక్ అడిగేటప్పుడు మన అభిప్రాయాలను తెలుగులోనే రాస్తుండాలి.

       స్మార్ట్ ఫోన్లలో తెలుగు భాష ద్వారా ఉపయోగించడానికి వీలుగా అనేకమైన యాప్స్ వస్తున్నాయి. వాటిని పరీక్షిస్తూ ఉండాలి. వాటిలోని లోటుపాట్లను మనం ఫీడ్బ్యాక్ ద్వారా అందించి, అది మరింత బాగా వినియోగంలోకి రావడానికి మన సూచనలు సలహాలు తెలుగులోనే ఇవ్వగలగాలి.

       ఇంటర్నెట్లో ఉపయోగించే బ్రౌజర్స్ తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ తెలుగుని ఉపయోగిస్తే మనం మనకు కావలసిన వాటిని త్వరగా చేరుకోలేక పోతాం. అందువల్ల ఇంగ్లీషులో మనకు సులభంగా తెలిసేటట్లు ఉండే అంశాలను అవసరమైతే ఇంగ్లీషులోని పదాన్ని తెలుగులో రాస్తూ తెలుగు లిపిలో మనం ఆ బ్రౌజర్స్ ని ఉపయోగించేలా తయారు చేసుకోవాలి. క్రమేపి ఆ పదాన్ని తెలుగులో ఎలా పిలిస్తే బాగుంటుందో ఆ పదాన్ని తెలుగు పదంగా మార్చుకోవాలి.

       ఇప్పుడు ఇంటర్నెట్ బ్రౌజర్ తో పాటు స్మార్ట్ ఫోన్ లో కూడా మనకి కొన్ని ప్లగ్ఇన్స్ ద్వారా పూర్తిగా అన్ని విషయాలు తెలుగులోనే చదువుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. కానీ ఆ అనువాదాల వలన మనం ప్లగ్ ఆన్స్ ని ఉపయోగించి తెలుగుని ఉపయోగించుకోలేకపోతున్నాం. కనక ఆ పారిభాషిక పదాల తెలుగు అనువాదం పట్ల సాంకేతిక నిపుణులు, భాష శాస్త్రవేత్తలు కలిసి పని చేయవలసిన అవసరం ఉంది.

       తెలుగు సాహిత్యాన్ని యూనికోడ్ లో అందిస్తున్న వెబ్సైట్స్ ద్వారా తెలుగు అభివృద్ధి బాగా జరుగుతుంది. మనకు కావలసిన పదాలు, పద్యాలు వెతికితే అవి సెర్చ్ లో కనిపిస్తాయి. సామాజిక మాధ్యమాలలో రాసే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. నిఘంటువు కూడా తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ రెండు పనులను ఆంధ్రభారతి.కామ్ వారు అందిస్తున్నారు.

       ఈ మధ్యకాలంలో ఛందస్సుని నేర్చుకునే వారికి కూడా తెలుగు ఛందస్సు యాప్ రూపొందించారు. అలాగే, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు వ్యాకరణాంశాల్ని సరిచూసుకోవడానికి సంస్కృత విభాగం వారు ఒక వెబ్సైట్ ని రూపొందించారు. ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో తెలుగు భాషాభివృద్ధికి, ఆధునీకరణకు తోడ్పడేవే.

 ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ ఎంత వేగంగా విస్తరిస్తుందో,  ప్రాంతీయ భాషలు కూడా అంతే వేగంగా విస్తరించడానికి అనేక అవకాశాలు  ఉన్నాయి. దీనికి సామాజిక మాధ్యమాలు అత్యంత శక్తివంతంగా తన తోడ్పాటును అందిస్తాయి. ప్రపంచంలోని అన్ని విషయాలను తమ భాషలో శక్తివంతంగా చెప్పగలిగే పదాల మన భాషలో ఉంటే ప్రపంచ భాషలు కూడా తెలుగు భాషా పదాలను స్వీకరిస్తాయి. కాబట్టి ప్రతి దానికీ తెలుగులో ఒక పేరు పెట్టి దాన్ని ప్రాచుర్యానికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ సామాజిక మాధ్యమాల్ని ఉపయోగించుకోగలగాలి. తెలుగు భాషకు గల శక్తిని కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు, సినిమాల ద్వారా ప్రాచుర్యంలోకి తేగలగాలి. మన భావాలు శక్తివంతంగా మన సాహిత్యం ద్వారా వ్యక్తీకరించగలిగినప్పుడు ఆ పదజాలం పెరుగుతుంది. ఏదైనా విషయాన్ని వివరించడానికి కథ నవల వంటి ప్రక్రియల్లో వాటిని శక్తివంతంగా వివరించగలిగే అవకాశం కలుగుతుంది. అందువల్ల సామాజిక మాధ్యమాల్లో రచనలు చేసేవారు కూడా మన తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నట్లుగానే భావించవచ్చు. ఆ విధంగా చూసినప్పుడు ఫేస్బుక్, బ్లాగుల ద్వారా జరుగుతున్న కృషి సామాన్యమైనది కాదు. ఈ మధ్యకాలంలో ప్రారంభమైన ఫోర్డ్ కాస్ట్ కూడా మన తెలుగు భాష అభివృద్ధికి అత్యంత శక్తిని సమకూరుస్తుంది. భవిష్యత్తు పోడ్ కాస్ట్ ల  పైనే ఆధారపడి ఉంటుందని కూడా అనిపిస్తుంది. ఫోర్డ్ కాస్ట్ కూడా సామాజిక మాధ్యమాల్లో ఒక భాగమే.

(ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ వారు గిడుగు వేంకట రామమూర్తి 159 వ జయంతి సందర్భంగా 29 ఆగస్టు 2022 వ తేదీన తెలుగు భాషా దినోత్సవ అంతర్జాల సదస్సులో చేసిన ఉపన్యాసం)

 

 

కామెంట్‌లు లేవు: